ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని, బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ (యూఎఫ్‌బీఐఎస్) ఇచ్చిన రెండు రోజుల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో మొదటి రోజు సోమవారం బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు.
దీంతో ప్రైవేట్ బ్యాంకుల మినహా ఇతర వాణిజ్య, గ్రామీణ బ్యాంకు శాఖలన్నీ మూతబడ్డాయి. జిల్లాలో మొత్తం 400 బ్యాంకు శాఖల్లో లావాదేవీలు స్తంభించాయి. నగదు లేక ఏటీఎంలు కూడా మూతబడటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో సుమారు 10 వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. అంతేకాకుండా వెయ్యి కోట్ల రూపాయలు క్లియరింగ్ లావాదేవీలు నిలిచిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చేతిలో నగదు లేక ఖాతాదారులు నానా అవస్థలు పడ్డారు.
ఒంగోలు నగరంలోని బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొని స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని ఆంధ్రాబ్యాంకు ప్రధానశాఖ వద్దకు చేరి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ వి.పార్థసారథి అధ్యక్షత వహించి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐబీఏ ఇస్తానన్న 10 శాతం వేతన సవరణను యూఎఫ్‌బీయూ తిరస్కరించిందన్నారు. కనీసం17 శాతం వేతన సవరణకు ఆయన డిమాండ్ చేశారు.
బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణలను త్వరలో అమలు చేయకపోతే నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు కూడా వెనుకాడేది లేదని పార్థసారథి హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్రనాథ్ మాట్లాడుతూ 1969లో జాతీయకరణ చేసిన బ్యాంకుల ద్వారా అట్టడుగు వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధించారన్నారు. బ్యాంకులు చేసిన సేవలను పాలకవర్గాలు మరిచిపోయి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అర్థం పర్థం లేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు, విద్య, వైద్యం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినందున దానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు కూడా పెరగాలని కోరారు. కోట్ల ఆదాయం బ్యాంకుల ద్వారా ఈ ఐదేళ్లలో వచ్చిందని, దీనిలో కనీసం 7 వేల కోట్లు ఇస్తే బ్యాంకు ఉద్యోగుల సమస్య తీరిపోతుందని సూచించారు.
మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి వి.ప్రకాశరావు మాట్లాడుతూ సంస్కరణల పేరుతో అనేక ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి బ్యాంకింగ్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు.
ఏపీజీబీ నాయకుడు సుబ్బారావు మాట్లాడుతూ మోసపూరితంగా ప్రవర్తిస్తున్న ఐబీఏ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా భవిష్యత్తులో యూఎఫ్‌బీయూ ఎటువంటి పిలుపునిచ్చినా హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నామని, న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐబీఓఏ నాయకుడు డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ సీఎల్‌సీ ఇచ్చిన సూచన మేరకు ఐబీఏ చర్చలకు పిలిచి బ్యాంకు ఉద్యోగస్తులను అవమానానికి గురి చేసిందని, దీనికి నిరసనగా రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నామని చెప్పారు. ఏఐబీఓసీ నాయకుడు సాంబయ్య మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఎందుకని అడిగితే జీతాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారన్నారు.
బ్యాంకుల్లో కనీస వేతనం రూ. 25 వేలు ఉండాలని డిమాండ్ చేశారు. ఏఐబీఓఏ నాయకుడు పీకే రాజేశ్వరరావు మాట్లాడుతూ 9వ వేతన సవరణ గడువు ముగిసి 15 నెలలైందని, అయినా ఇంత వరకు వేతన సవరణ జరగకపోవడం విచారకరమన్నారు.
ఏఐబీఓసీ అధ్యక్షుడు పి.మల్లికార్జునరావు, ఏఐబీఈఏ పట్టణ కార్యదర్శి వి.రామచంద్రరావులు మాట్లాడుతూ తమ న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని, వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐబీఈఏ జిల్లా కార్యదర్శి వి.వేణుగోపాల్ మాట్లాడుతూ ఐబీఏ, కేంద్రప్రభుత్వం తమ మొండివైఖరులను మార్చుకుని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్న న్యాయమైన వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఈహెచ్ అధ్యక్షుడు శోభన్‌బాబు మాట్లాడుతూ న్యాయమైన కోర్కెలను వెంటనే అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ సంఘాల నాయకులు ఎం.నరేంద్రబాబు, ఎ.వేణుగోపాల్, బీవీ కృష్ణారెడ్డి, డేవిడ్‌కింగ్, పి.బ్రహ్మాయ్య, ఎ.కోటేశ్వరరావు, వంశీకృష్ణ, సీహెచ్ ఉమాపతి, ఎన్. వెంకటేశ్వర్లు, టి.మల్లికార్జునరావు, నారాయణమూర్తి, జనార్దన్, ఆంజనేయులు, కె.రవిప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, కె.జానకీరామయ్య, చలపతి, ఉమామహేశ్వరరావు, మృధుల, చాముండేశ్వరీ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమ్మెతో బ్యాంకుల మూత
Published Tue, Feb 11 2014 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
Advertisement