Bank employees strike
-
నిరవధిక సమ్మె దిశగా బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, అమరావతి: జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో తొలిరోజు విజయవంతమైందని, దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. బంద్‌లో భాగంగా రాష్ట్రంలో కూడా సోమవారం బ్యాంకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్బీఐ జోనల్ కార్యక్రమం వద్ద బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఐబాక్) రాష్ట్ర కార్యదర్శి వైవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణపై చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు వెనుకాడమని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని, రూ.వేల కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించాయని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మంగళవారం సమ్మెను కూడా విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. -
స్తంభించిన బ్యాంకింగ్ రంగం
సాక్షి, అమరావతి: వేతన సవరణతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లావాదేవీలు స్థంభించాయి. రాష్ట్రంలోని 4,570 ప్రభుత్వరంగ బ్యాంకుల శాఖల్లో ఒక్క లావాదేవీ కూడా జరగలేదని, సమ్మెలో 45,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన సవరణతో పాటు, ఐదురోజుల పని దినాల అమలు వంటి డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (అయిబాక్) రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ గత వేతన సవరణ గడువు పూర్తయి రెండేళ్లు దాటినా ఇంత వరకు నూతన వేతన సవరణ అమలు చేయలేదన్నారు. కనీసం 20 శాతం పెంచుతూ సవరణ చేయనిదే ఉద్యోగులు అంగీకారం తెలిపే ప్రసక్తి లేదన్నారు. శనివారం విజయవాడ ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
బ్యాంక్ సేవలపై భారత్ బంద్ ప్రభావం
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్ సంఘాలూ మద్దతిచ్చాయి. ఆర్బీఐ కార్యాలయాల్లోనూ సమ్మె... పలు ఏటీఎమ్‌లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్ విత్‌డ్రాయల్, నగదు డిపాజిట్ చేయడం, చెక్ క్లియరెన్స్ వంటి బ్రాంచ్ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్మెంట్ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు యథావిధిగా పనిచేశాయి. మరోవైపు హోండా మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. -
మరోసారి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా... ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు తెలిపాయి. ఈ వివరాలను ఐడీబీఐ బ్యాంకు బీఎస్ఈకి తెలియజేసింది. సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు అవరోధం ఏర్పడుతుందని అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది. అయితే కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. బీవోబీ కూడా ఇదే విధమైన సమాచారం ఇచ్చింది. ప్రైవేటు రంగ కరూర్ వైశ్యా బ్యాంకు సైతం ఉద్యోగుల సమ్మె కారణంగా తమ కార్యకలాపాలకు విఘాతం కలగొచ్చని పేర్కొంది. బ్యాంకు ఉద్యోగులు గత నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు సమ్మె చేపట్టారు. -
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
సాక్షి, అమరావతి/ హైదరాబాద్ : బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టారు. విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్‌లను విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బందరు రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బ్యాంక్ యూనియన్ ఐక్యవేదిక హెచ్చరించింది. వైఎస్సార్ జిల్లా : బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కడపలో బ్యాంక్ ఉద్యోగులు ధర్న చేపట్టారు. యూనైటెడ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో 7 రోడ్స్ సర్కిల్లో ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ నిరసనలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. కరీంనగర్ : నగరంలోని ఆంధ్రాబ్యాంక్ జోనల్ ఆఫీస్ ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు బోసిపోయాయి. ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. విశాఖపట్నం : జిల్లాలోని 500పైగా బ్యాంకుల్లో ఉద్యోగులు విధులను బహిష్కరించారు. విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన సభ నిర్వహించారు. -
స్తంభించిన రూ.20వేల కోట్ల లావాదేవీలు
న్యూఢిల్లీ : స్వల్ప వేతనాల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేడు రెండో రోజుకి చేరుకుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, వివిధ ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ రెండు రోజుల బ్యాంకింగ్ సమ్మెతో రూ. 20వేల కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు స్తంభించినట్టు తెలిసింది. తొలి రోజు వంద శాతం సమ్మె విజయవంతమైందని బ్యాంకింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు. రెండో రోజు కూడా బ్యాంకు శాఖల్లో అన్ని బ్యాంకింగ్ సర్వీసులను రద్దు చేశామని యూఎఫ్‌బీయూ కన్వీనర్(మహారాష్ట్ర) దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. తొలిరోజు ఏటీఎం సర్వీసులు కొన్ని గంటల పాటు మూత పడి, అనంతరం ప్రారంభమయ్యాయి. బ్యాంకు లాభాలు పడిపోవడానికి కారణం ఉద్యోగులు కాదని తుల్జపుర్కర్ అన్నారు. ప్రొవిజన్స్ ఎక్కువగా పెరగడంతో బ్యాంకులు ఎక్కువ నష్టాలు చవి చూస్తున్నాయన్నారు. 2012 నాటి వేతన సవరణలో 15% మేర పెంచి.. తాజాగా రెండు శాతమే ఇస్తామనడం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులను అవమానించడమేనని వారు అంటున్నారు. ఇటు నెలాఖరు, అటు వేతనాల సమయం కూడా కావడంతో ఈ సమ్మె విత్‌డ్రాయల్ లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు చోట్ల ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. -
30, 31 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసి యేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఏపీ, తెలంగాణ శాఖలు వెల్లడించాయి. సమ్మె కారణంగా దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని, ఖాతాదారులు పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులకు సహకరించాలని బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్ వీవీఎస్ఆర్ శర్మ కోరారు. వేతన సవరణ త్వరితగతిన అమలు చేయాలని, అధికారులకు వేతన సవరణతోపాటు పాక్షిక ఆదేశాలను అమలు చేయాలని దేశంలో 10 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 5 ఉద్యోగుల, 4 అధికారుల సంఘాల సంయుక్త వేదిక, యూఎఫ్బీయూలు సమ్మె బాటపట్టాయని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్ నుంచి వేతన సవరణ జరపాల్సి ఉండగా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదన్నారు. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. ప్రతియేటా ప్రభుత్వరంగ బ్యాంకులు నికరలాభం సంపాదిస్తున్నా, లాభాల్లో వస్తున్న తరుగుదలను కుంటిసాకుగా చూపి కేవలం 2 శాతం వేతన పెంపును ప్రతిపాదించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పి.వెంకటరామయ్య (బీఈఎఫ్ఐ), అనిల్‌కుమార్, గిరిశ్రీనివాస్ (ఏఐబీవోఏ), బి.సుక్కయ్య (ఏఐబీఓసీ), టి.వెంకటస్వామి (ఐఎన్‌బీఈఎఫ్)లు పాల్గొన్నారు. -
28న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో తిరోగమన సంస్కరణలు, ఉద్యోగుల హక్కులను హరించేలా నిబంధనల సవరణలు మొదలైన వాటిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా ఈ నెల 28న ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 80 వేల పైగా బ్యాంకింగ్ సిబ్బంది ఇందులో పాల్గొననున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) కన్వీనర్ వి.వి.ఎస్.ఆర్ శర్మ తెలిపారు. ఇందులో పాత తరం ప్రైవేట్ బ్యాంకుల సిబ్బంది కూడా పాల్గోనున్నట్లు ఆయన వివరించారు. సమ్మెతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 20,000 కోట్ల మేర లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు పెద్ద ఎత్తున యత్నాలు జరుగుతున్నాయని, వ్యవస్థకు ముప్పు తెచ్చిపెట్టేలా అన్ని స్థాయుల్లో అవుట్సోర్సింగ్ పెరిగిపోతోందని శర్మ పేర్కొన్నారు. అటు కారుణ్య నియామకాలపైనా ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు. వీటన్నింటి గురించి చాలా కాలంగా పోరాడుతున్నప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తాజా సమ్మెకు యూఎఫ్‌బీయూ పిలుపునిచ్చినట్లు శర్మ చెప్పారు. ఇక పెద్ద నోట్ల రద్దు పరిస్థితుల్లో బ్యాంకుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడంతో ఆర్థిక ఫలితాలపరంగా వాటి పనితీరు దెబ్బతినే ముప్పు నెలకొందని తెలిపారు. ఇది రాబోయే రోజుల్లో ఉద్యోగుల వేతన సవరణలపైనా ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు. ఈ నేపథ్యంలో డీమోనిటైజేషన్‌తో బ్యాంకులపై పడిన అదనపు వ్యయాల భారాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని కూడా తాము డిమాండ్ చేస్తున్నట్లు శర్మ వివరించారు. -
నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి!
- నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి! - ఢిల్లీ హైకోర్టు జోక్యంతో సమ్మె నిలుపుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళ, బుధ వారాల్లో తలపెట్టిన సమ్మె వాయిదాపడింది. సమ్మెను నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులివ్వటంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు వేసిన రిట్ పిటీషన్ మీద విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఎస్బీహెచ్ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో సమ్మె వాయిదా పడినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు చెప్పారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ ఈ నెల 12 (నేడు), 13న (రేపు) సమ్మెకు పిలుపునివ్వడం తెలిసిందే. డిమాండ్లపై జరిపిన చర్చల్లో యాజమాన్యాలు నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తేకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మె జరపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అయితే, ఈలోగా న్యాయస్థానం ఆదేశాలు వెలువడటంతో వాయిదా వేశాయి. -
25 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె!
ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ల వార్నింగ్ న్యూఢిల్లీ: వేతన సవరణ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగ యూనియన్లు శుక్రవారం మళ్లీ సమ్మె సైరన్ మోగించాయి. ఫిబ్రవరి 25-28 మధ్య దేశ వ్యాప్తంగా 4 రోజులపాటు సమ్మె చేయనున్నట్లు బ్యాంక్ కార్మికుల జాతీయ సంఘం జనరల్ సెక్రటరీ అశ్వనీ రాణా చెప్పారు. 19 శాతం వేతన పెంపునకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ నెలారంభంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తన ఆఫర్‌ను 12.5 శాతం నుంచి 13 శాతానికి పెంచింది. ఈ నేపథ్యంలో చీఫ్ లేబర్ కమిషనర్ సలహామేరకు ఫిబ్రవరి 23న సమస్య పరిష్కారం దిశగా యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ)తో చర్చలకు ఐబీఏ అంగీకరించింది. చర్చలు విఫలమై సమ్మె జరిగితే, బడ్జెట్ సమయంలో ప్రభుత్వ నిధుల బదలాయింపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి. మొత్తమ్మీద 50,000 బ్రాంచీలలో దాదాపు 8 లక్షల మంది పనిచేస్తున్నారు. జనవరి 21 నుంచి 4 రోజుల సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చినా... ఫిబ్రవరి ఆరంభానికల్లా వేతన పెంపుపై తగిన పరిష్కారం చూపుతామన్న ఐబీఏ హామీతో అప్పుడు వాయిదా పడింది. -
బ్యాంకులు మూత
తాడేపల్లిగూడెం/ఏలూరు, న్యూస్‌లైన్ :వేతన సవరణ, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపుమేరకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో సోమవారం ఒక్కరోజే జిల్లాలో రూ.2వేల కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. సాధారణంగా వాణిజ్య వినియోగదారులు, అత్యధిక మొత్తాలతో ఆర్థిక వ్యవహారాలు నడిపేవారు 10వ తేదీన బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. మరోవైపు వారంలో తొలిరోజు కావటం వల్ల వల్ల కూడా బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా సుమారు 5వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగటంతో 800 శాఖలు మూతపడ్డాయి. ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), ఆలిండియా బ్యాంకు ఎంప్లాయూస్ అసోసియేషన్ (ఏఐబీఈఎ) ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండు రోజులపాటు సమ్మెలో ాల్గొంటున్నారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం పనిచేశాయి. జీతాలు, బిల్లులు, చెక్కుల క్లియరింగ్ వ్యవహారాలు సమ్మె కారణంగా స్తంభించాయి. జిల్లాలో ఒక్క చెక్కుల రూపంలోనే రూ.1,500 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయూయని జాతీయ బ్యాంకుల యూనియన్ నాయకుడు ఎస్ఎస్ ప్రసాద్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఏలూరు నగరంలో 60, భీమవరం పట్టణంలో 42, తణుకులో 24, తాడేపల్లిగూడెం ప్రాంతంలో 50కు పైగా బ్యాంకు బ్రాంచిలు మూతపడ్డాయని వివరించారు. నగదు లావాదేవీలకు అవకాశం లేక. ఏటీఎంలలో ఉంచిన సొమ్ములు త్వరగా అయిపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. -
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
బాలాజీచెరువు (కాకినాడ), న్యూస్‌లైన్ : పదో ద్వైపాక్షిక వేతన ఒప్పందాన్ని వెంటనే అమలుచేయాలని, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు నిలుపుదల చేయాలనే డిమాండ్లతో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేశారు. 500 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు శాఖల వఉద్యోగులు నినాదాలు చేస్తూ విధులు బహిష్కరించారు. దాంతో సుమారు రూ. 800 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. పలువురు వినియోగదారులు బ్యాంక్‌లకు వచ్చి ఇబ్బంది పడ్డారు. తమ డిమాండ్లు తీర్చకపోతే మరిన్ని నిరసన కార్యక్రమాలు నిరహిస్తామని బ్యాంక్ ఫోరం కన్వీననర్ ఆదినారాయణ మూర్తి తెలిపారు. ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం వద్ద జరిగిన సమ్మెలో బ్యాంక్ ఫోరం నాయకులు పి.రమణ, మూర్తి, దేవదాసు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు రాష్ట్రం లోని అన్ని జాతీయ బ్యాంకులు, ఎంతో కాలంగా సేవలందిస్తున్న కొన్ని ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఐసీఐసీఐ, యాక్సెస్, ఐడీబీఐ, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనలేదు. రాష్ట్రంలోని 14 వేల బ్యాంకులకు చెందిన 60 వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ఆయా బ్యాంకుల ముందు ఉద్యోగులు తమ డిమాండ్లతో నినాదాలు చేశారు. దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు మూతపడ్డాయి. కొన్ని చోట్లు బ్యాంకులు తెరిచినా సిబ్బంది లేకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో 3 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు, 5 లక్షల క్లియరెన్స్‌లు నిలిచిపోయాయి. చెన్నైలోని 1400 బ్యాంకుల్లో 3 లక్షల చెక్కులు నిలిచిపోయా యి. బ్యాంకుల సమ్మెను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలలో మంగళవారం రాత్రే నగదుతో నింపివేశారు. ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే రూ.40వేలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. సమ్మె ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఏటీఎంల వద్ద జనం క్యూకట్టారు. అనేక ఏటీఎంలలో బుధవారం సాయంత్రానికే నగదు ఖాళీ అయింది. చెన్నై బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చెన్నై కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. సంఘం అధ్యక్షుడు వెంకటాచలం మీడియాతో మాట్లాడుతూ, ఇందిరాగాంధీ హయాంలో ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేయగా, నేడు పునర్ వ్యవస్థీకరణ పేరుతో మళ్లీ ప్రయివేటీకరణ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల తరబడి బ్యాంకుల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగ భద్రత కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా డిపాజిట్టుదారులకు రాయితీలు కల్పించడం, పాత బకాయిలను రద్దుచేయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పై డిమాండ్లతోపాటూ బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెంచాలనే తమ కోర్కెలకు కేంద్రం దిగిరాని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.