
నేటి నుంచి పొగాకు వేలం ప్రారంభం
ధరలపై ఆశలు పెట్టుకున్న రైతులు
గతేడాదితో పోల్చుకుంటే భారీగా పెరిగిన సాగు ఖర్చులు
సరాసరిన కిలోకు రూ.300 ఇవ్వాలని రైతుల డిమాండ్
162 మిలియన్ కేజీల వరకు ఉత్పత్తులు రావొచ్చని అంచనా
మరికొద్దిరోజుల్లో పొగాకు వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. రెండేళ్లుగా ధరలు ఆశాజనకంగా ఉండి రైతులకు లాభాలొచ్చాయి. ఈ ఏడాది మార్కెట్ ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో వేలంలో దక్కే ధరలపై ఆశలు పెట్టుకున్నారు. గతేడాది కంటే ధరలు పెంచితేనే లాభాలు వస్తాయని లేకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటు బోర్డు అధికారులతోపాటు, ఇటు రైతులు అభిప్రాయపడుతున్నారు.
కందుకూరు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి కందుకూరు – 1వ కేంద్రంతోపాటు ఒంగోలు –1, కొండపి, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. మిగిలిన కందుకూరు – 2, కలిగిరి, డీసీపల్లితోపాటు ఒంగోలు – 2, టంగుటూరు, వెల్లంపల్లి, కనిగిరి వేలం కేంద్రాల్లో 19వ తేదీ నుంచి మొదలవుతుంది.
2025 – 26 సీజన్‌కు సంబంధించి 11 కేంద్రాల పరిధిలో 105.27 మిలియన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం సాగు విస్తీర్ణం, వస్తున్న ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని 162 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్‌లో అమ్మకాలు ఉండొచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
ధరలు పెంచాలంటూ..
రెండు సంవత్సరాలుగా పొగాకు మార్కెట్ రైతులకు లాభాల పంట పండించింది. దీంతో ఈ ఏడాది అనేకమంది సాగుపై అధికంగా మొగ్గు చూపారు. బోర్డు పరిమితికి మించి భారీగా పంట వేశారు. రైతులు సాగులో పోటీ పడటంతో పొలాలు, బ్యారెన్ల కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది రూ.లక్ష ఉన్న బ్యారెన్ కౌలు ఈసారి రూ.2.50 లక్షల వరకు పెరిగింది. పొలం కౌలు, కూలీల రేట్లన్నీ రెట్టింపయ్యాయి.
ఈ పరిస్థితుల్లో గతేడాది కంటే బ్యారెన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా ఖర్చయ్యిందని స్వయంగా బోర్డు అధికారులే లెక్కలు వేస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేలంలో ధరలు కూడా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీ పొగాకుకు సరాసరి ధరను రూ.300కు తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గతేడాది వేలం ముగిసే సమయానికి కేజీ సరాసరి ధర రూ.254 మాత్రమే ఉంది. కానీ రైతులు ఆశించిన స్థాయిలో ఈ సంవత్సరం మార్కెట్ ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కర్ణాటక మార్కెట్‌లో ఇలా..
ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలం అక్కడి రైతులకు కొంత ఆశాజనకంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ.337 వరకు పలుకుతోంది. మొత్తంగా కేజీ సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు ఉంది. అయితే ఆంధ్రాలో పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.
50 శాతం పైనే..
ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉండటం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా మొదటి రకం అంటే బ్రైట్ గ్రేడ్ వచ్చాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రేడ్‌లు కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయంటన్నారు. ఇది వేలంలో రైతులకు సానుకూలాంశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో వారు సరైన జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉత్పత్తి బాగా పెరిగింది
ఈనెల 10వ తేదీ నుంచి ఈ సీజన్‌కు సంబంధించి అధికారికంగా పొగాకు వేలం ప్రక్రియను ప్రారంభించనున్నాం. మొదటి దశలో నాలుగుచోట్ల, 19వ తేదీన మిగిలిన కేంద్రాల్లో మొదలుపెడతాం. ఈ ఏడాది ఉత్పత్తి బాగా పెరిగింది. రైతులు ఖర్చులకు అనుగుణంగా ధరలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేలం ప్రారంభమైన తర్వాత ధరలపై ఒక అంచనాకు రాగలం. – లక్ష్మణరావు, ఆర్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment