సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేల అవినీతి పై కార్యకర్తలు ధ్వజమెత్తుతుండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో అధిష్ఠానం ఉంది. వారికి టిక్కెట్లు ఇస్తే తామే ఓడిస్తామని చెబుతుండటంతో ఏం పాలుపోవడం లేదు. మరోవైపు జిల్లాలోని మూడు ఎస్సీ, ఒక ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థుల కోసం వెదుకులాట మొదలుపెట్టింది.
రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను మార్చితేగాని ఒప్పుకోమంటూ నియోజకవర్గ నేతలు పట్టుపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం సిట్టింగ్‌ల వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి ప్రకటించకపోయినా తమకే సీటు దక్కిందంటూ సిట్టింగ్‌లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేయకపోవడానికి ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలే కారణం.
చింతలపూడి నియోజకవర్గంలో మాజీ మంత్రి పీతల సుజాతకు సీటు ఖరారు చేయలేదు. ఇక్కడ ఏలూరు ఎంపీ మాగంటి బాబు పీతల సుజాతకు సీటు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారు. తన మాట వినని సుజాతకు ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వకూడదని ఎంపీ సామాజిక వర్గం పట్టుపడుతోంది. గోపాలపురం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఖరారు కాకపోవడం వెనుక జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఉన్నారు. ఆయన తన అనుచరుడు వెంకటరాజుకు ఇప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఇవ్వకుండా బలమైన లాబీయింగ్ చేస్తున్నారు.
మంత్రి జవహర్‌కు చెందిన కొవ్వూరు సీటు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన అచ్చిబాబు వర్గం అడ్డుకోవడం, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వద్దే ఇరువర్గాలు బాహాబాహీకి తలపడటం తెలిసిందే. దీంతో జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లను ముఖ్యమంత్రి ఖరారు కాకుండా నిలిపివేశారు. ఉన్న ఏకైక ఎస్టీ నియోజకవర్గం పోలవరం విషయంలో కూడా అదే సామాజిక వర్గం నేతలు చక్రం తిప్పుతుండటంతో అక్కడ అభ్యర్థి ఎన్నిక కూడా పెండింగ్‌లో పెట్టారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతల సీట్లను దాదాపు ఖరారు చేసినా రిజర్వుడు సీట్లు ఖరారు చేయకపోవడం వివాదానికి దారితీస్తోంది.
మరోవైపు ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కూడా వారికి తలనొప్పిగా మారింది. నర్సాపురం అభ్యర్థిగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీలో చేరడంతో అక్కడ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పోటీలోకి దింపాలని చూశారు. అయితే వారిద్దరు కూడా సుముఖత చూపకపోవడంతో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీ మోహన్ ఓటమి భయంతో పోటీ చేయడానికి ఇష్టపడని సంగతి తెలిసిందే. ఏలూరు స్థానాన్ని కూడా ఇంకా ఖరారు చేయలేదు.
మాగంటి బాబును అసెంబ్లీకి పోటీ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నిడదవోలు నియోజకరవ్గంలో టీడీపీ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనని నేతలు పట్టుపడుతున్నారు. ఆయన స్థానంలో ఎవరికి సీటు ఇచ్చినా మద్దతు తెలియచేస్తామని కుందుల సత్యనారాయణ వర్గం చెబుతోంది. ఒకవైపు బూరుగుపల్లి శేషారావు తనకే సీటు వచ్చిందని చెబుతుండగా, కుందుల సత్యనారాయణ ప్రచారానికి శ్రీకారం చుట్టి అక్కడ తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment