‘కోర్టు చెప్పినా.. రోజాను రానివ్వం’ | TDP MLA's Comments on MLA Roja Issue | Sakshi
Sakshi News home page

‘కోర్టు చెప్పినా.. రోజాను రానివ్వం’

Published Fri, Mar 18 2016 4:12 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

‘కోర్టు చెప్పినా.. రోజాను రానివ్వం’ - Sakshi

‘కోర్టు చెప్పినా.. రోజాను రానివ్వం’

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ తీర్పులో జోక్యం చేసుకునే అధికారమే న్యాయవ్యవస్థలకు లేదని వారన్నారు.

 

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ, అవసరమైతే రూల్స్‌ను కూడా మార్చే అధికారం తమకు ఉందని, దాన్ని కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. గతంలో లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కొంత మంది ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు, న్యాయస్థానం అభ్యంతరం చెప్పిందని, ఆ సందర్భంగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై చర్చించారని తెలిపారు. రోజా విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినా సభలో చర్చించిన తర్వాత ఆమె వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.


వాళ్ళు ధర్నాలు చేసినా న్యాయం జరగదు
రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆందోళనలు చేసినా ఎంతమాత్రం న్యాయం జరగదని టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు అన్నారు. రోజాను చూస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని, ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానం రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మాత్రమే ఆదేశించిందని, ఆమెను అసెంబ్లీలోకి అనుమతించమని ఎక్కడ చెప్పలేదని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.


అది మా ఏకగ్రీవ నిర్ణయం
రోజాను సస్పెండ్ చేయాలన్నది శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని, న్యాయస్థానం సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశించినా, దీనికి అసెంబ్లీ ఒప్పుకోవాల్సి ఉంటుందని అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చెప్పారు. దేశంలో ఇలాగే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయని చెప్పిన ఆయన... ఎథిక్స్ కమిటీ నిర్ణయం లేకుండానే జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. కారణాలు ఏవైనా రోజా విషయంలో సభలో చర్చించాల్సిందే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement