టీడీపీకి ‘రాజా’నామా.. ‘తోట’దీ అదే బాట | East Godavari TDP Leaders Varapula Raja Tota Trimurtulu Resigning To party | Sakshi
Sakshi News home page

మాకొద్దు ‘బాబో’య్‌...

Published Sat, Aug 31 2019 8:09 AM | Last Updated on Sat, Aug 31 2019 8:40 AM

East Godavari TDP Leaders Varapula Raja Tota Trimurtulu Resigning To party - Sakshi

వరపుల రాజా, తోట త్రిమూర్తులు

సాక్షి, రాజమహేంద్రవరం : ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ’ చందంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 19 స్థానాలకు 14 స్థానాలు, మూడు పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన టీడీపీ ఐదేళ్లు తిరిగేసరికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి గత ప్రాభవాన్ని కోల్పోయింది. మూడు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనానికి ఆ పార్టీ కోటలు కుప్పకూలిపోయాయి. జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ సింగిల్‌ డిజిట్‌కే అంటే నాలుగు స్థానాలకే పరిమితమైంది. జిల్లాలో మూడు పార్లమెంటు స్థానాల్లో బోణీ కూడా చేయలేక చతికిలపడింది. అధికారంలోకి  వచ్చిన వైఎస్సార్‌ పార్టీ ప్రణాళికా యుతంగా ముందడుగు వేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌మెహన్‌ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు జేజేలు పలుకుతుండడంతో టీడీపీ నేతల్లో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీలో కొనసాగితే భవిత ఉండదనే అభిప్రాయం ప్రైవేటు సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. రెండు నెలల కిందట కాకినాడలో ఆ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధ్వర్యంలో భేటీ కావడం తెలిసిందే. నడి సముద్రంలో మునిగిపోయే నావలాంటి టీడీపీలో ఉండటం కంటే మరో మార్గం చూసుకోవాలనే యోచనలోనే దాదాపు టీడీపీ నేతలంతా ఉన్నారు. అలాఅని బయటపడితే ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.

ఇప్పటికే ప్రారంభం...
ఇప్పటికే కోనసీమలో పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీకి రాజీనామా చేసి కమల దళంలో చేరిపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నారాయణమూర్తి తోపాటు పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లారు. తాజాగా గురువారం మెట్ట ప్రాంతంలో ఆ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. నిన్నమొన్నటి వరకూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) చైర్మన్, ఆప్కాబ్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్న వరుపుల జోగిరాజు (రాజా) టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. రాజా ఆ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. పార్టీ అధిష్టానం వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధించి పదవులకు రాజీనామా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

పార్టీ అధిష్టానం ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం విషయంలో చివరి నిమిషం వరకూ ఇవ్వకుండా మానసికంగా చాలా వేధింపులకు గురిచేసిందని రాజీనామా సందర్భంగా రాజా అధిష్టానం తీరును ఎండగట్టారు. ఓటమి చెందిన అనంతరమే పార్టీని వీడాలనుకున్నప్పటికీ వెంటనే బయటకు వచ్చేస్తే టిక్కెట్టు ఇచ్చినా వదిలి పోయారనే అపప్రథ వస్తుందని ఇంతకాలం వేచిచూశానని చెప్పుకున్నారు. రాజా టీడీపీకి రాజీనామా చేయడంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి షాక్‌ తగిలిందని చెప్పొచ్చు. రాజా తరువాత వంతు మరికొంత మంది పార్టీ నేతలు రాజీనామాకు లైన్‌లో ఉన్నారంటున్నారు. పార్టీని వీడే వారిలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరిలో ప్రస్తుతానికి జ్యోతుల పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా తోట మాత్రం ఇటీవల కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. త్రిమూర్తులు పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. ఒకరొకరుగా జిల్లా టీడీపీలో ముఖ్యులు త్వరలో రాజీనామా బాట పట్టేలా కనిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement