ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: వేతన సవరణ అమలుచేయాలని కోరుతూ, సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త ఒక రోజు సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలో బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. జిల్లావ్యాప్తంగా 300 ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో లావాదేవీలు పూర్తిగా స్థంభించాయి. ఖమ్మం నగరంలోని 38 ప్రభుత్వరంగ బ్యాంకులు పనిచేయలేదు.
యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జిల్లాపరిషత్ శాఖ ఎదుట ఉద్యోగులు సభ నిర్వహించారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సామినేని సుధాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఎం.చంద్రశేఖర్, ఎస్‌బీహెచ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకుడు నర్సింగరావు మాట్లాడుతూ.. 2012 నవంబర్‌లో జరిగిన వేతన సవరణను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకులను ప్రభుత్వం ప్రయివేటీకరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు బ్యాంకులు.. విదేశీ బ్యాంకులు శాఖ లను తెరిచేందుకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, శింగు నర్సింహారావు మాట్లాడుతూ.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగులను, కార్మికులను ఇబ్బందులపాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాయని, ఈ విధానంలో ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. బ్యాంక్ ఉద్యోగులకు వేతన సవరణ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు, బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో బుధవారం రూ.200కోట్ల మేరకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలు కూడా పనిచే యలేదు. సమ్మె విషయం తెలియక అనేకమంది వినియోగదారులు బ్యాంకుల వద్దకు వచ్చి తిరిగి వెళ్లారు.
సమ్మెతో స్తంభించిన బ్యాంకులు
Published Thu, Dec 19 2013 6:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement