గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.
అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఏపీలోని రాజమండ్రిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. శనివారం నిర్వహించిన ఈవెంట్‌లో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా పాల్గొన్నారు.
ఇంటికి వెళ్తుండగా విషాదం..
అయితే అభిమాన హీరో ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీ కొట్టడంతో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఎవరూ పట్టించుకోలేదు.. బాధిత కుటుంబాల ఆవేదన..
తాము కన్న కుమారులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న తమను ఎవరూ కూడా పరామర్శించలేదని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్దకు ఎవరూ రాలేదని.. చాలా నరకం అనుభవించామని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
బాధితు కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ..' పరామర్శించడానికి ఎవరూ రాలేదండి. ఆదివారమంతా మేము నరకం అనుభవించాం. మమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పాపాన పోలేదు. మాకు మేమే వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకుని సొంతంగా పోస్టుమార్టం చేయించుకున్నాం. ఏ రాజకీయ నాయకుడు కూడా మా గురించి పట్టించుకోలేదు. మేము ఫోన్ చేసినా ఎవరూ కూడా రెస్పాండ్ కాలేదండి. ఇప్పటి వరకు కూడా ఎవరూ మా వద్దకు రాలేదు. పరామర్శించేదు' అని అన్నారు.
సంతాపం ప్రకటించిన రామ్ చరణ్.. రూ.10 లక్షల సాయం
అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతి చెందిన అభిమానుల రెండు కుటుంబాలకు చెరొక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ... 'ఈవెంట్ చూసేందుకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని అన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ.
Comments
Please login to add a commentAdd a comment