సాక్షి, హైదరాబాద్: కేంద్రం తలపెట్టిన ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే బ్యాంకుల విలీనంతో తీవ్ర నష్టం జరిగిందంటున్న ఉద్యోగ సంఘాలు... ఇప్పుడు పీఎస్‌బీల ప్రైవేటీకరణతో బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకు సంస్కరణ బిల్లు, బ్యాంకులు మరియు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లులను ఆమోదించేందుకు కసరత్తు చేస్తోందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆందోళన వ్యక్తం చేస్తోంది.
బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 3వ తేదీ నుంచే పలు ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా ఈనెల 16, 17 తేదీల్లో విధులు బహిష్కరించి సమ్మె చేపట్టేందుకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు ఇచ్చింది. దీంతో రెండ్రోజుల పాటు బ్యాంకులు మూతబడనున్నాయి.
నేడు ఉద్యమ కార్యాచరణ...
దేశంలోని తొమ్మిది ప్రధాన బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలతో కూడిన ఐక్య సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ). ఈ నెల 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యూఎఫ్‌బీయూ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్నారు.
ఇందులో భాగంగా సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో యూఎఫ్‌బీయూ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ బీఎస్ రాంబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లతో పాటు ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment