షాడో ఎంపీపీ గ‘లీజు’
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోట్లాది రూపాయల విలువైన దేవాదాయ శాఖ భూమి అది. నగర నడిబొడ్డున ఉన్న ఆ స్థలంపై ఓ టీడీపీ నేత కన్నుపడింది. ఇంకేముందు తనదైన శైలిలో చాపకింద నీరులా చకచకా పావులు కదిపి ఆ స్థలాన్ని దర్జాగా ఆక్రమించేశారు. మామూళ్లకు తలొగ్గిన దేవాదాయ శాఖ అధికారులు సదరు నేత భూమిని ఆక్రమించినా కళ్లు మూసుకున్నారు. అక్రమాల పుట్టగా మారిన ‘పశ్చిమ’ దేవాదాయ శాఖలో మరో గ‘లీజు’ వ్యవహారమిది. పవర్‌పేట మార్కెట్ ఏరియా సెంటర్‌లో టౌన్ సర్వే నెంబర్ 487లో చుండూరి వారి సత్రం పేరిట దేవాదాయ శాఖకు సుమారు 1,500 గజాల స్థలముంది. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ గజం స్థలం మార్కెట్ విలువ కనీసం రూ.లక్ష వరకు ఉంది. అంటే మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం విలువ దాదాపు రూ.15కోట్ల పైమాటే. 1908 సంవత్సరంలో ఇక్కడ చుండూరి రత్నమ్మ ఓ సత్రాన్ని నిర్మించారు. తన తదనంతరం ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత సత్రాన్ని కొనసాగించాలని ఎంతో మంచి ఆశయంతో ఆ స్థలాన్ని దేవాదాయ శాఖకు దానమిచ్చారు.
కానీ దేవాదాయ శాఖ ఇందులో సుమారు 500 గజాల స్థలాన్ని నిబంధనలకు, దాత ఆశయాలకు విరుద్ధంగాఐఎన్‌ఎస్‌కే చక్రవర్తి, ఐఏ ప్రియదర్శిని, ఎం.వీరకుమార్‌లకు లీజుకిచ్చింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలంపై ఏలూరుకు చెందిన టీడీపీ నేత, ఏలూరు ఎంపీపీ అనూరాధ భర్త రెడ్డి అప్పలనాయుడు కన్నుపడింది. సబ్ లీజు ముసుగులో దర్జాగా స్థలాన్ని స్వాధీనం చేసుకుని న్యూ మౌర్య రెస్టారెంట్‌ను ప్రారంభించేశారు. ఇందుకోసం వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై నెలకు రూ.10 వేల చొప్పున చెల్లించేలా చక్రవర్తి నుంచి లీజుకు తీసుకున్నట్టు అగ్రిమెంట్ చూపిస్తూ వాణిజ్య పన్నుల శాఖకు రెడ్డి అప్పలనాయుడు దరఖాస్తు చేసుకున్నారు. దేవాదాయ భూమిని లీజుకు తీసుకున్న చక్రవర్తి నుంచి తిరిగి సబ్‌లీజు తీసుకున్న రెడ్డి అప్పలనాయుడు ఆ దరఖాస్తులో చక్రవర్తి సోదరి, మరో లీజుదారురాలు ప్రియదర్శినితో సాక్షి సంతకాలు చూపించారు.
వాస్తవానికి ఈ భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తి మరో వ్యక్తికి లీజు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు. అయితే వాణిజ్య పన్నులశాఖ అప్పలనాయుడును ప్రొప్రయిటర్‌గా గుర్తిస్తూ ఆ రెస్టారెంట్‌కు కొత్త రాష్ట్రంలో టిన్ నంబర్ 37300609364 కూడా కేటాయించింది. అప్పటి నుంచి నెలకు రూ.50 వేల ఆదాయాన్ని చూపుతూ ప్రతినెలా వాణిజ్య పన్నుల శాఖకు రెడ్డినాయుడు రిటర్న్స్ కూడా దాఖలు చేస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరిగినా అక్కడ నాన్‌వెజ్ రెస్టారెంట్ నిర్మించిన సంగతి దేవాదాయ శాఖాధికారులకే తెలియదంటే ఆశ్చర్యం కలగకమానదు. దే వాదాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే టీడీపీ నేతలు బరితెగించి చేస్తున్న గ‘లీజు’ వ్యవహారాలకు ఆ శాఖ అధికారులు మామూళ్లకు తలొగ్గి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆక్రమణదారులపై
పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం
దేవాదాయ భూములను సబ్ లీజుకు ఇవ్వకూడదు. లీజుదారులు తమ వ్యక్తిగత అవసరాల కోసం దాన్ని వేరొకరికి అప్పనంగా ధారాదత్తం చేయడం నేరం. న్యూ మౌర్య రెస్టారెంట్ వ్యవహారంపై రెవెన్యూ అధికారులతో తనిఖీ చేయించి అక్రమాలపై చర్యలు తీసుకుంటాం. అక్రమాలు రుజువైతే ఆక్రమణదారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం.
- కాటంనేని భాస్కర్, కలెక్టర్
నాన్‌వెజ్ రెస్టారెంటా.. అలాంటిదేమీ లేదే
దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న వారు మాత్రమే నియమ నిబంధనలకు అనుగుణంగా వాడుకోవాలి. అలాకాకుండా దాన్ని సబ్ లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధం. అలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. అసలు అక్కడ రెస్టారెంట్ లేదు. ఉంటే మాకు తెలీకుండా పోతుందా ఏమిటి?
- సూర్యప్రకాశ్,
దేవాదాయ శాఖ చుండూరు సత్రం ఇన్‌చార్జి
నాది కాదు.. మా కుర్రోడిది
న్యూ మౌర్య రెస్టారెంట్ నాది కాదు. ఈశ్వరరావు అని.. మా కుర్రోడిది. ఏదో నా మీద అభిమానం కొద్దీ అతను నా పేరు మీద రెస్టారెంట్ నడుపుకుంటున్నాడు. టాక్స్‌లు, కరెంట్ బిల్లులు వగైరా వ్యవహారాలన్నీ కూడా నా పేరు మీదే నిర్వహిస్తున్నాడు. సబ్ లీజు లేదు.. పాడూ లేదు. అతనికి అసలు లీజుదారులు డబ్బులివ్వాల్సి ఉండి వాళ్లే దీన్ని అతనికి స్వాధీనం చేశారు. డబ్బులిచ్చేశాక తిరిగి తీసుకుంటామని కూడా చెప్పారు. అక్కడ వెజ్ రెస్టారెంట్ వ్యాపారం సాగదని నాన్‌వెజ్ రెస్టారెంట్ పెట్టినట్టున్నాడు. ఇదేమంత పెద్ద విషయం కాదు.
- రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నేత