ముక్కామలలో సేంద్రీయ పద్దతిలో సాగుచేస్తున్న జామతోట
పెరవలి: పంటసాగులో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో పంట భూములు చౌడుబారి పోతున్నాయి. దీంతో పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రైతులు సేంద్రీయ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని సేంద్రీయ సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం రైతులు సేంద్రియ సాగు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు.
వరిలో 50 బస్తాల వరకూ దిగుబడి
పెరవలి మండలంలో సేంద్రీయ పద్ధతిలో వాణిజ్య పంటలైన బొప్పాయి, అరటి, జామ పంటలతో పాటు కూరగాయల పంటలైన వంగ, బెండ, దొండ, చిక్కుడు, పొట్ల, బీర, కాకర పాదులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా వరిసాగు చేసి భళా అనిపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎకరానికి 40 నుంచి 50 బస్తాల దిగుబడులు సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలో సేంద్రీయ పద్దతిలో అన్నవరప్పాడు, మల్లేశ్వరం, ఖండవల్లి, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేపట్టాలని వ్యవసాయాధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు రైతులతో అవగాహన సదస్సులు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. దీంతో రైతులు ముందుకు వచ్చి సాగు చేపట్టారు.
సేంద్రీయ సాగుతో లాభాలు
రసాయన ఎరువుల వినియోగం అధికంగా వాడడం వల్ల భూములు చౌడు బారిపోతున్నాయి. అంతేకాకుండా పచ్చిరొట్ట పైర్ల సాగు పట్ల నిర్లక్ష్యం వహించడంతో నేడు ఈ పరిస్థితి ఏర్పడింది. సేంద్రీయ వ్యవసాయంలో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్ల సాగు వంటివి ప్రధాన భూమిక వహిస్తాయి. అందుకు జనుము, జీలుగ, పిల్లిపిసర వంటి పంటలను వేస్తే భూమికి ఎకరానికి రెండు టన్నుల ఎరువు అందుతుందని ఇది మంచి ఫలితం ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటకు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. కేవలం కషాయాలు, పశువుల ఎరువుతో ఈ సాగు చేయవచ్చని తద్వారా భూసారం పెరిగి తెగుళ్ళ వ్యాప్తి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
తెగుళ్ల నివారణ ఇలా
పంటలపై వచ్చే తెగుళ్ళ నివారణకు రకరకాల కషాయాలు తయారుచేసి పంటలపై పిచికారీ చేస్తే తెగుళ్ళు దరిచేరవు. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, నీమాస్త్రం, బీజామృతం, ఘన జీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్య వంటి వాటిని తయారుచేసి తెగుళ్ళను నివారిస్తున్నామని రైతులు, అధికారులు చెబుతున్నారు.
ఎకరానికి రూ. 50 వేల లాభం
అరటి సాగు చేపట్టి రెండేళ్లైంది. గత ఏడాది ఎకరం చేలో లాభం రూ.50 వేలు వచ్చింది. పెట్టుబడి తక్కువ నాణ్యమైన దిగుబడి రావటంతో ఈ పంటకు మార్కెట్టులో మంచి ధర లబించింది. దీంతో ప్రస్తుతం అరటితో పాటు వరి సాగు చేస్తున్నాను. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం మానేసి తెగుళ్ళ నివారణకు కేవలం కషాయాలు వాడుతున్నాం.
– ఈ.కన్నయ్య, రైతు, ఖండవల్లి
కూరగాయలతో మంచి లాభాలు
సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేశాను. గత ఏడాది అర ఎకరం వేస్తే మంచి ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు మూడు ఎకరాల్లో అన్నిరకాల కూరగాయలు పండిస్తున్నాను. పెట్టుబడి తక్కువ.. అంతే కాకుండా భూసారం మెరుగుపడి మంచి దిగుబడులు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయమే మేలు.
–కె శ్రీరామమూర్తి రైతు, ఖండవల్లి
రైతుల్ని ఒప్పించడానికి కష్టపడ్డాం
సేంద్రీయ సాగు పెంచాలనే ఉద్దేశ్యంతో రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి వారిని పోత్సహించాం. మొదట ఈ సాగు చేయడానికి రైతులను ఒప్పించడానికి చాల ఇబ్బందులు పడ్డాం. నేడు జిల్లాలో 25,300 మంది రైతులు, 35,340 ఎకరాల్లో సాగు చేసేందుకు మార్గం ఏర్పడింది. ఒక్క పెరవలి మండలంలో 1500 ఎకరాల్లో వివిధ పంటలు వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల పంటలు ఉత్పత్తి చేయటం వలన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పర్యటనకు వచ్చి పంటలను స్వయంగా పరిశీలించారు.
–తాతారావు, సేంద్రీయ సాగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment