
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి హోం కేడర్ ఏపీకి బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌లను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఇద్దరు అధికారులను రిలీవ్ చేసినట్టు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌కు సూచించారు.
1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ ప్రస్తుతం తెలంగాణ రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా, 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఏపీ హోం కేడర్‌కు వెళ్లాల్సిందిగా కేంద్ర హోంశాఖ సూచించిన కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని మాత్రం ఇంకా రిలీవ్ చేయలేదు. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రిలీవ్ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment