Public sector bank
-
పీఎన్బీ – సెయిల్ మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు కంపెనీ సెయిల్‌తో ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెయిల్ ఉద్యోగులకు గృహ, కార్ల కొనుగోలుకు రుణాలను పీఎన్బీ అందిస్తుంది. అలాగే విద్యా రుణాలను సైతం తగ్గింపు రేట్లకే, ఆకర్షణీయమైన సదుపాయాలతో అందించనుంది. పీఎన్బీ కస్టమర్లను పెంచుకునేందుకు, సెయిల్ ఉద్యోగుల శ్రేయస్సుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పీఎన్బీ తెలిపింది. అవగాహన ఒప్పందంపై పీఎన్బీ జనరల్ మేనేజర్ (బిజినెస్ అక్విజిషన్) బిబు ప్రసాద్ మహపాత్ర, సెయిల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) లావికా జైన్, సెయిల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విక్రమ్ ఉప్పల్ సంతకాలు చేశారు. -
ఆర్బీఐ, బ్యాంకింగ్ నుంచి డివిడెండ్ల ధమాకా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్‌సహా ఇతర ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.02 లక్షల కోట్ల డివిడెండ్లు వస్తాయన్నది తాజా బడ్జెట్ అంచనా. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023–24 బడ్జెట్ అంచనా రూ.48,000 కోట్లయితే, ఊహించని రీతిలో రూ.1.04 లక్షల కోట్ల ఒనగూరుతాయన్నది తాజా బడ్జెట్ సవరిత అంచనా. ఆర్బీఐ ఒక్కటే గత ఏడాది మేలో రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించడంతో డివిడెండ్ రాబడులకు ఊతం లభించినట్లయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లభించిన డివిడెండ్లు రూ.39,961 కోట్లు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ చెల్లింపులు రూ.43,000 కోట్లని బడ్జెట్ అంచనా. మొత్తంగా డివిడెండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,54,407 కోట్లు ఉంటే, 2024–25లో విలువ స్వల్పంగా రూ.1.50 లక్షల కోట్లకు తగ్గుతుందని తాజా బడ్జెట్ అంచనావేసింది. -
బీవోబీ లాభం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.4,579 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.3,853 కోట్ల కంటే ఇది 19 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.27,092 కోట్ల నుంచి రూ.31,416 కోట్లకు వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ లాభం రూ.4,306 కోట్ల నుంచి రూ.4,789 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.23,540 కోట్ల నుంచి రూ.28,605 కోట్లకు దూసుకుపోయింది. నికర వడ్డీ ఆదాయం కేవలం 2.6 శాతం పెరిగి రూ.11,101 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లపై వ్యయాలు 4.01 శాతం నుంచి 4.96 శాతానికి పెరిగాయి. బ్యాంక్ రుణ ఆస్తుల నాణ్యత మరింత బలపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 3.08 శాతానికి (రూ.32,318 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి ఇవి 4.53 శాతంగా ఉంటే, 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 3.32 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 0.99 శాతంగా ఉంటే, 2023 సెపె్టంబర్ చివరికి 0.76 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ అడ్వాన్స్‌లు (రుణాలు) 13.6 శాతం పెరిగి రూ.10,49,327 కోట్లకు చేరాయి. డిపాజిట్లు 8.3 శాతం వృద్ధితో రూ.12,45,300 కోట్లుగా ఉన్నాయి. రిటైల్ రుణాల్లో 22 శాతం వృద్ధి కనిపించింది. వ్యవసాయ రుణాలు 12.6 శాతం, బంగారం రుణాలు 28 శాతం పెరిగి రూ.45,074 కోట్లకు చేరాయి. ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)లో ఎక్స్పోజర్కు సంబంధించి రూ.50 కోట్లను పక్కన పెట్టింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5 శాతం ఎగసి రూ.248 వద్ద క్లోజ్ అయింది. -
ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా 2000 టాప్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకింది. 2022 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్ విలువ ఆధారంగా ఈ దిగ్గజాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105వ ర్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 153వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 204వ ర్యాంకు దక్కించుకున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 104.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. తద్వారా 100 బిలియన్ డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిల్చిందని ఫోర్బ్స్ తెలిపింది. ‘గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ రెండు స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకుకు చేరుకుంది. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిల్చింది. ఈ ఏడాది తొలినాళ్లలో రిలయన్స్ అధినేత సంపద విలువ 90.7 బిలియన్ డాలర్లుగా లెక్కించాం. తద్వారా ఈ ఏడాది టాప్ బిలియనీర్ల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిల్చారు‘ అని వివరించింది. గ్లోబల్ 2000 జాబితాలో ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే అగ్రస్థానంలో నిల్చింది. 2003లో ఫోర్బ్స్ ఈ లిస్టును ప్రకటించడం ప్రారంభించినప్పట్నుంచి బఫెట్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. ఇక గత తొమ్మిదేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా తాజా లిస్టులో రెండో స్థానంలో నిల్చింది. సౌదీ ఆరామ్కో, జేపీమోర్గాన్ చేజ్, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టులో చోటు దక్కించుకున్న ఇతర సంస్థలు.. ► ఓఎన్జీసీ (228 ర్యాంకు), హెచ్డీఎఫ్సీ (268), ఐఓసీ (357), టీసీఎస్ (384), టాటా స్టీల్ (407), యాక్సిస్ బ్యాంక్ (431) ఈ జాబితాలో ఉన్నాయి. ► అపర కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు ఈసారి లిస్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ (1,453 ర్యాంకు), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (1,568), అదానీ గ్రీన్ ఎనర్జీ (1,570) అదానీ ట్రాన్స్మిషన్ (1,705), అదానీ టోటల్ (1,746) వీటిలో ఉన్నాయి. అదానీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్‌ను అధిగమించి అయిదో స్థానం దక్కించుకున్నారు. ► చమురు, గ్యాస్, మెటల్స్ దిగ్గజం వేదాంత ఏకంగా 703 స్థానాలు ఎగబాకి 593వ ర్యాంకు దక్కించుకుంది. ► ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో అత్యధికంగా ఇంధన, బ్యాంకింగ్ రంగ కంపెనీలే ఉన్నాయి. -
బ్యాంకు ఉద్యోగుల ఉద్యమ బాట...
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తలపెట్టిన ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్బీ)ల ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే బ్యాంకుల విలీనంతో తీవ్ర నష్టం జరిగిందంటున్న ఉద్యోగ సంఘాలు... ఇప్పుడు పీఎస్‌బీల ప్రైవేటీకరణతో బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకు సంస్కరణ బిల్లు, బ్యాంకులు మరియు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లులను ఆమోదించేందుకు కసరత్తు చేస్తోందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 3వ తేదీ నుంచే పలు ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా ఈనెల 16, 17 తేదీల్లో విధులు బహిష్కరించి సమ్మె చేపట్టేందుకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు ఇచ్చింది. దీంతో రెండ్రోజుల పాటు బ్యాంకులు మూతబడనున్నాయి. నేడు ఉద్యమ కార్యాచరణ... దేశంలోని తొమ్మిది ప్రధాన బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలతో కూడిన ఐక్య సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ). ఈ నెల 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యూఎఫ్‌బీయూ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యూఎఫ్‌బీయూ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ బీఎస్ రాంబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లతో పాటు ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. -
యూనియన్ బ్యాంకు.. భేష్
ముంబై: ప్రభుత్వరంగంలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సెప్టెంబర్ క్వార్టర్‌కు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 183 శాతం పెరిగి రూ.1,510 కోట్లుగా నమోదైంది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాకు సంబంధించి గతంలో మాఫీ చేసిన రుణం రికవరీ కావడం మెరుగైన ఫలితాలకు దోహదపడింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.534 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.6,829 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 2.78 శాతం నుంచి 2.95 శాతానికి పుంజుకుంది. రుణాల్లో 3 శాతం వృద్ధిని సాధించింది. వడ్డీయేతర ఆదాయం 65 శాతం పెరిగి రూ.3,978 కోట్లుగా నమోదైంది. ఇందులో మాఫీ చేసిన రుణం తాలూ కు వసూలైన రూ.1,764 కోట్లు కూడా ఉంది. 8 శాతం రుణ వృద్ధి లక్ష్యం మొత్తం మీద సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5,341 కోట్ల మేర రుణాల రికవరీని సాధించినట్టు యూనియన్ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ ఫలితాల సందర్భంగా ప్రకటించారు. రిటైల్, వ్యవసాయ రుణాల్లో మంచి వృద్ధి కనిపిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రుణాల్లో 8 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. స్థూల ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 14.71 శాతం నుంచి 12.64 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,745 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ఇందులో రూ. 2,600 కోట్లు శ్రేయీ గ్రూపు కంపెనీలవే ఉన్నాయి. ఈ ఖాతాలకు ఇప్పటికే 65 శాతం కేటాయింపులు చేసినట్టు రాజ్‌కిరణ్ రాయ్ తెలిపారు. ఎన్పీఏలకు కేటాయింపులు రూ.3,273 కోట్లకు తగ్గాయి. -
నేడు ఆర్థికమంత్రితో బ్యాంకింగ్ సీఈఓల భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓలు (పీఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు) సమావేశం కానున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పనితీరు, రుణ వృద్ధి, మహమ్మారిని ఎదుర్కొనడంలో బ్యాంకింగ్ మద్దతు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితో పాటు మొండిబకాయిలు (ఎన్పీఏ), వాటి రికవరీ ప్రక్రియపై కూడా ఆర్థికమంత్రి సమీక్ష జరిపే అవకాశం ఉంది. 2019 మార్చి 31న రూ.7,39,541 కోట్లుగా ఉన్న మొండిబకాయిలు, 2020 మార్చి 31 నాటికి రూ.6,78,317 కోట్లకు, 2021 మార్చి నాటికి రూ.6,16,616 కోట్లకు దిగివచ్చినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ముంబైలో జరుగుతుందని భావిస్తున్న ఈ సమావేశంలో భాగంగా ఆర్థికమంత్రి 2020–21కి ‘ఈఏఎస్‌ఈ 3.0 ఇండెక్స్’ ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.1,679 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2) లో స్టాండెలోన్ ప్రాతిపదికన (ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలపైనే) రూ. 1,679 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 737 కోట్ల లాభాన్ని నమోదుచేయగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ.864 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) బ్యాంకు క్యూ2లో రూ.1,771 కోట్ల నికర లాభాన్ని సాధించింది. నికర వడ్డీ ఆదాయం 6.83 శాతం వృద్ధితో రూ.7,508 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 2.96 శాతంగా నమోదైంది. మొండిబాకీలు తగ్గుముఖం...: బీఓబీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) ఈ ఏడాది క్యూ2లో 9.14 శాతానికి తగ్గుముఖం పట్టాయి. గతేడాది క్యూ2లో ఇవి 10.25%గా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 3.91 శాతం నుంచి 2.51%కి దిగొచ్చాయి. మొత్తం కేటాయింపులు (ప్రొవిజన్లు) జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.4,209 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు తగ్గాయి. క్యూ2లో తాజాగా మొండిబకాయిలుగా చేరిన రుణాలు రూ.899 కోట్లు. ఇక క్యూ2లో రూ.2,500 కోట్లను బ్యాంక్ రికవరీ చేసుకుంది. బీఓబీ షేరు బీఎస్ఈలో 2 శాతం ఎగబాకి రూ.43 వద్ద స్థిరపడింది. -
కెనరా బ్యాంక్ నష్టం 6 రెట్లు జంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్లో రూ.3,259 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.552 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, 6 రెట్లు పెరిగాయని కెనరా బ్యాంక్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.14,000 కోట్ల నుంచి రూ.14,222 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ► గత క్యూ4లో రూ.5,375 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.5,524 కోట్లు. ► 2018–19లో రూ.347 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,236 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► గత ఏడాది మార్చి నాటికి 8.83 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 8.21 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.37 శాతం నుంచి 4.22 శాతానికి తగ్గాయి. ► విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.39,224 కోట్ల నుంచి రూ.37,041 కోట్లకు, నికర మొండి బకాయిలు 22,955 కోట్ల నుంచి రూ.18,251 కోట్లకు తగ్గాయి. ► ప్రొవిజన్ కవరేజ్ రేషియో 68.13 శాతం నుంచి 70.97 శాతానికి పెరిగింది. ► ఈ ఏడాది ఏప్రిల్ 1న కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 4% నష్టంతో రూ.109 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం 2,312 కోట్లు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,312 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్ అలోన్)సాధించింది. గత క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా రావడం, మొండిబకాయిలు తగ్గిన కారణంగా కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో లాభాలు వచ్చాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.65,493 కోట్ల నుంచి రూ.70,653 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇతర వివరాలు... నికర వడ్డీ ఆదాయం 5 శాతం అప్... బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.21,798 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.22,939 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతం నుంచి 3.01 శాతానికి ఎగసింది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 9.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 7.53 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.84% నుంచి 3.07 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలు తగ్గడం తో కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూ1లో రూ.16,849 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో 35 శాతం తగ్గి రూ.10,934 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 79.34 శాతంగా ఉంది. అయితే తాజా మొండిబకాయిలు ఈ క్యూ1లో భారీగా, రూ.16,212 కోట్లకు పెరిగా యి. ఒక మహారత్న కంపెనీకి చెందిన రూ.2,000 కోట్ల రుణం ఎన్పీఏగా మారడం, వ్యవసాయ, ఎస్ఎంఈ రుణాలు ఎన్పీఏలుగా మారడంతో ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు పెరిగాయి. రూ. 5,769 కోట్ల రికవరీలు... మొండి బకీలకు సంబంధించి రికవరీలు, అప్గ్రేడ్లు రూ.5,769 కోట్లకు పెరిగాయి. దివాలా ప్రక్రియ నడుస్తున్న ఎస్సార్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్‌ల కేసులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ఖాతాల నుంచి రూ.16,000 కోట్ల రుణాలు రికవరీ అవుతాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.89% నుంచి 12.83 శాతానికి మెరుగుపడింది. రూ.7,000 కోట్ల సమీకరణ.... అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ.7,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. మరో రూ.20,000 కోట్ల నిధులు సమీకరించాలని కూడా ఆలోచిస్తున్నామని, అయితే దీనికి సమయం పడుతుందని బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడేదాకా వేచి చూస్తామని పేర్కొన్నారు. ఈ నాలుగో క్వార్టర్లో ఎస్బీఐ కార్డ్ ఐపీఓ ఉంటుందని, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ వచ్చే ఏడాది ఉంటుందని ఆయన తెలిపారు. రూ.2,312 కోట్ల నికర లాభం రావడం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి సానుకూలతలున్నా, బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ నష్టపోయింది. తాజా మొండి బకాయిలు పెరగడంతో ఎస్బీఐ షేర్ 3 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.... వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాలు సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమక్రమంగా మెరుగుపడుతున్నామని పేర్కొన్నారు. సిబ్బంది, ఇతర వ్యయాలు నియంత్రణలోనే ఉన్నాయని, ఆదాయానికి, వ్యయానికి గల నిష్పత్తి అర శాతం తగ్గి 2.03 శాతానికి చేరిందని వివరించారు. నిర్వహణ లాభం పెంచుకోవడంపై దృష్టి పెట్టామని, ఈ క్యూ1లో నిర్వహణ లాభం 11 శాతం వృద్ధితో రూ.13,246కు పెరిగిందని పేర్కొన్నారు. రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నికర వడ్డీ మార్జిన్ పెంచుకోవడం కష్టమైన పనేనని అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం రుణ వృద్ధి, 3.1 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించగలమని పేర్కొన్నారు. మొండిబకాయిలు వసూలు కావాలని ప్రతి రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వాహన రంగంలో మందగమనం చోటు చేసుకోవడం వల్ల తామెలాంటి ఆందోళన చెందడం లేదని పేర్కొన్నారు. మొత్తం రిటైల్ వాహన రుణాలు రూ.71,000 కోట్లుగా ఉన్నాయని, వీటిల్లో వాహన డీలర్ల రుణాలు రూ.11,500 కోట్లని రజనీష్ కుమార్ తెలిపారు. -
అలహాబాద్ బ్యాంక్ లాభం 128 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఇక గత క్యూ1లో రూ.4,794 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,747 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,590 కోట్ల నుంచి రూ.1,102 కోట్లకు తగ్గాయని వివరించింది. మిశ్రమంగా రుణ నాణ్యత.. బ్యాంక్ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. స్థూల మొండి బకాయిలు పెరగ్గా, నికర మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ1లో 15.97 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 17.43 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 7.32% నుంచి 5.71%కి చేరాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత క్యూ4లో స్థూల మొండి బకాయిలు 17.55%, నికర మొండి బకాయిలు 5.22%గా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేర్ 5.6% నష్టంతో రూ.36.85 వద్ద ముగిసింది. -
అలహాబాద్ బ్యాంకులో మరో మోసం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ కార్యకలాపాల తీరుపై సందేహాలు రేకెత్తించేలా తాజాగా మరో మోసం బైటపడింది. ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ (ఎస్‌ఈఎల్‌ఎం) రూ. 688.27 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు అలహాబాద్ బ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రొవిజనింగ్ చేసినట్లు, ఫ్రాడ్ గురించి ఆర్బీఐకి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎస్‌ఈఎల్‌ఎం దివాలా పిటిషన్‌పై ఎన్సీఎల్టీలో విచారణ జరుగుతున్నట్లు వివరించింది. వారం రోజుల వ్యవధిలో అలహాబాద్ బ్యాంకులో ఇది రెండో ఫ్రాడ్ కేసు కావడం గమనార్హం. భూషణ్ పవర్ అండ్ స్టీల్ (బీపీఎస్ఎల్) రూ. 1,775 కోట్ల మోసానికి పాల్పడినట్లు గత శనివారమే బ్యాంకు వెల్లడించింది. -
మరో కుంభకోణం : షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌కు సంబంధించి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్‌కు భారీ ఎత్తున కుచ్చు టోపీ పెట్టిన కంపెనీ మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంకును కూడా ముంచేసింది. రూ.238 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఫోరెన్సిక్ ఆడిట్ ఇన్వెస్టిగేషన్, సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రూ.238.30 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్లు, కంపెనీ, దాని డైరెక్టర్లు ఈ మేర ఫండ్స్ మళ్లించినట్లు తెలిపింది. ఈ మేరకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నివేదించింది. రుణదాతల బ్యాంకుల కన్సార్టియం నుంచి నిధులను సేకరించేందుకు భూషణ్ పవర్ అండ్ స్టీల్స్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని, అకౌంట్ బుక్స్‌ను తారుమారు చేసిందని పంజాబ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. దీంతో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు గురువారం 6 శాతం పతనమయ్యాయి. -
బ్యాంకింగ్ లావాదేవీలపై పాక్షిక ప్రభావం
న్యూఢిల్లీ: వేతనాల సవరణ డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులు నిర్వహించిన ఒక్క రోజు సమ్మెతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల శాఖలు మూతబడగా, మరికొన్ని ప్రాంతాల్లో సిబ్బంది లేక ఖాళీగా కనిపించాయి. బ్రాంచీల్లో డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరెన్సులు, డ్రాఫ్ట్‌ల జారీ తదితర లావాదేవీలపై ప్రభావం పడింది. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి. ఏఐబీవోసీ తలపెట్టిన ఒక్క రోజు సమ్మె గురించి చాలా బ్యాంకులు ముందే తమ ఖాతాదారులకు సమాచారం అందించాయి. మరోవైపు, డిసెంబర్ 26న కూడా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నేతృత్వంలో ఇది జరగనుంది. వేతనాల సవరణ డిమాండ్‌తో పాటు, మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం (బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కన్సాలిడేషన్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. సెలవులు, సమ్మెల కారణంగా బ్యాంకులు శుక్రవారం మొదలుకుని వచ్చే బుధవారం దాకా (మధ్యలో సోమవారం ఒక్క రోజు మినహా) పనిచేయని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 22 నాలుగో శనివారం కాగా, మర్నాడు ఆదివారం, ఆ తర్వాత మంగళవారం క్రిస్మస్ కారణంగా బ్యాంకులకు సెలవు. -
బ్యాంకులకు బెయిలవుట్ జోష్
న్యూఢిల్లీ: మొండిబాకీల(ఎన్పీఏ) దెబ్బకి మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఆదుకునేందుకు ఉద్దేశించిన బెయిలవుట్ ప్యాకేజీ కింద కేంద్రం మరికొన్ని నిధులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా అయిదు పీఎస్బీలకు రూ.11,336 కోట్లు అందించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ), అలహాబాద్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో అదనపు మూలధనాన్ని సమకూర్చడానికి సంబంధించి ఇదే తొలి విడత కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ. 53,664 కోట్లు కూడా పీఎస్బీలకు కేంద్రం అందించనుంది. తాజా ప్రణాళిక ప్రకారం.. నీరవ్ మోదీ స్కామ్ బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 2,816 కోట్లు లభించనున్నాయి. ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 2,019 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ. 2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ. 2,555 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ. 1,790 కోట్లు లభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాండ్లపై వడ్డీల చెల్లింపులకు తోడ్పాటు.. అదనపు టయర్ 1 (ఏటీ–1) బాండ్‌హోల్డర్లకు వడ్డీ చెల్లింపులు జరపాల్సి ఉండటంతో... ఈ జాబితాలోని కొన్ని బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. తాజా పరిణామం వీటికి కొంత ఉపశమనం ఇవ్వనుంది. సాధారణంగా శాశ్వత ప్రాతిపదికన ఉండే ఏటీ1 బాండ్ల ద్వారా కూడా బ్యాంకులు తమకు కావాల్సిన మూలధనాన్ని సమీకరిస్తుంటాయి. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పెరిగిపోతుండటంతో పాటు భారీ నష్టాలు చవిచూస్తున్న పీఎస్బీలకు.. తమ సొంత ఆదాయం నుంచి ఈ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కష్టంగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయమే తీసుకుంటే.. గతేడాది జూలైలో ఏటీ1 బాండ్ల విక్రయం ద్వారా సమీకరించిన రూ.1,500 కోట్ల మొత్తంపై వడ్డీ చెల్లించేందుకు తక్షణం రూ.135 కోట్లు అవసరముంది. 8.98 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ నెల 25లోగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. అయితే, నీరవ్ మోదీ స్కామ్ దెబ్బకి లాభాలు తుడిచిపెట్టుకుపోగా భారీ నష్టాలు, మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎన్బీకి ఈ చెల్లింపులు జరపడం కష్ట సాధ్యంగా మారింది. మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎన్బీ టయర్ 1 మూలధనం 5.96 శాతం స్థాయిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 7.375 శాతం కన్నా ఇది చాలా తక్కువ. జూలై 25 గడువులోగా నిర్దేశిత స్థాయికి మూలధనం పెంచుకుంటేనే పీఎన్బీ ఈ చెల్లింపులు చేయగలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్లకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవలే ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అదనపు మూలధన నిధులు సమకూర్చనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీఎన్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రూ.1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో పీఎస్బీలకు లభించనున్నాయి. మిగతా రూ. 58,000 కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవచ్చు. రూ.1.35 లక్షల కోట్లలో కేంద్రం ఇప్పటికే రూ.71,000 కోట్లు అందించింది. మిగతా మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చనుంది. పీఎస్‌బీలు కూడా సొంతంగా రూ. 50,000 కోట్లను సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 21 పీఎస్బీల్లో ఇప్పటికే 13 బ్యాంకులు ఇందుకోసం బోర్డులు, షేర్‌హోల్డర్ల అనుమతులు కూడా పొందాయి. పీఎస్‌బీల షేర్లు రయ్.. కేంద్రం అదనపు మూలధనం సమకూర్చనున్న వార్తలతో మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. 11 శాతం దాకా పెరిగాయి. కార్పొరేషన్ బ్యాంక్ షేరు సుమారు 10.88%, అలహాబాద్ బ్యాంక్ 7.23%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.57%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.38%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.87%, కెనరా బ్యాంక్ 5.71%, ఇండియన్ బ్యాంక్ 5.04% పెరిగాయి. అటు ఆంధ్రా బ్యాంక్ 4.91%, దేనా బ్యాంక్ 3.58%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.10%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2.27%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1.35% పెరిగాయి. కేంద్ర రీక్యాపిటలైజేషన్ ప్రతిపాదన వీటికి ఊతమిచ్చినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘కనీస బ్యాలెన్స్’ పెనాల్టీలతో పీఎన్బీకి రూ.152 కోట్లు న్యూఢిల్లీ: మినిమం బ్యాలెన్స్ పాటించని పొదుపు ఖాతాలపై జరిమానాల ద్వారా పీఎన్బీ గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా దారుల నుంచి రూ.151.66 కోట్లు వసూలు చేసింది. 1.23 కోట్ల సేవింగ్స్ ఖాతాలపై పీఎన్బీ ఈ మేరకు పెనాల్టీలు విధించింది. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల ద్వారా వసూలు చేసిన మొత్తం గురించిన వివరాలు వెల్లడించాలంటూ దరఖాస్తు చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్‌కు పీఎన్బీ ఈ విషయాలు తెలియజేసింది. ‘2017–18లో మినిమం బ్యాలెన్స్ పాటించని 1,22,98,748 సేవింగ్స్ అకౌంట్స్ నుంచి రూ.151.66 కోట్ల మేర పెనాల్టీని వసూలు చేయడం జరిగింది’ అని పేర్కొంది. ప్రభుత్వం మరింత మందిని బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. బ్యాంకులు ఇలా మినిమం బ్యాలెన్స్ నిబంధనల పేరుతో పెనాల్టీలు విధించడం సరికాదని, ఈ విషయంలో ఆర్బీఐ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్థికవేత్త జయంతిలాల్ భండారీ వ్యాఖ్యానించారు. -
రొటొమ్యాక్ కుంభకోణం 3,695 కోట్లు
న్యూఢిల్లీ/కాన్పూర్: రూ. 800 కోట్లు కాదు.. ఏకంగా రూ. 3,695 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని రొటొమ్యాక్ పెన్స్ ప్రమోటర్ విక్రమ్ కొఠారి ముంచేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆ మేరకు కొఠారీ అండ్ కో పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సోమవారం వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి. రొటొమ్యాక్ కంపెనీ ఖాతాల పరిశీలన తర్వాత ఆ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ల నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ బ్యాంకుల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో రూ. 2919 కోట్ల రుణాల్ని పొందగా అసలు, వడ్డీ, కలుపుకుంటే ఆ మొత్తం రూ. 3,695 కోట్లుగా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 754.77 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 456.63 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 771.07 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 458.95 కోట్లు, అలహాబాద్ బ్యాంకు రూ. 330.68 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 49.82 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 97.47 కోట్ల రుణాలిచ్చాయి. ఇంకా అరెస్టు చేయలేదు: సీబీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ఆధారంగా కాన్పూర్‌కు చెందిన రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కొఠారి మోసాలపై దర్యాప్తు కోసం సీబీఐ ఆదివారమే రంగంలోకి దిగింది. విక్రమ్ కొఠారి, అతని భార్య సాధన, కుమారుడు రాహుల్, మరికొందరు గుర్తు తెలియని బ్యాంకు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం ఉదయం కాన్పూర్‌లో కొఠారి ఇల్లు, కార్యాలయంతో పాటు మూడు చోట్ల సీబీఐ తనిఖీలు ప్రారంభించింది. ఇంతవరకూ ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదని, కొఠారి, అతని భార్య, కుమారుడ్ని విచారిస్తున్నామని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు. రుణాల్ని ఎక్కడికి మళ్లించారో విచారిస్తున్నాం: ఈడీ సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా రొటొమ్యాక్ పెన్స్ యాజమాన్యంపై ఈడీ కూడా మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. విక్రమ్ కొఠారి, అతని కుటుంబసభ్యుల్ని కేసులో నిందితులుగా చేర్చింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని దారి మళ్లించారా? అక్రమాస్తులు కూడగట్టేందుకు, నల్లధనం సృష్టికి ఆ డబ్బును వాడారా? అన్న కోణంలో విచారణ చేస్తామని ఈడీ తెలిపింది. ఎగుమతి ఆర్డర్ల పేరిట రుణాల దారి మళ్లింపు సీబీఐ వర్గాల కథనం ప్రకారం.. 2008 నుంచి బ్యాంకుల నుంచి పొందిన భారీ రుణాలను రొటొమ్యాక్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించింది. ఎగుమతి ఆర్డర్ల పేరిట బ్యాంకుల నుంచి మంజూరైన రుణాలను అందుకు వినియోగించకుండా స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేసింది. ఎగుమతి ఆర్డర్ల కోసం తప్పుడు ధ్రువపత్రాలతో పొందిన అప్పును విదేశాల్లోని ఇతర కంపెనీలకు మళ్లించారని.. ఆ డబ్బును తిరిగి కాన్పూర్‌కు చెందిన కంపెనీకే మళ్లించారని సీబీఐ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇక ఇతర కేసుల్లో .. ఎగుమతి కోసం వస్తువుల కొనుగోలుకు బ్యాంకులిచ్చిన రుణాల్ని కూడా రొటొమ్యాక్ దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. -
ఉద్దేశపూర్వక ఎగవేతలు రూ.92,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు 20% పెరి గిపోయాయి. 2016–17 ఆర్థిక సంవత్సరం చివరికి 9,000 మంది రూ.92,376 కోట్ల మేర బ్యాంకులకు ఎగ్గొట్టారు. 2016 మార్చి నాటికి ఇలా ఉద్దేశపూర్వకంగా చెల్లించని రుణాల మొత్తం రూ.76,685 కోట్లుగానే ఉన్నాయి. ఇక ఉద్దేశపూర్వక ఎగవేత కేసులు గతేడాది మార్చి నాటికి 8,167గా ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి వాటి సంఖ్య 8,915కు పెరిగింది. వీటిలో రూ.32,484 కోట్ల ఎగవేతలకు సంబంధించి రూ.1,914 కేసులపై బ్యాం కులు కేసులు దాఖలు చేయించాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 27ప్రభుత్వ రంగ బ్యాంకు లు (ఎస్బీఐ, దాని లో విలీనమైన అనుబంధ బ్యాంకులు సహా) రూ.81,683 కోట్ల మొండి బాకీలను రద్దు చేయడం గమనార్హం. అంతకుమందు ఏడాదితో పోలిస్తే ఇది 41 % అధికం. -
బ్యాంకింగ్‌లో విలీనాల జోరు..!
♦ ఇక జాప్యానికి తావులేదు ♦ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా వేచి చూడనక్కర్లేదు ♦ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా ఎదురుచూస్తూ కూర్చోకుండా.. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం మిగతా బ్యాంకులను కలిపే విషయానికి సంబంధించి ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా ఆగాలని అంతర్గతంగా భావించినట్లు ఆయన తెలిపారు. ‘అయితే, బ్యాంకింగ్ వ్యవస్థ తీరుతెన్నులను పునఃసమీక్షించిన మీదట ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కన్సాలిడేషన్‌కి అనువైన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని గుర్తించాం. కాబట్టి ఆ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం‘ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిపి 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ఉన్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయొచ్చు. అలాగే దక్షిణాదిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాంటి టర్న్‌ఎరౌండ్ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకుల్లో కలపవచ్చు. ఇక దేనా బ్యాంక్ వంటి వాటిని దక్షిణాదిన మరో పెద్ద బ్యాంకులో కలిపేయవచ్చు. 2016–17 ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో పీఎస్బీల్లో మొండిబాకీలు రూ. 1 లక్ష కోట్ల పైగా పెరిగి రూ. 6.06 లక్షల కోట్లకు ఎగిశాయి. కొన్ని పీఎస్‌బీలను మెరుగైన బ్యాంకులతో విలీనం చేస్తే మొండిబాకీల సమస్య పరిష్కారానికీ తోడ్పాటు లభిస్తుందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు రియల్టీ చిక్కు.. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై స్పందిస్తూ.. సంస్థ రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ప్రక్రియ కాస్త నెమ్మదించిందని ఆయన చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో గణనీయంగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నికర నష్టం రూ. 5,158 కోట్లకు, మొండిబాకీలు 21.25 శాతానికి ఎగిశాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ తరహాలోనే ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించే అవకాశం ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. మరోవైపు, యాక్సిస్ బ్యాంక్‌లో వాటాల విక్రయానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నామని జైట్లీ చెప్పారు. అయితే, ఇంతవరకూ దీనిపై ఏ సంస్థతోను చర్చలు జరపలేదని తెలిపారు. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ విలీన వార్తలు వచ్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా యాక్సిస్ బ్యాంక్‌లో కేంద్రానికి 12.02% వాటాలు ఉన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపును కోరుకుంటున్నా... న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలకమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) ముందు రేట్ల తగ్గింపునకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం, అదే సమయంలో పెట్టుబడులు, వృద్ధి రేటు పుంజుకోవాల్సిన అవసరాన్ని జైట్లీ పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ఎంపీసీ మంగళ, బుధవారాల్లో సమావేశమై ద్రవ్యపరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ ఆర్బీఐ మాత్రం ధరలపై జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతే పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే భేటీలో యథాతథ స్థితినే కొనసాగించొచ్చని చెబతున్నారు. ‘‘ద్రవ్యోల్బణం చాలా కాలంగా నియంత్రణలోనే ఉంది. మంచి వర్షాలతో ఇది ఇకపైనా ఇదే విధంగా కొనసాగవచ్చు. అలాగే, చమురు ధరలు కూడా పెరగకపోవచ్చు. ఇదే సమయంలో వృద్ధి, పెట్టుబడులు మెరుగుపడాల్సి ఉంది. ఏ ఆర్థిక మంత్రి అయినా ఈ పరిస్థితుల్లో రేట్ల కోతనే కోరుకుంటారు. ప్రైవేటు రంగం సైతం రేట్ల కోతను ఆశిస్తుంది. ఈ అధికారం ఎంపీసీకి అప్పగించినందున నిర్ణయం కోసం వేచి చూస్తా’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో అరుణ్ జైట్లీ వివరించారు. జీఎస్టీ తర్వాతే...! గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ రేటు 7.1 శాతానికి తగ్గిన నేపథ్యంలో, పుంజుకునేందుకు గాను రేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రేట్ల కోతకు అన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ... జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ ఇందుకు ప్రతికూలంగా మారింది. జీఎస్టీ విధానం ధరలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంలో ఆర్బీఐ స్పష్టత కోసం వేచి చూసే ధోరణి అవలంభించొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా పాలసీ సమావేశంలో ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందని తాను భావించడం లేదని, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు చూసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని యూనియన్ బ్యాంకు ఈడీ వినోద్ కతూరియా పేర్కొన్నారు. జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఎయిరిండియాను15 ఏళ్ల క్రితమే వదిలేయాల్సింది.. రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం 15 ఏళ్ల క్రితమే ప్రైవేటీకరించాల్సిందని జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సమర్ధవంతంగా నడుస్తుండటంతో దేశీయంగా పౌర విమానయాన రంగం మెరుగుపడుతోందన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు రూ. 50,000 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియాను ప్రజాధనంతో నిలబెట్టేందుకు ప్రయత్నించడం ఎంతవరకూ సబబు అని పేర్కొన్నారు. కేవలం 14 శాతం మార్కెట్ వాటా కోసం దాదాపు రూ. 55,000–రూ. 60,000 కోట్ల ప్రజాధనాన్ని ధారపోయడం సరికాదన్నారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న నీతి ఆయోగ్ అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తానని, అయితే తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
త్వరలో ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ.10 వేల కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రం త్వరలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకూ తాజా మూలధనం సమకూర్చే అవకాశం ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే కొద్ది వారాల్లో కేంద్రం ఈ నిధులు సమకూర్చుతుందని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఫలితాల అనంతరం, మొండిబకాయిలు, అవసరాలకు అనుగుణంగా ప్రతి బ్యాంకూ తనకు కావల్సిన తాజా మూలధనం వివరాలను ప్రభుత్వానికి సమర్పించాయని, దీనికి అనుగుణంగా నిధులు సమకూర్చే విషయంలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక కార్యాచరణ రూపొందించిందనీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల తాజా మూలధన కల్పనను బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పునర్వ్యస్థీకరణ కోసం ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు నాలుగేళ్లలో రూ.70,000 కోట్ల పెట్టుబడులు అందించనున్నారు. ఈ కార్యక్రమం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్లు ఇవ్వగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25,000 కోట్లు ఇవ్వనున్నారు. -
బ్యాంకింగ్ రంగం పటిష్టతే ధ్యేయం
♦ ఆర్థిక శాఖ సహాయ మంత్రి సిన్హా ♦ అవసరమైతే మరింత మూలధనం అందిస్తామని హామీ గుర్గావ్: ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టతకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. 2016-17 బడ్జెట్లో బ్యాంకింగ్‌కు తాజా మూలధనంగా కేంద్రం రూ.25,000 కోట్లను కేటాయించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ... అవసరమైతే మరింత మూలధనం అందించడానికి సైతం సిద్ధమని ఇక్కడ జరిగిన రెండవ జ్ఞాన సంగమ్ కార్యక్రమంలో అన్నారు. మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న రుణాల విలువ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు (బ్యాంకింగ్ వ్యవస్థ లోన్ బుక్ విలువ దాదాపు రూ.69 లక్షల కోట్లు) బ్యాంకుల ఉంటుందన్నది తమ అంచనా అని తెలిపారు. అయితే ఈ తరహా రుణాల పెరుగుదల వేగం దాదాపు నిలిచిపోయిందని ఆయన అన్నారు. సమస్యకు సంబంధించి ఇది ఒక సానుకూల పరిణామంగా ఆయన పేర్కొన్నారు. సమస్య ఎక్కడుందో తెలుసని, ఎలా పరిష్కరించాలో కూడా తెలుసని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక ఇప్పటికే భారం గా మారిన మొండిబకాయిల సమస్య పై ఆయన మాట్లాడుతూ, ఇది ఆందోళనకరమైన అంశమే అయినప్పటికీ సమస్యను నియంత్రించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019 మార్చి నాటికి గడచిన నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్రం రూ.70,000 కోట్లు ఇవ్వాలన్నది ప్రణాళిక. వీటిలో 2015-16, 2016-17ల్లో రూ.25,000 కోట్లు చొప్పున అందుతోంది. అటు తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10 వేల కోట్ల చొప్పున బ్యాంకింగ్‌కు అందజేస్తారు. నిజానికి బ్యాంకింగ్‌కు నాలుగేళ్లలో తాజా మూలధనంగా రూ.1.85 లక్షల కోట్లు అందాలన్నది అంచనా. అయితే ప్రభుత్వం సమకూర్చగా మిగిలినది మార్కెట్ ద్వారా సమీకరించుకోవాలన్నది ప్రణాళిక. -
మొండి బకాయిలకు ‘బ్యాడ్ బ్యాంక్’!
పరిశీలిస్తున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిల సమస్య పరిష్కారంపై సర్కారు కసరత్తు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక బ్యాంకునో లేదా కంపెనీనో ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటుపై చర్చించాం. అయితే బ్యాంకర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి’ అని సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులున్న పరిస్థితులు చూస్తే ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు యోచన అంత తీసిపారేయదగ్గది కాదని పీఎన్బీ ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ చెప్పారు. అయితే దీనివల్ల బ్యాంకుల్లో అలసత్వం పెరిగే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. బ్యాంకులు తమ మొండి బకాయిలను రాబట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా సదరు ‘బ్యాడ్ బ్యాంక్’కు బదలాయించే సే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటులాంటివేవీ అక్కర్లేదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. బ్యాంకులు ఇప్పటికే వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇవ్వడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం వెల్లడించారు. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదన చర్చనీయాంశమయింది. -
ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేస్తాం..
- వాటాలు 52%కి తగ్గించుకుంటాం: జైట్లీ ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా వాటిలో వాటాలను 52 శాతానికి తగ్గించుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని, బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పిస్తామని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) 68వ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం కేంద్రానికి ఎస్బీఐలో 59 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 76.5 శాతం, ఆంధ్రా బ్యాంకులో 61 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 59 శాతం, కెనరా బ్యాంకులో 64.5 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 57.5 శాతం, అలహాబాద్ బ్యాంకులో 60 శాతం పైగా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 64.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 81.5 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు, పీఎస్‌బీలు దేశ అభివృద్ధి అజెండాలో కీలక పాత్ర పోషించాలని, రాజకీయ జోక్యాలకు తావు లేకుండా వాటి నిర్వహణ పూర్తిగా బ్యాంకింగ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా సాగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే కొన్ని పీఎస్బీల్లో కీలక స్థానాల్లో ప్రొఫెషనల్స్ నియామకాలు జరిగాయని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో చేపట్టే నియామకాలన్నీ కూడా ప్రొఫెషనల్‌గా ఉండే విధంగా చూసేందుకు ప్రత్యేకంగా బ్యాంకింగ్ బ్యూరోను ఏర్పాటు చేస్తున్న సంగతిని జైట్లీ ప్రస్తావించారు. ఎకానమీ పటిష్టతకు మరిన్ని చర్యలు... సంస్కరణలను కొనసాగించడం ద్వారా మన ఎకానమీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు జైట్లీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బలపడితే ఇటు పరిశ్రమలపరంగానూ, అటు మార్కెట్లపరంగానూ అద్భుతమైన అవకాశాలు అందిరాగలవని పేర్కొన్నారు. 2015-16లో ద్రవ్య లోటును 3.9 శాతానికి కట్టడి చేయడంతో పాటు ఇంకా మెరుగైన వృద్ధి రేటు సాధించగలమని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)ని కంప్యూటరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎస్బీహెచ్ లాభం 11% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికరలాభం 10.6 శాతం వృద్ధితో రూ. 251 కోట్లకు చేరింది. ఇదే సమయంలో మొత్తం వ్యాపారం 9 శాతం పెరిగి రూ. 2.40 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఎస్బీహెచ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 998 కోట్ల నుంచి రూ.1,107 కోట్లకు చేరింది. నికరవడ్డీ లాభదాయకత (నిమ్) 3.02 శాతం నుంచి 3.08 శాతానికి పెరిగింది. గతేడాదితో పోలిస్తే నికర నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. గతేడాది జూన్‌లో రూ. 6,174 కోట్లు(6.26%)గా ఉన్న స్థూల ఎన్పీఏలు ఇప్పుడు రూ. 5,482 కోట్లు(5.14%) తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఆర్థిక ఫలితాలకు ఆమోదం తెలిపారు. జూన్ చివరి నాటికి ఎస్బీహెచ్ మొత్తం శాఖల సంఖ్య 1,824 ఉంటే అందులో 741 శాఖలు తెలంగాణలో, 400 శాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. -
విస్తరణపై విజయా బ్యాంక్ దృష్టి
సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు ♦ ఉత్తరాదిలో మరో 2 రీజనల్ శాఖలు ♦ ఈ ఏడాది వ్యాపారంలో 14% వ్యాపార వృద్ధి లక్ష్యం ♦ క్యూ3లో రూ. 500 కోట్ల క్విప్ ఇష్యూ ♦ బ్యాంక్ ఎండీ, సీఈవో కిషోర్ సాన్సే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగానూ, విదేశాల్లోనూ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నట్లు ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ ప్రకటించింది. సింగపూర్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర మధ్యప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆర్బీఐ అనుమతి కోరినట్లు విజయా బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో కిషోర్ సాన్సే తెలిపారు. ఈ అనుమతులు రావడానికి 12 నుంచి 15 నెలల సమయం పడుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాన్సే మాట్లాడుతూ దక్షిణాది బ్యాంక్ ముద్రను చెరిపేసుకొని పాన్ ఇండియా విస్తరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రానున్న తొమ్మిది నెలల్లో ఉత్తర భారత దేశంలో కొత్తగా రెండు రీజినల్ ఆఫీసులను ప్రారంభించడంతో పాటు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడు నెలల కొత్తగా 74 శాఖలను ఏర్పాటు చేయగా వచ్చే తొమ్మిది నెలల్లో మరో 150 శాఖలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. దీంతో వచ్చే మార్చినాటికి మొత్తం శాఖల సంఖ్య 1,627 నుంచి 1,840కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివార్లలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు శాఖలను సాన్సే శనివారం ప్రారంభించనున్నారు. 14 శాతం వృద్ధి లక్ష్యం ఈ ఏడాది వ్యాపారంలో 14 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు విజయా బ్యాంక్ తెలిపింది. మార్చినాటికి బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ. 2.14 లక్షల కోట్లుగా ఉంది. ఇంకా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోకపోవడంతో రుణాల మంజూ రులో ఆచితూచి అడుగులు వేస్తున్నామని, ప్రధానంగా రిటైల్, వ్యవసాయ రుణాలపై దృష్టిసారిస్తున్నట్లు సాన్సే తెలిపారు. వ్యాపార విస్తరణకు ఈ ఏడాది రూ. 500 కోట్ల మూలధనం సమకూర్చాల్సిందిగా కేం ద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్ర నిర్ణయాన్ని బట్టి మూడో త్రైమాసికంలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రూ. 400 నుంచి రూ. 500 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులో కేంద్రానికి 74 శాతం వాటా ఉంది. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలు ఒక స్పష్టతను ఇవ్వలేకపోయాయని, దీంతో ఆగస్టు సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
మొండి బకాయిల్లో యునెటైడ్ బ్యాంక్ టాప్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యునెటైడ్ బ్యాం క్ ఆఫ్ ఇండియాకు అత్యధికంగా మొండి బకాయిలు ఉన్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదించిన వివరాల ప్రకారం..., ఈ ఏడాది మార్చి నాటికి యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21.5 శాతం రుణాలు మొండి బకాయిలు(పునర్వ్యస్థీకరించిన రుణాలను కూడా కలుపుకొని)గా ఉన్నాయి. ఈ తరహా రుణాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21.3 శాతంగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు 19.4 శాతంగా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు 18.7 శాతంగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 17.9 శాతంగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో, దేనా బ్యాంక్‌లకు ఈ తరహా రుణాలు 15 శాతానికి పైగానే ఉన్నాయి. మొండి బకాయిలు పెరగడం ఆర్బీఐని, ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. వీటిని తగ్గించడానికి ఆర్బీఐ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ.2,55,180 కోట్లు. వీటిలో 30%(రూ.93,769 కోట్లు) టాప్-30 డిఫాల్టర్లవే.