land occupy
-
రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణల పర్వం: గోనె ప్రకాశరావు
సాక్షి, ఢిల్లీ: ఈనాడు అధినేత రామోజీరావు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ప్రకటన చేశారు. ఫిలిం సిటీ ప్రాంతంలో గాలిబ్ జంగ్ రాజవంశానికి చెందిన 1700 ఎకరాల భూమిని రామోజీరావు ఆక్రమించుకున్నారని ప్రకాశ్ రావు ఆరోపించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రావు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ భూములున్నాయి. రామోజీరావు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఫిలిం సిటీలో రాజ వంశీకుల భూములు, అసైన్డ్, రహదారి భూములు ఉన్నాయి. గాలిబ్ జంగ్ రాజ వంశానికి సంబంధించిన 1700 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. అనాజ్‌పూర్-ఇబ్రహీంపట్నం ప్రజా రహదారిని కూడా ఆక్రమించారు. ఈ విషయంలో ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆక్రమణలపై దృష్టి పెట్టాలి. రాజుల వంశంలోని నాటి మైనర్లకు సంబంధించిన భూములు అవి. మైనర్లు కావడం వల్ల ఆ భూములు కోర్టు ఆఫ్ వార్డ్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు ఆ భూములన్నింటినీ ఆక్రమించుకున్నారు. రాష్ట్రంలో పత్రికాధిపతి చేతిలో ఈ భూములు ఉన్నాయి. అలాగే ఓ రియల్టర్, పారిశ్రామికవేత్త కూడా ఈ భూములను ఆక్రమించారు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తాను. ఈ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి’ అని అన్నారు. -
సారొచ్చారు.. పేదల్లో భరోసా.. భూకాసురుల్లో దడ
జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములపై పట్టున్న తహసీల్దార్‌గా అతనికి పేరుంది. ముచ్చటగా మూడోసారి తమ ప్రాంత తహసీల్దార్‌గా రావడంతో నిరుపేదల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటే... కజ్జాదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషించి జిల్లా అధికారులతో శభాష్ అనిపించుకున్నారు. అతనే గౌతమ్‌కుమార్. సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం కొత్తగా ఏర్పాటైన తర్వాత అక్టోబర్ 11, 2016న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 25న రెండోసారి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలతో పాటు కస్టోడియన్ భూములు, కార్పొరేషన్లో వందల ఎకరాలను కజ్జాదారుల చెర నుంచి కాపాడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉప్పల్ మండల తహసీల్దార్‌గా కొనసాగుతున్న గౌతమ్‌కుమార్‌ను ప్రభుత్వం కాప్రా మండల ఇన్చార్జ్ తహసీల్దార్‌గా బుధవారం అదనపు బాధ్యతలను అప్పగించింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు... ప్రభుత్వ భూములపై పట్టున్న అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్‌కుమార్ మూడోసారి అదనపు బాధ్యతలు చేపట్టడడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవ రికార్డులకు అనుకూలంగా వ్యవహరించి పేదలకు న్యాయం చేకూర్చుతూనే... ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి కాపాడి ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు స్వీకరించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ►గతంలో ప్రభుత్వ భూములను రక్షించి సఫలీకృతమయ్యారు. గౌతమ్‌కుమార్ అదన పు బాధ్యతలు స్వీకరించడంతో తమకు న్యాయం జరుగుతుందని నిరుపేదలు గట్టిగా నమ్ముతున్నారు. కాని అక్రమార్కుల్లో మా త్రం అప్పుడే ఆందోళన మొదలైంది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న తహసీల్దార్ (ఫైల్) గతంలో సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట.. జవహర్‌నగర్‌లోని మల్కారం గుట్టల్లో అక్రమంగా రాత్రి వేళల్లో నడిపిస్తున్న మట్టి దందాపై గతంలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంతలు తవ్వుతూ సహజ వనరులను దొచుకెళ్తున్న వారిపై కొరడా ఝులిపించారు. ఒంటరిగా గుట్టల్లోకి తానే ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్లి సహజ వనరుల దోపిడీని నివారించడంలో సఫలీకృతుడయ్యారు. మరోమారు ఈ ప్రాంతాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సమగ్ర విచారణ, బాధ్యులపై చర్యలు ప్రభుత్వ భూములను కాపాడి భవిష్యత్ తరాలకు ఉపయోగడేలా చర్యలు తీసుకోవడమే నా భాధ్యత. గతంలో రెండు పర్యాయాలు ఇక్కడ విధులు నిర్వర్తించా. నిజమైన నిరుపేదలకు న్యాయం చేసి కజ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్ల కజ్జాలు, మున్సిపాలిటీకి (ప్రజల అవసరాల కోసం) కేటాయించిన స్థలాలపై సమగ్ర విచారణ చేసి వాటి పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తా. సిబ్బంది తప్పులు చేస్తే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – గౌతమ్‌కుమార్, కాప్రా ఇన్చార్జ్ తహసీల్దార్ -
టీడీపీ నాయకుల బండారం బట్టబయలు.. కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని..
కాశీబుగ్గ (శ్రీకాకుళం): అధికారుల సాక్షిగా టీడీపీ నాయకుల బండారం బయటపడింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు గురువారం చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో పచ్చనేతలే ఆక్రమణదారులని తేలింది. టీడీపీ నాయకులు పెంట ఉదయ్‌శంకర్, లొడగల కామేష్ దాదాపు 8 ఎకరాలకుపైగా భూమిని ఆక్రమించినట్లు స్పష్టమైంది. పలాస ఆర్డీఓ సీతారామమూర్తి, తహశీల్దార్ మధుసూదనరావు, సర్వేయర్లు ఇతర రెవెన్యూ సిబ్బంది గురువారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పద్మనాభపురం, పెంటిబద్ర, సూదికొండ, నెమలికొండ, ఉదయపురం ప్రాంతాల్లో పర్యటించారు. పెంటిబద్ర గిరిజన గ్రామంలో రికార్డులు, భూమిని పరిశీలించగా సర్వే నంబర్ 311/ఎ మంగబంద (చెరువు)లో 04.85 ఎకరాలు భూమి, సర్వే నంబర్ 314/08 గజాలు గుమ్మి, 00.96 ఎకరాలు భూమి, పద్మనాభపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 365/05లో 02.31 ఎకరాల కాలువ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకుంటాం.. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని, త్వరలోనే భూములను స్వాధీ నం చేసుకుంటామని పలాస ఆర్డీఓ సీతారామమూర్తి స్పష్టం చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో జరుగుతున్న ఆక్రమణలపై హైకోర్టులో పిల్ వేసిన సందర్భంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని తమను ఆదేశించిందన్నారు. స్థానికంగా ఎలాంటి ఆక్రమణలు జరగడానికి అవకాశం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. జగనన్న భూరక్షణ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల స్వాధీనం నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. మున్సిపాలిటీలోని 27 గ్రామాల్లో ఆక్రమణలను గుర్తించామని, వాటిని తొలగిస్తామని చెప్పారు. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారు, దాని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చి ప్రభుత్వ భూమిని కాపాడుకుంటామని తెలిపారు. ఆయనతో పాటు పలాస తహసీల్దార్ లంబాల మధుసూదన్, సర్వేయర్ గిరికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, వీఆర్ఓ ఖగేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్‌తో వాగ్వాదం చేస్తున్న టీడీపీ మద్దతుదారులు ఉద్రిక్తత.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉదయపురం చెరువు వద్ద ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించేందుకు అధికారులు గురువారం సాయంత్రం సిద్ధమయ్యారు. అధికారుల రాకతో ఉదయపురం సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన గురిటి సూర్యనారాయణకు చెందిన కొన్ని నిర్మాణాలు చెరువులో ఉన్నాయని ఆర్డీఓ గుర్తించగా వాటిని తొలగించేందుకు జేసీబీతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే గురిటి సూర్యనారాయణ బంధువులు, మద్దతుదారులు వందల సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. తహసీల్దార్‌ను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. కాశీబుగ్గ పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. -
తిన్నారు కోట్లు.. ఎందుకు వేయాలి ఓట్లు
సాక్షి, రాజమండ్రి : కంచే చేను మేసినట్టు.. ప్రభుత్వ, ప్రజల ఆస్తుల్ని రక్షించాల్సిన పాలకులే.. వాటిని యథేచ్ఛగా భక్షిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం, కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ నేతలు. అధికార మదంతో ఖాళీగా కనిపించిన ప్రతి జాగాలోనూ పాగా వేశారు. అవి పర్ర భూములా.. తీరప్రాంత భూములా.. చెరువులా.. గుట్టలా.. దేవదాయ భూములా.. మఠం భూములా.. అసైన్డ్ భూములా.. రోడ్లా.. ప్రైవేటు భూములా.. అని చూడకుండా ఆక్రమించేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించేశారు. ఆన్లైన్లో రికార్డులు మార్చేశారు. అడ్డం వచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకూ కబ్జా కాండకు దిగారు. జిల్లావ్యాప్తంగా రూ.500 కోట్ల విలువైన సుమారు 300 ఎకరాల వరకూ ఆక్రమించారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయంటే జిల్లాలో టీడీపీ నేతల కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్న భూములను కూడా ఆక్రమించుకునేందుకు.. ఇప్పుడు ఎన్నికల వేళ.. మళ్లీ తమకు అధికారం ఇవ్వాలని కోరుతూ ప్రజల ముందుకు వస్తున్నారు. ఇటువంటి వారికి మళ్లీ ఓట్లు వేయడం అవసరమా?! రాజమహేంద్రవరం నడిబొడ్డున నూరు కోట్ల స్థలానికి కంచె రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున కంబాలచెరువు సమీపంలోని ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలో 1985లో ప్రభుత్వం సేకరించిన భూమిలో వాంబే గృహాలు నిర్మించగా మిగిలిన 3 ఎకరాల భూమిని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండతో ఆక్రమించారు. ఆ ప్రభుత్వ స్థలంలో ఏళ్ళ తరబడి గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్న 110 కుటుంబాలకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ముట్టజెప్పి ఖాళీ చేయించారు. ఉన్నత స్థాయి అధికారులుఆ వైపు చూడకుండా, పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించకుండా అధికారాన్ని అడ్డుపెట్టి మూడు ఎకరాల స్థలానికి కంచె వేశారు. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ చట్టం సెక్షన్ 45 ప్రకారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం కంచె వేసిన వారికి నోటీసులు జారీ చేసింది. ‘సాక్షి’ కథనాలతో కేసులు, రికవరీకి ఆదేశాలు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని వేమగిరిలో టీడీపీ నేత వెలుగుబంటి వెంకటాచలం కంకరగుట్టను, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి, దర్జాగా గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో బా«ధ్యుడిపై నాలుగు కేసులు పెట్టడమే కాకుండా రూ.8.61 కోట్ల రికవరీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. మురుగు కాలువనూ వదల్లేదు తునిలో మురుగు నీటి కాలువను దర్జాగా కబ్జా చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. టీడీపీ నేతల అవకతవకలపై ప్రతిపక్షానికి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తుని పరిసర ప్రాంతాల ప్రజలందరికీ బాతుల కోనేరు అంటే తెలిసిందే. తుని పట్టణం నడిబొడ్డున ఐదు ఎకరాల్లో కోనేరు ఉండేది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు ఇందులోకి చేరేది. కోనేరు ముందు జీఎన్టీ రోడ్డును ఆనుకుని తుని తాలూకా పోలీస్‌స్టేషన్ ఉంది. దాని వెనుక పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ భూమిలో నిర్మించినవి. తుని మున్సిపాలిటీ ఏర్పడక ముందు వీరవరం పంచాయతీగా ఉండేది. అప్పట్లో సర్వే నంబరు 268/4లో 1.25 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమి ఉంది. కాలక్రమంలో కోనేరును చెత్త, పాత భవనాల శిథిలాలతో పూడ్చి వేశారు. 1983లో పురపాలక సంఘం జీఎన్టీ రోడ్‌లోని సర్వే నంబరు 268 /4లో సోమరాజు సినిమా థియేటర్ గోడను ఆనుకుని 22 సెంట్ల భూమిలో కాలువ నిర్మించారు. దీన్ని, దాని పక్కన ఉన్న 8 సెంట్ల పోలీసు క్వార్టర్స్ భూమిని ఆక్రమించారు. తెలుగుతమ్ముళ్లు కాజేసిన స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.10 కోట్లు పైన ఉంటుంది. -
ప్రత్తిపాటి కుయుక్తులను అడ్డుకుంటాం
* దళితుల భూముల్లో ఒక్క సెంటు తీసుకున్నా తీవ్ర పరిణామాలు * వైఎస్సార్సీపీ నాయకుల హెచ్చరిక * యడవల్లి భూముల పరిశీలన * అండగా ఉంటామని దళితరైతులకు భరోసా చిలకలూరిపేట: యడవల్లి దళిత రైతుల భూములను కబ్జా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న కుయుక్తులను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు చెప్పారు. చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని దళితులకు చెందిన 416 ఎకరాల పంట భూములను పార్టీ ఎస్సీ విభాగంతో పాటు వివిధ విభాగాల నాయకులు మంగళవారం సందర్శించారు. దళిత రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ... అధికారం చేపట్టిన నాటి నుంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న మంత్రి దళితుల భూములపై కన్నేశారని, వారిని భూముల నుంచి వెళ్లగొట్టేందుకు అధికారులతో తప్పుడు నివేదికలు రూపొందించారని ఆరోపించారు. మంత్రి ప్రాపకం కోసం తప్పుడు నివేదికలు రూపొందించిన తహసీల్దార్‌తో పాటు ఇతర అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ నిక్షేపాలు కాజేసేందుకే... ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే పెదమాదిగనై రుణం తీర్చుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తే, ఆయన మంత్రి వర్గంలోని ప్రత్తిపాటి పుల్లారావు దళితుల భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలే దేవరాజు విమర్శించారు. భూముల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్ నిక్షేపాలు కాజేసేందుకు పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసి వారిని రోడ్డు పాలు చేసేందుకు మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 416 ఎకరాల భూమిలో ఒక్క సెంటు తీసుకున్నా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రజాఉద్యమం ద్వారా తేల్చుకుంటాం.. దళితుల భూములు కాజేసేందుకు భూబకాసురుడి అవతారం ఎత్తిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంగతి ప్రజా ఉద్యమం ద్వారా తేల్చుకుంటామని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తోట జోసెఫ్ హెచ్చరించారు. వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమిస్తామని, దళితులకు అన్యాయం జరగకుండా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ భూకుంభకోణం వ్యవహారంలో సీబీఐ విచారణ నిర్వహించి మంత్రితో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలుచేపట్టాలని కోరారు. అనంతరం దళితుల భూములకు నీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు), మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మాబు, సేవాదళ్ జిల్లా అ«ధ్యక్షుడు కొత్త చిన్నపరెడ్డి, గుంటూరురూరల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏటుకూరి విజయసారధి, ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంగా జయరాజు, పార్టీ జిల్లా కార్యదర్శి చిలకా సుబ్బారావు, బండారు శ్రీనివాసరావు, కాకుమాను జయప్రకాశ్, పచ్చల ఆనందరావు, చిలకలూరిపేట మండల పార్టీ అధ్యక్షుడు చాపలమడుగు గోవర్దన్, యువజన విభాగం అధ్యక్షుడు వేజర్ల కోటేశ్వరరావు, యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ ఉపా«ధ్యక్షుడు తాళ్లూరి వెంకట్రావు , నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు రాయిపూడి మాణిక్యరావు, మాదిగ సంక్షేమ పోరాట సభ రాష్ట్ర అధ్యక్షుడు తంగిరాల ఇర్మియా మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
షాడో ఎంపీపీ గ‘లీజు’
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోట్లాది రూపాయల విలువైన దేవాదాయ శాఖ భూమి అది. నగర నడిబొడ్డున ఉన్న ఆ స్థలంపై ఓ టీడీపీ నేత కన్నుపడింది. ఇంకేముందు తనదైన శైలిలో చాపకింద నీరులా చకచకా పావులు కదిపి ఆ స్థలాన్ని దర్జాగా ఆక్రమించేశారు. మామూళ్లకు తలొగ్గిన దేవాదాయ శాఖ అధికారులు సదరు నేత భూమిని ఆక్రమించినా కళ్లు మూసుకున్నారు. అక్రమాల పుట్టగా మారిన ‘పశ్చిమ’ దేవాదాయ శాఖలో మరో గ‘లీజు’ వ్యవహారమిది. పవర్‌పేట మార్కెట్ ఏరియా సెంటర్లో టౌన్ సర్వే నెంబర్ 487లో చుండూరి వారి సత్రం పేరిట దేవాదాయ శాఖకు సుమారు 1,500 గజాల స్థలముంది. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ గజం స్థలం మార్కెట్ విలువ కనీసం రూ.లక్ష వరకు ఉంది. అంటే మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం విలువ దాదాపు రూ.15కోట్ల పైమాటే. 1908 సంవత్సరంలో ఇక్కడ చుండూరి రత్నమ్మ ఓ సత్రాన్ని నిర్మించారు. తన తదనంతరం ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత సత్రాన్ని కొనసాగించాలని ఎంతో మంచి ఆశయంతో ఆ స్థలాన్ని దేవాదాయ శాఖకు దానమిచ్చారు. కానీ దేవాదాయ శాఖ ఇందులో సుమారు 500 గజాల స్థలాన్ని నిబంధనలకు, దాత ఆశయాలకు విరుద్ధంగాఐఎన్ఎస్కే చక్రవర్తి, ఐఏ ప్రియదర్శిని, ఎం.వీరకుమార్లకు లీజుకిచ్చింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలంపై ఏలూరుకు చెందిన టీడీపీ నేత, ఏలూరు ఎంపీపీ అనూరాధ భర్త రెడ్డి అప్పలనాయుడు కన్నుపడింది. సబ్ లీజు ముసుగులో దర్జాగా స్థలాన్ని స్వాధీనం చేసుకుని న్యూ మౌర్య రెస్టారెంట్‌ను ప్రారంభించేశారు. ఇందుకోసం వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై నెలకు రూ.10 వేల చొప్పున చెల్లించేలా చక్రవర్తి నుంచి లీజుకు తీసుకున్నట్టు అగ్రిమెంట్ చూపిస్తూ వాణిజ్య పన్నుల శాఖకు రెడ్డి అప్పలనాయుడు దరఖాస్తు చేసుకున్నారు. దేవాదాయ భూమిని లీజుకు తీసుకున్న చక్రవర్తి నుంచి తిరిగి సబ్‌లీజు తీసుకున్న రెడ్డి అప్పలనాయుడు ఆ దరఖాస్తులో చక్రవర్తి సోదరి, మరో లీజుదారురాలు ప్రియదర్శినితో సాక్షి సంతకాలు చూపించారు. వాస్తవానికి ఈ భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తి మరో వ్యక్తికి లీజు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు. అయితే వాణిజ్య పన్నులశాఖ అప్పలనాయుడును ప్రొప్రయిటర్‌గా గుర్తిస్తూ ఆ రెస్టారెంట్‌కు కొత్త రాష్ట్రంలో టిన్ నంబర్ 37300609364 కూడా కేటాయించింది. అప్పటి నుంచి నెలకు రూ.50 వేల ఆదాయాన్ని చూపుతూ ప్రతినెలా వాణిజ్య పన్నుల శాఖకు రెడ్డినాయుడు రిటర్న్స్ కూడా దాఖలు చేస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరిగినా అక్కడ నాన్‌వెజ్ రెస్టారెంట్ నిర్మించిన సంగతి దేవాదాయ శాఖాధికారులకే తెలియదంటే ఆశ్చర్యం కలగకమానదు. దే వాదాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే టీడీపీ నేతలు బరితెగించి చేస్తున్న గ‘లీజు’ వ్యవహారాలకు ఆ శాఖ అధికారులు మామూళ్లకు తలొగ్గి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం దేవాదాయ భూములను సబ్ లీజుకు ఇవ్వకూడదు. లీజుదారులు తమ వ్యక్తిగత అవసరాల కోసం దాన్ని వేరొకరికి అప్పనంగా ధారాదత్తం చేయడం నేరం. న్యూ మౌర్య రెస్టారెంట్ వ్యవహారంపై రెవెన్యూ అధికారులతో తనిఖీ చేయించి అక్రమాలపై చర్యలు తీసుకుంటాం. అక్రమాలు రుజువైతే ఆక్రమణదారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. - కాటంనేని భాస్కర్, కలెక్టర్ నాన్‌వెజ్ రెస్టారెంటా.. అలాంటిదేమీ లేదే దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న వారు మాత్రమే నియమ నిబంధనలకు అనుగుణంగా వాడుకోవాలి. అలాకాకుండా దాన్ని సబ్ లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధం. అలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. అసలు అక్కడ రెస్టారెంట్ లేదు. ఉంటే మాకు తెలీకుండా పోతుందా ఏమిటి? - సూర్యప్రకాశ్, దేవాదాయ శాఖ చుండూరు సత్రం ఇన్చార్జి నాది కాదు.. మా కుర్రోడిది న్యూ మౌర్య రెస్టారెంట్ నాది కాదు. ఈశ్వరరావు అని.. మా కుర్రోడిది. ఏదో నా మీద అభిమానం కొద్దీ అతను నా పేరు మీద రెస్టారెంట్ నడుపుకుంటున్నాడు. టాక్స్‌లు, కరెంట్ బిల్లులు వగైరా వ్యవహారాలన్నీ కూడా నా పేరు మీదే నిర్వహిస్తున్నాడు. సబ్ లీజు లేదు.. పాడూ లేదు. అతనికి అసలు లీజుదారులు డబ్బులివ్వాల్సి ఉండి వాళ్లే దీన్ని అతనికి స్వాధీనం చేశారు. డబ్బులిచ్చేశాక తిరిగి తీసుకుంటామని కూడా చెప్పారు. అక్కడ వెజ్ రెస్టారెంట్ వ్యాపారం సాగదని నాన్‌వెజ్ రెస్టారెంట్ పెట్టినట్టున్నాడు. ఇదేమంత పెద్ద విషయం కాదు. - రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నేత