
దారుణంగా నష్టపోతున్న రైతులు
గతేడాది క్వింటాల్‌కు రూ.15 వేలకు పైనే ధర
ఈ ఏడాది ధర రూ.3 వేలలోపే
కొంటామని కంపెనీలు అభయమివ్వడంతో సాగు చేసిన రైతులు
పంట కోత వేళ చేతులెత్తేస్తున్న కంపెనీలు
నిలువునా నష్టపోతున్నామని రైతులు గగ్గోలు
సాక్షి, అమరావతి : నాటు పొగాకుగా పిలిచే బర్లీ పొగాకు ధరలు అనూహ్యంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి కాదు కదా.. కనీసం కౌలు కూడా వచ్చే పరిస్థితి లేక దిగాలు పడుతున్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్ రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలకగా, ఈ ఏడాది తేమ శాతం వంకతో క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు మించికొనే పరిస్థితి కూడా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని నల్ల నేలల్లో బ్లాక్ బర్లీ, ఎర్ర నేలల్లో వైట్ బర్లీ సాగు చేస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
చేతులెత్తేసిన కంపెనీలు
ఐటీసీ, జీపీఐ, డక్కన్, ఆలయన్స్ వంటి పొగాకు కంపెనీలు అభయమివ్వడంతో రైతులు బర్లీ పొగాకు సాగు చేశారు. గత ఏడాది ఈ రకం పొగాకు 1.95 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఈ ఏడాది దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షలకు పైగా రైతులు ఖర్చు చేశారు. కౌలు కోసమే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించారు.
అయితే, తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 11–12 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. చివరకు విత్తనాలు ఇచ్చి సాగు చేయమని చెప్పిన పొగాకు కంపెనీలు పంట చేతికొచ్చే సమయాయిని పత్తా లేకుండా పోయాయి. దీంతో క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
అప్పట్లో అండగా నిలిచిన గత ప్రభుత్వం
గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి తేమ శాతంతో సంబంధం లేకుండా దాదాపు 30వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా లేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు.