సాక్షి, అమరావతి: దేశంలోనే సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీకి 2020, 2021 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒక లక్ష హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇటీవల లోక్ సభలో వెల్లడించారు. 2019–20 నుంచి ఇప్పటివరకు ఏపీలో 1,44,465 హెక్టార్లు సేంద్రీయ వ్యవసాయం కిందకు వచ్చినట్లు తెలిపారు.
2020–21లో భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద 8 రాష్ట్రాల్లో 4.09 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇందులో అత్యధికంగా ఏపీలో లక్ష హెక్టార్లకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం, భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ
2019–20 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాల కింద సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు శిక్షణ, సామర్ధ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రైతుల క్లస్టర్ల ఏర్పాటు, సామర్ధ్యం పెంపునకు హెక్టార్‌కు రూ.12,200 సాయాన్ని అందించినట్లు చెప్పారు. హ్యాండ్ హోల్డింగ్, సర్టిఫికేషన్, అవశేషాల విశ్లేషణ్‌కు హెక్టారుకు మూడేళ్లలో రూ. 2 వేల ఆర్థిక సాయం అందించామన్నారు. సహజ సేద్య ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం, విలువ జోడింపునకు రైతులకు హెక్టార్‌కు మూడేళ్లలో రూ.8,800 డీబీటీ ద్వారా ఇచ్చామన్నారు. ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ వరకు, ధృవీకరణ, మార్కెటింగ్, పంటకోత తర్వాత నిర్వహణకు పూర్తి మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment