ఏపీ కేడర్‌కు ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్‌లు
తెలంగాణ నుంచి ఏపీకి ఐదుగురు ఐఏఎస్‌లు.. ఏపీలోనే కొనసాగనున్న ఇద్దరు ఐఏఎస్‌లు
తెలంగాణ నుంచి ఏపీకి ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష్ భిష్త్
ఏపీ నుంచి తెలంగాణ కేడర్‌కు మరో ముగ్గురు ఐఏఎస్‌లు
ఏపీ, తెలంగాణ మధ్య ఏఐఎస్ అధికారుల తుది కేటాయింపులపై డీవోపీటీ కీలక నిర్ణయం
ప్రస్తుత రాష్ట్ర కేడర్ నుంచి ఈ అధికారులను తక్షణమే రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటన
ఈ నెల 16లోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారుల తుది కేటాయింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీ కేడర్‌కు బదులుగా తెలంగాణ కేడర్‌కు కేటాయించాలన్న ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. వారిలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఏపీలోనే పనిచేస్తుండగా మిగిలిన ఐదుగురు తెలంగాణలో పనిచేస్తున్నారు. అదేవిధంగా తమను తెలంగాణ కేడర్‌కు బదులు ఏపీ కేడర్‌కు కేటాయించాలన్న మరో ముగ్గురు ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తులనూ తిరస్కరించింది.
తక్షణమే వారిని ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ నుంచి రిలీవ్ చేయడంతోపాటు ఈ నెల 16లోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు షంషేర్ సింగ్ రావత్, జి.అనంతరాము ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనే పనిచేస్తూ తమను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించి వారిద్దరినీ ఏపీలోనే కొనసాగాలని ఆదేశించింది. మిగిలిన వారంతా ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రానికి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడింది.
వివాదం నేపథ్యం ఇది...
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏఐఎస్ అధికారుల కేటాయింపులను కేంద్రం చేపట్టింది. ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, కాటా ఆమ్రపాలి, జి.అనంతరాము, ఎం. ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణీప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్‌ఎస్ రావత్‌లను ఏపీ కేడర్‌కు.. హరికిరణ్, జి. సృజన, శివశంకర్ లహోటిలను తెలంగాణ కేడర్‌కు కేటాయించింది. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిష్త్, అభిషేక్ మహంతిని ఏపీకి కేటాయించారు. అయితే ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ ఆయా ఐఏఎస్, ఐపీఎస్‌లు గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. వారి వాదనలు విన్న ట్రిబ్యునల్.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొట్టేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పుతో మారిన పరిస్థితి..
ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో 2017, 2018లో వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. సోమేశ్ కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై తొలుత విచారణ చేపట్టిన హైకోర్టు... ఆ కేటాయింపును రద్దు చేస్తూ తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాలని 2023 జనవరి 10న తీర్పు ఇచ్చింది.
. ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసులను సమర్ధించింది.. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉన్న సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు.
ఈ తీర్పును నాటి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు ఇతర ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకూ వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి జనవరి 3న తీర్పునిచ్చింది.
10 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌ల కేటాయింపులపై క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది. ఆ అధికారుల ప్రస్తుత సర్వీసు, మిగిలిన సర్వీసుతోపాటు వారి వ్యక్తిగత అభ్యంతరాలను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకొని గతంలో జరిపిన తుది కేటాయింపులపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వివాదంపై నిర్ణయం తీసుకొనే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది.
ఆ అధికారుల విజ్ఞప్తులపై కేంద్రం నిర్ణయం తీసుకొనే వరకు వారందరినీ ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ అధికారుల తుది కేటాయింపులపై పునఃపరిశీలన కోసం హైకోర్టు ఆదేశాల మేరకు డీవోపీటీ శాఖ మాజీ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ దీపక్ ఖండేకర్‌తో ఆ శాఖ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా అధికారుల నుంచి కమిటీ వినతిపత్రాలను స్వీకరించడంతోపాటు వారితో వ్యక్తిగతంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించింది. అనంతరం ఆయా అధికారుల విజ్ఞప్తులను తిరస్కరిస్తూ డీవోపీటీకి సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను డీవోపీటీ ఆమోదించింది.
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారులు
1..మల్లేల ప్రశాంతి
2. వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి
3. ఎ.వాణీ ప్రసాద్, ముఖ్యకార్యదర్శి, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ
4. డి.రోనాల్డ్ రోస్, ఇంధన శాఖ కార్యదర్శి
5. కాటా ఆమ్రపాలి, జీహెచ్‌ఎంసీ కమిషనర్
తెలంగాణకు కేటాయించాలన్న విజ్ఞప్తి తిరస్కరించడంతో ఏపీలోనే కొనసాగనున్న ఐఏఎస్ అధికారులు..
1. షంషేర్ సింగ్ రావత్, స్పెషల్ సీఎస్, ఏపీ (దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు)
2.జి.అనంతరాము, స్పెషల్ సీఎస్, ఏపీ అటవీ శాఖ
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు
1.అంజనీకుమార్, డీజీ, రోడ్ సేఫ్టీ ఆథారిటీ
2. అభిలాష భిస్త్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్
ఏపీ నుంచి తెలంగాణకు రానున్న ఐఏఎస్ అధికారులు...
1.శివశంకర్ లోతేటి – వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్
2. శ్రీజన, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్
3. సి.హరికిరణ్
Comments
Please login to add a commentAdd a comment