సాక్షి, రాజమండ్రి : కంచే చేను మేసినట్టు.. ప్రభుత్వ, ప్రజల ఆస్తుల్ని రక్షించాల్సిన పాలకులే.. వాటిని యథేచ్ఛగా భక్షిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం, కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ నేతలు. అధికార మదంతో ఖాళీగా కనిపించిన ప్రతి జాగాలోనూ పాగా వేశారు. అవి పర్ర భూములా.. తీరప్రాంత భూములా.. చెరువులా.. గుట్టలా.. దేవదాయ భూములా.. మఠం భూములా.. అసైన్డ్ భూములా.. రోడ్లా.. ప్రైవేటు భూములా.. అని చూడకుండా ఆక్రమించేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించేశారు. ఆన్‌లైన్‌లో రికార్డులు మార్చేశారు. అడ్డం వచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకూ కబ్జా కాండకు దిగారు. జిల్లావ్యాప్తంగా రూ.500 కోట్ల విలువైన సుమారు 300 ఎకరాల వరకూ ఆక్రమించారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయంటే జిల్లాలో టీడీపీ నేతల కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్న భూములను కూడా ఆక్రమించుకునేందుకు.. ఇప్పుడు ఎన్నికల వేళ.. మళ్లీ తమకు అధికారం ఇవ్వాలని కోరుతూ ప్రజల ముందుకు వస్తున్నారు. ఇటువంటి వారికి మళ్లీ ఓట్లు వేయడం అవసరమా?!
రాజమహేంద్రవరం నడిబొడ్డున నూరు కోట్ల స్థలానికి కంచె
రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున కంబాలచెరువు సమీపంలోని ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలో 1985లో ప్రభుత్వం సేకరించిన భూమిలో వాంబే గృహాలు నిర్మించగా మిగిలిన 3 ఎకరాల భూమిని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండతో ఆక్రమించారు. ఆ ప్రభుత్వ స్థలంలో ఏళ్ళ తరబడి గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్న 110 కుటుంబాలకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ముట్టజెప్పి ఖాళీ చేయించారు.
ఉన్నత స్థాయి అధికారులుఆ వైపు చూడకుండా, పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించకుండా అధికారాన్ని అడ్డుపెట్టి మూడు ఎకరాల స్థలానికి కంచె వేశారు. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ చట్టం సెక్షన్ 45 ప్రకారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం కంచె వేసిన వారికి నోటీసులు జారీ చేసింది.
‘సాక్షి’ కథనాలతో కేసులు, రికవరీకి ఆదేశాలు
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని వేమగిరిలో టీడీపీ నేత వెలుగుబంటి వెంకటాచలం కంకరగుట్టను, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి, దర్జాగా గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో బా«ధ్యుడిపై నాలుగు కేసులు పెట్టడమే కాకుండా రూ.8.61 కోట్ల రికవరీకి అధికారులు నోటీసులు జారీ చేశారు.
మురుగు కాలువనూ వదల్లేదు
తునిలో మురుగు నీటి కాలువను దర్జాగా కబ్జా చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. టీడీపీ నేతల అవకతవకలపై ప్రతిపక్షానికి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తుని పరిసర ప్రాంతాల ప్రజలందరికీ బాతుల కోనేరు అంటే తెలిసిందే. తుని పట్టణం నడిబొడ్డున ఐదు ఎకరాల్లో కోనేరు ఉండేది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు ఇందులోకి చేరేది. కోనేరు ముందు జీఎన్‌టీ రోడ్డును ఆనుకుని తుని తాలూకా పోలీస్‌స్టేషన్ ఉంది. దాని వెనుక పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ భూమిలో నిర్మించినవి. తుని మున్సిపాలిటీ ఏర్పడక ముందు వీరవరం పంచాయతీగా ఉండేది. అప్పట్లో సర్వే నంబరు 268/4లో 1.25 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమి ఉంది. కాలక్రమంలో కోనేరును చెత్త, పాత భవనాల శిథిలాలతో పూడ్చి వేశారు.
1983లో పురపాలక సంఘం జీఎన్‌టీ రోడ్లోని సర్వే నంబరు 268 /4లో సోమరాజు సినిమా థియేటర్ గోడను ఆనుకుని 22 సెంట్ల భూమిలో కాలువ నిర్మించారు. దీన్ని, దాని పక్కన ఉన్న 8 సెంట్ల పోలీసు క్వార్టర్స్ భూమిని ఆక్రమించారు. తెలుగుతమ్ముళ్లు కాజేసిన స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.10 కోట్లు పైన ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment