పోషకాల పుట్టిల్లు ‘కంచల’.. మూడు శతాబ్దాలుగా ఆకు కూరల సాగు
సేంద్రియ పద్ధతే విజయ రహస్యం
రుచి, నాణ్యతలో ఇక్కడి ఆకు కూరల తీరే వేరు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నిత్య కల్యాణం.. పచ్చతోరణం అనే నానుడిని అక్కడి రైతులు ‘నిత్య ఆదాయం.. పచ్చతోరణం’గా మార్చేసుకున్నారు. 300 ఏళ్లుగా వారసత్వ సాగునే కొనసాగిస్తూ అలనాటి వ్యవసాయ పద్ధతులను నేటికీ ఆచరిస్తున్నారు. సేంద్రియ విధానంలో ఆకు కూరల్ని పండిస్తున్నారు. తమ గ్రామం నుంచే ఆకు కూరల సాగు తెలుగు రాష్ట్రాలకు విస్తరించిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండలంలోని కంచల గ్రామంలోకి అడుగు పెడితే...
మునేరు ఒడ్డున.. పోషకాల వడ్డన
మునేరుకు ఒడ్డున గల కంచల గ్రామంలో ఇసుకతో కూడిన తువ్వ (మెతక) నేలలు ఉండటంతో ఆ గ్రామ రైతులు ఆకు కూరల సాగుకు అనువుగా మలచుకున్నారు. ఈ నేలలో పండించిన ఆకు కూరలు రుచికి పెట్టింది పేరుగా మారాయి. పోషకాల పుట్టినిల్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు పోషక విలువలతో కూడిన ఆకు కూరలను నిత్యం ఇక్కడి రైతులు సరఫరా చేస్తున్నారు.
తమ తాత ముత్తాతలు ఏ విధానంలో ఆకు కూరల్ని పండించారో నేటికీ అదే పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. పశువుల పేడ, వానపాముల ఎరువు వినియోగించడం వల్ల మంచి నాణ్యతతో కూడిన ఆకు కూరలు ఉత్పత్తి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మార్కెట్‌లో కంచల ఆకు కూరలకు డిమాండ్ ఉంది.
తాము పండించిన ఆకు కూరలను రైతులే నేరుగా విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, కోదాడ, హైదరాబాద్ వరకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఏడాది మొత్తం రోజూ ఆదాయం వచ్చే ఆకు కూరలకు కాలంతో సంబంధం లేకుండా పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో తమ పూర్వీకులు ఆకు కూరల సాగును ఎంచుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
ఎకరాకు రూ.30 వేల కౌలు
రెండు వేలకు పైగా జనాభా ఉన్న కంచల గ్రామంలో కులం, మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆకు కూరలను కలిసిమెలిసి సాగు చేస్తున్నారు. వీరికి చెరువుల కింద సాగు భూమి ఉన్నప్పటికీ ఆ భూమిలో తినడానికి వరి పండిస్తూ.. మెట్ట భూములను కౌలుకు తీసుకుని మరీ ఆకు కూరలను సాగు చేస్తున్నట్టు చెప్పారు.
ఏడాదికి కౌలు రూపంలో ఎకరానికి రూ.30 వేల వరకు చెల్లిస్తున్నామన్నారు. కౌలు, పెట్టుబడి పోగా ఎకరానికి రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వార్షికాదాయం పొందుతున్నట్టు చెప్పారు. గ్రామంలో 1,000కి పైగా ఎకరాల్లో ఆకు కూరలు పండిస్తున్నట్టు పేర్కొన్నారు.
మునేరు పొంగితే నష్టమే..
భారీ వర్షాలు కురిసినప్పుడు మునేరు పొంగి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గతేడాది ఆగస్ట్‌లో వచ్చిన వరదలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని రైతులు చెప్పారు.
సొంత విత్తనాలతోనే..
కంచల రైతులు విత్తనాలను సొంతంగానే తయారు చేసుకుంటున్నారు. తోటకూర, బచ్చలికూర, పాలకూర, గోంగూర, పొన్నగంటికూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకు కూరలను సాగు చేస్తూ వీటినుంచి వచ్చే విత్తనాలనే సేకరిస్తున్నారు. తమకు సరిపడా ఉంచుకుని ఇతర గ్రామాల రైతులకు విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. కంచల గ్రామ ఆకు కూరలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో మార్కెట్లో లభించే విత్తనాల కంటే ఇక్కడి విత్తనాలకు డిమాండ్ ఎక్కువ.
సొంతంగా విత్తనాల తయారీ
మేం పండిస్తున్న ఆకు కూరల విత్తనాలను మేమే తయారు చేసుకుంటాం.దీంతో మంచి దిగుబడులు సాధిస్తున్నాం. విత్తనాల ఖర్చూ తగ్గుతుంది. మేం పండించే ఆకు కూరలతో పాటు ఇక్కడి విత్తనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది..– ఎం.భూలక్ష్మి, ఆకు కూరల రైతు
వరదలతో తీవ్ర నష్టం
మా పెద్దోళ్ల కాలం నుంచి ఆకు కూరలనే పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. రూ.లక్షల్లో ఆదాయం రాకపోయినా రోజువారీ కూలీ రూ.500కి తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఇటీవల మునేరు వరదతో తీవ్రంగా నష్టపోయాం. – చలమల సుబ్బారావు, ఆకు కూరల రైతు
Comments
Please login to add a commentAdd a comment