
అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను వారి హోం కేడర్ అయిన ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అంజనీకుమార్ తెలంగాణ రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా, అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా, ట్రైనింగ్స్ డీజీగా పనిచేస్తున్నారు. అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతకుముందే తెలంగాణలో పనిచేసిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలిలను ఏపీ కేడర్‌కు పంపిన విషయం తెలిసిందే
