ఆడపిల్లలను కనడమే పాపమా? | MLA Roja fires on CM Chandrababu about Dachepalle girl issue | Sakshi
Sakshi News home page

ఆడపిల్లలను కనడమే పాపమా?

Published Sat, May 5 2018 5:08 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

MLA Roja fires on CM Chandrababu about Dachepalle girl issue - Sakshi

సాక్షి, గుంటూరు: ఆడపిల్లలను కనడమే పాపమా.. అన్నట్టు దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులు దీనంగా చూస్తున్న చూపులు అందరి హృదయాలను కలచివేశాయని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై గుంటూరు జీజీహెచ్‌ గైనకాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న బాలికను శుక్రవారం రోజా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాలికపై 55 ఏళ్ల మానవ మృగం చేసిన దాష్టీకం చూస్తుంటే కడుపు తరుక్కుపోయిందని అన్నారు. మనం అడవిలో ఉన్నామా.. ప్రజలు ఉండే సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. బాధితురాలు మగవాళ్లను చూస్తేనే భయంతో వణికిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తునిలో టీడీపీ ఎంపీటీసీ సంధ్య భర్త ఒక టీషాపు యజమాని కూతురిపై అత్యాచారయత్నం చేయడం దారుణమన్నారు. 

చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి 
‘‘రాష్ట్రంలో 40 రోజుల వ్యవధిలో 45 మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి. చంద్రబాబు కంటే చేతగాని దద్దమ్మ సీఎం ఏ రాష్ట్రంలో అయినా ఉంటారా? చంద్రబాబు పరిపాలన వల్లే రాష్ట్రంలో నేరస్తులకు ధైర్యం వస్తోంది. రిషితేశ్వరి మృతి చెందిన వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించి ఉంటే ఈరోజు ఇలా జరిగి ఉండేదే కాదు. మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు రాజీనామా చేయాలి’’ అని రోజా డిమాండ్‌ చేశారు. 

ప్రతి ఆడపిల్లకు జగన్‌ భరోసా 
‘‘డమ్మీ హోం మంత్రిని పెట్టుకుని చంద్రబాబు, నారా లోకేశ్‌ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబుపై పోలీసులంతా తిరగబడాలి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మహిళల గురించి తప్పుడు ఆలోచనలు చేస్తే ఉరికంబం ఎక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఆడపిల్లకు సొంత అన్న సీఎంగా ఉన్నాడని భరోసా కల్పించేలా జగన్‌ ప్రభుత్వం ఉండబోతోంది’’ అని రోజా తెలిపారు. బాధిత బాలికను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేలు షేక్‌ మహ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, నేతలు లేళ్ల అప్పిరెడ్డి, కత్తెర హెన్రీ క్రిస్టినా తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement