ఆంధ్రా బ్యాంకు వద్ద మహాధర్నా చేస్తున్న బ్యాంకు యూనియన్ నేతలు
సాక్షి, అమరావతి: వేతన సవరణతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లావాదేవీలు స్థంభించాయి. రాష్ట్రంలోని 4,570 ప్రభుత్వరంగ బ్యాంకుల శాఖల్లో ఒక్క లావాదేవీ కూడా జరగలేదని, సమ్మెలో 45,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన సవరణతో పాటు, ఐదురోజుల పని దినాల అమలు వంటి డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు.
విజయవాడ వన్‌టౌన్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (అయిబాక్) రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ గత వేతన సవరణ గడువు పూర్తయి రెండేళ్లు దాటినా ఇంత వరకు నూతన వేతన సవరణ అమలు చేయలేదన్నారు. కనీసం 20 శాతం పెంచుతూ సవరణ చేయనిదే ఉద్యోగులు అంగీకారం తెలిపే ప్రసక్తి లేదన్నారు. శనివారం విజయవాడ ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment