banking operations
-
బ్యాంకింగ్ లావాదేవీలపై పాక్షిక ప్రభావం
న్యూఢిల్లీ: వేతనాల సవరణ డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులు నిర్వహించిన ఒక్క రోజు సమ్మెతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల శాఖలు మూతబడగా, మరికొన్ని ప్రాంతాల్లో సిబ్బంది లేక ఖాళీగా కనిపించాయి. బ్రాంచీల్లో డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరెన్సులు, డ్రాఫ్ట్‌ల జారీ తదితర లావాదేవీలపై ప్రభావం పడింది. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి. ఏఐబీవోసీ తలపెట్టిన ఒక్క రోజు సమ్మె గురించి చాలా బ్యాంకులు ముందే తమ ఖాతాదారులకు సమాచారం అందించాయి. మరోవైపు, డిసెంబర్ 26న కూడా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నేతృత్వంలో ఇది జరగనుంది. వేతనాల సవరణ డిమాండ్‌తో పాటు, మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం (బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కన్సాలిడేషన్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. సెలవులు, సమ్మెల కారణంగా బ్యాంకులు శుక్రవారం మొదలుకుని వచ్చే బుధవారం దాకా (మధ్యలో సోమవారం ఒక్క రోజు మినహా) పనిచేయని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 22 నాలుగో శనివారం కాగా, మర్నాడు ఆదివారం, ఆ తర్వాత మంగళవారం క్రిస్మస్ కారణంగా బ్యాంకులకు సెలవు. -
నిలిచిన బ్యాంకింగ్
• ఏటీఎంలు ఖాళీ • దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ప్రభావం న్యూఢిల్లీ: డిమాండ్ల సాధనకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు దాదాపుగా స్తంభించాయి. చాలా ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు లేక నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. వేతనాలతో పాటు వివిధ డిమాండ్లతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తమ సమ్మె విజయవంతమైందని, అన్ని బ్యాంకుల శాఖలు మూతబడ్డాయని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ‘నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ మొదలైన కార్యకలాపాలేవీ జరగలేదు. ప్రభుత్వ ట్రెజరీ లావాదేవీలు, ఎగుమతి..దిగుమతి లావాదేవీలు, మనీ మార్కెట్ కార్యకలాపాలు మొదలైనవి నిలిచాయి‘ అని చెప్పారు. నగదు బదిలీలు, క్యాష్ రెమిటెన్సులపైనా ప్రతికూల ప్రభావం పడింది. రిజర్వ్ బ్యాంక్ పనిచేసినా.. ఉద్యోగులు అందుబాటులో లేక క్లియరింగ్ కార్యకలాపాలకూ విఘాతం కలిగిందని వెంకటాచలం పేర్కొన్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ అయిపోయాయని, పని చేసిన కొన్ని బ్యాంకుల్లోనూ నగదు పరిమిత స్థాయిలోనే ఉందని ఆయన వివరించారు. రూ.1.3 లక్షల కోట్ల లావాదేవీలపై ప్రభావం.. బ్యాంకింగ్ సమ్మె కారణంగా దాదాపు రూ. 1.3 లక్షల కోట్ల మేర ఫారెక్స్, క్లియరింగ్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడనుందని పరిశ్రమల సమాఖ్య అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. భారీగా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై కేంద్రం కసరత్తు చేయాలని ఆయన పేర్కొన్నారు. డిమాండ్లు ఇవీ... యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు తమ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వెల్లడించాయి. తమ శాఖల్లో కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ.. ఏటీఎంలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఖాతాదారులకు యథాప్రకారం సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. మరోవైపు, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. యూఎఫ్‌బీయూలో 9 యూనియన్లు ఉండగా.. 2 యూనియన్లు(భారతీయ మజ్దూర్ సంఘ్‌కు చెందిన ది నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్) కూడా సమ్మెలో పాల్గొనలేదు. అవుట్సోర్సింగ్ తదితర సంస్కరణలు నిలిపివేయాలని, నోట్ల రద్దు అనంతరం మరిన్ని గంటలు అధికంగా పనిచేసిన ఉద్యోగులు.. అధికారులకు తగిన పరిహారం ఇవ్వాలని, తదుపరి వేతన సవరణ సమీక్షను సత్వరం చేపట్టాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. అలాగే, అన్ని క్యాడర్లలో సముచిత స్థాయిలో నియామకాలు జరపాలని, మొండిబకాయిల రికవరీకి కఠిన చర్యలు తీసుకోవాలని.. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ కేసులు వేయాలని, టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను జవాబుదారీగా చేయాలన్నవి మిగతా డిమాండ్లు. డీమోనిటైజేషన్ వల్ల బ్యాంకులకు అయిన అదనపు వ్యయాలను సైతం రీయింబర్స్ చేయాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. -
12న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై: వేతనాల పెంపునకు సంబంధించిన చర్చలు విఫలంకావడంతో సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 12న(బుధవారం) సమ్మెకు దిగనున్నారు. దీంతో 12న బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశమున్నట్లు యూనియన్ అధికారి ఒకరు చెప్పారు. తక్కువలోతక్కువ 23% పెంపును ఆశిస్తున్నప్పటికీ దేశీ బ్యాంకుల అసోసియేషన్(ఐబీఏ) 11% పెంపునకు మాత్రమే అంగీకరిస్తున్నదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ) అధికారి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. ఈ పెంపు బ్యాంకుల మొండిబకాయిల్లో(ఎన్పీఏలు) కేవలం 1%కు సమానమన్నారు. బ్యాంకులు మంచి నిర్వహణ లాభాలను ఆర్జిస్తున్నాయని, అయితే మొండిబకాయిల కారణంగా నికర లాభాలు ప్రభావితమవుతున్నప్పటికీ వీటికి ఉద్యోగులు బాధ్యులుకారని వివరించారు. ఎన్పీఏలకు కేటాయింపులు చేపట్టినట్లే ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా జీతాల పెంపును సైతం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ, పాత ప్రయివేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన ఆఫీసర్లతోసహా 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. -
సమ్మెతో స్తంభించిన బ్యాంకులు
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: వేతన సవరణ అమలుచేయాలని కోరుతూ, సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త ఒక రోజు సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలో బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. జిల్లావ్యాప్తంగా 300 ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో లావాదేవీలు పూర్తిగా స్థంభించాయి. ఖమ్మం నగరంలోని 38 ప్రభుత్వరంగ బ్యాంకులు పనిచేయలేదు. యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జిల్లాపరిషత్ శాఖ ఎదుట ఉద్యోగులు సభ నిర్వహించారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సామినేని సుధాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఎం.చంద్రశేఖర్, ఎస్బీహెచ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకుడు నర్సింగరావు మాట్లాడుతూ.. 2012 నవంబర్‌లో జరిగిన వేతన సవరణను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకులను ప్రభుత్వం ప్రయివేటీకరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు బ్యాంకులు.. విదేశీ బ్యాంకులు శాఖ లను తెరిచేందుకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, శింగు నర్సింహారావు మాట్లాడుతూ.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగులను, కార్మికులను ఇబ్బందులపాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాయని, ఈ విధానంలో ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. బ్యాంక్ ఉద్యోగులకు వేతన సవరణ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు, బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో బుధవారం రూ.200కోట్ల మేరకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలు కూడా పనిచే యలేదు. సమ్మె విషయం తెలియక అనేకమంది వినియోగదారులు బ్యాంకుల వద్దకు వచ్చి తిరిగి వెళ్లారు.