Murali Mohan Maganti
-
ఆ సీన్ చూసి కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారు: మురళీ మోహన్
Murali Mohan Interesting Comments On Krishna: సూపర్ స్టార్ కృష్ణపై సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణలాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదంటూ ప్రశంసలు కురిపించారు. కాగా నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిచన ఆయన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఇద్దరం ఇంటర్లో క్లాస్‌మెట్స్, ఒకే బెంచ్‌లో కూర్చునే వాళ్లమంటూ ఆసక్తికర విషయం చెప్పారు. చదవండి: బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్ అలాగే ‘ఇంటర్ ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఇద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యాం. అయితే కాలేజీ మొత్తంలో కృష్ణ చాలా అందగాడు. అందరు ఆయన వెంట పడేవారు. ఇంటర్ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన తేనె మనసులు మూవీతో హీరోగా మారారు. ఆ తర్వాత అనతి కాలంలోనే ఆయన సూపర్ స్టార్‌గా ఎదిగిన విషయం మీ అందరికి తెలిసిందే’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం తాను కూడా కొద్ది రోజుల్లోనే సినిమాల్లోకి వచ్చానని, హీరోగా కొన్ని సినిమాలు చేశానన్నారు. ఆ తర్వాత నటుడి నుంచి నిర్మాతగా మారానంటూ వారసుడి మూవీ సమయంలో చోటు చేసుకున్న ఓ చేదు సంఘటన గురించి చెప్పారు. చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ ‘కృష్ణ-నాగార్జున కాంబినేషన్లో వారసుడు చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమాలో నాగార్జున ఓ సీన్లో తండ్రి కృష్ణను నిలదీస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్ణణ తారాస్థాయికి చేరుతుంది. ఇందులో కృష్ణను నాగార్జున ఎదురించడం, నువ్వెంత అంటూ ఆయనతో అమర్యాదగా వ్యవహరిస్తాడు. అది చూసిన కృష్ణ ఫ్యాన్స్ మా ఇంటి మీదకు గొడవకు వచ్చారు. కొంతమంది అయితే ఏకంగా నన్ను కొట్టడానికి వచ్చారు’ అని అన్నారు. అంతేకాదు కృష్ణ గారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడని, ఇది ఆయనను అగౌరవ పరచడమే అంటూ తనతో ఘర్షణ పడ్డారన్నారు. ఆ సీన్‌ని సినిమా నుంచి తొలగించాలని, లేదంటే సీన్ మార్చమంటూ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారని ఆయన అన్నారు. చదవండి: ‘కేజీఎఫ్’ హీరో యశ్‌పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ‘‘అది సినిమా.. కథను, పాత్రను బట్టి చూడండి. పర్సనల్‌గా తీసుకోవద్దు’ అని నేను నచ్చచెప్పినా వినలేదు. దీన్ని బట్టి అప్పడు నాకు అర్థమైంది ఆయనకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని. ఇక కృష్ణ గారు బయట కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన నిర్మాతల హీరో అని అనొచ్చు. ఒక నిర్మాత సినిమా ప్లాప్‌తో డబ్బులు పోగొట్టుకుంటే.. ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి .. తనతో సినిమా చేస్తానని చెప్పేవారు. నిర్మాతలు డబ్బులు లేవని చెప్పినా అవన్నీ తరువాత మీరు సినిమా మొదలు పెట్టండి అని భరోసా ఇచ్చేవారు. అలాంటి గొప్ప మనిషిని నేను ఇంతవరకు చూడాలేదు” అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. కాగా తెలుగులో మురళీమోహన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కృష్ణ, శోభన్ బాబు వంటివారు అగ్ర హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన మురళీమోహన్. తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
అమ్మ! మురళీమోహనూ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాభిమానంతో గెలిచే దారిలేక దొడ్డిదారిన కోట్లు కుమ్మరించి ఎన్నికల్లో విజయం సాధించాలన్న టీడీపీ రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ బండారం బయటపడింది. రూ.2 కోట్ల నగదుతో ఆయన అనుచురులు హైదరాబాద్ హైటెక్ రైల్వేస్టేషన్ వద్ద పట్టుబడిన వ్యవహారం జిల్లాలో కలకకలం రేపుతోంది. మురళీమోహన్ కోడలు రూప రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. గడచిన ఐదేళ్లలో ప్రజాభిమానం దక్కించుకోలేకపోయిన మురళీమోహన్ ఎన్నికలకు దూరంగా ఉండి కోడలికి సీటు ఇప్పించుకున్నారు. టిక్కెట్టు ఖరారైన దగ్గర నుంచి ఎక్కడకు వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో కోడలిని గెలిపించుకునేందుకు డబ్బు కుమ్మరించి ఓట్లు కొని, గెలుపొందాలని పక్కా స్కెచ్ వేశారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున నగదు తరలించేందుకు ఆయన చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో బండారం బయటపడింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో సొమ్మును జిల్లాకు తరలించేశారన్న చర్చ రాజమహేంద్రవరం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కోట్లు కుమ్మరించి ఓట్లు కొనాలన్న ఆయన ప్రయత్నాన్ని చూసి జనం ఛీత్కరిస్తున్నారు. చదవండి....(టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసు) పట్టుబడిందిలా.. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ హైటెక్ రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిమ్మలూరి శ్రీహరి, పండరిల బ్యాగ్‌లను పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల నగదు పోలీసులకు దొరికింది. విచారణలో మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థ ఉద్యోగులు జగన్మోహన్, ధర్మరాజు ఈ సొమ్ము తమకు ఇచ్చినట్టు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ సొమ్ము కోసం యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్‌లు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో ఎదురుచూస్తారని తెలిపారు. హైటెక్ రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్ చేరుకుని, అక్కడి నుంచి గరీబ్‌రథ్‌లో ఈ సొమ్మును తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. రాజమహేంద్రవరంలో ఈ నగదును ఎంపీ మురళీమోహన్ కోడలు రూపకు అందజేసేందుకు తీసుకువెళ్తున్నట్టు నిందితులు అంగీకరించారని తెలిసింది. పట్టుబడిన రూ.2 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఆరుగురిపై ఐపీసీ 171(బి), 171(సి), 171(ఇ), 171(ఎఫ్) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసు రికార్డుల్లో నమోదైనట్టు సమాచారం. -
అధికార పార్టీలో కొలిక్కిరాని సీట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేల అవినీతి పై కార్యకర్తలు ధ్వజమెత్తుతుండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో అధిష్ఠానం ఉంది. వారికి టిక్కెట్లు ఇస్తే తామే ఓడిస్తామని చెబుతుండటంతో ఏం పాలుపోవడం లేదు. మరోవైపు జిల్లాలోని మూడు ఎస్సీ, ఒక ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థుల కోసం వెదుకులాట మొదలుపెట్టింది. రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను మార్చితేగాని ఒప్పుకోమంటూ నియోజకవర్గ నేతలు పట్టుపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం సిట్టింగ్‌ల వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి ప్రకటించకపోయినా తమకే సీటు దక్కిందంటూ సిట్టింగ్‌లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేయకపోవడానికి ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలే కారణం. చింతలపూడి నియోజకవర్గంలో మాజీ మంత్రి పీతల సుజాతకు సీటు ఖరారు చేయలేదు. ఇక్కడ ఏలూరు ఎంపీ మాగంటి బాబు పీతల సుజాతకు సీటు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారు. తన మాట వినని సుజాతకు ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వకూడదని ఎంపీ సామాజిక వర్గం పట్టుపడుతోంది. గోపాలపురం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఖరారు కాకపోవడం వెనుక జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఉన్నారు. ఆయన తన అనుచరుడు వెంకటరాజుకు ఇప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఇవ్వకుండా బలమైన లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రి జవహర్‌కు చెందిన కొవ్వూరు సీటు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన అచ్చిబాబు వర్గం అడ్డుకోవడం, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వద్దే ఇరువర్గాలు బాహాబాహీకి తలపడటం తెలిసిందే. దీంతో జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లను ముఖ్యమంత్రి ఖరారు కాకుండా నిలిపివేశారు. ఉన్న ఏకైక ఎస్టీ నియోజకవర్గం పోలవరం విషయంలో కూడా అదే సామాజిక వర్గం నేతలు చక్రం తిప్పుతుండటంతో అక్కడ అభ్యర్థి ఎన్నిక కూడా పెండింగ్‌లో పెట్టారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతల సీట్లను దాదాపు ఖరారు చేసినా రిజర్వుడు సీట్లు ఖరారు చేయకపోవడం వివాదానికి దారితీస్తోంది. మరోవైపు ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కూడా వారికి తలనొప్పిగా మారింది. నర్సాపురం అభ్యర్థిగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీలో చేరడంతో అక్కడ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పోటీలోకి దింపాలని చూశారు. అయితే వారిద్దరు కూడా సుముఖత చూపకపోవడంతో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీ మోహన్ ఓటమి భయంతో పోటీ చేయడానికి ఇష్టపడని సంగతి తెలిసిందే. ఏలూరు స్థానాన్ని కూడా ఇంకా ఖరారు చేయలేదు. మాగంటి బాబును అసెంబ్లీకి పోటీ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నిడదవోలు నియోజకరవ్గంలో టీడీపీ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనని నేతలు పట్టుపడుతున్నారు. ఆయన స్థానంలో ఎవరికి సీటు ఇచ్చినా మద్దతు తెలియచేస్తామని కుందుల సత్యనారాయణ వర్గం చెబుతోంది. ఒకవైపు బూరుగుపల్లి శేషారావు తనకే సీటు వచ్చిందని చెబుతుండగా, కుందుల సత్యనారాయణ ప్రచారానికి శ్రీకారం చుట్టి అక్కడ తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. -
‘దేశం’లో.. మురళీ ‘ద్రోహం’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :సీట్ల సిగపట్లతో తెలుగుదేశం పార్టీ రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో మురళీమోహన్‌కు వివాదాలు తలెత్తాయి. అప్పట్లో తన ఓటమికి వారిద్దరూ పరోక్షంగా కారణమని ఆరోపిస్తూ.. ఆ కక్షతో.. మురళీమోహన్ ఈసారి తమ నాయకుల సీట్లకు ఎసరు పెట్టేందుకు యత్నిస్తున్నారని గోరంట్ల, నల్లమిల్లి అనుచరులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రి సిటీని పొత్తుల్లో బీజేపీకి విడిచిపెట్టే ఎత్తుగడలో మురళీమోహన్ వ్యూహాత్మకంగా పైచేయి సాధించారు. తన చేతికి మట్టి అంటకుండా గోరంట్లను సిటీ నుంచి తప్పించడంలో మురళీమోహన్ కృతకృత్యులయ్యారు. ఆయన రెండో టార్గెట్ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ఆయన తనయుడు రామకృష్ణారెడ్డి. ఇప్పుడు వారి వంతు వచ్చింది. ఇందులో భాగంగానే రామకృష్ణారెడ్డి సీటుకు పొగ పెట్టేందుకు.. అసలు పార్టీలోనే లేని రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు పడాల రామారెడ్డి భార్య సునీత పేరును మురళీమోహన్ ప్రతిపాదిస్తున్నారంటూ మూలారెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. సునీత పేరును పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి మురళీమోహన్ తీసుకువెళ్లిన విషయం బయటకు పొక్కింది. దీనిపై అనపర్తిలో రచ్చరచ్చ అవుతోంది. మురళీమోహన్ తీరును ఎండగడుతూ అనపర్తిలో టీడీపీ మండల అధ్యక్షుడు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు), సీనియర్ నాయకుడు సిరసపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలు సమావేశం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ మూలారెడ్డి, రామకృష్ణారెడ్డి ఆస్తులు అమ్ముకొని పార్టీ జెండా మోస్తుంటే, పార్టీ సభ్యత్వం కూడా లేని సునీత పేరును ఎలా ప్రతిపాదిస్తారంటూ వారు నిప్పులు చెరుగుతున్నారు. అవసరమైతే స్వతంత్ర పోరుకు కూడా సిద్ధపడి, మురళీమోహన్‌కు, టీడీపీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. కేవలం డబ్బు లేదన్న సాకుతో సీటు మార్చేసేందుకు ప్రతిపాదిస్తే గతంలో వచ్చిన ఓట్లు కూడా రాకుండా చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రెండేళ్ల క్రితమే రాజకీయాల నుంచి వైదొలగుతామని తండ్రీ కొడుకులు చెప్పినా మిన్నకున్న మురళీమోహన్.. ఇప్పుడు రామకృష్ణారెడ్డిని తప్పించేందుకు ఎత్తులు వేయడాన్ని వారు ప్రశ్నించారు. నిలకడలేని నాయకులను తెచ్చుకుని మురళీమోహన్ తప్పటడుగులు వేస్తే గత ఎన్నికల్లో ఫలితాలే పునరావృతమవుతాయన్న విషయాన్ని గుర్తించాలని వారు అంటున్నారు. తన చర్యల ద్వారా మురళీమోహన్ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణారెడ్డికి టిక్కెట్టు ఇవ్వకుంటే టీడీపీ రాజీనామాలు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో భాగంగా మార్చి 26న చంద్రబాబు అనపర్తి మండలం కుతుకులూరు వచ్చారు. ఆ సందర్భంగా అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికే అని బహిరంగా ప్రకటించారు. తీరా ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనకు బదులు సునీతకు టిక్కెట్టు ఇచ్చేందుకు మురళీమోహన్ ప్రయత్నించడం వెనుక గత ఎన్నికల నాటి విభేదాలే కారణమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చందన రమేష్ సీటుకు ఎసరు పెట్టడంపై ఎగసిన నిరసన సెగ.. మంగళవారం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబుకు తగిలింది. వీటితో పాటు జిల్లాలోని మరికొన్ని సీట్లపై కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య వివాదాలు రోడ్డెక్కుతుండగా, ఇప్పుడు కొత్తగా మురళీమోహన్ కారణంగా మరో వివాదం రాజుకుంది. ఈ వివాదాన్ని బాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.