rayalaseema districts
-
పాడి రైతులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా మరోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.4.51, ఆవు పాలపై రూ.1.84 చొప్పున.. కనిష్టంగా గేదె పాలపై రూ.2.26, ఆవు పాలపై రూ.0.11 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.32, ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. ఈ పెంపు రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాలకు ఆదివారం నుంచి వర్తించనుంది. తద్వారా 65 వేల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ తరఫున రాయలసీమలో కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇటీవలే సబర్కాంత్ యూనియన్ పాల సేకరణ ధరలను పెంచింది. తాజాగా కైరా యూనియన్ పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా.. తాజా పెంపుతో కలిపి ఏడు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి. కైరా యూనియన్ ప్రస్తుతం లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.84.26, ఆవు పాలకు రూ.42.27 చొప్పున చెల్లిస్తోంది. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.87.77, ఆవు పాలకు రూ.42.38 చొప్పున రాయసీమ జిల్లాల పరిధిలోని పాడి రైతులకు కైరా యూనియన్ చెల్లించనుంది. 30 నెలల్లో 8.50 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.96 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,549 గ్రామాలకు విస్తరించింది. 2116 ఆర్బీకేల పరిధిలోని 76వేల మంది నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తోంది. 8.50 కోట్ల లీటర్ల పాలను సేకరించగా.. పాడి రైతులకు రూ.378.26 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా.. అంతకు మించి ప్రస్తుతం లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవు పాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.3,395.18 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ వాయుగుండం సోమవారం రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 530, భారత్‌లోని కరైకల్‌కు తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని, అనంతరం మలుపు తిరిగి క్రమంగా దక్షిణ నైరుతి వైపు పయనిస్తుందని, బుధవారం మధ్యాహ్నానికి శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వివరించింది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
అమూల్ పాలసేకరణ ధర పెంపు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో పాలసేకరణ ధరను అమూల్ పెంచింది. ఇటీవలే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాలసేకరణ ధరను పెంచిన అమూల్ తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటరు గేదెపాలపై రూ.2.47, ఆవుపాలపై రూ.1.63 చొప్పున పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి రానుంది. జగనన్న పాలవెల్లువ కింద అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇటీవలే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగోసారి పాలసేకరణ ధర పెంచగా, రాయలసీమ జిల్లాల్లో నేటినుంచి అమలు చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 3.5 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.30.50 నుంచి రూ.32.13కు పెంచింది. లీటరు గేదెపాలకు (ఫ్యాట్ 6 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.42.50 నుంచి రూ.44.97కు పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5కు పెంచారు. హ్యాండ్లింగ్ చార్జీల కింద లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 4 శాతం ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) రూ.1.24, గేదెపాలకు (ఫ్యాట్ 8 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9.2 శాతం) రూ.1.64 చొప్పున సొసైటీలకు చెల్లించనున్నారు. అమూల్ దాణాపై 50 కిలోల బస్తాకు రూ.10 చొప్పున ఆయా సొసైటీ కార్యదర్శులకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఫలితంగా వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 44 వేలమంది రైతులతోపాటు 3,768 మహిళా పాడిరైతు సంఘాలు లబ్ధిపొందనున్నాయి. అమూల్ రాకతో అదనపు లబ్ధి జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఇటీవలే తిరుపతి జిల్లాకు విస్తరించారు. ప్రస్తుతం 17 జిల్లాల్లో 1,644 ఆర్బీకేల పరిధిలోని 2,856 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలవుతోంది. 2,47,958 మంది మహిళా పాడిరైతుల నుంచి రోజూ 1.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. గడిచిన 24 నెలల్లో 5.12 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. పాలుపోసిన పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రూ.219.57 కోట్లు చెల్లించారు. లీటరుపై రూ.4 అదనంగా లబ్ధిచేకూర్చేలా కృషిచేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ కంటే మిన్నగా లీటరు గేదెపాలపై రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 వరకు అదనంగా లబ్ధిచేకూర్చారు. ప్రైవేటు డెయిరీలు ఇస్తున్న రేట్లతో పోలిస్తే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న గ్రామాల్లోని రైతులు రూ.25 కోట్ల వరకు అదనంగా లబ్ధిపొందారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడి ధరలను పెంచాల్సి వచ్చింది. మూడేళ్లలో వరుసగా నాలుగుసార్లు పెంచడంతో అమూల్‌తో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం లీటరుపై రూ.15 వరకు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా జగనన్న పాలవెల్లువ పథకం కింద పాలుసేకరిస్తున్న గ్రామాల్లోనే కాదు.. ప్రైవేటు డెయిరీలకు పాలుపోస్తున్న రైతులకు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో లబ్ధికలిగింది. ఆయా డెయిరీల పరిధిలోని రైతులు మూడేళ్లలో రూ.2,354.22 కోట్ల మేర లబ్ధిపొందగలిగారు. ఇప్పటికే అమూల్ తరఫున పాలు సేకరిస్తున్న సబర్కాంత్, బనస్కాంత్ యూనియన్లు పాలసేకరణ ధర పెంచగా, తాజాగా గురువారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పాలుసేకరిస్తున్న కైరా యూనియన్ కూడా నాలుగోసారి పెంచింది. జగనన్న పాలవెల్లువ పథకాన్ని డిసెంబర్ కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేదిశగా ముందుకెళుతున్నారు. -
సీమ జిల్లాల్లో సోలార్ పవర్ భేష్!
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలైన వైఎస్సార్, కర్నూలు, అనంతపురంలలో సౌర విద్యుత్ ఉత్పత్తి లాభసాటని ఉత్పత్తిదారులు భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు పోటీ పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంధన ఎగుమతి విధానం’ (ఎక్స్పోర్ట్ పాలసీ) వారిని మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తోపాటు పలు దేశీయ, విదేశీ కంపెనీలు సీమ జిల్లాలపై దృష్టి పెట్టాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పై మూడు జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా జరిగే వీలుంది. ఇటీవల అధ్యయనాలను బట్టి ఆ జిల్లాల్లో సోలార్ రేడియేషన్ ఉదయం త్వరగా వస్తుందని, సాయంత్రం పొద్దుపోయే వరకూ ఉంటోందని తేలింది. ట్రాకింగ్ (సూర్యుడు ఎటువైపు తిరిగితే అటు ప్యానల్ తిరిగేలా) సిస్టమ్ అమర్చుకుంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం.. రాయలసీమ జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్నవి కొన్నే. ఇప్పుడు ట్రాకింగ్‌తోపాటు తేలికగా రేడియేషన్‌ను తెచ్చే మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ వాట్స్ (దాదాపు 350 వాట్స్) ఉండే ప్యానల్స్ ఉన్నాయి. తక్కువ ప్రదేశంలోనే వీటిని ఎక్కువగా అమర్చుకోవచ్చు. తద్వారా గతంలో కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. సాధారణంగా ఒక మెగావాట్‌కు 5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తే కేవలం 4 ఎకరాల భూమితో సరిపెట్టే వీలుందని అధికారులు అంటున్నారు. పైగా ప్రస్తుతం వస్తున్న 22 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను 25కు తీసుకెళ్లే వీలుందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్ల కోసం గుర్తించిన భూముల వివరాలు.. ఎక్స్పోర్ట్ పాలసీతో అపార అవకాశాలు.. ► ఎక్స్పోర్ట్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల కోసం దాదాపు లక్ష ఎకరాలను గుర్తించింది. ఇందులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉత్పత్తిదారులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ► రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఆయా సంస్థలు మరే ఇతర రాష్ట్రాల్లోనైనా అమ్ముకోవచ్చు. దీన్నే ఎక్స్పోర్ట్ పాలసీ అంటారు. విద్యుత్‌ను చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) లైన్లు వాడుకునే ఏర్పాట్లు చేస్తోంది. ► రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తిదారులకు 25 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వనుంది. ప్రతి ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి. ఏటా లీజు మొత్తాన్ని 5 శాతం పెంచుతారు. మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. -
సీమలో సైకిల్‌కు పంక్చరే..!
సాక్షి, నెట్వర్క్ : వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సరికొత్త రాజకీయ సమీకరణలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అత్యధిక శాతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవటం.. అడుగడుగునా అవినీతి తాండవించడంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. విలువలకు వలువలు ఊడదీసి అనైతిక రాజకీయాలు చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగజారుడు రాజకీయాలను సహించేది లేదని.. విలువలతో కూడిన రాజకీయాలకు, విశ్వసనీయతకు ఓటేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. క్లీన్ స్వీప్ దిశగా ‘వైఎస్సార్’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డ వైఎస్సార్ కడప జిల్లా. సౌమ్యుడు, అందరికీ తలలో నాలుకగా ఉండే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఎక్కడ ఎలాంటి అరాచకాలకు పాల్పడుతుందోనన్న భయం అంతటా నెలకొంది. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన ఈ జిల్లా 2014 ఎన్నికల్లో ఒక్కచోట తప్ప 9 నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగురవేసింది. చంద్రబాబు వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టిన తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, తాగునీటి సమస్యను పరిష్కరించడంలోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలోను ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పులివెందుల, బద్వేలు, రాజంపేట, కడప, రైల్వే కోడూరు, రాయచోటి, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరుతోపాటు కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాల్లో గెలుపు వైఎస్సార్ సీపీదేనని టీడీపీ శ్రేణులు సైతం బాహాటంగానే చెబుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పులివెందులలో ఈసారి గతం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆ నియోజకవర్గానికి చెందిన ఎం.జోసఫ్ నర్మగర్భంగా చెబుతున్నారు. జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులు సైతం ఆయన చెప్పినదానికి తగ్గట్టుగానే ఉన్నాయి. వైఎస్సార్ సీపీ కంచుకోటల్లో ఒకటైన ఈ జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్లూ విస్మరించి.. ఎన్నికలకు ముందు తానేదో చేసినట్టు చెప్పుకోవడాన్ని కడప నగరానికి చెందిన కె.రవికుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రశ్నించారు. వైఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నది ఆయన వాదన. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఆదినారాయణరెడ్డి పార్టీ ఫిరాయించిన తీరును జమ్మలమడుగుకు చెందిన బాలమ్మ తప్పుబట్టారు. ‘నీతిగా ఉండాల్సిన పని లేదా?’ అని ప్రశ్నించింది. ‘మారినోడు మారినట్టు ఉండకుండా ఇప్పుడు రాంసుబ్బారెడ్డితో కలిపి మరో తప్పు చేశాడు. వాళ్లి ద్దరూ కలిస్తే సరిపోతుందా. వారి వర్గాలు కలవాల్సిన పని లేదా?’ అని సాక్షాత్తు ఓ పోలీసు అధికారి ప్రశ్నించడం గమనార్హం. ఈసారి ఏమైనా కనీసం రెండు సీట్లలోనైనా వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలన్న చంద్రబాబు పాచిక పారే అవకాశమే కనిపించడం లేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ జిల్లా పెట్టని కోటగా నిలిచినందునే చంద్రబాబు వివక్ష చూపారని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో విస్తారమైన ఖనిజ సంపద ఉన్నా.. ఎలాంటి కొత్త పరిశ్రమలు రాలేదు. రాయచోటి, బద్వేలులో ఫ్లోరైడ్ సమస్య పీడిస్తోంది. ఇలాంటి అంశాలను ప్రభు త్వం పట్టించుకోకపోవడాన్ని ప్రజలు నిల దీస్తున్నారు. అందుకే ఈ జిల్లాలో ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండబోతోంది. వైఎస్సార్ సీపీ మొత్తం పది సీట్లనూ కైవశం చేసుకునే దిశగా ఓటరు తీర్పు ఉంది. జిల్లాలో ఫ్యాన్ గుర్తు క్లీన్‌స్వీప్ చేయడం తథ్యమని రాయచోటికి చెందిన కె.నాగిరెడ్డి అనే టీ కొట్టు యజమాని చెప్పారు. ‘అనంత’ అభిమానం అనంతపురం జిల్లా శింగనమల, రాప్తాడు, పుట్టపర్తి, కదిరి, గుంతకల్లు, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి హోరున వీస్తోంది. రాయదుర్గం, పెనుకొండ, మడకశిర, అనంతపురం, ధర్మవరం, ఉరవకొండ, హిందూపురం, తాడిపత్రి నియోజకవర్గాల టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి సినీ నటుడు బాలకృష్ణ వ్యవహార శైలితో స్థానికులు విసిగిపోయా రని, ఈసారి ఆయనకు కనువిప్పు కలిగిస్తారని ప్రైవేటు ఉద్యోగి ఆర్.వెంకటస్వామి వ్యాఖ్యానించారు. అనంతపురానికి చెందిన చిరు వ్యాపారి చిన్నం వెంకటసూరి మాట్లాడుతూ.. పేదోళ్లను పట్టించుకోని ఈ ప్రభుత్వం ఇక ఉండకూడదని, రాజన్న రాజ్యం తిరిగి రావాలి’ అని వ్యాఖ్యానిం చారు. పెనుకొండకు చెందిన వెంకారెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. జిల్లాలో ముందెన్నడూ లేనివిధంగా కరువు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తవ్విన కాలువల్లోనే ప్రస్తుతం నీళ్లు వస్తున్నాయని, అందుకే ఈసారి రైతులంతా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. మంత్రిగా ఉన్న ఓ నాయకురాలి కీలక అనుచురులు ఎందరో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రజలకు రోత పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలు మంచి ఊపుతెచ్చాయి. నియోజకవర్గాల వారీ సమస్యలను ఆయన ప్రస్తావించి.. ఇవేవీ పరిష్కరించనప్పుడు వీళ్లకు మళ్లీ ఛాన్స్ ఎందుకివ్వాలంటూ వేస్తున్న ప్రశ్నలు ప్రజల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సంక్షేమ పథకాల అమలు విషయంలో కులాలు, మతాలు, పార్టీలనే భేదం ఉండదని జగన్ ఇస్తున్న హామీపై జనానికి నమ్మకం కలగటంతో ఈసారి మా ఓటు ఫ్యానుకే అంటున్నారు. పడిపోయిన టీడీపీ గ్రాఫ్ 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలలో 8 వైఎస్సార్ సీపీ, 6 టీడీపీ గెలుచుకున్నాయి. ఈసారి టీడీపీ గ్రాఫ్ మరింతగా దిగజారింది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలోనూ వైఎస్సార్ సీపీ హవా కనిపి స్తోంది. జిల్లా ప్రజల్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారీగా విభజించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న చంద్రబాబు ఎత్తులు ఫలించే పరిస్థితి లేదని గ్రామాల్లో వెల్లువెత్తుతున్న నిరసనను బట్టి అర్థమవుతోంది. 2014తో పోలిస్తే ఈసారి టీడీపీ బాగా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నది. జిల్లాలో 1,800కు పైగా పైగా చెరువుల్ని పూడ్చివేయించిన ఘనత చంద్రబాబుకే దక్కింది. చంద్రబాబు పాలనలో రైతులు ఇక్కట్లు పాలయ్యారని చంద్రగిరికి చెందిన జగన్నాథనాయుడు చెప్పారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీని గెలిపిస్తే మేలు కలుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. సొంత జిల్లాలోనూ సీఎంకు ఎదురీతే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ సైకిల్‌కు ఎదురుగాలి వీస్తోంది. ఆయన మనస్తత్వం, వ్యక్తిత్వం తెలిసిన ప్రజలు ఆయన తీరును ఈసడించుకుంటున్నారు. ‘ఈసారి ఎన్నికల్లో ఆయన పాచికలేవీ పారవు’ అని ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ తెలిపారు. కనిపించని ప్రవాహమేదో చాపకింద నీరులా వ్యాపించిందని, అదే వైఎస్సార్ సీపీకి అత్యధిక సీట్లు తెచ్చిపెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఇప్పుడు అందరి చూపు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉంది’ అని పూతలపట్టుకు చెందిన న్యాయ విద్యార్థి నరసింహులు చెప్పారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు పవన్ కళ్యాణ్, కేఏ పాల్‌ను రంగంలోకి దించినా అది సక్సెస్ కావటం లేదు. ఈసారి వైఎస్సార్ సీపీకి ఒక చాన్స్ ఇవ్వాలన్నదే ప్రజలందరి అభిప్రాయం’ అని మదనపల్లికి చెందిన కిరణ్ చెప్పారు. -
ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాగూర్ నెల్లూరు జిల్లా రాపూరు స్టేషన్ ఘటనపై స్పందించారు. పోలీసులపై దాడి చేయటం బాధాకరమన్నారు. ఆ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన సూచించారు. ఆదివారం రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. కర్నూలు క్వారీ ఘటన, సీమలో ఫ్యాక్షన్ నివారణ, ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల పరిధిలో మైనింగ్ క్వారీలపై తనిఖీలు చేపడతామని అన్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఫైర్ శాఖ సహాయంతో తనిఖీలు చేస్తామన్నారు. అక్రమ లైసెన్స్ కలిగి ఉన్నట్లయితే కఠిన చర్యలతో పాటు క్వారీలను మూసివేస్తామని హెచ్చరించారు. -
శాసనమండలి ఎన్నికల కోలాహలం
-
‘సీమ’కు ద్రోహం చేస్తున్నారు
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాయలసీమ జిల్లాలు కరువు కోరల్లో అల్లాడుతున్నా, అక్కడి పంటలన్నీ ఎండిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరువుపై ఇప్పటి వరకూ ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడమే దానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీటిని నిల్వ చేయాలని తామెంతగా చెప్పినా వినకుండా 847 అడుగులకు చేరుకోగానే దిగువకు నీటిని వదలి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ జరిగినవన్నీ మాఫీ చేసుకుందామని చంద్రబాబుకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రహస్య ఒప్పందం కుదిరినట్లుందని, అందుకే రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి దిగువకు నీళ్లొదులుతున్నారన్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. కర్ణాటకకు ఒక్క లేఖైనా రాశారా? రాజధాని శంకుస్థాపనకు దేశ,విదేశీ మంత్రులకు శుభలేఖలు ఇచ్చి మరీ ఆహ్వానించిన చంద్రబాబు.. కృష్ణా నది నుంచి నీళ్లు వదలాల్సిందిగా కర్ణాటక సీఎంకు ఒక్క లేఖైనా రాశారా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పోతుదివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నిర్మాణం జరుగుతూ ఉంటే దానిని వ్యతిరేకిస్తూ ప్రకాశం బ్యారేజీ వద్దచంద్రబాబు నిరాహారదీక్షలు చేయించారని గుర్తుచేశారు. రాయలసీమ గడ్డపై పుట్టిన చంద్రబాబు.. తన ప్రాంతానికే అన్యాయం చేస్తున్నారన్నారు. -
త్వరలో అంగన్వాడీ పోస్టుల భర్తీ
ఆలూరు రూరల్ : రాయలసీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మాతాశిశు సంరక్షణశాఖ ఆర్జేడీ శారద తెలిపారు. సోమవారం ఆమె ఆలూరు మండల పరిధిలోని ఆలూరు-02, పెద్దహోతూరు, హాలహర్వి మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో 100 అంగన్వాడీ కార్యకర్తలు, 191 ఆయాలు, 10 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. త్వరలో జిల్లా ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ ఆదేశాల మేరకు ఆయా ప్రాజెక్టుల అధికారులు ఖాళీల వివరాలను ప్రకటిస్తారన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాయలసీమ జిల్లాల్లో దాదాపు 600కు పైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, త్వరలో వాటన్నింటికీ పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అంగన్వాడీ సేవలను పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులు, చిన్నారుల వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపరుస్తూ వారి ఆరోగ్యాల పరిరక్షణ కోసం తగిన పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో యుక్త వయస్సు కలిగిన బాలికలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలో ఆయా గ్రామాల్లో యుక్త వయస్సు కలిగిన బాలికల వివరాలను కూడా అంగన్వాడీ కార్యకర్తలు సేకరిస్తారన్నారు. పుట్టిన పిల్లలందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని కూడా అంగన్వాడీ కార్యకర్తలే చూసుకోవాల్సి ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పల్లెల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆరోగ్య సేవలను అందించే విషయంలో అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే తగు చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సీడీపీఓ కోటేశ్వరి, ఏసీడీపీఓ లలిత తదితరులు ఆమె వెంట ఉన్నారు. -
'రాయలసీయ జిల్లాలకు నీరందిస్తాం'
గుంతకల్లు(అనంతపురం): గోదావరి నుంచి 70 టీఎమ్‌సీలనీటిని శ్రీశైలం తరలించి రాయలసీమ జిల్లాలకు నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. కృష్ణమూర్తి తెలిపారు. అనంతపురం జిల్లాలో సోమవారం ఒకపెళ్లి కార్యాక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటుచేస్తామని మంత్రి చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 571జీవోను రద్దు చేస్తామన్నారు. అంతేకాకుండా ఈ జీవో ఆధారంగా గత ప్రభుత్వ ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఆసైన్డ్ భూములు, గ్రామకుంటాలులను సాగుచేసుకునే వారు రిజిస్ట్రేషన్ ద్వారా ఆ భూములను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తామని హామినిచ్చారు. 2014-15 ఏడాది కాలంలో రెవిన్యూ స్టాంప్ డ్యూటీ ఆదాయ లక్ష్యం రూ. 3400కోట్లుగా ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే 2723 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి, మార్చిలో మిగిలిన మొత్తాన్ని రాబడతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. -
కర్నూలు కరువుకు పరిష్కారమేదీ?
రాయలసీమ జిల్లాల ముఖద్వారం, రాష్ట్ర పూర్వ రాజధాని కర్నూ లు జిల్లా. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, ఏఐసీసీ అధ్యక్షు లను దేశానికి అందించిన జిల్లాగా పేరు గొప్పగా చెప్పుకుంటున్న ప్రాంతమిది. ప్రత్యేకించి కర్నూలు జిల్లా పశ్చిమప్రాంతానికి సాగు నీరు, తాగునీరు, ఉపాధి, అభివృద్ధి వంటివి పూర్తిగా అందని ద్రాక్ష గానే ఉంటున్నాయి. పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు నియోజకవర్గాలతో ఉన్న ప్రాంతం అనాదిగా పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలస త్వం, అవినీతితో అభివృద్ధికి ఆమడదూరంలా నిలిచిపోయింది. వరుస కరువులు, గ్రామాల్లో ఉపాధి కనుమరుగవడంతో బతుకుతెరువు కోసం, పిల్లాపాపలు, తట్టాబుట్టతో సుదూర ప్రాంతాలకు పొట్టచేత బట్టుకుని వలసవెళ్లడం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ. తాగునీరును ఇప్పటికీ కిలోమీటర్ల మేర నడిచి తెచ్చు కోవడం, రాని తాగునీటి కుళాయిల కోసం రోజుల తరబడి వే చి చూడటం 300 అడుగుల లోతున బేర్లు వేసినా గంగమ్మ బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో హగరి (వేదావతి), తుంగ భద్ర, హంద్రీ వంటి నదులు ప్రవహిస్తూ, ఏటా వర్షాకాలంలో వం దల టీఎంసీల నీరు వృథాగా కిందికి వెళుతున్నా పట్టించుకునే నాథులు లేరు. హంద్రీనీవా సుజలస్రవంతి, గురురాఘవేంద్ర, తుంగభద్ర వరద కాలువ, గుండ్రేవుల రిజర్వాయరు వంటి ప్రభు త్వం ప్రతిపాదిత సాగునీటి ప్రాజెక్టులు ఏళ్లు గడిచినా పూర్తికాక రైతాంగాన్ని వెక్కిరిస్తున్నాయి. హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా జిల్లాలో మూడు రిజర్వాయర్లు నిర్మించి 80 వేల ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యం పెట్టుకున్నారు. పత్తి కొండ నియోజకవర్గంలో పందికోన రిజర్వాయర్ ద్వారా 42 వేల ఎకరాలు, క్రిష్ణగిరి రిజర్వాయర్ ద్వారా 5,000 ఎకరాలకు సాగు నీరు ఇవ్వవచ్చు. కానీ 2005లోనే ప్రారంభించనప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం నిధుల కేటాయింపులు, నిధుల విడుదలపై మీనమేషాలు లెక్కిస్తూ పంట కాలువల నిర్మాణం పూర్తి చేయకుండా ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. పాలకులకు చిత్తశుద్ధి లోపించడంతో కళ్ల ముందు నీళ్లు పరుగెడుతుంటే, దీనంగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తే పరిస్థితి నెలకొంది. 2006లో జిల్లా సమగ్రాభివృద్ధి పేరుతో మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ నేతృత్వంలో సీపీఎం 1500 కిలోమీ టర్ల పాదయాత్ర ద్వారా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. దీని కొన సాగింపుగా నేటికీ జిల్లాలో పాదయాత్రలు, సదస్సులు, కార్యాల యాల ముట్టడి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. లక్ష లాది రైతాంగాన్ని కరువు బారినుంచి కాపాడే ఈ ప్రాజెక్టుల సాధనకు ప్రజాప్రతినిధులు చొరవచూపి పరిష్కరించాలి. - వీరశేఖర్ సీపీఎం డివిజన్ కార్యదర్శి, పత్తికొండ -
రాజధాని ఇవ్వకపోతే మళ్లీ విభజన
రాయలసీమ రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి గుంతకల్లు టౌన్ : రాయలసీమ జిల్లాల్లో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయకపోతే రాయలసీమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని రాయలసీమ రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం జిల్లా గుంతకల్లులోని పరిటాల కళ్యాణ మండపంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజ ధాని రాయలసీమ ప్రజల హక్కు’ సాధన కోసం న్యూడమోక్రసీ జిల్లా కమిటీ సభ్యు డు సురేష్ అధ్యక్షతన భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీమ ప్రాంతానికి చెందిన మంత్రులు రాయలసీమలో రాజ ధాని ఏర్పాటు కోసం నోరు విప్పే పరిస్థితి లేదని, పొరపాటున ఎవరైనా మాట్లాడితే తమ పదవులను బాబు బర్తరఫ్ చేస్తారన్న భయంతో వారంతా వణికిపోతున్నారని ఆరోపించారు. శివరామకష్ణన్ కమిటీ నివేదిక రాయలసీమకు అనుకూలంగా రానున్న నేపథ్యంలో రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందిన మంత్రులతోనే ప్రతిపాదనలను పెట్టించి నాటకాలాడుతున్నారని విమర్శించారు. అన్ని రంగాల్లో అభివ ద్ధి చెందిన విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనే తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలోని కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు, మేధావులు, ప్రజా సంఘాల అభిప్రాయం మేరకు రాయలసీమ ప్రాంత అభివ ద్ధిలో భాగంగా నీళ్లు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి 350 టిఎంసిల నికర జలాలను మళ్లించాలని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ‘సీమ’ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శులు గాదె దివాకర్, శ్యామలారెడ్డి, జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, న్యాయవాది నాగరాజులు మాట్లాడుతూ రాయలసీమ రాజధాని సాధన కోసం ప్రజలంతా ఉద్యమించని పక్షంలో రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. -
వైఎస్సార్సీపీ జలయుద్ధం
ఈనెల 7న సీమ జిల్లాల రైతులతో కలిసి శ్రీశైలం డ్యాం ముట్టడి నంద్యాల/శ్రీశైలం: సీమ జిల్లాల దాహార్తిని విస్మరించి పొరుగు ప్రాంతాలకు అంతర్గతంగా జల సాయం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ యుద్ధం ప్రకటిచింది. శ్రీశైలం జలాశయం నుంచి తాగు, విద్యుత్, అవసరాలను చూపి నీటిని తీసుకెళ్లడానికి అభ్యంతరం తెలుపుతోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీకి చెందిన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఈనెల 7న శ్రీశైలం రిజర్వాయర్‌ను ముట్టడించడానికి నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ముహూర్థం నిర్ణయించారు. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో దాదాపు 2కోట్ల మంది ప్రజలకు తాగునీటిని అందించడంలో కృష్ణా జలాలతో నింపుకున్న శ్రీశైలం రిజర్వాయర్ కీలక భూమిక పోషిస్తోది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కర్నూలు, కడప జిల్లాల్లో కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులతో పాటు హెచ్ఎల్సీ నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలకు తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి చిత్తూరు జిల్లాకు సాగునీటిని దాదాపు 10లక్షల ఎకరాలకు పైగా అందిస్తోంది. ఈ పొలాలకు సాగునీరు అందాలన్నా, దాహార్తి తీరాలన్నా శ్రీశైలం రిజర్వాయర్‌లో 854అడుగుల కనీస నీటి మట్టాన్ని కొనసాగిస్తే తప్ప సాధ్యం కాని పరిస్థితి. అయితే తెలంగాణాలోని నల్గొండ, సీమాంధ్రలోని కోస్తా జిల్లాలకు శ్రీశైలం నుంచి 788అడుగుల్లోపే నీటిని తరలించడానికి అవకాశం ఉంది. దీంతో రాయలసీమ జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం సీమ జిల్లాల అత్యవసరాలను విస్మరించి ఇతర ప్రాంతాలకు నీటిని విడుదల చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి బాసటగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ సీమ నాయకులు ముందుకు నడుంబిగించారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి శ్రీశైలం జలాశయంతో లబ్ధి పొందే ప్రాంతాల ఎమ్మెల్యేలను కలుపుకొని ఈనెల 7న శ్రీశైలం రిజర్వాయర్ ముట్టడికి సిద్ధపడ్డారు. 854అడుగులకు తాము పోరాటం చేస్తుంటే కృష్ణా నీటి యాజమాన్య కమిటీ 788అడుగులకు తగ్గిస్తే అధికార పార్టీ నాయకులు నోరు మెదపకపోవడంపై కూడా భూమా మండిపడుతున్నారు. గతంలో జలపోరాటం చేసిన ఎంపీ ఎస్పీవై రెడ్డి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నా ఆయన కూడా ప్రభుత్వ నిర్ణయాలకు వంత పాడటంపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీమకు జరుగుతున్న అన్యాయంపై గతంలో గళమెత్తారు. ఇప్పుడు పదవి వచ్చిందని నోరు మెదపకపోవడంపై కూడా సీమ జిల్లాలకు చెందిన రైతులు ఆగ్రహంతో ఉన్నారు. -
మూడున్నర లక్షల దీపం కనెక్షన్లు రద్దు
* రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం * రాయలసీమ జిల్లాల్లోనే 1,63,981 మంది తొలగింపు * కొత్త లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు * రేషన్ డీలర్ పోస్టుల భర్తీపై పాత మార్గదర్శకాలు రద్దు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో దీపం పథకం కింద మంజూరైన వాటిలో 3.50 లక్షల గ్యాస్ కనెక్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ మేరకు వెంటనే జాబితాను తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధ్దిదారుల ఎంపికలో అవకతవకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల దీపం కనెక్షన్లు రద్దు చేస్తుండగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనే 1,63,981 మంది లబ్ధిదారులను ఆ పథకం నుంచి తొలగించనున్నారు. మంత్రి ఇటీవల రాయలసీమ జిల్లాల్లో నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితి, గతంలో దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు తదితర వాటిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీపం పథకం కింద చిత్తూరు జిల్లాకు 1,39,646 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా వాటిలో 88,882 కనెక్షన్లను రద్దు చేయనున్నారు. కర్నూలు జిల్లాకు మంజూరైన 57,667 కనెక్షన్లలో 35,137, అనంతపురం జిల్లాకు మంజూరైన 72,270 కనెక్షన్లలో 26,679, కడప జిల్లాకు మంజూరైన 53,333 కనెక్షన్లలో 13,283 కనెక్షన్లు రద్దు చేసి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించినట్లు సమాచారం. మిగతా కనెక్షన్లకు సంబంధించి కూడా ప్రాంతాల వారీగా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి అక్కడికక్కడే రద్దు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా దీపం పథకం కింద కొత్తగా మంజూరు చేసిన లక్ష దీపం కనెక్షన్లకు సంబంధించిన లబ్ధ్దిదారుల జాబితా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించా రు. రాష్ట్రంలో 1999 నుంచి ప్రభుత్వం దీపం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద కనెక్షన్ పొందే లబ్ధిదారులు రూ. 1600 డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. అందుకే వీటికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఇలావుండగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరులో 277, కడపలో 360, అనంతపురంలో 589, కర్నూలులో 187 చౌక దుకాణాల డీలర్ పోస్టులు అధికారికంగా ఖాళీగా ఉన్నాయి. వీరి నియామకానికి సంబంధించి ప్రస్తుతం వున్న మార్గదర్శకాలను రద్దు చేసి కొత్త మార్గదర్శకాలు తయారు చేసి వెంటనే నియామకాలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆశించిన స్థాయిలో స్పందించని అధికారులను బదిలీ చేసే విషయమై మంత్రి సునీత.. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
కృష్ణా బోర్డు ఏర్పాటు కర్నూలులో లేనట్టే!
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్ : కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబంధించిన బోర్డు ఏర్పాటుకు ఆదిలోనే అడ్డంకులు పడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రాజెక్టుల పర్యవేక్షణకు అనుకూలంగా ఉంటుందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు భావించారు. అయితే కర్నూలులో బోర్డు ఏర్పాటు చేస్తే కృష్ణానది వరద జలాలపై నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీటి ఇబ్బందులు వస్తాయంటూ అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆ పార్టీ అధిష్టానం ద్వారా రాష్ట్ర విభజన కమిటీపై ఏర్పాటైన జీవోఎంపై ఒత్తిడి చేసి బోర్డును కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం. అందులో భాగంగా నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికారులతో కేంద్ర జలసంఘానికి రహస్య నివేదికలు అందజేసినట్లు తెలిసింది. దీనికి తోడు ఇరిగేషన్లో ఇద్దరు కీలక అధికారులు కూడా కోస్తా ప్రాంతానికి చెందినవారు కావడంతోనే ఎలాంటి సమావేశం లేకుండా ఏకపక్షంగా కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు జిల్లాలో ఏర్పాటు అయి ఉంటే వివిధ కేటగిరీల కింద కొత్తగా 700 ఉద్యోగాలు వచ్చేవి. కృష్ణానది జలాలపై ఆధారపడిన ప్రాజెక్టుల పర్యవేక్షణ వల్ల తాగు, సాగునీటి సమస్యలు కూడా కర్నూలు, కడప జిల్లాలకు వచ్చేవి కాదు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు పట్టించుకోకపోవడం, అనంతపురం జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు చక్రం తిప్పుతుండడంతో జిల్లాకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయా రాజకీయ పార్టీల నాయకులు స్పందించాలని, బోర్డును జిల్లాలోనే ఏర్పాటు చేసేలా ఒత్తిడి చేయాలని పలువురు అధికారులు కోరుతున్నారు. బోర్డు రాకపోతే ఆందోళనలు చేస్తాం నంద్యాల అర్బన్, న్యూస్‌లైన్ : కర్నూలులో కృష్ణా బోర్డును ఏర్పాటు చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని నంది రైతు సమాఖ్య గౌరవ ఉపాధ్యక్షుడు పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. రాయలసీమ జిల్లాలు కృష్ణా జలాలపై ఆధారపడ్డాయని, అందుకే కృష్ణ జలాల బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివారం స్థానిక నంది రైతు సమాఖ్య కార్యాలయంలో కార్యవర్గసభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలాల బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు వినతి పత్రాన్ని పంపారు. అనంతరం మాట్లాడుతూ కృష్ణా జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులు కర్నూలులోనే ఉన్నాయన్నారు. దిగువ ప్రాంతమైన విజయవాడలో కృష్ణా జలాల బోర్డును ఏర్పాటు చేయడం సబబు కాదని అన్నారు. ఆయకట్టు రైతాంగం కోరిక మేరకు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. లేని పక్షంలో సీమ ప్రాంత నాయకులు, రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. కృష్ణా జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా తాగు, సాగునీరు పంపిణీ న్యాయబద్ధంగా జరగాలంటే కర్నూలు ప్రాంతంలోనే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ముఖ్య సలహాదారుడు డాక్టర్ రవీంద్రనాథ్, అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, ట్రెజరర్ వెంకటసుబ్బారెడ్డి, సభ్యులు కొండామోహన్‌రెడ్డి, పుల్లారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, వీరయ్య, నాగరాజరావు పాల్గొన్నారు.