rajamahendra varam
-
శివయ్య ప్రీతికి ‘శంఖు’ నాదం : దంపతులకు అవార్డు
రాజమహేంద్రవరం రూరల్: శివయ్యను ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు అనేకమార్గాలను అనుసరిస్తారు. శంఖాన్ని ఏకబిగిన పూరిస్తూ మహాదేవుడిని ఆనందింపచేస్తారు మరికొందరు. శ్వాసను బిగించి ఏకధాటిగా దాదాపు ఇరవై నిముషాల పాటు శంఖాన్ని పూస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్న ఎస్పీఎఫ్ కమాండెంట్ నర్సింహరావు, అలివేలు మంగాదేవి దంపతులకు ఆధ్మాత్మిక సంపూర్ణత్వంతో పాటు, భౌతికంగా కూడా అవార్డులు వరిస్తున్నాయి. వీరు చేసే ఆధ్యాత్మిక సేవ అవార్డుల కోసం కాకపోయినప్పటికీ శంఖనాదంలో వీరి నిపుణతకు హైదరాబాదుకు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామధేను –2024 అవార్డ్స్‌లో భాగంగా జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం (డిసెంబరు 14) హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో నరసింహారావు దంపతులు ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.ఈ సందర్భంగా తమ ఆధ్యాత్మిక మార్గం, శంఖునాదం సాధన గురించి నర్సింహరావు మాటల్లో.. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి.గన్నవరం తమ స్వగ్రామం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఏపి ప్రత్యేక రక్షణ దళం(ఏపీఎస్పీఎఫ్) కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా. తన భార్య అలివేలు మంగాదేవి గృహిణి. తమకు శివుడు అంటే ఎనలేని భక్తి. తాను 1989లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలో సరిహద్దు భద్రత దళంలో పనిచేసే సమయంలో బెంగాలీ పూజారి చక్రవర్తి వద్ద శంఖం పూరించడంలో మెలుకువలు నేర్చుకున్నాను. అదే స్పూర్తితో తన భార్య మంగాదేవికి కూడా ఈ విద్యలో పట్టుసాధించారు. దీంతో తమకు ‘అఖండ శంఖారావ యుగళం’గా పేరొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళ,తమిళనాడు ,కర్ణాటక, డిల్లీ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఇంతవరకు నాలుగువేలకు పైగా కార్యక్రమాలు తమ శంఖారావంతో ఆరంభమయ్యాయంటారు ఈ దంపతులు ఇంకా గోదావరి,కృష్ణాపుష్కరాలు, ఇబ్రహీంపట్నం పవిత్ర నదీసంగమ అనుసంధానం వంటి పెద్దపెద్ద కార్యక్రమాల్లో శుభసూచికంగా అఖండ శంఖారావం పూరించాం. ఈసందర్బంగా పలు సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు, అవార్డులు, సత్కారాలు, సువర్ణ ఘంటాకంకణాలు లభించాయన్నారు. ఇదంతా కేవలం సాధనతోనే సాధ్యమైందని, పదేళ్లపాటు దీన్ని సాధన చేశామని నరసింహారావు దంపతులు పేర్కొన్నారు. -
ఏపీ,తెలంగాణాలో మరో 8 నగరాలకు జియో ట్రూ5జీ సేవలు
సాక్షి,ముంబై: టెలికాం మేజర్ రిలయన్స్ జియో తన 5G కవరేజీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మరో 8 నగరాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, నరసరావు పేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరంతోపాటు, తెలంగాణలోని నల్గొండతో కలిపి తెలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది నగరాలు మంగళవారం నుండి Jio True 5G సేవలను పొందనున్నాయి. దీంతో ఏపీలోని 16, తెలంగాణాలో 6 నగరాల్లో జియో ట్రూ5జీని వినియోగ దారులకు అందిస్తోంది. రిలయన్స్ జియో ఈ నగరాల్లో చాలా వరకు 5జీ సేవలను ప్రారంభించిన తొలి ఏకైక ఆపరేటర్‌గా అవతరించిందని కంపెనీ ఒక ప్రకటనలె తెలిపింది. ఈ నగరాల్లోని జియో వినియోగదారులు ఈరోజు నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbp వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు Jio వెల్కమ్ ఆఫర్‌ను పొందనున్నారు. ఏపీ, తెలంగాణాలోని మరికొన్ని నగరాలకు జియో ట్రూ5 జీ సేవల విస్తరణపై జియో సంతోషం వెలిబుచ్చింది. దేశం మొత్తం డిసెంబర్ 2023 నాటికి 5G సేవల్ని అందించాలన్నలక్క్ష్యంలో భాగంగా మొత్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాల్లో జియో ట్రూ 5జీ ప్రారంభించినట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఇప్పటికే ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలులోను, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలో జియో ట్రూ5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. -
ఆరేళ్లుగా నక్కి.. ఆఖరికి చిక్కి
సాక్షి, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కేసులో ఆరేళ్లుగా పరారీలో ఉన్న రాజమహేంద్రవరం సుబ్బారావునగర్‌కు చెందిన తొండపు నాగప్రసాద్(ప్రసాద్)ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు త్రీటౌన్ ఇన్స్పెక్టర్ జి.మధుబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం రామన్నపాలేనికి చెందిన పేరుబోయిన శివభవాని (మృతురాలు) 2008లో మొదటిభర్త చనిపోవడంతో కుమార్తెను తీసుకుని బతుకుతెరువు నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, రోగులకు సేవలందిస్తూ వారిచ్చే డబ్బులతో తన కుమార్తెతో కలసి జీవిస్తుండేది. శివభవానికి కార్ డ్రైవర్ తొండపు నాగప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. నాగప్రసాద్ భార్యకు ఓ ప్రమాదంలో మతిస్థిమితం పోయింది. దీంతో 2014 నుంచి శివభవాని, తన కుమార్తెతో కలసి నాగప్రసాద్ ఇంట్లోనే కాపురం ఉన్నారు. అనంతరం ఆ ఇల్లు అమ్మేయడంతో పక్కనే ఉన్న సంజీవయ్యనగర్‌లో అద్దెకు వెళ్లారు. 2017 మార్చి 2న శివభవాని ఇంట్లో మృతిచెంది ఉంది. మృతురాలి తల్లి పేరుబోయిన కొవ్వాడమ్మ, బంధువులు వచ్చి చూడగా శివభవాని పీకకోసి ఉంది. ముందురోజు తమకు గొడవ జరగడంతో ఆమె పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నాగప్రసాద్ అందరినీ నమ్మించాడు. దీంతో బంధువులు శివభవాని మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. అంత్యక్రియలు పూర్తయిన రెండు వారాల తరువాత మృతురాలి సోదరుడు వెంకటేష్‌కు నాగప్రసాద్ ఫోన్ చేసి మీచెల్లి తనకు తానుగా పీక కోసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, తరచూ డబ్బులు కోసం వేధిస్తుందని అందుకే తానే చంపేశానని తెలిపాడు. దీంతో ఈ విషయమై 21 రోజుల అనంతరం మృతురాలి తల్లి కొవ్వాడమ్మ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఇన్స్పెక్టర్ సీహెచ్ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాగప్రసాద్ పరారీలో ఉండగా, ప్రస్తుత త్రీటౌన్ ఇన్స్పెక్టర్ జి.మధుబాబు, సెంట్రల్ జోన్ డీఎస్పీ జేవీ సంతోష్ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్స్ బీఎంవీవీ భానుమూర్తి, జె.సుబ్బారావు, క్రైమ్ కానిస్టేబుళ్లు కె.వెంకటేశ్వరరావు, బి.విజయకుమార్‌లను సెంట్రల్ జోన్ డీఎస్పీ జేవీ సంతోష్ అభినందించారు. (చదవండి: సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’) -
వదిలేశారా కన్నా! నీ కోసం మేమున్నాం
సాక్షి,ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆ కన్న తల్లికి ఏం కష్టమొచ్చిందో.. లేక ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. భూమిపై పడిన కాసేపటికే ఆ పసికందు కన్నవారికి దూరమై.. సజీవంగా.. ఓ అట్టపెట్టెలో.. శ్మశానవాటిక వద్ద కనిపించడం కలకలం రేపింది. ఏడో నెలలోనే పుట్టినప్పటికీ ఆయుర్దాయం గట్టిదేమో.. పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఆ పసికందును అక్కున చేర్చుకున్నారు. ఆ చిన్నారి ఆయువును నిలిపేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు 108 నియోనేటల్ అంబులెన్స్ సిబ్బంది ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గుర్తు తెలియని ఓ గర్భిణి నాలుగు రోజుల క్రితం ఏడో నెలలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తరఫు వారు ఆ బిడ్డ చనిపోయాడనుకున్నారో లేక మరేవైనా కారణాలతో వద్దనుకున్నారో కానీ.. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు శ్మశానవాటిక వద్ద బాక్స్‌లో పెట్టి వదిలేశారు. ఆ పెట్టెలోనే సజీవంగా ఉన్న ఆ పసికందు క్యార్క్యార్ మంటూ ఏడుస్తూండటం వినిపించి.. అక్కడే ఉన్న ఓ వ్యాన్ డ్రైవర్ శివ దగ్గరకు వెళ్లి చూశాడు. అట్టపెట్టెలో అనారోగ్యంతో ఉన్న పసికందును గమనించాడు. విషయం తెలియడంతో స్థానిక మల్లికార్జున నగర్‌కు చెందిన తుంపాటి వెంకటేష్, దేవి దంపతులు ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో దేవుడే ఆ బిడ్డను ఇచ్చాడని భావించారు. పసికందు అస్వస్థతకు గురవడంతో తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో శనివారం సాయంత్రం వెంకటేష్ దంపతులు ఆ బిడ్డను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకువచ్చారు. అయితే శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొవ్వూరులోని 108 నియోనేటల్ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆ అంబులెన్స్ ఈఎంటీ శాంతకుమార్, పైలట్ బుల్లిరాజు వెంటనే ఇక్కడకు చేరుకుని, ఆ పసికందుకు అత్యవసర వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు సురక్షితంగా తరలించారు. ఐసీడీఎస్ అధికారులకు, పశ్చిమ గోదావరి జిల్లా 108 జిల్లా మేనేజర్ కె.గణేష్‌కు దీనిపై సమాచారం అందించారు. ఏడో నెలలో పుట్టిన పసికందును నిర్దయగా బాక్సులో పెట్టి శ్మశానవాటిక వద్ద వదిలివేయడం చూపరులను కలచివేసింది. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఆ పసికందును తన భార్య దేవి దగ్గరుండి చూసుకుంటోందని ఆమె భర్త వెంకటేష్ తెలిపారు. పసికందు ప్రాణాలతో ఉంటే తమకు అదే పదివేలని ఆయనన్నారు. -
టీడీపీకి ‘రాజా’నామా.. ‘తోట’దీ అదే బాట
సాక్షి, రాజమహేంద్రవరం : ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ’ చందంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 19 స్థానాలకు 14 స్థానాలు, మూడు పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన టీడీపీ ఐదేళ్లు తిరిగేసరికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి గత ప్రాభవాన్ని కోల్పోయింది. మూడు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనానికి ఆ పార్టీ కోటలు కుప్పకూలిపోయాయి. జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ సింగిల్ డిజిట్‌కే అంటే నాలుగు స్థానాలకే పరిమితమైంది. జిల్లాలో మూడు పార్లమెంటు స్థానాల్లో బోణీ కూడా చేయలేక చతికిలపడింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ పార్టీ ప్రణాళికా యుతంగా ముందడుగు వేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌మెహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు జేజేలు పలుకుతుండడంతో టీడీపీ నేతల్లో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో కొనసాగితే భవిత ఉండదనే అభిప్రాయం ప్రైవేటు సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. రెండు నెలల కిందట కాకినాడలో ఆ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధ్వర్యంలో భేటీ కావడం తెలిసిందే. నడి సముద్రంలో మునిగిపోయే నావలాంటి టీడీపీలో ఉండటం కంటే మరో మార్గం చూసుకోవాలనే యోచనలోనే దాదాపు టీడీపీ నేతలంతా ఉన్నారు. అలాఅని బయటపడితే ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ప్రారంభం... ఇప్పటికే కోనసీమలో పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీకి రాజీనామా చేసి కమల దళంలో చేరిపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నారాయణమూర్తి తోపాటు పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లారు. తాజాగా గురువారం మెట్ట ప్రాంతంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. నిన్నమొన్నటి వరకూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా ఉన్న వరుపుల జోగిరాజు (రాజా) టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. రాజా ఆ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. పార్టీ అధిష్టానం వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధించి పదవులకు రాజీనామా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీ అధిష్టానం ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం విషయంలో చివరి నిమిషం వరకూ ఇవ్వకుండా మానసికంగా చాలా వేధింపులకు గురిచేసిందని రాజీనామా సందర్భంగా రాజా అధిష్టానం తీరును ఎండగట్టారు. ఓటమి చెందిన అనంతరమే పార్టీని వీడాలనుకున్నప్పటికీ వెంటనే బయటకు వచ్చేస్తే టిక్కెట్టు ఇచ్చినా వదిలి పోయారనే అపప్రథ వస్తుందని ఇంతకాలం వేచిచూశానని చెప్పుకున్నారు. రాజా టీడీపీకి రాజీనామా చేయడంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. రాజా తరువాత వంతు మరికొంత మంది పార్టీ నేతలు రాజీనామాకు లైన్లో ఉన్నారంటున్నారు. పార్టీని వీడే వారిలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరిలో ప్రస్తుతానికి జ్యోతుల పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా తోట మాత్రం ఇటీవల కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. త్రిమూర్తులు పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. ఒకరొకరుగా జిల్లా టీడీపీలో ముఖ్యులు త్వరలో రాజీనామా బాట పట్టేలా కనిపిస్తున్నారు. -
వారి సంగతేంటో తేల్చండి..
సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మందికి ఎయిడ్స్ ఉందో! లేదో! జైలు అధికారులు నిర్ధారించాలని బుధవారం హై కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారు. ఇంకా ఎంత మందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులను ఆదేశించింది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడైన ఏడు కొండలు అనే ఖైదీ తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హై కోర్టుకు విన్నవించడంతో కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఎంత మంది హెచ్ఐవీ రోగులు ఉన్నారు? వారికి ఆరోగ్యపరంగా ఇస్తున్న వైద్యం, పౌష్టికాహారం తదితర వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జైలు అధికారులు ఖైదీలకు ఇస్తున్న ఆహారం మందుల వివరాల నివేదికను అందజేశారు. ప్రతిరోజూ ఆహారంతో పాటు గుడ్డు, 250 మిల్లీ గ్రాముల పాలు, వారంలో వంద గ్రాముల మాంసం, ప్రోటీన్స్, ఇతర ఏఆర్టీ మందులు ఇస్తామని హై కోర్టుకు తెలిపారు. అలాగే ఇతర జైళ్ల నుంచి కూడా హెచ్ఐవీ రోగులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపుతున్నారన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 30 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండడంతో గుంటూరు, కృష్ణ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని హెచ్ఐవీ రోగులు ఎక్కువ మంది ఉన్నారని, ఈ నాలుగు జిల్లాలు హైవే కు ఆనుకొని ఉండడంతో లారీ డ్రైవర్లు, కూలీలు, రోడ్డు ప్రమాదం చేసి, హత్యలు చేసి హెచ్ఐవీ రోగులుగా జైలుకు వస్తున్నారని జైలు అధికారులు హై కోర్టుకు వివరించారు. గత ఐదేళ్లలో హెచ్ఐవీ రోగులు 19 మంది బయట నుంచి వచ్చారని, అనారోగ్యంతో బాధపడే వారికి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు హెచ్ఐవీ టెస్ట్‌లలో బయటపడ్డాయని కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ ఆగస్టు రెండో తేదీకి వాయిదా వేసింది. -
ప్రభుత్వ శాఖలే శాపం
విద్యుత్తు శాఖకు బకాయిలు షాక్ కొడుతున్నాయి. ప్రజలు ఠంఛన్‌గా బిల్లులు జమ చేస్తున్నా ప్రభుత్వ శాఖలు మాత్రం పైసా చెల్లించకుండా వాయిదా మంత్రాన్ని జపిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్తు శాఖకు ఆయా శాఖల నుంచి బిల్లులు జమచేయకపోవడంతో బకాయిలు గుదిబండగా మారాయి. ఈ రకంగా కోట్ల రూపాయల్లోనే బకాయిలు వసూలు కాకుండా ఉన్నాయి. ఫలితంగా ఏటేటా విద్యుత్తుశాఖ రెవెన్యూ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. సాక్షి, తూర్పు గోదావరి: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చే జిల్లాలోని ఆరు విద్యుత్తు డివిజన్లలో గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ శాఖల వద్ద పేరుకుపోయిన బకాయిలు రూ.342.58 కోట్లు పైమాటే ఉన్నాయి గత జూన్ నెలలో బకాయిలు రూ.216.04 కోట్లుంటే తాజాగా జూలై నెలకు వచ్చేసరికి బకాయిలు రూ.230.83 కోట్లకు చేరుకుంది. గత చంద్రబాబు సర్కార్ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇందుకు జిల్లాలో ఉన్న 1072 గ్రామ పంచాయతీలు కూడా మినహాయింపు కాదు. గత సర్కార్ గ్రామాలకు వచ్చిన నిధులను వంది మాగధుల స్వప్రయోజనాల కోసం దారిమళ్లించడంతో గడచిన ఐదేళ్లుగా పంచాయతీల పాలకవర్గాలు చిల్లిగవ్వ కూడా విద్యుత్తు బిల్లులు చెల్లించలేకపోయాయి. ఈ కారణంగానే విద్యుత్తు శాఖకు బకాయి పడిన వాటిలో అత్యధికంగా గ్రామ పంచాయతీల వద్దనే ఉండిపోయాయి. జిల్లాలో 17 లక్షల మంది వినియోగదారుల్లో 90 శాతంపైనే నెలనెలా ఏపీఈపీడీసీఎల్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించేస్తున్నారు. కానీ ప్రభుత్వ శాఖల నుంచి మాత్రం బకాయిలు ఊడిపడటం లేదు. అందులోను బకాయిలు గుదిబండగా మారిన విభాగాల్లో గ్రామ పంచాయతీలదే ఎక్కువగా ఉంది. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు గడచిన మూడు నెలల లెక్కలు తీస్తే రూ.14.22 కోట్లు ఉంటే అందులో వసూలైంది కేవలం రూ.4.22 కోట్లు మాత్రమే. అంటే ఒక్క గ్రామ పంచాయతీల నుంచి మూడు నెలల బకాయిలు రూ.10 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు, గ్రామ పంచాయతీలన్నీ కలిపితే ఉన్న బకాయిలు రూ.342.58 కోట్లు. ఇందులో గ్రామ పంచాయతీల నుంచే అత్యధికంగా రూ.201.34 కోట్లు విద్యుత్ బిల్లుల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల తరువాత రెండో స్థానంలో నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ నుంచి రూ.97.87 కోట్లు బకాయిలు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల నుంచి రూ.20.98 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు వసూలు కాకపోవడంతో విద్యుత్తు శాఖ తలపట్టుకుంటోంది. ఉన్నత స్థాయి నుంచి ఇచ్చే రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను అధిగమించేందుకు ఈ బకాయిలు ప్రతిబంధకమవుతున్నాయని ఏపీఈపీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ లక్ష్యాలు పడిపోతున్నాయి బకాయిలు వసూలు కాకపోవడంతో ఏటా రెవెన్యూ లక్ష్యాలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో బకాయిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా అత్యధికంగా 17 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరు సకాలంలో బిల్లులు చెల్లిస్తుండడంతో రెవెన్యూ బాగానే వస్తున్నా, ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు వల్ల లక్ష్యాన్ని అందుకోలేక పోతున్నాం. సీహెచ్ సత్యనారాయణరెడ్డి,సూపరింటెండింగ్ ఇంజినీర్, ఏపీఈపీడీసీఎల్ -
ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా..
ఆ యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. డబ్బు సులభంగా సంపాదించేందుకు చోరీలకు అలవాటు పడ్డారు. చైన్ స్నాచింగ్‌లు మొదలుపెట్టారు. ఒంటరిగా వెళుతున్న వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఆ చోరుల వివరాలను మంగళవారం రాజమహేంద్రవరం తూర్పు మండలం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ వై.వి.రమణకుమార్, తూర్పు మండలం డీఎస్పీ వి.వి.రమణ కుమార్ వెల్లడించారు. రెండున్నర నెలలుగా రాజా నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో చైన్ స్నాచింగ్స్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన కాకరబాల సుబ్రహ్మణ్యం(అలియాస్ బాబి) రావి వెంకటేష్ (వెంకీ), జక్కంపూడి వెంకటేష్ , ధవళేశ్వరం గ్రామానికి చెందిన సాంబారి క్రాంతి కుమార్‌లు స్నేహితులు. వీరు ఆటో డ్రైవర్‌గా, లారీ డ్రైవర్‌గా, కూలిపనులు చేసుకుని జీవిస్తుంటారు. వ్యసనాలకు బానిసలైన ఈ యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం చైన్ స్నాచింగ్‌లకు దిగారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలే లక్ష్యంగా వీరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. కాకరాల బాల సుబ్రమ్మణ్యం, మరో యువకుడు మోటారు సైకిల్‌పై మహిళలను వెంబడించి, నిర్జీవ ప్రదేశంలో వారి మెడలోని బంగారు గొలుసులను తెంచుకుని పారిపోయేవారు. వాటిని మల్లయ్య పేటకు చెందిన(రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులో బంగారు నగలు తయారీ చేసే వ్యక్తి) పాలతీర్ధపు మహేష్ అనే వ్యక్తికి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారని పోలీసులు తెలిపారు. పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చోరీలు నిందితులు ప్రతి చోరీ పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చేస్తుండేవారని అడిషనల్ ఎస్పీ వివరించారు. నిందితులు తొలిసారిగా ఈ ఏడాది మే 3న కొంతమూరులో చైన్ స్నాచింగ్ చేశారని తెలిపారు. అనంతరం మే 29న కొంతమూరు గ్రామంలో, జూన్ 6న మరో చైన్ స్నానింగ్ చేశారని తెలిపారు. జూన్ 24వ తేదీన మరో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఒకే ప్రాంతంలో చోరీలు చేస్తుండడంతో పోలీసుల నిఘా పెంచారు. దీంతో వారు చోరీ చేసే ప్రాంతాన్ని మార్చుకున్నారని తెలిపారు. ఐదో సారి జూలై నాలుగో తేదీన బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్లో చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యారని తెలిపారు ఈనెల 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొంతమూరు అవుట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటారు సైకిల్‌పై కాకర బాలసుబ్రహ్మణ్యం, రావి వెంకటేష్ పోలీసుల ను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా చైన్ స్నాచింగ్ చేస్తున్న మిగిలిన వారి పేర్లు జక్కంపూడి వెంకటేష్, సాంబారీ క్రాంతి కుమార్ పేర్లు వెల్లడించారని తెలిపారు. వీరితో పాటు చోరీ చేసిన నగలు కొనుగోలు చేసిన పాలతీర్ధపు మహేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అన్నారు. అలాగే చోరీలు చేయడానికి ఉపయోగించే రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో క్రైం పార్టీ పోలీస్ కానిస్టేబుళ్లు కె.సురేష్, డి.విజయ కుమార్, స్టేషన్ క్రైం పోలీసు కానిస్టేబుళ్లు బీఎన్ఎస్ ప్రసాద్, కె. కళ్యాణరావు, ఎం.ప్రసాద్ సహకరించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు ఎం.వి.సుభాష్, నాగబాబు పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్‌పై బ్లేడ్ బ్యాచ్ దాడి
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : నగరంలో బ్లేడ్ బ్యాచ్ దారుణాలు పెరిగిపోతున్నాయి. బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన యువకులు ప్రజలపై దాడులు చేసి వారి వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్లు చోరీ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరో సంఘటన ఆదివారం ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీతానగరానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటేష్, క్లీనర్ ప్రసాద్ లక్ష్మి రుద్ర ట్రాన్స్ పోర్టులో పనిచేస్తున్నారు. వారు ఆదివారం పంగిడి నుంచి మద్యం మత్తులో హైవే పై వెళ్తున్న లోడు లారీకి అడ్డుగా నలబడి హారన్ కొట్టినా తప్పుకోకుండా డ్రైవర్ బ్రేకులు వేసిన తరువాత లారీ డ్రైవర్, క్లీనర్లను క్యాబిన్లో నుంచి బయటకు లాగి దాడి వారి వద్ద ఉన్న నగదు చోరీ చేసి పరారైయ్యారు. సీతానగరానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటేష్, క్లీనర్ ప్రసాద్ లక్ష్మి రుద్ర ట్రాన్స్‌పోర్టులో పని చేస్తున్నారు. వారు ఆదివారం పంగిడి నుంచి సట్రు (క్వారీలో వచ్చే నల్లరాతి బూడిద)ను బొమ్మూరు తీసుకువెళ్తున్నారు. హైవేపై బ్రెస్ట్ ప్రైస్ ఉన్న ప్రదేశంలో దానికి ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు నుంచి తొమ్మిది మంది బ్లేడ్ బ్యాచ్ యువకులు రోడ్డుకు అడ్డుగా నడిచి వెళ్తుండగా లారీ డ్రైవర్ హారన్ కొట్టాడు. అప్పటికీ వారు తప్పుకోకుండా రోడ్డుకు అడ్డుగా నిలబడ్డారు. దాంతో చేసేది లేక డ్రైవర్ లారీని రోడ్డుపై ఆపాడు. వారు రాళ్లతో లారీపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. లారీ డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి కిందకు లాగి ‘మేము రోడ్డు దాటుతుండగా లారీని ఆపడం మాని హారన్ కొడతావా?’ అంటూ డ్రైవర్ వెంకటేష్‌పై దాడి చేశారు. అడ్డు వచ్చిన క్లీనర్‌పై కూడా దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ, 50 వేలు లాక్కుని పరారయ్యారు. గాయపడిన లారీ డ్రైవర్ వెంకటేష్, క్లీనర్ ప్రసాద్‌లను స్థానికులు చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ! మురళీమోహనూ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాభిమానంతో గెలిచే దారిలేక దొడ్డిదారిన కోట్లు కుమ్మరించి ఎన్నికల్లో విజయం సాధించాలన్న టీడీపీ రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ బండారం బయటపడింది. రూ.2 కోట్ల నగదుతో ఆయన అనుచురులు హైదరాబాద్ హైటెక్ రైల్వేస్టేషన్ వద్ద పట్టుబడిన వ్యవహారం జిల్లాలో కలకకలం రేపుతోంది. మురళీమోహన్ కోడలు రూప రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. గడచిన ఐదేళ్లలో ప్రజాభిమానం దక్కించుకోలేకపోయిన మురళీమోహన్ ఎన్నికలకు దూరంగా ఉండి కోడలికి సీటు ఇప్పించుకున్నారు. టిక్కెట్టు ఖరారైన దగ్గర నుంచి ఎక్కడకు వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో కోడలిని గెలిపించుకునేందుకు డబ్బు కుమ్మరించి ఓట్లు కొని, గెలుపొందాలని పక్కా స్కెచ్ వేశారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున నగదు తరలించేందుకు ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో బండారం బయటపడింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో సొమ్మును జిల్లాకు తరలించేశారన్న చర్చ రాజమహేంద్రవరం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కోట్లు కుమ్మరించి ఓట్లు కొనాలన్న ఆయన ప్రయత్నాన్ని చూసి జనం ఛీత్కరిస్తున్నారు. చదవండి....(టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసు) పట్టుబడిందిలా.. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ హైటెక్ రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిమ్మలూరి శ్రీహరి, పండరిల బ్యాగ్‌లను పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల నగదు పోలీసులకు దొరికింది. విచారణలో మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థ ఉద్యోగులు జగన్మోహన్, ధర్మరాజు ఈ సొమ్ము తమకు ఇచ్చినట్టు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ సొమ్ము కోసం యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్‌లు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో ఎదురుచూస్తారని తెలిపారు. హైటెక్ రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్ చేరుకుని, అక్కడి నుంచి గరీబ్‌రథ్‌లో ఈ సొమ్మును తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. రాజమహేంద్రవరంలో ఈ నగదును ఎంపీ మురళీమోహన్ కోడలు రూపకు అందజేసేందుకు తీసుకువెళ్తున్నట్టు నిందితులు అంగీకరించారని తెలిసింది. పట్టుబడిన రూ.2 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఆరుగురిపై ఐపీసీ 171(బి), 171(సి), 171(ఇ), 171(ఎఫ్) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసు రికార్డుల్లో నమోదైనట్టు సమాచారం. -
తిన్నారు కోట్లు.. ఎందుకు వేయాలి ఓట్లు
సాక్షి, రాజమండ్రి : కంచే చేను మేసినట్టు.. ప్రభుత్వ, ప్రజల ఆస్తుల్ని రక్షించాల్సిన పాలకులే.. వాటిని యథేచ్ఛగా భక్షిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం, కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ నేతలు. అధికార మదంతో ఖాళీగా కనిపించిన ప్రతి జాగాలోనూ పాగా వేశారు. అవి పర్ర భూములా.. తీరప్రాంత భూములా.. చెరువులా.. గుట్టలా.. దేవదాయ భూములా.. మఠం భూములా.. అసైన్డ్ భూములా.. రోడ్లా.. ప్రైవేటు భూములా.. అని చూడకుండా ఆక్రమించేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించేశారు. ఆన్లైన్లో రికార్డులు మార్చేశారు. అడ్డం వచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకూ కబ్జా కాండకు దిగారు. జిల్లావ్యాప్తంగా రూ.500 కోట్ల విలువైన సుమారు 300 ఎకరాల వరకూ ఆక్రమించారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయంటే జిల్లాలో టీడీపీ నేతల కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్న భూములను కూడా ఆక్రమించుకునేందుకు.. ఇప్పుడు ఎన్నికల వేళ.. మళ్లీ తమకు అధికారం ఇవ్వాలని కోరుతూ ప్రజల ముందుకు వస్తున్నారు. ఇటువంటి వారికి మళ్లీ ఓట్లు వేయడం అవసరమా?! రాజమహేంద్రవరం నడిబొడ్డున నూరు కోట్ల స్థలానికి కంచె రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున కంబాలచెరువు సమీపంలోని ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలో 1985లో ప్రభుత్వం సేకరించిన భూమిలో వాంబే గృహాలు నిర్మించగా మిగిలిన 3 ఎకరాల భూమిని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండతో ఆక్రమించారు. ఆ ప్రభుత్వ స్థలంలో ఏళ్ళ తరబడి గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్న 110 కుటుంబాలకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ముట్టజెప్పి ఖాళీ చేయించారు. ఉన్నత స్థాయి అధికారులుఆ వైపు చూడకుండా, పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించకుండా అధికారాన్ని అడ్డుపెట్టి మూడు ఎకరాల స్థలానికి కంచె వేశారు. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ చట్టం సెక్షన్ 45 ప్రకారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం కంచె వేసిన వారికి నోటీసులు జారీ చేసింది. ‘సాక్షి’ కథనాలతో కేసులు, రికవరీకి ఆదేశాలు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని వేమగిరిలో టీడీపీ నేత వెలుగుబంటి వెంకటాచలం కంకరగుట్టను, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి, దర్జాగా గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో బా«ధ్యుడిపై నాలుగు కేసులు పెట్టడమే కాకుండా రూ.8.61 కోట్ల రికవరీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. మురుగు కాలువనూ వదల్లేదు తునిలో మురుగు నీటి కాలువను దర్జాగా కబ్జా చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. టీడీపీ నేతల అవకతవకలపై ప్రతిపక్షానికి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తుని పరిసర ప్రాంతాల ప్రజలందరికీ బాతుల కోనేరు అంటే తెలిసిందే. తుని పట్టణం నడిబొడ్డున ఐదు ఎకరాల్లో కోనేరు ఉండేది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు ఇందులోకి చేరేది. కోనేరు ముందు జీఎన్టీ రోడ్డును ఆనుకుని తుని తాలూకా పోలీస్‌స్టేషన్ ఉంది. దాని వెనుక పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ భూమిలో నిర్మించినవి. తుని మున్సిపాలిటీ ఏర్పడక ముందు వీరవరం పంచాయతీగా ఉండేది. అప్పట్లో సర్వే నంబరు 268/4లో 1.25 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమి ఉంది. కాలక్రమంలో కోనేరును చెత్త, పాత భవనాల శిథిలాలతో పూడ్చి వేశారు. 1983లో పురపాలక సంఘం జీఎన్టీ రోడ్‌లోని సర్వే నంబరు 268 /4లో సోమరాజు సినిమా థియేటర్ గోడను ఆనుకుని 22 సెంట్ల భూమిలో కాలువ నిర్మించారు. దీన్ని, దాని పక్కన ఉన్న 8 సెంట్ల పోలీసు క్వార్టర్స్ భూమిని ఆక్రమించారు. తెలుగుతమ్ముళ్లు కాజేసిన స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.10 కోట్లు పైన ఉంటుంది. -
రాజమహేంద్రవరంలో ఆక్రమణల కూల్చివేత
రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఆక్రమణలపై కార్పొరేషన్ అధికారులు సోమవారం కొరడా ఝుళిపించారు. స్ధానిక దానవాయిపేట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కార్పొరేషన్ అధికారులు తొలగించి వేస్తున్నారు. పలు దుకాణాలను కూల్చివేయడంతో స్థానికులు కార్పొరేషన్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.