కొవ్వూరు 108 నియోనేటల్ అంబులెన్స్‌లో పసికందుకు వైద్యసేవలందిస్తున్న ఈఎంటీ శాంతకుమార్
సాక్షి,ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆ కన్న తల్లికి ఏం కష్టమొచ్చిందో.. లేక ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. భూమిపై పడిన కాసేపటికే ఆ పసికందు కన్నవారికి దూరమై.. సజీవంగా.. ఓ అట్టపెట్టెలో.. శ్మశానవాటిక వద్ద కనిపించడం కలకలం రేపింది. ఏడో నెలలోనే పుట్టినప్పటికీ ఆయుర్దాయం గట్టిదేమో.. పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఆ పసికందును అక్కున చేర్చుకున్నారు. ఆ చిన్నారి ఆయువును నిలిపేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు 108 నియోనేటల్ అంబులెన్స్ సిబ్బంది ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గుర్తు తెలియని ఓ గర్భిణి నాలుగు రోజుల క్రితం ఏడో నెలలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తరఫు వారు ఆ బిడ్డ చనిపోయాడనుకున్నారో లేక మరేవైనా కారణాలతో వద్దనుకున్నారో కానీ.. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు శ్మశానవాటిక వద్ద బాక్స్‌లో పెట్టి వదిలేశారు. ఆ పెట్టెలోనే సజీవంగా ఉన్న ఆ పసికందు క్యార్‌క్యార్ మంటూ ఏడుస్తూండటం వినిపించి.. అక్కడే ఉన్న ఓ వ్యాన్ డ్రైవర్ శివ దగ్గరకు వెళ్లి చూశాడు. అట్టపెట్టెలో అనారోగ్యంతో ఉన్న పసికందును గమనించాడు.
విషయం తెలియడంతో స్థానిక మల్లికార్జున నగర్‌కు చెందిన తుంపాటి వెంకటేష్, దేవి దంపతులు ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో దేవుడే ఆ బిడ్డను ఇచ్చాడని భావించారు. పసికందు అస్వస్థతకు గురవడంతో తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో శనివారం సాయంత్రం వెంకటేష్ దంపతులు ఆ బిడ్డను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకువచ్చారు. అయితే శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొవ్వూరులోని 108 నియోనేటల్ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
ఆ అంబులెన్స్ ఈఎంటీ శాంతకుమార్, పైలట్ బుల్లిరాజు వెంటనే ఇక్కడకు చేరుకుని, ఆ పసికందుకు అత్యవసర వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు సురక్షితంగా తరలించారు. ఐసీడీఎస్ అధికారులకు, పశ్చిమ గోదావరి జిల్లా 108 జిల్లా మేనేజర్ కె.గణేష్‌కు దీనిపై సమాచారం అందించారు. ఏడో నెలలో పుట్టిన పసికందును నిర్దయగా బాక్సులో పెట్టి శ్మశానవాటిక వద్ద వదిలివేయడం చూపరులను కలచివేసింది. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఆ పసికందును తన భార్య దేవి దగ్గరుండి చూసుకుంటోందని ఆమె భర్త వెంకటేష్ తెలిపారు. పసికందు ప్రాణాలతో ఉంటే తమకు అదే పదివేలని ఆయనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment