కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్ : కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబంధించిన బోర్డు ఏర్పాటుకు ఆదిలోనే అడ్డంకులు పడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రాజెక్టుల పర్యవేక్షణకు అనుకూలంగా ఉంటుందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు భావించారు. అయితే కర్నూలులో బోర్డు ఏర్పాటు చేస్తే కృష్ణానది వరద జలాలపై నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీటి ఇబ్బందులు వస్తాయంటూ అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆ పార్టీ అధిష్టానం ద్వారా రాష్ట్ర విభజన కమిటీపై ఏర్పాటైన జీవోఎంపై ఒత్తిడి చేసి బోర్డును కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం. అందులో భాగంగా నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికారులతో కేంద్ర జలసంఘానికి రహస్య నివేదికలు అందజేసినట్లు తెలిసింది.
దీనికి తోడు ఇరిగేషన్‌లో ఇద్దరు కీలక అధికారులు కూడా కోస్తా ప్రాంతానికి చెందినవారు కావడంతోనే ఎలాంటి సమావేశం లేకుండా ఏకపక్షంగా కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు జిల్లాలో ఏర్పాటు అయి ఉంటే వివిధ కేటగిరీల కింద కొత్తగా 700 ఉద్యోగాలు వచ్చేవి. కృష్ణానది జలాలపై ఆధారపడిన ప్రాజెక్టుల పర్యవేక్షణ వల్ల తాగు, సాగునీటి సమస్యలు కూడా కర్నూలు, కడప జిల్లాలకు వచ్చేవి కాదు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు పట్టించుకోకపోవడం, అనంతపురం జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు చక్రం తిప్పుతుండడంతో జిల్లాకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయా రాజకీయ పార్టీల నాయకులు స్పందించాలని, బోర్డును జిల్లాలోనే ఏర్పాటు చేసేలా ఒత్తిడి చేయాలని పలువురు అధికారులు కోరుతున్నారు.
బోర్డు రాకపోతే ఆందోళనలు చేస్తాం
నంద్యాల అర్బన్, న్యూస్‌లైన్ : కర్నూలులో కృష్ణా బోర్డును ఏర్పాటు చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని నంది రైతు సమాఖ్య గౌరవ ఉపాధ్యక్షుడు పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. రాయలసీమ జిల్లాలు కృష్ణా జలాలపై ఆధారపడ్డాయని, అందుకే కృష్ణ జలాల బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివారం స్థానిక నంది రైతు సమాఖ్య కార్యాలయంలో కార్యవర్గసభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలాల బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు వినతి పత్రాన్ని పంపారు. అనంతరం మాట్లాడుతూ కృష్ణా జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులు కర్నూలులోనే ఉన్నాయన్నారు.
దిగువ ప్రాంతమైన విజయవాడలో కృష్ణా జలాల బోర్డును ఏర్పాటు చేయడం సబబు కాదని అన్నారు. ఆయకట్టు రైతాంగం కోరిక మేరకు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. లేని పక్షంలో సీమ ప్రాంత నాయకులు, రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. కృష్ణా జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా తాగు, సాగునీరు పంపిణీ న్యాయబద్ధంగా జరగాలంటే కర్నూలు ప్రాంతంలోనే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ముఖ్య సలహాదారుడు డాక్టర్ రవీంద్రనాథ్, అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, ట్రెజరర్ వెంకటసుబ్బారెడ్డి, సభ్యులు కొండామోహన్‌రెడ్డి, పుల్లారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, వీరయ్య, నాగరాజరావు పాల్గొన్నారు.
కృష్ణా బోర్డు ఏర్పాటు కర్నూలులో లేనట్టే!
Published Mon, May 19 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement