
కూడేరు హైస్కూల్లో 15 ఏళ్లలోపు విద్యార్థులు బీడీ,సిగరెట్, గుట్కాలకు బానిస
తల్లిదండ్రుల గారాభం తెస్తోంది చేటు
అడిగినంత డబ్బులిస్తున్న తల్లిదండ్రులు
పెడదోవ పడుతున్న బాల్యం
భవిష్యత్‌ను చేతులారా నాశనం చేసుకుంటున్న వైనం
అడ్డాగా మారిన కంపచెట్లు: కూడేరు హైస్కూల్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద మరుగుదొడ్లు, అదనపు తరగతుల గదుల నిర్మాణానికి రూ.లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పటి ప్రధానోపాధ్యాయుడు పనులు సక్రమంగా చేయించకపోవడంతో బాలుర మరుగుదొడ్ల నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. బాలికలకు 5 మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లు లేకపోవడంతో మగపిల్లలు మలవిర్జనకు పాఠశాలకు దగ్గరలో జాఫర్ పిండి మిషన్ ముందు ఖాళీ స్థలంలో పెరిగిపోయిన కంపచెట్ల మాటుకు వెళ్తున్నారు.
ఈ కంప చెట్లే పిల్లలు చెడు మార్గంలో వెళ్లడానికి అడ్డాగా మారాయి. మూత్ర విసర్జనకంటూ అక్కడికి వెళ్లడం.. బీడీలు, సిగరెట్లు తాగడం చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అలవాటు చేసుకోవడం అధికమైంది. పిల్లలు బయటకు వెళుతున్నా హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కూడేరు: బాగా చదివి భావి పౌరులుగా ఎదగాల్సిన ఆ విద్యార్థులు బంగారు బాల్యాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించి ఉన్నతంగా ఎదగాల్సిన వారి జీవితాలు బీడీ, సిగరెట్, గుట్కాలాంటి వ్యసనాలతో ‘పొగ’ చూరుతున్నాయి. పదిహేనేళ్లలోళ్లలోపే ‘మత్తు’కు అలవాటు పడి భవిష్యత్ చిత్తు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల గారాభం.. ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడడంతో తోటి విద్యార్థులు తోడై పెడదోవ పడుతున్నారు.
చిరుప్రాయం నుంచే క్రమశిక్షణతో ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన పిల్లలు.. అవసరానికి మించి డబ్బులిస్తుండడంతో జల్సాలకు అలవాటు పడుతున్నారు. చెడుమార్గంలో వెళ్లి వారి ఆశయాలు, తల్లిదండ్రుల ఆశలను ఆదిలోనే తుంచేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నగరానికి పొరుగున ఉండే కూడేరు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 454 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పలువురు బాలురులు బీడీ సిగరెట్, గుట్కా, కల్లుకు బానిసవుతున్నారు. ఆరు నెలల క్రితం వరకు 9,10వ తరగతి పిల్లల్లో కొందరు వ్యసనాలకు అలవాటు పడ్డారు. నెల రోజులు నుంచి వారిని చూసి 6, 7,8వ తరగతి పిల్లలు కూడా అదేబాటలో నడుస్తున్నారు. తొలుత రూపాయి పెట్టి చుట్ట బీడీ తాగడం మొదలెట్టి .. తర్వాత రూ.10ల విల్స్, రూ.12 పెట్టి గోల్డ్ సిగరెట్లకు అలవాటు పడ్డారు. తాజాగా వారి ధ్యాస గుట్కా వైపు మళ్లింది. రూ.10, రూ.20 పెట్టి విమల్, చైనీ ఖైనీ వంటి గుట్కాలను వాడుతున్నారు.
వ్యసనాలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు..
కొందరు పిల్లలకు చదువుపై ధ్యాస లేదు. టీవీలు, సినిమాలు, సెల్‌ఫోన్‌లో యుట్యూబ్‌లో బీడీలు, సిగరెట్లు తాగడం, గుట్కాలు వేసుకోవడం ఫ్యాషన్‌గా తీసుకొని వీరు బానిసలవుతున్నారు. ధూమపానం చేయడం ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, గుట్కా వేసుకోవడంతో నోటి కేన్సర్ వస్తుందన్న విషయం తెలియక డబ్బు పెట్టి జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు.
పిల్లల భవిష్యత్ నాశనం
పెద్దవారే బీడీలు, సిగరెట్లు తాగి, గుట్కా వేసుకోవడంతో ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. మరీ చిన్నపిల్లలు వీటికి బానిస కావడం దారుణం. అడ్డుకట్ట వేయకపోతే చదువుపై శ్రద్ధ చూపకపోగా మరింత వ్యసన పరులై చేతులారా భవిష్యత్ నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు డబ్బులివ్వడం మంచిది కాదు. – లక్ష్మీనారాయణ, మండల వైద్యాధికారి, కూడేరు
నిఘా ఉంచుతాం..
కొందరు పిల్లలు బీడీలు, సిగరెట్లు తాగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. తరగతి గదుల్లో ఉండకుండా బయట తిరుతున్న పిల్లలపై నిఘా ఉంచాం. అల్లరి, చిల్లరిగా తిరిగే పిల్లల విషయాన్ని వారి తల్లిదండ్రులను పిలిపించి తెలియజేశాం. మగపిల్లలకు మరుగుదొడ్లు లేకపోవడం సమస్యగా మారింది. మలమూత్ర విసర్జనకంటూ పిల్లలు బయటకు వెళుతున్నారు. ధూమపానం, గుట్కాకు అలవాటు పడిన పిల్లలపై తోటి పిల్లలతో నిఘా పెట్టిస్తాం. – శ్రీదేవి, హెచ్‌ఎం, కూడేరు హైస్కూల్
Comments
Please login to add a commentAdd a comment