ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ నాయకుల తీరు అడ్డగోలుగా ఉంది. చోటామోటా నాయకుని మొదలు పెద్ద స్థాయి నాయకుని వరకు తమకు ఎదురులేదన్నట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అవినీతి అక్రమాలకు పాల్పడే పనిలోనే ఉంటున్నారు. తాజాగా కలెక్టర్ బంగ్లాకు కిలోమీటరు దూరంలోనే కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. టీడీపీ నాయకులే కొలతలు వేసుకుని ప్లాట్లుగా విభజించుకొని కర్రలు పాతారు. ఆ తర్వాత శాశ్వతంగా ఉండే విధంగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఏకంగా బేరం పెట్టి విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులన్నీ చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఇంత జరుగుతున్నా ఒంగోలు రెవెన్యూ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే.. టీడీపీ నాయకులకు భయపడి పట్టించుకోవడం లేదా.? లేకుంటే ఇప్పటికే జేబులు నింపుకుని నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్ విలువ 10 కోట్ల పైనే..
ఒంగోలు నగరంలో అగ్రహారం రైల్వే గేటు దాటగానే బాలాజీనగర్, ఆ తర్వాత దత్తాత్రేయకాలనీ వస్తుంది. దత్తాత్రేయకాలనీ ఎదురుగా సర్వే నంబర్–81లో ప్రభుత్వానికి చెందిన 1.36 ఎకరాల అసైన్‌మెంట్ భూమి ఉంది. ఈ భూమి విలువ ప్రైవేటుకు చెందిన రిజిస్ట్రేషన్ స్థలమైతే మార్కెట్‌లో దాదాపు రూ.10 కోట్లకుపైనే ఉంది. ప్రభుత్వానికి చెందిన అసైన్‌మెంట్ స్థలం కావడంతో ప్రస్తుత మార్కెట్లో ఒక్కో గది రూ.55 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంది. దాదాపు 816 గదుల స్థలం కావడంతో సరాసరిన ఒక్కో గదికి రూ.60 వేలు వేసుకున్నా.. సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. ఇంత ఖరీదైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా టీడీపీ నేతలు కబ్జా చేసి మూడునాలుగు రోజులుగా ప్లాట్లు వేసుకుని ఏకంగా పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారంటే.. తెరవెనుక పెద్ద తతంగమే నడిచి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక ఎమ్మెల్యే దామచర్ల హస్తం?
కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేయడం వెనుక ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే ప్లాట్లు వేసుకోమన్నాడంటూ ఒంగోలు నగర పాలక సంస్థలోని 16వ డివిజన్‌కు చెందిన టీడీపీ నాయకుడు, స్థానిక కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం అండతో తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి నేరుగా ప్లాట్లు వేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రమేయం ఉండటంతోనే రెవెన్యూ అధికారులుగానీ, మండల సర్వేయర్‌గానీ, ఒంగోలు నగర పాలక సంస్థ సర్వేయర్‌గానీ కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తోంది.
స్థానికంగా ఉన్న టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఉంగరాల రమణయ్య, ఆ పార్టీ నాయకులు పాదర్తి శింగయ్య, మాదాసు చంద్ర, కర్రి వాసు, సీహెచ్ సురేష్‌తో పాటు మరికొంతమంది కలిసి ప్లాట్లు వేసుకుని అమ్ముకుంటున్నట్లు సమాచారం. మామిడిపాలేనికి చెందిన ఒక పాస్టర్‌కు 50 గదులను ఒక్కో గదిని రూ.60 వేల చొప్పున విక్రయించినట్లు కూడా తెలిసింది. స్థలం కొనుగోలు చేసిన పాస్టర్ ఆగమేఘాలపై పిల్లర్లు వేసేందుకు అవసరమైన బాక్సులు తెప్పించి ఏకంగా స్థలం చుట్టూ ప్రహరీ గోడకు పిల్లర్లు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ పిల్లర్ల మధ్యలో పునాధులు తీసి ప్రహరీ నిర్మించడమే తరువాయి.
టీడీపీ వస్తే ఇలానే..
2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సర్వే నంబర్–81లో స్థలాన్ని కబ్జా చేసి గుడిసెలు కూడా వేశారు. అప్పట్లో ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి రంగంలోకి దిగి అక్రమంగా వేసిన గుడిసెలను పూర్తిగా తొలగించారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎవరూ ఆ స్థలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ పార్టీ నాయకుల కళ్లు ఖరీదైన ప్రభుత్వ స్థలంపై పడ్డాయి. ఇంకేముంది.. అనుకున్నదే తడవుగా పాగా వేసేశారు. జేబుల్లో కోట్ల రూపాయలు నింపుకుంటున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం.. నున్నా సురేష్, వీఆర్‌ఓ, బాలాజీ నగర్
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సమాచారం అందడంతో కట్టడాలు చేస్తున్న వారిని ప్రశ్నించాను. ప్రభుత్వం నలుగురికి పట్టాలు మంజూరు చేసిందని, ఆ నాలుగు పట్టాలకు సంబంధించిన స్థలంలో చర్చి నిర్మిస్తున్నామని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు తెలియజేస్తా.
Comments
Please login to add a commentAdd a comment