
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం
రైతులకు భారంగా మారిన పెట్టుబడి వ్యయం
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అరకొరే!
గాడి తప్పిన గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ విధానం
స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల ఎక్కువ వినియోగంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయనే విషయాన్ని చాలా మంది రైతులు గుర్తించలేకపోతున్నారు. వివిధ పంటల్లో ఉత్పాదకతను పెంచుకునేందుకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో భూమి స్వభావం దెబ్బతింటోంది. చాలా చోట్ల పొలాలు చౌడుబారుతున్నాయి. పర్యావరణం కూడా కలుషితం అవుతోంది.
పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉండటంతో మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 2023–24లో 2,04,318 టన్నుల రసాయన ఎరువులు వాడగా.. 2024–25లో 2,34,144 టన్నులు వినియోగించారు. మొత్తం 29,826 టన్నుల వినియోగం పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులకు అవగాహన కల్పించడం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాలు పెంచడం... తదితర విషయాలపై దృష్టిసారించడం లేదు.
ఎకరాకు 185 కిలోల రసాయన ఎరువులు
రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 96 వేల ఎకరాల్లో మిర్చి సాగైంది. పత్తి కూడా జిల్లాలో అత్యధికంగా సాగు అవుతోంది. 2024 ఖరీఫ్‌లో 10,55,517 ఎకరాలు, రబీలో 2,14,692 ఎకరాలు ప్రకారం మొత్తంగా 12,70,209 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. నీటిపారుదల కింద సాగు చేసే పంటలకు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు.
సగటున ఎకరాకు 160 కిలోల వరకు రసాయన ఎరువులు వాడవచ్చు. అయితే 2024–25లో ఎకరాకు సగటున 185 కిలోల రసాయన ఎరువులు వినియోగించారు. 2024–25లో భూసార పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి.. వాటి ఫలితాలను రైతులకు అందచేసినప్పటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది.
ఖర్చు తడిసి మోపెడు
రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరుగుతుండటంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. వివిధ కంపెనీలు రసాయన ఎరువుల ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నాయి. 10–26–26, 12–32–16 రసాయన ఎరువుల 50కిలోల బస్తా ధర రూ.1,720 ఉందంటే ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలుస్తోంది. దీంతో రైతులకు ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. మిర్చి, వరి సాగులో అడ్డుగోలుగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పండించిన పంటల్లో కూడా కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ అవుతోంది.
‘ప్రకృతి’సాయం కరువే!
రసాయన ఎరువుల వినియోగం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినట్లే. అయితే జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. కాగితాల్లో వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కనిపిస్తోంది. 2024–25లో 50 వేల ఎకరాలకుపైగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లు లెక్కలు ఉన్నప్పటికీ వాస్తవం నామమాత్రమే. స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేసేవారు జిల్లాలో 70 నుంచి 80 మంది వరకు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, విరివిరిగా సాయం అందించడం.. తదితర కారణాలతో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు.
గ్యాప్..తూచ్
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (గ్యాప్) కింద ప్రతి మండలంలో పొంలబడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చేసిన సిఫార్సుల మేరకే కెమికల్స్ వాడాలి. ప్రతి మండలంలోని 50 నుంచి 100 ఎకరాల వరకు ‘గ్యాప్’కింద ఆహార పంటలు సాగు చేశారు. ప్రతి వారం పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినప్పటికీ రసాయన ఎరువులు వాడకం తగ్గలేదు. పలు పంటల శ్యాంపుల్స్‌లో కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
చర్యలు తీసుకుంటున్నాం
2024–25 సంవత్సరంలో సాగు విస్తీర్ణం పెరిగినందున రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. 2023–24 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 30 వేల టన్నులు అదనంగా వినియోగించారు. కెమికల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కింద రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పొలంబడి నిర్వహిస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయఅధికారి, కర్నూలు
వినియోగంలో దేశంలో రెండో స్థానం
రసాయన ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రికార్డుల్లోకి ఎక్కింది. 2024–25 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలోనే ఎరువుల వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. మరో విశేషమేమిటంటే దేశంలోనే ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రకటించారు.
ఈ జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. కాగా యూరియా 3 బస్తాల వేయాల్సి ఉండగా... 10 బస్తాల వరకు వినియోగించారు. రికార్డు స్థాయిలో నంద్యాల జిల్లాలో 3.75 లక్షల టన్నులు వినియోగించిట్లు సమాచారం. ఎరువులు ఈ స్థాయిలో వినియోగించారంటే ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.
ఇవీ నష్టాలు..
» మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న, వివిధ కూరగాయల పంటలకు రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లు తెలుస్తోంది.
» కెమికల్స్‌తో పండించిన ఆహార ఉత్పత్తులు తీసుకుంటే ప్రజలు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
» గతంలో పశువుల ఎరువులు వాడేవారు. అలాగే పొలాల్లో నాలుగైదు రోజుల పాటు గొర్రెల మందను ఉంచేవారు. కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడంతో అప్పటి వారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నారు.
» ప్రస్తుతం పలు రసాయన ఎరువులతో, మందులతో పండించిన ఆహారం తీసుకుంటుండటంతో జబ్బులు పెరిగిపోతున్నాయి.