28న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో తిరోగమన సంస్కరణలు, ఉద్యోగుల హక్కులను హరించేలా నిబంధనల సవరణలు మొదలైన వాటిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా ఈ నెల 28న ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 80 వేల పైగా బ్యాంకింగ్ సిబ్బంది ఇందులో పాల్గొననున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) కన్వీనర్ వి.వి.ఎస్.ఆర్ శర్మ తెలిపారు.
ఇందులో పాత తరం ప్రైవేట్ బ్యాంకుల సిబ్బంది కూడా పాల్గోనున్నట్లు ఆయన వివరించారు. సమ్మెతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 20,000 కోట్ల మేర లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు పెద్ద ఎత్తున యత్నాలు జరుగుతున్నాయని, వ్యవస్థకు ముప్పు తెచ్చిపెట్టేలా అన్ని స్థాయుల్లో అవుట్‌సోర్సింగ్ పెరిగిపోతోందని శర్మ పేర్కొన్నారు. అటు కారుణ్య నియామకాలపైనా ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు.
వీటన్నింటి గురించి చాలా కాలంగా పోరాడుతున్నప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తాజా సమ్మెకు యూఎఫ్‌బీయూ పిలుపునిచ్చినట్లు శర్మ చెప్పారు. ఇక పెద్ద నోట్ల రద్దు పరిస్థితుల్లో బ్యాంకుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడంతో ఆర్థిక ఫలితాలపరంగా వాటి పనితీరు దెబ్బతినే ముప్పు నెలకొందని తెలిపారు. ఇది రాబోయే రోజుల్లో ఉద్యోగుల వేతన సవరణలపైనా ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు. ఈ నేపథ్యంలో డీమోనిటైజేషన్‌తో బ్యాంకులపై పడిన అదనపు వ్యయాల భారాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని కూడా తాము డిమాండ్ చేస్తున్నట్లు శర్మ వివరించారు.