చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు రాష్ట్రం లోని అన్ని జాతీయ బ్యాంకులు, ఎంతో కాలంగా సేవలందిస్తున్న కొన్ని ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఐసీఐసీఐ, యాక్సెస్, ఐడీబీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనలేదు. రాష్ట్రంలోని 14 వేల బ్యాంకులకు చెందిన 60 వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ఆయా బ్యాంకుల ముందు ఉద్యోగులు తమ డిమాండ్లతో నినాదాలు చేశారు. దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు మూతపడ్డాయి. కొన్ని చోట్లు బ్యాంకులు తెరిచినా సిబ్బంది లేకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో 3 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు, 5 లక్షల క్లియరెన్స్‌లు నిలిచిపోయాయి.
చెన్నైలోని 1400 బ్యాంకుల్లో 3 లక్షల చెక్కులు నిలిచిపోయా యి. బ్యాంకుల సమ్మెను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలలో మంగళవారం రాత్రే నగదుతో నింపివేశారు. ఎస్‌బీఐ ఏటీఎంలలో మాత్రమే రూ.40వేలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. సమ్మె ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఏటీఎంల వద్ద జనం క్యూకట్టారు. అనేక ఏటీఎంలలో బుధవారం సాయంత్రానికే నగదు ఖాళీ అయింది. చెన్నై బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చెన్నై కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.
సంఘం అధ్యక్షుడు వెంకటాచలం మీడియాతో మాట్లాడుతూ, ఇందిరాగాంధీ హయాంలో ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేయగా, నేడు పునర్ వ్యవస్థీకరణ పేరుతో మళ్లీ ప్రయివేటీకరణ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల తరబడి బ్యాంకుల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగ భద్రత కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా డిపాజిట్టుదారులకు రాయితీలు కల్పించడం, పాత బకాయిలను రద్దుచేయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పై డిమాండ్లతోపాటూ బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెంచాలనే తమ కోర్కెలకు కేంద్రం దిగిరాని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Published Thu, Dec 19 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement