న్యూఢిల్లీ : స్వల్ప వేతనాల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేడు రెండో రోజుకి చేరుకుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, వివిధ ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ రెండు రోజుల బ్యాంకింగ్ సమ్మెతో రూ. 20వేల కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు స్తంభించినట్టు తెలిసింది. తొలి రోజు వంద శాతం సమ్మె విజయవంతమైందని బ్యాంకింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు. రెండో రోజు కూడా బ్యాంకు శాఖల్లో అన్ని బ్యాంకింగ్ సర్వీసులను రద్దు చేశామని యూఎఫ్‌బీయూ కన్వీనర్(మహారాష్ట్ర) దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు.
తొలిరోజు ఏటీఎం సర్వీసులు కొన్ని గంటల పాటు మూత పడి, అనంతరం ప్రారంభమయ్యాయి. బ్యాంకు లాభాలు పడిపోవడానికి కారణం ఉద్యోగులు కాదని తుల్జపుర్కర్ అన్నారు. ప్రొవిజన్స్ ఎక్కువగా పెరగడంతో బ్యాంకులు ఎక్కువ నష్టాలు చవి చూస్తున్నాయన్నారు. 2012 నాటి వేతన సవరణలో 15% మేర పెంచి.. తాజాగా రెండు శాతమే ఇస్తామనడం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులను అవమానించడమేనని వారు అంటున్నారు. ఇటు నెలాఖరు, అటు వేతనాల సమయం కూడా కావడంతో ఈ సమ్మె విత్‌డ్రాయల్ లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు చోట్ల ఏటీఎంలు ఖాళీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment