
అనంతపురం జిల్లా నీర్జాంపల్లిలో నేలకూలిన అరటిపంట
రాష్ట్రంలో భిన్న వాతావరణం
రాయలసీమ జిల్లాల్లో పిడుగులు, వడగళ్ల వానలు
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావమే కారణం
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య తదితర జిల్లాల్లో పలుచోట్ల శనివారం సాయంత్రం పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసలపల్లెలో ఆదివారం 2.9 సెం.మీ. వర్షం పడింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్నిచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల ఆదివారం సాయంత్రం చెదురుమదురు వర్షాలు కురిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జల్లులు పడ్డాయి. విజయవాడలోని గుణదల, ప్రసాదంపాడు తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో భారీ వర్షం కురిసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో చిరు జల్లులు కురిశాయి. ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి.
ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతోనే..
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలులు కలిసినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment