United Forum of Bank Unions
-
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన సమ్మెను వాయిదా వేశాయి. ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంగీకరించడం ఇందుకు కారణం. తొమ్మిది బ్యాంకు యూనియన్లకు నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఐబీఏతో చర్చలు జూలై 1 నుంచి మొదలు కానున్నాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని ఉద్యోగ సంఘాలు బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నాయి. పింఛన్ దారులందరికీ పెన్షన్‌ను నవీకరించడం, సవరించడంతోపాటు జాతీయ పెన్షన్ పథకాన్ని తొలగించడం, బ్యాంకు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి డిమాండ్ల జాబితాలో ఉన్నాయి. -
బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం!
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న సంస్థల తీవ్ర మొండిబకాయిలు (ఎన్పీఏ) భారీ రాయితీలతో పరిష్కారం ఒకవైపు, యస్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు ‘బెయిల్ అవుట్లు’ మరోవైపు... ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ తీవ్ర సవాళ్లలో కూరుకుపోతోందని యూఎఫ్‌బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) విమర్శించింది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్బీ) ప్రైవేటీకరణ, విలీనాల వంటి ప్రతికూల నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. ఆయా విధానాలకు నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మ తప్పదని పేర్కొంది. ఈ మేరకు యూఎఫ్‌బీయూ కన్వీనర్ బీ రాంబాబు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని యూఎఫ్‌బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ► 13 కార్పొరేట్ల రుణ బకాయిలు రూ.4,86,800 కోట్లు. అయితే భారీ రాయితీలతో రూ.1,61,820 కోట్లకే రుణ పరిష్కారం జరిగింది. వెరసి బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ► సంక్షోభంలో ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకులను నిధుల పరంగా గట్టెక్కించడానికి (బెయిల్ అవుట్) గతంలోనూ, వర్తమానంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులనే వినియోగించుకోవడం జరిగింది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాద్‌లు ఇందుకు గత ఉదాహరణలుకాగా, ఇప్పుడు యస్‌బ్యాంక్‌ను రక్షించడానికి ప్రభుత్వ రంగ ఎస్బీఐని వినియోగించుకోవడం జరిగింది. ప్రైవేటు రంగ దిగ్గజ ఎన్బీఎఫ్సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బెయిల్ అవుట్‌కు ఎస్బీఐ, ఎల్ఐసీలను వినియోగించుకోవడం జరిగింది. ► ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న యోచన సరికాదు. జన్ ధన్, నిరుద్యోగ యువత కోసం ముద్ర, వీధి వ్యాపారుల కోసం స్వధన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విజయవంతానికి మెజారిటీ భాగస్వామ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం గమనార్హం. ► ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ► బ్యాంకులను ప్రైవేటీకరించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే పక్షంలో, బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెతో ఎటువంటి చర్యలకైనా దిగేందుకు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సిద్ధమవుతారు. ప్రైవేటీకరణ విధానం ప్రజల ప్రయోజనాలకు మంచిదికాదు. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ లాభాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు తీవ్రమైన భారీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌పీఏల్లో ప్రధాన వాటా పెద్ద కార్పొరేట్‌దే కావడం గమనార్హం. -
బ్యాంకు ఉద్యోగుల ఉద్యమ బాట...
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తలపెట్టిన ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్బీ)ల ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే బ్యాంకుల విలీనంతో తీవ్ర నష్టం జరిగిందంటున్న ఉద్యోగ సంఘాలు... ఇప్పుడు పీఎస్‌బీల ప్రైవేటీకరణతో బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకు సంస్కరణ బిల్లు, బ్యాంకులు మరియు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లులను ఆమోదించేందుకు కసరత్తు చేస్తోందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 3వ తేదీ నుంచే పలు ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా ఈనెల 16, 17 తేదీల్లో విధులు బహిష్కరించి సమ్మె చేపట్టేందుకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు ఇచ్చింది. దీంతో రెండ్రోజుల పాటు బ్యాంకులు మూతబడనున్నాయి. నేడు ఉద్యమ కార్యాచరణ... దేశంలోని తొమ్మిది ప్రధాన బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలతో కూడిన ఐక్య సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ). ఈ నెల 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యూఎఫ్‌బీయూ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యూఎఫ్‌బీయూ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ బీఎస్ రాంబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లతో పాటు ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. -
నిరవధిక సమ్మె దిశగా బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, అమరావతి: జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో తొలిరోజు విజయవంతమైందని, దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. బంద్‌లో భాగంగా రాష్ట్రంలో కూడా సోమవారం బ్యాంకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్బీఐ జోనల్ కార్యక్రమం వద్ద బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఐబాక్) రాష్ట్ర కార్యదర్శి వైవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణపై చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు వెనుకాడమని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని, రూ.వేల కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించాయని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మంగళవారం సమ్మెను కూడా విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. -
నేడు, రేపు బ్యాంకుల బంద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నేడు, రేపు (శుక్ర, శనివారం) బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనున్నారు. ఈ రెండు రోజులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు సాగవని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ తొలగింపు వంటి 11 డిమాండ్లతో కార్మిక శాఖ, కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని.. అందుకే సమ్మెకు సిద్ధమయ్యామని యూఎఫ్‌బీయూ తెలిపింది. శుక్ర, శనివారాల్లో జరగనున్న సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యూ, ఎన్ఓబీఓ బ్యాంకింగ్ సంఘాలు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. గ్రామీణ బ్యాంకులు మాత్రమే సమ్మెలో పాల్గొనడం లేదని, మద్దతు మాత్రం తెలుపుతున్నట్లు ఆల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో మార్చి 11, 12, 13 తేదీల్లో కూడా సమ్మె ఉంటుందని యూఎఫ్‌బీయూ హెచ్చరించింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజు కూడా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలోనే పాల్గొంటారు. 2వ తేదీ ఆదివారం. అంటే వరుసగా 3 రోజులు బ్యాం కులు పనిచేయవు. పునఃప్రారంభం సోమవారమే. -
రేపు బ్యాంకులు బంద్
ఉద్యోగుల ఒకరోజు సమ్మె న్యూఢిల్లీ: ఉద్యోగులు ఒక రోజు సమ్మె తలపెట్టినందున ప్రభుత్వరంగ బ్యాంకు సేవలకు రేపు(ఆగస్టు 22న) అంతరాయం కలగనుంది. బ్యాంకుల స్థిరీకరణతోపాటు పలు ఇతర అంశాలకు సంబంధించి సమ్మె చేయనున్నట్టు తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల ఉమ్మడి సంఘమైన ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్’ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో సేవల అంతరాయంపై చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇప్పటికే సమాచారం అందించాయి. ఇక ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్, కోటక్ బ్యాంకు సేవలు సాధారణంగానే కొనసాగనున్నాయి. చీఫ్ లేబర్ కమిషనర్ ముందు చర్చలు విఫలమయ్యాయని, సమ్మె మినహా మరో మార్గం లేదని ఆల్ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్(ఏఐబీవోసీ) జనరల్ సెక్రటరీ డీటీ ఫ్రాంకో పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లలో వేటికీ ఇంతదాకా ఫలితం కనిపించలేదని, దీంతో ఈ నెల 22న సమ్మెకు సిద్ధమైనట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) తెలిపింది. బ్యాంకుల స్థిరీకరణతోపాటు సంఘాలు లేవనెత్తిన ఇతర అంశాల్లో కార్పొరేట్ రుణాల ఎన్పీఏలను రద్దు చేయకుండా ఉండడం, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను నేరపూరిత చర్యగా ప్రకటించడం, ఎన్పీఏల వసూలుకు పార్లమెంటరీ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయడం ఉన్నాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. -
మూతపడ్డ బ్యాంకులు
విశాఖపట్నం: బ్యాంకులు మూతపడ్డాయి. వేతన సంబంధ అంశాలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీ యూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేయడంతో వందల కోట్ల లావాదేవీలకు బ్రేకులు పడ్డాయి. జిల్లాలో 750 బ్రాంచ్‌లుండగా వాటి పరిధిలో 1,112 ఏటీఎంలు పని చేస్తున్నాయి. బ్యాంకులు మూతపడడంతో మంగళవారం ఏటీఎంల వద్ద రద్దీ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.150 కోట్ల మేర లావాదేవీలకు బ్రేకులు పడినట్టుగా అంచనా. కాగా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేసినా చెక్ క్లియరెన్సుల విషయంలో కొంతమేర ఇబ్బంది తప్పలేదు. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఏ) అనుబంధ సంఘాలు, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్లు సమ్మెలో పాల్గొన్నారు. వరుస సెలవులు రావడంతో నగదు లేక చాలా ఏటీఎం వద్ద మళ్లీ నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె విషయంపై అవగాహన లేని వందలాది మంది ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లగా..అక్కడ సమ్మె కారణంగా మూతపడినట్టుగా బోర్డులు దర్శనమివ్వడంతో నిరుత్సాహంతో వెనుదిరగడం కన్పించింది. -
రేపే బ్యాంకుల సమ్మె
చెన్నై : ప్రభుత్వం, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెడుతున్న పాలసీలను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు రేపు సమ్మెకు దిగనున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), మంగళవారం ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో, గతంలో సమ్మెకు పిలుపునిచ్చిన మాదిరిగానే శుక్రవారం ఒక్కరోజు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు బంద్ కానున్నట్టు బ్యాంకు యూనియన్ల ఫోరం ప్రకటించింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీ.హెచ్ వెంకటచలం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు ఈ బంద్ పాల్గొనబోతున్నారని తెలిపారు. 80 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు శుక్రవారం క్లోజ్ కానున్నాయి. అసమంజసమైన బ్యాంకింగ్ సంస్కరణ నేపథ్యంలో బ్యాంకులు వన్ డే బంద్‌ను చేపడుతున్నాయి. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం
ఒంగోలు: సమస్యల పరిష్కారం కోరుతూ యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం స్థానిక స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి వద్ద లంచ్ అవర్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ వి.పార్థసారథి మాట్లాడుతూ పదో వేతన సవరణ ఒప్పందంపై ఇటు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, అటు కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఏ బ్యాంకు ఉద్యోగి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలులో బ్యాంకు ఉద్యోగులు అధిక శ్రద్ధ చూపుతున్నా ఉద్యోగుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిపి కూడా బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెనుకంజ వేయడం దారుణమని పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఒప్పందం చేసుకున్నా యాజమాన్యాలు 11 శాతం మాత్రమే వేతన సవరణ చేస్తామనడం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూడటమేనన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మొత్తం ఒకరోజు సమ్మె చేయడంతో పాటు దేశంలోని నాలుగు విభాగాల్లో ఒక్కో రోజు నిరసన తెలియజేశామన్నారు. అయినా యాజమాన్యాలు స్పందించకపోతుండటంతో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు యూఎఫ్‌బీయూ పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగా తాము కూడా 2015 జనవరి 7వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొనాలని నిర్ణయించామన్నారు. అప్పటికీ స్పందించకపోతే జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. జనవరి 25, 26 తేదీలు కూడా సెలవు రోజులని, అందు వల్ల ఆరు రోజుల పాటు పూర్తిస్థాయిలో బ్యాంకులు మూసేసేందుకు ఉద్యోగులు సంసిద్ధత ప్రకటించారన్నారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేకపోతే మార్చి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తారని అన్నారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐబీఈఏ నాయకులు వి.రామచంద్రయ్య, ఏ.వేణుగోపాల్, ఎం.నరేంద్రబాబు, కె.రవిప్రకాష్, ఆర్.చలపతిరావు, వంశీకృష్ణ, పీవీ కృష్ణారెడ్డి, ఎన్సీబీఈ నాయకులు ఎం.కృష్ణ, కృష్ణమోహన్, విజయమోహన్, ఏఐబీవోఏ నాయకులు డి.కోటేశ్వరరావు, సుధాకర్, ఏఐబీఓసీ నాయకులు సాంబశివరావు, శ్రీనివాసరావు, బెఫీ నాయకులు సీహెచ్.శోభన్‌బాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో వేతన సవరణ ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
12న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై: వేతనాల పెంపునకు సంబంధించిన చర్చలు విఫలంకావడంతో సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 12న(బుధవారం) సమ్మెకు దిగనున్నారు. దీంతో 12న బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశమున్నట్లు యూనియన్ అధికారి ఒకరు చెప్పారు. తక్కువలోతక్కువ 23% పెంపును ఆశిస్తున్నప్పటికీ దేశీ బ్యాంకుల అసోసియేషన్(ఐబీఏ) 11% పెంపునకు మాత్రమే అంగీకరిస్తున్నదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ) అధికారి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. ఈ పెంపు బ్యాంకుల మొండిబకాయిల్లో(ఎన్పీఏలు) కేవలం 1%కు సమానమన్నారు. బ్యాంకులు మంచి నిర్వహణ లాభాలను ఆర్జిస్తున్నాయని, అయితే మొండిబకాయిల కారణంగా నికర లాభాలు ప్రభావితమవుతున్నప్పటికీ వీటికి ఉద్యోగులు బాధ్యులుకారని వివరించారు. ఎన్పీఏలకు కేటాయింపులు చేపట్టినట్లే ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా జీతాల పెంపును సైతం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ, పాత ప్రయివేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన ఆఫీసర్లతోసహా 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. -
ఉద్యోగుల సమ్మెతో బ్యాంకుల మూత
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని, బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ (యూఎఫ్బీఐఎస్) ఇచ్చిన రెండు రోజుల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో మొదటి రోజు సోమవారం బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ప్రైవేట్ బ్యాంకుల మినహా ఇతర వాణిజ్య, గ్రామీణ బ్యాంకు శాఖలన్నీ మూతబడ్డాయి. జిల్లాలో మొత్తం 400 బ్యాంకు శాఖల్లో లావాదేవీలు స్తంభించాయి. నగదు లేక ఏటీఎంలు కూడా మూతబడటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో సుమారు 10 వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. అంతేకాకుండా వెయ్యి కోట్ల రూపాయలు క్లియరింగ్ లావాదేవీలు నిలిచిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చేతిలో నగదు లేక ఖాతాదారులు నానా అవస్థలు పడ్డారు. ఒంగోలు నగరంలోని బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొని స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని ఆంధ్రాబ్యాంకు ప్రధానశాఖ వద్దకు చేరి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ వి.పార్థసారథి అధ్యక్షత వహించి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐబీఏ ఇస్తానన్న 10 శాతం వేతన సవరణను యూఎఫ్‌బీయూ తిరస్కరించిందన్నారు. కనీసం17 శాతం వేతన సవరణకు ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణలను త్వరలో అమలు చేయకపోతే నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు కూడా వెనుకాడేది లేదని పార్థసారథి హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్రనాథ్ మాట్లాడుతూ 1969లో జాతీయకరణ చేసిన బ్యాంకుల ద్వారా అట్టడుగు వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధించారన్నారు. బ్యాంకులు చేసిన సేవలను పాలకవర్గాలు మరిచిపోయి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అర్థం పర్థం లేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు, విద్య, వైద్యం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినందున దానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు కూడా పెరగాలని కోరారు. కోట్ల ఆదాయం బ్యాంకుల ద్వారా ఈ ఐదేళ్లలో వచ్చిందని, దీనిలో కనీసం 7 వేల కోట్లు ఇస్తే బ్యాంకు ఉద్యోగుల సమస్య తీరిపోతుందని సూచించారు. మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి వి.ప్రకాశరావు మాట్లాడుతూ సంస్కరణల పేరుతో అనేక ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి బ్యాంకింగ్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఏపీజీబీ నాయకుడు సుబ్బారావు మాట్లాడుతూ మోసపూరితంగా ప్రవర్తిస్తున్న ఐబీఏ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా భవిష్యత్తులో యూఎఫ్‌బీయూ ఎటువంటి పిలుపునిచ్చినా హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నామని, న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐబీఓఏ నాయకుడు డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ సీఎల్సీ ఇచ్చిన సూచన మేరకు ఐబీఏ చర్చలకు పిలిచి బ్యాంకు ఉద్యోగస్తులను అవమానానికి గురి చేసిందని, దీనికి నిరసనగా రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నామని చెప్పారు. ఏఐబీఓసీ నాయకుడు సాంబయ్య మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఎందుకని అడిగితే జీతాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారన్నారు. బ్యాంకుల్లో కనీస వేతనం రూ. 25 వేలు ఉండాలని డిమాండ్ చేశారు. ఏఐబీఓఏ నాయకుడు పీకే రాజేశ్వరరావు మాట్లాడుతూ 9వ వేతన సవరణ గడువు ముగిసి 15 నెలలైందని, అయినా ఇంత వరకు వేతన సవరణ జరగకపోవడం విచారకరమన్నారు. ఏఐబీఓసీ అధ్యక్షుడు పి.మల్లికార్జునరావు, ఏఐబీఈఏ పట్టణ కార్యదర్శి వి.రామచంద్రరావులు మాట్లాడుతూ తమ న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని, వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐబీఈఏ జిల్లా కార్యదర్శి వి.వేణుగోపాల్ మాట్లాడుతూ ఐబీఏ, కేంద్రప్రభుత్వం తమ మొండివైఖరులను మార్చుకుని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్న న్యాయమైన వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఈహెచ్ అధ్యక్షుడు శోభన్‌బాబు మాట్లాడుతూ న్యాయమైన కోర్కెలను వెంటనే అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎం.నరేంద్రబాబు, ఎ.వేణుగోపాల్, బీవీ కృష్ణారెడ్డి, డేవిడ్‌కింగ్, పి.బ్రహ్మాయ్య, ఎ.కోటేశ్వరరావు, వంశీకృష్ణ, సీహెచ్ ఉమాపతి, ఎన్. వెంకటేశ్వర్లు, టి.మల్లికార్జునరావు, నారాయణమూర్తి, జనార్దన్, ఆంజనేయులు, కె.రవిప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, కె.జానకీరామయ్య, చలపతి, ఉమామహేశ్వరరావు, మృధుల, చాముండేశ్వరీ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.