tota trimurtulu
-
త్రిమూర్తులు పార్టిలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం
-
వైఎస్ జగన్‌తో కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తాం
-
వైఎస్సార్సీపీలో చేరిన తోట త్రిమూర్తులు
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైఎస్సార్సీపీలో చేరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నేతను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాపుల తరుపున మాట్లాడలేదని, ఆయన అభిప్రాయం మాత్రమే అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం.. టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ‘చంద్రబాబుకో దండం’ అంటూ గుడ్‌బై చెప్పేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం, వైఎస్సార్సీపీలో చేరడం జిల్లాలో టీడీపీని ఓ కుదుపు కుదిపింది. చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు గుడ్‌బై చెప్పేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై మాట్లాడటం అనవసరం సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. తోట త్రిమూర్తులు వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ‘అన్ని సామాజిక వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు, కాబట్టే అన్ని వర్గాల నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఎల్లో మీడియాకు తప్ప అన్ని వర్గాల ప్రజలకు జగన్ పాలన ఎంతో బాగా నచ్చింది. వంద రోజుల్లో సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. అన్ని వ్యవస్థలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి. అవగాహన లేని వ్యక్తి. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడటం అనవసరం’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. త్రిమూర్తులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తామని పేర్కొన్నారు. టీడీపీ వ్యాపార సంస్థ: ఆమంచి కృష్ణ మోహన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కాపులే కాదు అన్ని సామాజిక వర్గాలు వైస్సార్సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సామాజిక న్యాయం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. సిగ్గులేకుండా చంద్రబాబు తన పార్టీ వాళ్ళను బీజేపీలోకి పంపుతున్నారు. చంద్రబాబు వెనుక ఉన్న వాళ్లు ఉత్తుత్తి నాయకులే. మేము దేనికి ఆశపడి పార్టీలో చేరలేదు. టీడీపీ అనేది అక్రమ వ్యాపార సంస్థ. -
బాబూ.. గుడ్‌బై..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హామీల మీద హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను నమ్మించి, మోసం చేసిన పాపానికి.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంతటి పరాభవం ఎదురైనా.. ఏమాత్రం ఆత్మవిమర్శ లేకపోగా.. మితిమీరిన అహంకారంతో అధినాయకత్వం.. ముఖ్యంగా చంద్రబాబు, కొందరు నేతలు మోనార్క్‌ల్లా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ‘చంద్రబాబుకో దండం’ అంటూ గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం.. కునుకుతీస్తున్న నక్క మీద తాటిపండు పడిన చందాన.. టీడీపీని ఓ కుదుపు కుదిపింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు తమ అనుచరులతో గుడ్‌బై చెప్పేస్తున్నారు. అధిష్టానం ఒంటెత్తు పోకడలతోనే పార్టీకి ఈ దుర్గతి పట్టిందని, అయినప్పటికీ కళ్లు తెరవకపోగా, నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన ఒకరిద్దరు నాయకుల మాటలు నమ్మి చంద్రబాబు పార్టీ పుట్టి ముంచేస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని బలంగా నమ్ముతూ, ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల మెట్ట ప్రాంతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ వరుపుల జోగిరాజు (రాజా) టీడీపీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన వీడాక ఆ నియోజవకర్గానికి ఇన్చార్జిగా ఇంతవరకూ ఎవ్వరినీ నియమించుకోలేని దుస్థితిలో టీడీపీ ఉంది. ఇదిలా ఉండగా ఒక బలమైన సామాజికవర్గంలో పట్టున్న నాయకుడిగా పేరున్న రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి శుక్రవారం గుడ్‌బై చెప్పేశారు. ఆయన వెంట నియోజకవర్గంలోని ఆ పార్టీ ముఖ్య నాయకులందరూ టీడీపీకి రాజీనామా చేశారు. తోటతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ గోపాల్‌బాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వట్టికూటి సుబ్రహ్మణ్యం (అబ్బు), చెరుకూరి విశ్వేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు యాళ్ల సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు అల్లూరి దొరబాబు, కొండా పోతురాజు, భీమారావు, పదిమంది మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు.. ఇలా దాదాపు ఆ పార్టీ నాయకులందరూ టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఒక రకంగా రామచంద్రపురంలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తీరుతోనే.. తన రాజీనామాకు చంద్రబాబు వ్యవహార శైలే కారణమని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. చంద్రబాబు ఇటీవల కాకినాడలో నిర్వహించిన పార్టీ జిల్లా సమీక్షకు ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయన రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో ఉన్న తన సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో కాకినాడలో భేటీ అయినప్పుడే చంద్రబాబు తీరుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యులు.. సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహనరావుతో పాటు టీజీ వెంకటేశ్ టీడీపీ నుంచి కమళ దళంలో చేరడం వెనుక చంద్రబాబు ప్రోత్సాహం ఉందని నాడు బహిరంగంగానే చెప్పారు. అదే విషయాన్ని తన రాజీనామా సందర్భంగా త్రిమూర్తులు పునరుద్ఘాటించడం గమనార్హం. జిల్లాలో పట్టు లేని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలకు విలువనిచ్చి.. క్రియాశీలకంగా పని చేస్తున్న నేతలను చంద్రబాబు దూరం చేసుకుంటున్నారని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. అంతమంది బీజేపీకి వెళ్లిపోతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదన్నది జవాబు లేని ప్రశ్నగానే మిగులుతోంది. దీనిపై టీడీపీ నేతలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉందని త్రిమూర్తులు అన్నారు. పాతికేళ్ల రాజకీయ జీవితంలో 17 ఏళ్లపాటు టీడీపీలోనే ఉన్నా.. తనకు చంద్రబాబు కనీస గౌరవం ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. జొన్నాడ – యానాం ఏటిగట్టు రహదారిని రూ.175 కోట్లతో 40 అడుగులకు విస్తరించే పనులకు 2016లో ప్రతిపాదనలు ఇస్తే జీవో ఇచ్చి తరువాత పట్టించుకోకుండా అవమానించారని, ఇది కూడా తన రాజీనామాకు కారణమని చెప్పారు. కాగా తోట త్రిమూర్తులు తాజా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణు చేతిలో ఓటమి చెందిన విషయం తెలిసిందే. భవిత ప్రశ్నార్థకం రానున్న కాలంలో పార్టీకి మరింత గడ్డు పరిస్థితిని తప్పదని టీడీపీ నేతలే విశ్లేషిస్తున్నారు. వరుస రాజీనామాలకు పూర్తిగా చంద్రబాబుతో పాటు జిల్లాలోని ఇద్దరు మాజీ మంత్రుల తీరే కారణమని దుయ్యబడుతున్నారు. -
టీడీపీకి ‘రాజా’నామా.. ‘తోట’దీ అదే బాట
సాక్షి, రాజమహేంద్రవరం : ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ’ చందంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 19 స్థానాలకు 14 స్థానాలు, మూడు పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన టీడీపీ ఐదేళ్లు తిరిగేసరికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి గత ప్రాభవాన్ని కోల్పోయింది. మూడు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనానికి ఆ పార్టీ కోటలు కుప్పకూలిపోయాయి. జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ సింగిల్ డిజిట్‌కే అంటే నాలుగు స్థానాలకే పరిమితమైంది. జిల్లాలో మూడు పార్లమెంటు స్థానాల్లో బోణీ కూడా చేయలేక చతికిలపడింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ పార్టీ ప్రణాళికా యుతంగా ముందడుగు వేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌మెహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు జేజేలు పలుకుతుండడంతో టీడీపీ నేతల్లో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో కొనసాగితే భవిత ఉండదనే అభిప్రాయం ప్రైవేటు సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. రెండు నెలల కిందట కాకినాడలో ఆ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధ్వర్యంలో భేటీ కావడం తెలిసిందే. నడి సముద్రంలో మునిగిపోయే నావలాంటి టీడీపీలో ఉండటం కంటే మరో మార్గం చూసుకోవాలనే యోచనలోనే దాదాపు టీడీపీ నేతలంతా ఉన్నారు. అలాఅని బయటపడితే ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ప్రారంభం... ఇప్పటికే కోనసీమలో పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీకి రాజీనామా చేసి కమల దళంలో చేరిపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నారాయణమూర్తి తోపాటు పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లారు. తాజాగా గురువారం మెట్ట ప్రాంతంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. నిన్నమొన్నటి వరకూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా ఉన్న వరుపుల జోగిరాజు (రాజా) టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. రాజా ఆ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. పార్టీ అధిష్టానం వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధించి పదవులకు రాజీనామా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీ అధిష్టానం ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం విషయంలో చివరి నిమిషం వరకూ ఇవ్వకుండా మానసికంగా చాలా వేధింపులకు గురిచేసిందని రాజీనామా సందర్భంగా రాజా అధిష్టానం తీరును ఎండగట్టారు. ఓటమి చెందిన అనంతరమే పార్టీని వీడాలనుకున్నప్పటికీ వెంటనే బయటకు వచ్చేస్తే టిక్కెట్టు ఇచ్చినా వదిలి పోయారనే అపప్రథ వస్తుందని ఇంతకాలం వేచిచూశానని చెప్పుకున్నారు. రాజా టీడీపీకి రాజీనామా చేయడంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. రాజా తరువాత వంతు మరికొంత మంది పార్టీ నేతలు రాజీనామాకు లైన్లో ఉన్నారంటున్నారు. పార్టీని వీడే వారిలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరిలో ప్రస్తుతానికి జ్యోతుల పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా తోట మాత్రం ఇటీవల కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. త్రిమూర్తులు పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. ఒకరొకరుగా జిల్లా టీడీపీలో ముఖ్యులు త్వరలో రాజీనామా బాట పట్టేలా కనిపిస్తున్నారు. -
టీడీపీ కాపు నేతల రహస్య భేటీ
-
టీడీపీ కాపు నేతల రహస్య భేటీ
సాక్షి, కాకినాడ: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తోసిపుచ్చారు. తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీలోకి వెళుతున్నామన్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా టీడీపీకి చెందిన కాపు నాయకులంతా గురువారం కాకినాడలోని ఓ ప్రయివేట్ హోటల్లో సమావేశం అయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మీసాల గీత, వరుపుల రాజా, బొండా ఉమా, బడేటి బుజ్జి, పంచకర్ల రమేష్ బాబు, కదిరి బాబూరావు, ఈలి నాని, జ్యోతుల నెహ్రు, కేఏ నాయుడు, వేదవ్యాస్, చెంగల్రాయుడు, బండారు మాధవ నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 20మంది మాజీ ఎమ్మెల్యేలు... పార్టీలో తమ భవిష్యత్, రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..’ టీడీపీకి చెందిన కాపు నాయకులంతా సమావేశం పెట్టుకున్నాం. ఒక సామాజిక వర్గానికి చెందిన సమావేశం కావడంతో హోటల్లో భేటీ జరిగింది. లేకుంటే పార్టీ కార్యాలయంలోనే మీటింగ్ పెట్టుకుని ఉండేవాళ్లం. సామాజిక వర్గ సమస్యలపై మాట్లాడుకోవడానికే ఈ భేటీ నిర్వహించాం. అంతేకాకుండా ఓటమిపై సమీక్ష కూడా జరుపుకున్నాం.’ అని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు భేటీ కావడం వెనుక ...పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు సమాచారం. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేముందే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారని, ఆ స్క్రిప్ట్ ప్రకారమే టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అయిదుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి బీజేపీలో చేరనున్నారు. వీరంతా 15 రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు టీడీపీ కాపు నేతలతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా టచ్‌లో ఉన్నారని భోగట్టా. అయితే ఇదంతా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: టీడీపీలో భారీ సంక్షోభం! -
అందుకే ఆమె కాళ్లు మొక్కా: పవన్ కల్యాణ్
సాక్షి, అమలాపురం : వీధికో గూండా ఉండే ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రంలో దళిత మహిళ అయిన మాయావతిని అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, అందుకే ఆమె కాళ్లు మొక్కినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. సోమవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత తోట త్రిమూర్తులుపై విరుచుకుపడ్డారు. ‘తోట త్రిమూర్తులను నేను ఎప్పుడూ పార్టీలోకి రమ్మని అడగలేదు. 2014లో మేము మద్దతు ఇస్తేనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తులను చెంచాలు అంటారు. త్రిమూర్తులు జాతి గౌరవం కాపాడు. నేను నా అన్న చిరంజీవి మాటే వినను. నీ మాట ఎలా వింటాను. తెలుగుదేశం నాయకులు బానిస బతులుకు బ్రతుకుతున్నారు. టీడీపీ, జనసేన ఒకటే అంటూ అవగాహన లేని మాటలు మాట్లాడకండి’ అంటూ ధ్వజమెత్తారు. కాగా ఏపీలో బీఎస్పీతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చిన సందర్భంగా పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కారు. -
‘కోర్టు చెప్పినా.. రోజాను రానివ్వం’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ తీర్పులో జోక్యం చేసుకునే అధికారమే న్యాయవ్యవస్థలకు లేదని వారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ, అవసరమైతే రూల్స్‌ను కూడా మార్చే అధికారం తమకు ఉందని, దాన్ని కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. గతంలో లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కొంత మంది ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు, న్యాయస్థానం అభ్యంతరం చెప్పిందని, ఆ సందర్భంగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై చర్చించారని తెలిపారు. రోజా విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినా సభలో చర్చించిన తర్వాత ఆమె వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వాళ్ళు ధర్నాలు చేసినా న్యాయం జరగదు రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆందోళనలు చేసినా ఎంతమాత్రం న్యాయం జరగదని టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు అన్నారు. రోజాను చూస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని, ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానం రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మాత్రమే ఆదేశించిందని, ఆమెను అసెంబ్లీలోకి అనుమతించమని ఎక్కడ చెప్పలేదని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అది మా ఏకగ్రీవ నిర్ణయం రోజాను సస్పెండ్ చేయాలన్నది శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని, న్యాయస్థానం సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశించినా, దీనికి అసెంబ్లీ ఒప్పుకోవాల్సి ఉంటుందని అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చెప్పారు. దేశంలో ఇలాగే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయని చెప్పిన ఆయన... ఎథిక్స్ కమిటీ నిర్ణయం లేకుండానే జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. కారణాలు ఏవైనా రోజా విషయంలో సభలో చర్చించాల్సిందే అన్నారు. -
త్రిమూర్తీభవించిన జులుం
* బీసీ, ఎస్సీలపై కక్ష కట్టిన మాజీ ఎమ్మెల్యే తోట * చిరుద్యోగులను సైతం బదిలీ చేయించిన నిర్వాకం * ఇందిరమ్మ రుణాలకు మోకాలడ్డిన అధికారమదం * వెల్లలో 22 కుటుంబాల్ని రోడ్డు పాల్జేసిన దురాగతం రామచంద్రపురం, న్యూస్‌లైన్ : ఇప్పుడు మొట్టిన చేతులతోనే.. తర్వాత మొక్కినంత మాత్రాన- నొప్పీ, తలబొప్పీ దూరమవుతాయనుకుంటే అవివేకమే. ఇప్పుడు కన్నెర్రజేసి బెదిరించి.. ఆనక కంటిని రెప్పలా చూసుకుంటానన్నంత మాత్రాన.. తప్పిదాలన్నీ ఒప్పు అయిపోతాయనుకుంటే భ్రాంతి మాత్రమే. మనది ప్రజాస్వామ్యమన్న విషయాన్నే విస్మరించి, తనకు గులాం గిరీ చేయని వారందరిపై జులుం చలాయించడమే రివాజుగా మారిన నాయకుడు తాజా మాజీ ఎమ్మెల్యే, రామచంద్రపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు. ప్రస్తుతం ఎన్నికల పబ్బం గడుపుకొనేందుకు ఆయన వివిధ వర్గాలపై టన్నుల కొద్దీ అభిమానం ప్రదర్శిస్తున్నారు. గతంలో తాను కక్ష గట్టిన వారిపైనే ఎక్కడ లేని ఆపేక్ష ఒలకబోస్తున్నారు. అయితే ఇదంతా.. పులి తెల్లరంగు పులుముకుని ఆవులా నటించే చందమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తోట.. ఎన్నికలకు ముందు ఏ వర్గాలనైతే ఇబ్బందుల పాల్జేశారో ఆ వర్గాలన్నింటి పైనా ఇప్పుడు అమితమైన ప్రేమ ప్రదర్శిస్తున్నారు. వారితో సమావేశాలు నిర్వహిస్తూ ప్రలోభాల పాచిక విసురుతున్నారు. అయితే ఉప ఎన్నికలో గెలిచి, 23 నెలలుఅధికారంలో ఉండగా తోట శెట్టిబలిజలతోపాటు ఇతర బీసీలు, ఎస్సీలపై చేసిన కక్ష సాధింపులు మర్చిపోలేదని ఆ వర్గాల నాయకులు అంటున్నారు. ఉప ఎన్నికకు ముందు మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ను నూజివీడు, వర్క్ ఇన్స్పెక్టర్ను మచిలీపట్నం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ను కృష్టా జిల్లాకు, చివరకు మంచినీటి సరఫరా విభాగంలో పనిచేసే వాటర్ బాయ్‌ను నూజివీడుకు కేవలం కక్షతోనే అడ్డగోలుగా బదిలీ చేయించడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న ఒక ఉద్యోగిని బదిలీ చేయించగా.. ఆనక చికిత్స పొందుతూ మృతి చెందిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా తోట.. కేవలం తనకు అనుకూలంగా లేరనే ఏకైక కారణంతో నియోజకవర్గంలోని శెట్టిబలిజ గ్రామాల్లో పలువురు నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి రుణాలను ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాక.. దంగేరు, భట్లపాలిక గ్రామాల్లో సంబంధిత సామాజికవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా ఇప్పటివరకు బిల్లులు మంజూరు కానివ్వకుండా ఎమ్మెల్యే అనుచరులు కక్షసాధింపులకు పాల్పడ్డారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో 2007 నుంచి వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న బీసీ, ఎస్సీ కాంట్రాక్టు ఉద్యోగులు గత ఏడాది నుంచి రోడ్డున పడ్డారు. ఎక్స్‌రే, ఫార్మసిస్టు, సెక్యూరిటీ, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ అసిస్టెంట్, స్కానింగ్, అటెండర్ వంటి పోస్టుల్లో ఉన్న 14 మంది ఎస్సీ, బీసీ వర్గాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తొలగించారని అంటున్నారు. కపటప్రేమతో తప్పులు ఒప్పులు కావు.. వెల్లలో బలహీనవర్గాలకు చెందిన వారి ఇళ్లను పోలీసులు, రెవెన్యూ అధికారులను వినియోగించి కూల్పించిన విషయం నిజం కాదా అని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి పోలీసు బలగాలను పంపించి పొక్లెయిన్‌తో ఇళ్లను కూల్చివేసి, 22 కుటుంబాలను రోడ్డు పాలు చేసిన విషయం ఎలా మరిచిపోగలమంటున్నారు. ద్రాక్షారామలో గతంలో బీసీ, ఎస్సీలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయించటానికి ప్రయత్నించిన నిర్వాకమూ తోటదేనంటున్నారు. ద్రాక్షారామలో మండాలమ్మపేట వద్ద ఎస్సీలకు చెందిన భూములను వారికి తిరిగి అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చినా.. తోట అధికారులను అడ్డం పెట్టుకుని అప్పగించలేదని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఇంత సంతోషం ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో శెట్టిబలిజలకు చెందిన రేషన్ డిపోలపై తోట.. అధికారులతో దాడులు చేయించి కేసుల్లో ఇరికించారని, వారిని తప్పించి తన అనుచరులకు ఇప్పించుకున్నారని, షాపులు కోల్పోయిన డీలర్లు కోర్టుల్ని ఆశ్రయించినా.. తోట అధికారం అడ్డం పెట్టుకుని షాపులు రాకుండా చేశారని బీసీ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. తమ వర్గీయులను పుండులా సలిపే.. ఆ దురాగతాలను.. ఇప్పుడు కపటప్రేమ ఒలకబోసి కప్పిపుచ్చలేరని ఆక్షేపిస్తున్నారు. నియోజకవర్గంలో బీసీలందరూ తన వెంటే ఉన్నారని తోట.. తప్పుడు ప్రచారం చేసుకుంటున్నా.. తమ వర్గీయులు తగిన బుద్ధి చెప్పి తీరతారని స్పష్టం చేస్తున్నారు. -
అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే తప్పుకుంటా:పిల్లి సుభాష్ చంద్రబోస్
తోటకు బోస్ సవాల్ ద్రాక్షారామ, న్యూస్‌లైన్ : ‘రామచంద్రపురం నియోజకవర్గంలో నేను ఎనిమిదేళ్ల కాలంలో అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే అసెంబ్లీ ఎన్నికల పోటీనుంచి తప్పుకుంటా.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు సవాల్ విసిరారు. ఆయన బుధవారం రాత్రి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌తో కలసి ద్రాక్షారామలో ప్రచారం నిర్వహించారు. తాను చేసిన పనులను తోట త్రిమూర్తులు ఖాతాలో వేసుకోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ‘ఎనిమిదేళ్ల కాలంలో నేను చేసిన అభివృద్ధి త్రిమూర్తులు ఏడాదిన్నర కాలంలోనే చేసినని చెప్పుకుంటున్నారు. ఆయన దాన్ని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అన్నారు. ఇసుక మాఫియా, కుల రాజకీయాలను రెచ్చగొట్టడం సంస్కారం కాదని ఆయన తోటకు హితవు పలికారు. రామచంద్రపురం పట్టణంలోని మెయిన్ రోడ్డు, రాజీవ్ గృహకల్ప, బైపాస్ రోడ్డు, జూనియర్ కాలేజీ అభివృద్ధి, కాలేజీ గ్రౌండు అభివృద్ధి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ‘నేను కట్టించిన కమ్యూనిటీ హాళ్లు, వేయించిన సీసీ రోడ్లను తాను చేసిన అభివృద్ధిగా త్రిమూర్తులు చెప్పుకుంటున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను ఆయన మానుకోవాలి’ అని హెచ్చరించారు. లేకుంటే ఆగ్రహించిన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కొత్తూరులో పేదవారి కోసం 33 ఎకరాలను పట్టాలుగా ఇస్తే అవి దొంగ పట్టాలంటూ ప్రచారం చే స్తున్న నీకు అక్షరం జ్ఞానం ఉందా అని బోస్ తోటను ప్రశ్నించారు. ‘నకిలీలు ఏవో ఒరిజినల్ పట్టాలు ఏవో నీకు తెలియదు. నేను చేసిన అభివృద్ధి నాది కాదు అని కాని, నేను పంపిణీ చేసిన పట్టాలు నకిలీవి అని నువ్వు నిరూపిస్తే నేను నీకు బానిసగా ఉంటాను’ అని ఆయన అన్నారు. అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగించాలని చూస్తే వారు తగిన గుణపాఠం చెబుతారన్నారు.