న్యూఢిల్లీ: వేతనాల సవరణ డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులు నిర్వహించిన ఒక్క రోజు సమ్మెతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల శాఖలు మూతబడగా, మరికొన్ని ప్రాంతాల్లో సిబ్బంది లేక ఖాళీగా కనిపించాయి. బ్రాంచీల్లో డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరెన్సులు, డ్రాఫ్ట్‌ల జారీ తదితర లావాదేవీలపై ప్రభావం పడింది. అయితే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి. ఏఐబీవోసీ తలపెట్టిన ఒక్క రోజు సమ్మె గురించి చాలా బ్యాంకులు ముందే తమ ఖాతాదారులకు సమాచారం అందించాయి. మరోవైపు, డిసెంబర్ 26న కూడా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నేతృత్వంలో ఇది జరగనుంది. వేతనాల సవరణ డిమాండ్‌తో పాటు, మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం (బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కన్సాలిడేషన్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. సెలవులు, సమ్మెల కారణంగా బ్యాంకులు శుక్రవారం మొదలుకుని వచ్చే బుధవారం దాకా (మధ్యలో సోమవారం ఒక్క రోజు మినహా) పనిచేయని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 22 నాలుగో శనివారం కాగా, మర్నాడు ఆదివారం, ఆ తర్వాత మంగళవారం క్రిస్మస్ కారణంగా బ్యాంకులకు సెలవు.
Comments
Please login to add a commentAdd a comment