సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాభిమానంతో గెలిచే దారిలేక దొడ్డిదారిన కోట్లు కుమ్మరించి ఎన్నికల్లో విజయం సాధించాలన్న టీడీపీ రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ బండారం బయటపడింది. రూ.2 కోట్ల నగదుతో ఆయన అనుచురులు హైదరాబాద్ హైటెక్ రైల్వేస్టేషన్ వద్ద పట్టుబడిన వ్యవహారం జిల్లాలో కలకకలం రేపుతోంది. మురళీమోహన్ కోడలు రూప రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే.
గడచిన ఐదేళ్లలో ప్రజాభిమానం దక్కించుకోలేకపోయిన మురళీమోహన్ ఎన్నికలకు దూరంగా ఉండి కోడలికి సీటు ఇప్పించుకున్నారు. టిక్కెట్టు ఖరారైన దగ్గర నుంచి ఎక్కడకు వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో కోడలిని గెలిపించుకునేందుకు డబ్బు కుమ్మరించి ఓట్లు కొని, గెలుపొందాలని పక్కా స్కెచ్ వేశారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున నగదు తరలించేందుకు ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో బండారం బయటపడింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో సొమ్మును జిల్లాకు తరలించేశారన్న చర్చ రాజమహేంద్రవరం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కోట్లు కుమ్మరించి ఓట్లు కొనాలన్న ఆయన ప్రయత్నాన్ని చూసి జనం ఛీత్కరిస్తున్నారు.
చదవండి....(టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసు)
పట్టుబడిందిలా..
ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ హైటెక్ రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిమ్మలూరి శ్రీహరి, పండరిల బ్యాగ్‌లను పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల నగదు పోలీసులకు దొరికింది. విచారణలో మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థ ఉద్యోగులు జగన్‌మోహన్, ధర్మరాజు ఈ సొమ్ము తమకు ఇచ్చినట్టు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ సొమ్ము కోసం యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్‌లు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ఎదురుచూస్తారని తెలిపారు.
హైటెక్ రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్ చేరుకుని, అక్కడి నుంచి గరీబ్‌రథ్‌లో ఈ సొమ్మును తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. రాజమహేంద్రవరంలో ఈ నగదును ఎంపీ మురళీమోహన్ కోడలు రూపకు అందజేసేందుకు తీసుకువెళ్తున్నట్టు నిందితులు అంగీకరించారని తెలిసింది. పట్టుబడిన రూ.2 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఆరుగురిపై ఐపీసీ 171(బి), 171(సి), 171(ఇ), 171(ఎఫ్) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసు రికార్డుల్లో నమోదైనట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment