UFBU
-
కస్టమర్లకు గమనిక: జనవరి 30, 31 తేదీల్లో యథావిధిగా బ్యాంకు సేవలు
సాక్షి,ముంబై: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ముంబైలో జరిగిన సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు జనవరి 30-31 తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. సమ్మె వాయిదా పడడంతో సంబంధిత తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. (అదానీకి మరో ఎదురుదెబ్బ: సెబీ కన్ను, మరింత లోతుగా పరిశీలన) ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్స్‌తో బ్యాంకు యూనియన్లు జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది. (అదానీ సెగ: ఎల్ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి) ఉద్యోగుల డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సమస్యలపై సంబంధిత అధికారులు, కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చించనున్నారు. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: మోగనున్న సమ్మె సైరన్
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. తమ వివిధ డిమాండ్ల సాధన కోసం జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని పలు బ్యాంకు యూనియన్ల గొడుగు సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గురువారం నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది, గురువారం ముంబైలో జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తతమ డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో, తమ ఆందోళనను పునరుద్ధరించాలని భావించామని, జనవరి 30, 31 తేదీల్లో ( సోమ, మంగళవారం) సమ్మెకు పిలుపు నివ్వాలని నిర్ణయించామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఐఏఎన్ఎస్కు తెలిపారు. ముఖ్యంగా ఐదు రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) రద్దు, వేతన సవరణ డిమాండ్ల చార్టర్‌పై తక్షణ చర్చలు, అన్ని విభాగాల్లో తగిన నియామకాలు తదితర డిమాండ్స్‌తో ఈ సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు. -
స్తంభించిన బ్యాంకింగ్ రంగం
సాక్షి, అమరావతి: వేతన సవరణతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లావాదేవీలు స్థంభించాయి. రాష్ట్రంలోని 4,570 ప్రభుత్వరంగ బ్యాంకుల శాఖల్లో ఒక్క లావాదేవీ కూడా జరగలేదని, సమ్మెలో 45,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన సవరణతో పాటు, ఐదురోజుల పని దినాల అమలు వంటి డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (అయిబాక్) రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ గత వేతన సవరణ గడువు పూర్తయి రెండేళ్లు దాటినా ఇంత వరకు నూతన వేతన సవరణ అమలు చేయలేదన్నారు. కనీసం 20 శాతం పెంచుతూ సవరణ చేయనిదే ఉద్యోగులు అంగీకారం తెలిపే ప్రసక్తి లేదన్నారు. శనివారం విజయవాడ ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
31 నుంచి బ్యాంకింగ్ రెండు రోజుల సమ్మె!
న్యూఢిల్లీ: వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. 9 బ్యాంక్ యూని యన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ ఐక్య వేదికలో అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీఓసీ), అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్ కార్మి కుల జాతీయ సంఘం (ఎన్‌ఓబీడబ్ల్యూ) వంటివి ఉన్నాయి. సమస్యల పరిష్కార దిశలో చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని, దీనితో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కు తీసుకోలేదని ఏఐబీఓసీ ప్రెసిడెండ్ సునిల్ కుమార్ తెలిపారు. యూనియన్ల నుంచి డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి కూడా ఎటువంటి హామీ రాలేదని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. మా సమస్యలూ పరిష్కరించాలి:ఐబీపీఏఆర్‌ఏ (ఏపీఅండ్‌టీఎస్) బ్యాంకింగ్ సమ్మె నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ పెన్షనర్లు అండ్ రిటైరీస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా) ఐదవ ద్వైవార్షిక సమావేశం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. తమ సమస్యల పరిష్కారానికి, తగిన గౌరవప్రదమైన పెన్షన్ పొందడానికి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. -
26న బ్యాంకుల సమ్మె
ప్రభుత్వ రంగంలోని మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా డిసెంబర్ 26న (బుధవారం) సమ్మెకు దిగనున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొననున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటు వేతనాల పెంపు డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్స్ శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 3.20 లక్షల మంది అధికారులు పాల్గొన్నారు. ఈ మూడు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్రం సెప్టెంబర్‌లో ప్రతిపాదించింది. అయితే, ఈ విలీనం వల్ల ఇటు బ్యాంకులకు గానీ అటు కస్టమర్లకు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, పైగా రెండు వర్గాల ప్రయోజనాలకు ప్రతికూలమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్ని స్తోందని, అయితే మొత్తం ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ కలిపేసినా టాప్ 10 గ్లోబల్ బ్యాంకుల్లో చోటు దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ తదితర 9 యూనియన్లు.. యూఎఫ్‌బీయూలో భాగం. -
బ్యాంకింగ్ లావాదేవీలపై పాక్షిక ప్రభావం
న్యూఢిల్లీ: వేతనాల సవరణ డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులు నిర్వహించిన ఒక్క రోజు సమ్మెతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల శాఖలు మూతబడగా, మరికొన్ని ప్రాంతాల్లో సిబ్బంది లేక ఖాళీగా కనిపించాయి. బ్రాంచీల్లో డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరెన్సులు, డ్రాఫ్ట్‌ల జారీ తదితర లావాదేవీలపై ప్రభావం పడింది. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి. ఏఐబీవోసీ తలపెట్టిన ఒక్క రోజు సమ్మె గురించి చాలా బ్యాంకులు ముందే తమ ఖాతాదారులకు సమాచారం అందించాయి. మరోవైపు, డిసెంబర్ 26న కూడా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నేతృత్వంలో ఇది జరగనుంది. వేతనాల సవరణ డిమాండ్‌తో పాటు, మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం (బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కన్సాలిడేషన్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. సెలవులు, సమ్మెల కారణంగా బ్యాంకులు శుక్రవారం మొదలుకుని వచ్చే బుధవారం దాకా (మధ్యలో సోమవారం ఒక్క రోజు మినహా) పనిచేయని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 22 నాలుగో శనివారం కాగా, మర్నాడు ఆదివారం, ఆ తర్వాత మంగళవారం క్రిస్మస్ కారణంగా బ్యాంకులకు సెలవు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె : వరుస సెలవులున్నాయా?
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు డిసెంబర్ 26న సమ్మెను చేపట్టనున్నారు. బ్యాంక్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 26న సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ), ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఇఏ) వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇతర బ్యాంకుల విలీనం ఆర్బీఐకు ఎలాంటి లాభదాయకం కానందున మరిన్ని బ్యాంకుల విలీనం మంచి పరిణామం కాదని యూనియన్స్ వాదిస్తున్నాయి. మరోవైపు డిసెంబరు నాలుగవ వారంలో అటు సెలవులు, ఇటు బంద్ నేపథ్యంలో ఈ ప్రభావం సామాన్యులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా విలీనం బ్యాంకింగ్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామాలు బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న క్రమంలో ఏకీకరణ చర్య అవాంఛనీయమన్నారు. ఈ దేశవ్యాప్త సమ్మెలో పది లక్షలమంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. బ్యాంకు సెలవులను ఒకసారి పరిశీలిద్దాం : డిసెంబర్ 22 - 4వ శనివారం సెలవు డిసెంబర్ 23 - ఆదివారం సెలవు డిసెంబర్ 24 - సోమవారం బ్యాంకులు పని చేస్తాయి. డిసెంబర్ 25 - మంగళవారం క్రిస్మస్ సెలవు డిసెంబర్ 26 - బుధవారం బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె -
రెండు రోజులు బ్యాంకులు మూత
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మెకు దిగనున్నారు. మే 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాము ఈ సమ్మెలో పాల్గొననున్నామని యూఎఫ్‌బీయూ ఏపీ, తెలంగాణ శాఖలు తెలిపాయి. మరోవైపు తమ ఉద్యోగులు రెండు రోజులు పాటు సమ్మెకు దిగే అవకాశం ఉందని దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది. దీంతో తమ వినియోగదారులు, సేవలు కొంతవరకు ప్రభావితం కానున్నాయని తెలిపింది. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. దీంతో దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని యూఎఫ్‌బీయూ ప్రకటించింది. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా జరిపిన చర్యలు విఫలం కావడంతో సమ్మెకు దిగనున్నట్టు బ్యాంకు సంఘాలు వివరించాయి. తమ పోరాటానికి ఖాతాదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. ముఖ్యంగా జీతం 2శాతం పెంపునకు, ఇతర సేవా పరిస్థితుల్లో మెరుగుదలను డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్ నుంచి వేతన సవరణ జరపాల్సి ఉందనీ, ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని యూఎఫ్‌బీయూ కోరుతున్న సంగతి తెలిసిందే. -
బ్యాంకుల్లో స్కామ్‌లపై జేపీసీ దర్యాప్తు..!
కోల్‌కతా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాం సహా వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలన్నింటిపైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరపాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) డిమాండ్ చేసింది. బ్యాంకులను పర్యవేక్షించడంలో రిజర్వ్ బ్యాంక్ విఫలమైనందునే ఈ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటిల్లో చిన్న ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని యూఎఫ్‌బీయూ పశ్చిమ బెంగాల్ విభాగం కన్వీనర్ సిద్ధార్థ్ ఖాన్ ఆరోపించారు. ‘ఇటీవలి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను ఇద్దరు వజ్రాభరణ వ్యాపారులు మోసం చేసిన కేసులో సమగ్రమైన జేపీసీ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 1992లో హర్షద్ మెహతా స్కామ్ సమయంలో జేపీసీ విచారణ జరిపినట్లుగానే ఇప్పుడు కూడా చేయాలని కోరుతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. అసలు పీఎన్బీ జారీ చేసిన లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ)ల ఆధారంగా చెల్లింపులు జరిపేందుకు ఉపయోగపడిన స్విఫ్ట్ సాఫ్ట్‌వేర్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర ఉందా లేదా అన్నదీ ప్రశ్నార్థకమేనని ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు, భారీ మొండిబాకీలు, కుంభకోణాలతో పాటు బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై తొమ్మిది ట్రేడ్ యూనియన్లు మార్చి 21న పార్లమెంటు ముందు ర్యాలీ నిర్వహించనున్నట్లు యూఎఫ్‌బీయూ తెలిపింది. అటు, బెయిల్–ఇన్ నిబంధనతో కూడిన ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నట్లు వివరించింది. -
నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ సమ్మె
-
నేడు బ్యాంకింగ్ సమ్మె
వేతనాలుసహా పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు మంగళవారం దేశవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. వేతన సంబంధ అంశాలుసహా పలు సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గొడుకు కింద పలు యూనియన్ల బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడమే దీనికి కారణం. కాగా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కొటక్ మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేసినా... చెక్ క్లియరెన్సుల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంగళవారం సమ్మె ప్రభావం గురించి ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు వివరించాయి. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో 75 శాతం వాటా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులది కావడం గమనార్హం. బీఎంఏ నో..: సమ్మెకు నేతృత్వం వహిస్తున్న యూఎఫ్‌బీయూ 9 యూనియన్లకు నేతృత్వం వహిస్తోంది. దాదాపు 10 లక్షల మందికి సభ్యత్వం ఉన్నట్లు పేర్కొంటోంది. కాగా భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఏ) అనుబంధ సంఘాలు.. నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ సమ్మెలో పాల్గొనడంలేదు. సమ్మె తప్పడం లేదు: ఏఐబీఓసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బ్యాంక్ మేనేజ్మెంట్ ప్రత్యేకించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి తగిన స్పందన లేకపోవడంతో సమ్మె చేయాల్సి వస్తోందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ హర్వీందర్ సింగ్ తెలిపారు. ఫిబ్రవరి 21వ తేదీన ఐబీఏ, బ్యాంక్ యూనియన్లు, చీఫ్ లేబర్ కమిషనర్ మధ్య చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. డిమాండ్లు ఇవీ... ⇒ బ్యాంకింగ్ రంగంలో పర్మినెంట్ ఉద్యోగాలకు ఔట్సోర్సింగ్ విధానాన్ని ఎంచుకోవడం సరికాదు. ⇒ నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు అనంతరం పనిచేసిన అదనపు గంటలకు సంబంధించి ఉద్యోగులు, అధికారులకు తగిన పరిహారం ఇవ్వాలి. ⇒ బ్యాంక్ ఉద్యోగులకు తదుపరి వేతన సవరణ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలి. ⇒ అన్ని విభాగాల్లో తగిన రిక్య్రూట్మెంట్లు జరగాలి. ⇒ మొండిబకాయిల పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలి. టాప్ ఎగ్జిక్యూటివ్‌లను ఇందుకు బాధ్యులుగా చేయాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. -
బ్యాంకుల విలీనం విరమించుకోవాలి
సీతమ్మధార: బ్యాంకుల విలీనం ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని బ్యాంకు యూనియన్ల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎ.ఎస్. ప్రభాకర్ కోరారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ బ్యాంకు వ్యతిరేక విధానాలకు నిరసనగా బ్యాంకుల బంద్‌లో భాగంగా సీతమ్మధారలోని ఆంధ్రాబ్యాంక్ ఆవరణలో శుక్రవారం ధర్నా చేపట్టారు. నగరంలోని వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాలబాటలో ఉన్న బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం విలీనం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంకుల ప్రారంభానికి అనుమతులు ఇచ్చేస్తున్నారని ఆందోళన వ్యత్తం చేశారు. రూ.లక్షల కోట్లు బకాయి ఉన్న వారి పేర్లు మీడియా ద్వారా బయటపెట్టి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించరాదని కోరారు. సహకార బ్యాంకులను పటిష్టం చేయాలని, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను వాటి అనుబంధ బ్యాంకులలో విలీనం చేయాలని, వ్యవసాయ రంగానికి మరిన్ని రుణాలు ఇవ్వాలని కోరారు. పటిష్టమైన భారత్ కోసం పటిష్టమైన బ్యాంకింగ్ రంగాన్ని నిర్మించాలని పలువురు వక్తలు కోరారు. ధర్నాలో ఏఐఎస్‌ఈఏ నాయకుడు పీఎస్ మల్లేశ్వరరావు, యుఎఫ్‌బీయూ నాయకులు ఎన్.సాంబశివరావు, జె. కేశవరావు, జి. వాసుదేవరావు, బి.రమణమూర్తి, శంకరాజు, ఎ. యుగంధర్, ఎ.సుష్మ, పి.సరోజ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల బంద్ కారణంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించి ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపు
వడోదర: యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆగ స్టు 29న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వపు బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా ఆగస్ట్‌లో సమ్మె నిర్వహిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపర్చడం, బ్యాంకుల విలీనం, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఎక్కువగా బ్యాంకు లెసైన్స్‌ల జారీ, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోకి అధిక ప్రైవేట్ మూలధనాన్ని అనుమతిం చడం వంటి ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తామని వివరించారు. ప్రభుత్వ సంస్కరణలు కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయన్నారు. బ్యాంకుల మొండిబకాయిల్లో అధిక వాటా కార్పొరేట్ సంస్థలదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ ఎందుకని 7,000 మంది డిఫాల్టర్ల పేర్లను వెల్లడించడం లేదని ప్రశ్నించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బ్యాంక్ ఉద్యోగులకు బొనాంజా
- 15 శాతం వేతనం పెంపు - 2012 నవంబర్ నుంచి వర్తింపు - ఇక నెలలో 2వ,4వ శనివారాలు సెలవు - సంఘాల సమ్మె ప్రతిపాదన విరమణ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఎట్టకేలకు తమ దీర్ఘకాలిక డిమాండ్లను సాధించుకున్నారు. దీని ప్రకారం 2012 నవంబర్ నుంచీ 15 శాతం వేతన పెంపు అమలు కానుంది. దీనితోపాటు నెలలో రెండు శనివారాలుత సెలవు ఇవ్వాలన్న డిమాండ్ కూడా పరిష్కారమైంది. ఈ మేరకు సోమవారం ఉద్యోగ యూనియన్లకు, యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీనితో తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25 నుంచీ నాలుగురోజుల పాటు జరపతలపెట్టిన సమ్మెను యూనియన్లు విరమించాయి. బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ సోమవారమిక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు. నెలలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్నది బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండని, ఈ విషయంలో కూడా సానుకూల ఫలితం రావడం హర్షణీయమని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. మధ్యేమార్గం... నిజానికి 19 శాతం వేతన పెంపునకు యూనియన్లు డిమాండ్ చేశాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తొలుత 12.5 శాతం పెంపునకు సరే అంది. దీనికి యూనియన్లు ససేమిరా అన్నాయి. చివరకు చర్చల్లో మధ్యేమార్గంగా 15 శాతంగా నిర్ణయించుకున్నారు. ఈ చర్చల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు, బ్యాంక్ యాజమాన్య, ఐబీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. వీటికి దేశ వ్యాప్తంగా 50,000 బ్రాంచీలుండగా, వాటిలో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. -
స్తంభించిన బ్యాంకింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతన సవరణలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జరిగిన ఒక రోజు సమ్మె కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం అయినట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 80,000 మందికిపైగా ఉద్యోగులు, అధికారులు ఈ ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నారని, దీనివల్ల సుమారు రూ.12,000 కోట్ల లావాదేవీలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు. వేతనాలను 25% పెంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తుండగా 11%కి మించి పెంచేది లేదని యాజమాన్యాలు అంటున్నాయి. దీంతో ఉద్యోగస్తులు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఉద్యోగులు 25 నుంచి 2% దిగొచ్చినా, యాజమాన్యం 1% కూడా పెంచడానికి ముందుకు రాకపోవడం... సిబ్బందిలో ఆగ్రహాన్ని పెంచిందని, అందుకే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నట్లు రాంబాబు తెలిపారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచడానికి జోన్ వారీగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చామని, అందులో భాగంగా డిసెంబర్2న దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగస్తులు ఒక రోజు సమ్మెలో పొల్గొన్నట్లు ఆయన తెలిపారు. ముందు జాగ్రత్తగా బ్యాంకులు ఏటీఎంల్లో పూర్తిస్థాయిలో నగదును నింపడంతో వీటి కార్యకలపాలకు పెద్దగా ఆటంకాలు ఎదురుకాలేదు. అలాగే ఈ సమ్మె నుంచి కో-ఆపరేటివ్ బ్యాంకులను మినహాయించడంతో, వాటి కార్యకలపాలు యధావిధిగా కొనసాగాయి. కొన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగస్తులకు ప్రైవేటు బ్యాంకులు మద్దతు ప్రకటించడమే కాకుండా లావాదేవీలకు దూరంగా ఉన్నట్లు యూనియన్ వర్గాలు చెప్పాయి. ఆగిన 10 కోట్ల చెక్ క్లియరెన్స్‌లు దేశవ్యాప్తంగా 8 లక్ష మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ప్రకటించింది. 27 ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 75,000 శాఖల్లో బ్యాంకింగ్ సేవలు ఆగిపోయినట్లు ఏఐబీఈఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశ్వాస్ తెలిపారు. ఈ సమ్మె కారణంగా 10 కోట్లకుపైగా చెక్కులు క్లియరెన్స్ ఆగిపోయాయని, సుమారుగా రూ. 15.5 కోట్ల లావాదేవీలకు ఆటంకం కలిగినట్లు యూనియన్లు పేర్కొన్నాయి. మోడీ సర్కారు వచ్చాక బ్యాంకు యూనియన్ల తొలి సమ్మె ఇది. -
సమ్మెతో స్తంభించిన బ్యాంకులు
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: వేతన సవరణ అమలుచేయాలని కోరుతూ, సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త ఒక రోజు సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలో బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. జిల్లావ్యాప్తంగా 300 ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో లావాదేవీలు పూర్తిగా స్థంభించాయి. ఖమ్మం నగరంలోని 38 ప్రభుత్వరంగ బ్యాంకులు పనిచేయలేదు. యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జిల్లాపరిషత్ శాఖ ఎదుట ఉద్యోగులు సభ నిర్వహించారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సామినేని సుధాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఎం.చంద్రశేఖర్, ఎస్బీహెచ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకుడు నర్సింగరావు మాట్లాడుతూ.. 2012 నవంబర్‌లో జరిగిన వేతన సవరణను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకులను ప్రభుత్వం ప్రయివేటీకరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు బ్యాంకులు.. విదేశీ బ్యాంకులు శాఖ లను తెరిచేందుకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, శింగు నర్సింహారావు మాట్లాడుతూ.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగులను, కార్మికులను ఇబ్బందులపాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాయని, ఈ విధానంలో ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. బ్యాంక్ ఉద్యోగులకు వేతన సవరణ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు, బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో బుధవారం రూ.200కోట్ల మేరకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలు కూడా పనిచే యలేదు. సమ్మె విషయం తెలియక అనేకమంది వినియోగదారులు బ్యాంకుల వద్దకు వచ్చి తిరిగి వెళ్లారు.