లక్ష్యం ఘనం.. క్షేత్రంలో అంతా శూన్యం
ప్రకృతి వ్యవసాయంపై అంతులేని నిర్లక్ష్యం
కాకిలెక్కలతో ప్రభుత్వాన్నే బురిడీ కొట్టిస్తున్న అధికారులు
సేంద్రియసాగు పేరుతో జిల్లాలో జోరుగా కెమికల్స్ వినియోగం
ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అందువల్లే గత ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. ఇందుకోసం వ్యవసాయశాఖలోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. కానీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం లెక్కలు ఘనంగా కనిపిస్తున్నా... క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం జిల్లాలో రికార్డుల్లోనే సాగుతోంది. అధికారులు వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నామమాత్రానికే పరిమితమైంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విభాగం ఉన్నా... ఉత్తుత్తి హడవుడే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో సాగుచేసిన ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ కావడంతో ప్రకృతి సేద్యం...అంతా చోద్యంగా మారింది.
లెక్కల్లో మాత్రం 34,024 ఎకరాల్లో...
2024–25 సంవత్సరంలో జిల్లాలోని 141 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 53,834 మంది రైతులతో 75,534 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ప్రకృతి వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఇప్పటికే 32,607 మంది రైతులు 34,024 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
కానీ 32,707 మంది రైతుల్లో 5 శాతం మంది కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే జిల్లాలో వేలాది మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికి.. సరి్టఫికేషన్ మాత్రం అతి కొద్ది మందికే వస్తోంది. అది కూడా స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకే దక్కుతోంది.
సాగుకు సిబ్బంది వెనుకంజ
ప్రకృతి వ్యవసాయ విభాగంలో 367 మంది పనిచేస్తున్నారు. వాస్తవానికి వీరంతా వారికున్న భూమిలో ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రధానంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీ వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులకు అదర్శంగా నిలవాలి. కానీ వీరిలోనే 60 శాతం మంది ప్రకృతి వ్యవసాయాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు.
రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన సిబ్బందే కాడికిందపడేస్తే ఇక రైతులు ఎందుకు పట్టించుకుంటారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కొందరు మాస్టర్ ట్రైనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతున్నా.. ప్రకృతి వ్యవసాయం అంటూ నమ్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విచ్చల విడిగా కెమికల్స్ వాడకం
జిల్లాలో చాలా మంది పేరుకే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆచరణలో మాత్రం అంతా కెమికల్స్ వ్యవసాయమే. ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంటే రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గాలి. కానీ వివిధ మండలాల్లో లెక్కకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తుండటం గమనార్హం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.50 లక్షల టన్నుల వరకు రసాయన ఎరువుల వినియోగం ఉంది. జిల్లాల పునరి్వభజన తర్వాత కర్నూలు జిల్లాలో 1.50 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. 2024–25 ఖరీఫ్‌లో 1,27,567.657 టన్నుల రసాయన ఎరువులను వినియోగించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
సాగు విస్తీర్ణం పెంచుతాం
జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి శిక్షణ ఇస్తున్నాం. జీవామృతం, కషాయాల తయారీపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడ ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 54,834 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి
ప్రకృతి వ్యవసాయం అంటే...
ప్రకృతి వ్యవసాయం అంటే ఎలాంటి పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించడం. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాన్ని మాత్రమే వినియోగించడం. చీడపీడల నివారణకు కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం తదితర వాటిని వినియోగించడం. ఏ రకంగానూ ఇటు పురుగుమందులు, అటు రసాయన ఎరువులు వినియోగించకపోవడం. అలా..వరుసగా మూడేళ్లు సాగు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా పరిగణిస్తారు. కానీ అధిక దిగుబడుల కోసం చాలా మంది వి చ్చల విడిగా రసాయన మందులు వాడుతున్నారు.
కల్లూరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో 631 మంది మహిళలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పంచాయతీలో ముగ్గురు మాత్రమే 100 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందుకే సరి్టఫికేషన్ కూడా ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఇలాగే ఉంటున్నాయి.
పాలేకర్ స్ఫూర్తితో 150 మంది రైతులు..
ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందగా జిల్లాలోని 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరు దాదాపు పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు. వీరు సుబాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయ విభాగం చెబుతున్న వారిలో 5 శాతం కూడ ప్రకృతి వ్యవసాయం చేసే వారు లేరు. ఈ 150 మంది రైతుల ఉత్పత్తులతోనే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హడావుడి చేస్తున్నారు.
34,024 ఎకరాలు అధికారుల లెక్కల ప్రకారం ప్రకృతి సాగు విస్తీర్ణం
367 ప్రకృతి సాగు విభాగంలోని సిబ్బంది
75,534 ఎకరాలు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయం లక్ష్యం?
? ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment