Krishna Basin
-
సాగుకే కాదు.. తాగు నీరూ ఉండదు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో, ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సర్కారు తీరు ఇలాగే ఉంటే కృష్ణా బేసిన్లో సాగు నీటికే కాదు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై విచారిస్తున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు విన్పించేలా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు న్యాయవాదులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా నిర్లక్ష్యం వహిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని, జలాలను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుందంటూ 2013లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది నివేదికను ఇప్పటి విచారణలో చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ–1956లో సెక్షన్–3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. దీనినీ వాదనల్లో వినిపించి ఉంటే ట్రిబ్యునల్ నిర్ణయం మరోలా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను ఆ ట్రిబ్యునలే ఉల్లంఘించినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పలేకపోయిందని ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన వాదనల వల్లే సెక్షన్–3 కింద కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన అదనపు విధి విధానాల మేరకు కృష్ణా జలాల పంపిణీపై ముందుగా వాదనలు వింటామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేస్తున్నారు. నాడే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులుఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల పంపిణీకి 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపిణీకి ఎంచుకున్న న్యాయ సూత్రాలపై ముందుగా అధ్యయనం చేసిన ఈ ట్రిబ్యునల్ 1976 మే 27న తీర్పు ఇచ్చింది. ‘ఫస్ట్ ఇన్ టైమ్ ఫస్ట్ ఇన్ రైట్ (మొదటి ప్రాజెక్టు నిర్మించి నీటిని వినియోగించుకున్న వారికే మొదటి హక్కు)’ న్యాయసూత్రంగా నిర్దేశించుకుంది. చారిత్రక ఒప్పందాలు, వినియోగాల ప్రాతిపదికగా 1951 నాటికే పూర్తయిన ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెపెంబరు మధ్య పూర్తయిన ప్రాజెక్టులు, 1960 సెప్టెంబరు తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా వర్గీకరించి నీటిని కేటాయించింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో కలిపి 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్కకట్టింది. ఆ ప్రాతిపదికన మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలో అప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ 749.16 టీఎంసీలను కేటాయించింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు, ఆవిరి నష్టాల రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలు, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు.. మొత్తం 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. వాటిని ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఈ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే.. రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాకు 387.34 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా ఆధునికీకరణలో మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణలోని బీమా ఎత్తిపోతలకు కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కుతాయి. ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.పునఃపంపిణీ చట్టవిరుద్ధంబచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో స్పష్టం చేసింది. ఇక విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్–85(7)ఈ–4 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. దీన్ని బట్టి చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే. దానిప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా అంటే 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపైనే ప్రస్తుతం ఆ ట్రిబ్యునల్ విచారణ చేయాలి. అందులోనూ తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను తుది నివేదికలో కేటాయించినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెల్లడించింది. వీటిని మినహాయిస్తే మిగతా 165 టీఎంసీల కేటాయింపులో విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వకుర్తిలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ.. ఇందుకు భిన్నంగా సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల పునఃపంపిణీపై విచారణ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు.అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) – 1956 సెక్షన్ 6(2) ప్రకారం.. నదీ జల వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. ఆ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి వీల్లేదు. ఆ మేరకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) చేసిన కేటాయింపుల జోలికి వెళ్లడంలేదు. ఆ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే ప్రాజెక్టుల పరిస్థితి తలకిందులై గందరగోళానికి దారితీస్తుంది.– కేంద్ర ప్రభుత్వానికి 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) స్పష్టీకరణ -
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. శనివారం సాయంత్రానికి 1,74,120 క్యూసెక్కులు వస్తోంది. దిగువ ప్రాజెక్ట్‌లకు 99,488 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.398 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.371 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రానికి జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. కాగా, నాగార్జునసాగర్ జలాశయం నుంచి 16 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,29,600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగుల వద్ద ఉంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం. ఇక్కడ నుంచి కుడి కాలువకు 6,112, ఎడమ కాలువకు 6,173, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 29,597, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు విడుదలవుతోంది. కాగా.. ప్రకాశం బ్యారేజీ నుంచి 84,297 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఇందులో కేఈ మెయిన్‌కు 4,028, కేడబ్ల్యూ మెయిన్‌కు 2,519, డెల్టాలోని కాలువలకు 6,547 క్యూసెక్కుల చొప్పున నీటిని వదిలారు. -
కృష్ణాలో 3,048.37 టీఎంసీలా?
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఏటేటా నీటి లభ్యత తగ్గుతోందని.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు అంచనా వేసినంత కూడా రావడంలేదని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన చెందుతుంటే.. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరిగిందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చెబుతోంది. కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 వరకు 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై తాజాగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ బుధవారం ఆ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం కృష్ణాలో 3,048.37 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ 2,130 టీఎంసీల లభ్యత ఉందని తేల్చితే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీలు ఉన్నట్లు నిర్ధారించింది. ఆ రెండు ట్రిబ్యునళ్లు నిర్ధారించిన దానికంటే అధికంగా 875 టీఎంసీల లభ్యత ఉన్నట్లుగా సీడబ్ల్యూసీ తాజాగా వెల్లడించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల సమయంలో పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాలో సీడబ్ల్యూసీ చెప్పినంతగా నీటి లభ్యత ఉండదని తేల్చిచెబుతున్నారు. కేవలం 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనాలకే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ ఇదీ..మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకునే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా బేసిన్ 2,59,439 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యంలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. మహారాష్ట్రలో 26.60 శాతం, కర్ణాటకలో 43.80 శాతం, తెలంగాణలో 19.80, ఆంధ్రప్రదేశ్‌లో 9.80 శాతం కృష్ణా బేసిన్ విస్తరించి ఉంది. నదిలో కోయినా, వర్ణ, పంచ్‌గంగా, దూద్‌గంగా, ఘటప్రభ, మలప్రభ, బీమా, తుంగభద్ర, కాగ్నా, మూసీ, మున్నేరు వంటి ప్రధాన ఉప నదులు కలుస్తాయి.తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు..కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 843.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనివల్ల ఏటా సగటున 7,725.80 టీఎంసీల ప్రవాహం ఉంది. ఈ 38 ఏళ్లలో గరిష్టంగా 2005–06లో 1,169.70 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 10,716.60 టీఎంసీల ప్రవాహం ఉంది. కనిష్టంగా 2018–19లో 568.38 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 5,207.50 టీఎంసీల ప్రవాహం ఉంది.1985–86 నుంచి 2022–23 మధ్య కృష్ణాలో సగటున 3,048.37 టీఎంసీల లభ్యత ఉంది. 2025–26లో గరిష్టంగా 5,250.70 టీఎంసీల లభ్యత ఉండగా.. 2018–19లో కనిష్టంగా 1,818.70 టీఎంసీల లభ్యత ఉంది.1985–2023 మధ్య బేసిన్లో సాగునీటి అవసరాలకు ఏటా సగటున 1,781.28 టీఎంసీలను వినియోగించుకున్నారు.బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటు 96.06 టీఎంసీలు. -
కృష్ణా బేసిన్‌లోని జలాశయాలు ఖాళీ
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో జలాశయాలన్నీ ఖాళీ అయ్యాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి రాష్ట్రంలోని పులిచింతల ప్రాజెక్టు వరకూ అన్ని జలాశయాల్లోనూ నీటి నిల్వ కనిష్ట స్థాయికి చేరింది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల పశ్చిమ కనుమలు, బేసిన్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి బుధవారం 7,490 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 24.68 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇది నిండాలంటే 105.04 టీఎంసీలు అవసరం. ఇక ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు. ప్రస్తుతం 24.2 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే ఇంకా 13.42 టీఎంసీలు అవసరం. అంటే.. 118.46 టీఎంసీలు చేరితేగానీ ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండవు. ఆ రెండు జలాశయాలు నిండాక గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ప్రస్తుతం జూరాలలో 7.65 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో 2.01 టీఎంసీలు చేరితే అదీ నిండుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 34.52 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం నిండాలంటే 181.29 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌లో 122.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండాలంటే 189.2 టీఎంసీలు అవసరం. సాగర్ దిగువన రాష్ట్రంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజీ స్థాయిలో 0.77 టీఎంసీలున్నాయి. అది నిండాలంటే 45 టీఎంసీలు అవసరం. కృష్ణా నదికి ప్రధాన ఉప నది అయిన తుంగభద్రపై నిర్మించిన మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్‌లో 5.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర నిండాలంటే ఇంకా 100 టీఎంసీలు అవసరం. -
నీళ్లు.. నేలమట్టం.. డెడ్ స్టోరేజీలో జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో 2015–16 తర్వాత ఇంతగా నీటి సమస్య రావడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు 2023–24 నీటి సంవత్సరం (వాటర్ ఇయర్ – జూన్ నుంచి మే వరకు)లో తగిన వరద రాలేదు. నిజానికి మొదట్లో రాష్ట్రంలో సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా.. అక్టోబర్ తర్వాత వానలు జాడ లేకుండా పోయాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సాధారణ వర్షపాతంతో పోల్చితే.. 56.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో జలాశయాల్లోకి కొత్త నీరు చేరక.. ఉన్న నీటి నిల్వలు శరవేగంగా అడుగంటిపోతూ వచ్చాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో 14 ప్రధాన జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీనితో మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా కటకట తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ జూన్‌లో వానలు ఆలస్యంగా మొదలైతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ‘కృష్ణా’లో ఏడేళ్ల తర్వాత మళ్లీ కరువు.. ఏడేళ్ల తర్వాత ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఇన్‌ఫ్లో వచ్చింది. శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల వరద వస్తుందని అంచనా. కానీ 2015–16లో అతి తక్కువగా 71 టీఎంసీలే చేరింది. ఆ తర్వాత మళ్లీ 2023–24లో 144.36 టీఎంసీలు మాత్రమే వరద వచ్చింది. ఇక నాగార్జునసాగర్‌కు కూడా సాధారణంగా వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీలు రావాల్సి ఉండగా.. 2015–16లో కేవలం 72 టీఎంసీలు.. ఆ తర్వాత మళ్లీ తక్కువగా ఈసారి 147 టీఎంసీలు వరద మాత్రమే వచ్చింది. కనీస నిల్వలూ కరువే! శ్రీశైలం జలాశయంలో సాగునీటి అవసరాలకు ఉండాల్సిన కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 854 అడుగులుకాగా.. ఇప్పటికే 810 అడుగులకు పడిపోయింది. నిల్వలు 34.29 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 510 అడుగులుకాగా.. ప్రస్తుతం 511.5 అడుగుల వద్ద ఉంది. నిల్వలు 134.23 టీఎంసీలకు తగ్గిపోయాయి. అయితే ఇందులో వాడుకోగల నీళ్లు అతి తక్కువే. ఇక జూరాల ప్రాజెక్టు కనీస మట్టం 1033 అడుగులకుగాను.. ఇప్పటికే 1031.27 అడుగులకు పడిపోయింది. గోదావరిలో మూడేళ్ల కనిష్టానికి వరదలు గోదావరి నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ ఏడాది ఇన్‌ఫ్లోలు గణనీయంగా తగ్గాయి. ఇంత తక్కువ వరదలు రావడం మూడేళ్ల తర్వాత ఈసారే. కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2023–24లో 203.73 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20 తర్వాత ఇంత తక్కువ వరద రావడం ఇదే తొలిసారి. 2022–23లో 593 టీఎంసీలు, 2021–22లో 678 టీఎంసీలు, 2020–21లో 368 టీఎంసీలు వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 2019–20 తర్వాత ఈసారి అతితక్కువగా 396 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో 7.53 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. 20.1 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే సమయానికి 12.26 టీఎంసీల నీళ్లు ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మిడ్ మానేరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. దిగువ మానేరుకు సైతం 2019–20 తర్వాత అతితక్కువగా ఈ ఏడాది 78 టీఎంసీలే ఇన్‌ఫ్లో నమోదైంది. ఒకేసారి వచ్చి.. లాభం లేక.. గోదావరిపై ప్రధాన ప్రాజెక్టుల్లోకి వందల టీఎంసీల్లో నీరు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నా.. అదంతా భారీ వరద కొనసాగే కొద్దిరోజుల్లోనే కావడం గమనార్హం. అప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. తర్వాత వానలు లేక ఇన్‌ఫ్లో లేకుండా పోయింది. ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితి వచ్చింది. మంజీరా వెలవెల సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్‌లోనూ నీళ్లు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాలకు మంజీరా నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఏప్రిల్ తొలివారంలోనే ఇలా ఉంటే.. మే వచ్చే సరికి నీటి సరఫరా పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
170 మండలాల్లో కరువు ఛాయలు 'భూగర్భ శోకం'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి పతనమయ్యాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 170 మండలాల్లో కరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి. బోరుబావుల్లో నీళ్లు అడుగంటడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు (24.08 అడుగులు) ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్ల (28.54 అడుగులు)కు పడిపోవడమే అందుకు కారణం. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 1.36 మీటర్ల (4.46 అడుగుల) మేర భూగర్భ జలాలు పడిపోయాయి. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల వ్యవధిలోనే ఒక మీటర్ మేర క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గత నెలలో ఉన్న భూగర్భ జలాల స్థితిగతులపై భూగర్భజల శాఖ రూపొందించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,718 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ఆ శాఖ ప్రతి నెలా సమీక్షించి మరుసటి నెలలో నివేదికలను విడుదల చేస్తోంది. 11 జిల్లాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ... జిల్లా స్థాయిల్లో భూగర్భ జలమట్టాలను 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లకుపైన అనే కేటగిరీలుగా భూగర్భజలశాఖ వర్గీకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల (42.8 అడుగులు)కు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. మొత్తం 33 జిల్లాలకుగాను కేవలం జగిత్యాల జిల్లా 4.93 మీటర్ల (16.17 అడుగులు) భూగర్భ జలమట్టంతో 0–5 మీటర్ల కేటగిరీలో నిలిచింది. అంటే ఈ ఒక్క జిల్లాలోనే భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్యన, మరో 11 జిల్లాల్లో 10 మీటర్లకన్నా ఎక్కువగానే భూగర్భ జలమట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జలమట్టం 10 మీటర్లకు (32.8 అడుగులు)పైనే పడిపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు భావిస్తారు. 30 జిల్లాల్లో క్షీణత నమోదు.. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 జిల్లాల్లోని భూగర్భ జలమట్టాల్లో క్షీణత నమోదైంది. నాటితో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టాల్లో 0.15 మీటర్ల నుంచి 3.91 మీటర్ల వరకు వ్యత్యాసం కనిపించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.91 మీటర్ల వ్యత్యాసం కనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో నల్లగొండ జిల్లాలో భూగర్భ జలమట్టం 6.15 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.06 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నల్లగొండ జిల్లాపై తీవ్ర దుష్ప్రభావం పడినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాల్లో అత్యంత ప్రమాదకరం.. సిద్దిపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని దక్షిణాది ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణమధ్య, ఉత్తరాది ప్రాంతాలు, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మోస్తారు లోతు (మోడరేట్లీ డీప్), 20 మీటర్లకుపైన తీవ్ర లోతు (వెరీ డీప్)ల్లో ఉన్నట్టు నిర్ధారించారు. రాష్ట్ర భూభాగంలో 8 శాతం ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 24 శాతం ప్రాంతం పరిధిలో 10–15 మీటర్లు, 53 శాతం ప్రాంతం పరిధిలో 5–10 మీటర్లు, 15 శాతం ప్రాంతం పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలమట్టాలు నమోదయ్యాయి. 170 మండలాల్లో దశాబ్ద కాల కరువు... రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలను గత దశాబ్ద కాల (2014–2023) సగటు భూగర్భ జలమట్టాలతో పోల్చినప్పుడు ఫిబ్రవరిలో 170 (28%) మండలాల్లో భూగర్భ జలమట్టాలు 0.01 మీటర్ల నుంచి 17.08 మీటర్ల వరకు క్షీణించాయి. గత దశాబ్ద కాలంతో పోల్చినప్పుడు 442 (72%) మండలాల్లో మాత్రం నామమాత్ర స్థాయి నుంచి 15.52 మీటర్ల వరకు వృద్ధి చెందాయి. అంటే రాష్ట్రంలోని 170 మండలాల్లో గత దశాబ్దకాలంలో లేని కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి కాంపొనెంట్ (విభాగం) వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని పెట్టాలని నిర్ణయించారు. జలవిద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 ఔట్లెట్లు (శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేతోపాటు రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ ఫ్లడ్ కెనాల్–హెడ్ రెగ్యులేటర్–పరిసరాలు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం– పంప్‌హౌస్ పరిసరాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేతోపాటు రివర్, చూట్ స్లూయిస్, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్)లను బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి ఇరువురు ఈఎన్సీలు అంగీకారం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా 10 కాంపోనెంట్ల వద్ద మూడేసీ షిఫ్టులు (ఒక్కో షిప్టు 8 గం ఉండేలా ఇరు 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి అంగీకరించారు. అయితే నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్సీ సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి)ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయం మేరకు జరుగుతుందనే అంగీకారం ఇరువురి మధ్య కుదిరింది. అయితే నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేపట్టాలని నిర్ణయించారు. గంటన్నరపాటు సమావేశం... కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్‌లు హాజరవగా ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డితోపాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాలని తాము సమ్మతించినట్లు ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. అప్పటిదాకా అప్పగింత కుదరదు: తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రంగంలోకి దిగారు. నీటి వాటాలు తేలేదాకా, శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్‌పై స్పష్టత వచ్చేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీనిపై జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బహిర్గతం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ జనవరి 17న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించకున్నా అంగీకరించినట్లు పేర్కొంటూ మినిట్స్ విడుదల చేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఆ సమావేశంలో తాము లేవనెత్తిన పలు అంశాలను మినిట్స్‌లో పేర్కొనలేదని గుర్తుచేశారు. ఆ మినిట్స్‌ను సవరించాలని లేఖలో కోరారు. మరోవైపు కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన వెంటనే ప్రాజెక్టుల అప్పాగింతకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. తొలుత భేటీకి వెళ్లరాదనుకొని... అసలు కృష్ణా బోర్డు సమావేశాలకు హాజరు కాకూడదని అధికారులు తొలుత భావించినప్పటికీ తెలంగాణ అభిప్రాయాలను స్పష్టంగా బోర్డుకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు స్వయంగా హాజరయ్యారు. అయితే లేఖకు కట్టుబడే ఉండాలని సమావేశంలో తెలంగాణ భావించగా తద్విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగర్ పరిధిలో మొత్తం 8 కాంపోనెంట్లు ఉండగా అందులో 7 తెలంగాణ అదీనంలో ఉన్నాయి. వాటిలో ఐదింటిని అప్పగించడానికి, శ్రీశైలం పరిధిలో 7 కాంపోనెంట్లు ఉండగా అందులో తెలంగాణ అదీనంలో ఉన్న కాంపోనెంట్‌ను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్ ప్రకటన చేశారు. దాంతో విస్తుపోవడం తోటి అధికారుల వంతైంది. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు విడుదల చేశారు. దాంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈఎన్సీ ఒకదారిలో నడుస్తుండగా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరోదారిలో నడుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
‘సీతారామ’పై సందేహాలు.. కీలక ప్రశ్నలు లేవనెత్తిన గోదావరి యాజమాన్య బోర్డు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుల ఉమ్మడి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ప్రాజెక్టుతో దిగువన ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలకు నష్టం జరగదని నిర్ధారించాలని కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కోరింది. ప్రధానంగా 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఖరారు చేసిన మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద 561 టీఎంసీల లభ్యతకు రక్షణ కల్పించాలని సూచించింది. ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో భాగంగా సీడబ్ల్యూసీ గతంలో డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు పంపించింది. బోర్డు ఏమందంటే.. ఏపీ, తెలంగాణ మధ్య సమ్మతి లేదు.. రాష్ట్రాలు, ప్రాజెక్టుల వారీగా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నీటి కేటాయింపులు జరపలేదు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన గోదావరి జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. చివరకు ఉమ్మడి ఏపీకి గోదావరి జలాల లభ్యత, ప్రాజెక్టుల ద్వారా వినియోగం లెక్కలపై సైతం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు. నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తేల్చాలి.. ఇప్పటికే ఉన్న, నిర్మాణంలోని, నిర్మాణం ప్రారంభం కాని తమ ప్రాజెక్టుల అవసరాలకు 776 టీఎంసీలు అవసరమని ఏపీ, 967 టీఎంసీలు అవసరమని తెలంగాణ చెబుతున్నాయి. అయితే గోదావరిలో 1,743 టీఎంసీల మేరకు నీటి లభ్యత లేదని ఆయా రాష్ట్రాలే అంగీకరిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ 2014 జనవరి 2న రాసిన లేఖ ప్రకారం 1,486.155 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని తెలంగాణ అంటోంది. 2004 నాటి వ్యాప్కోస్ నివేదిక ప్రకారం కేవలం 1,360 టీఎంసీల లభ్యతే ఉందని, అలాగే 70 టీఎంసీల ఊట నీళ్ల లభ్యత ఉందని ఏపీ పేర్కొంటోంది. అయితే ఊట నీళ్లను పరిగణనలోకి తీసుకోరాదని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పేర్కొంటోంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా 2000–2020 మధ్యకాలంలో సగటున వరుసగా 72 టీఎంసీలు, 11 టీఎంసీలను వాడినట్టు తెలంగాణ పేర్కొంటోంది. ఈ అంశాల నేపథ్యంలో గోదావరి బేసిన్, సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అధ్యయనం జరగాలి. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా సీతారామ వద్ద గోదావరిలో 347.06 టీఎంసీల లభ్యత ఉందని ప్రాజెక్టు డీపీఆర్ పేర్కొంటోంది. దీనిపై అధ్యయనానంతరం సీడబ్ల్యూసీ నిర్ధారిత లెక్కలు పంపించాలి. గోదావరి జలాలను కృష్ణాకు ఎలా తరలిస్తారు? సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల ద్వారా 10.109 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కి తరలించి నాగార్జునసాగర్, వైరా, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించనున్నట్టు డీపీఆర్‌లో ప్రతిపాదించారు. అయితే తరలింపును సమర్థిస్తూ డీపీఆర్‌లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
నీటిలెక్కలు తేల్చడానికి రెడీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను కోటా కంటే అధికంగా వాడుకున్నారంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో.. నీటిలెక్కలు తేల్చేందుకు కృష్ణాబోర్డు సిద్ధమైంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిలెక్కలు తేల్చి.. కోటాలో మిగిలిన నీటిని లభ్యత ఆధారంగా కేటాయించేందుకు బోర్డు చైర్మన్ శివ్‌నంద్‌కుమార్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి అనువైన రోజును ఎంపిక చేయాలని రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులను కృష్ణాబోర్డు కోరింది. 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు దిగువ కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉందని.. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం) టీఎంసీలు, తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.72 టీఎంసీలను వాడుకున్నాయని తెలిపారు. అందులో ఏపీ 442.52 (52.2 శాతం) టీఎంసీలు, తెలంగాణ 404.20 (47.8 శాతం) టీఎంసీలు వాడుకున్నాయని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని, తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే అధికంగా 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుందని కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటా కంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 38.72 టీఎంసీలు వాడుకుందని, ఇకపై నీటిని వాడుకోకుండా కట్టడిచేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నీటిలెక్కలు తేల్చి వివాదానికి తెరదించడానికి కృష్ణాబోర్డు సిద్ధమైంది. -
10 రోజులు ఏపీ వ్యాప్తంగా అనూహ్య వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా అన్ని ప్రాంతాల్లోను పడుతుండడం ప్రత్యేకంగా చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నా గతంలో అది కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి అన్ని జిల్లాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధికం ఈ నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 17.69 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 10 రోజుల్లో 82.3 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ 99.99 మిల్లీమీటర్ల వర్షం పడింది. 8 జిల్లాల్లో 50 నుంచి 90 శాతం అధిక వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధిక వర్షం పడింది. అక్కడ 84.9 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 161.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో 70 శాతం, విజయనగరం జిల్లాలో 62.2 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61.2, ఏలూరు జిల్లాలో 66.4, కృష్ణాలో 51, గుంటూరు జిల్లాలో 64.5, పల్నాడు జిల్లాలో 50.4 శాతం అధిక వర్షం కురిసింది. ఒక్క నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షం పడింది. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లు కళకళ భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లలోకి బాగా నీరు చేరి కళకళలాడుతున్నాయి. గోదావరి బేసిన్లో లక్ష్మి, సమ్మక్క బ్యారేజీల నుంచి దిగువకు భారీగా నీటిని వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో తుంగభద్ర, సుంకేశుల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీ నిండిపోవడంతో 10 రోజులుగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా బేసిన్లో గండికోట, మైలవరం, సోమశిల రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో నీటిని కిందకు వదులుతున్నారు. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. నైరుతి మురిసింది.. ఈ నైరుతి సీజన్లో రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 657 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 683.1 మిల్లీమీటర్లు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 41.3 శాతం అధిక వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 36.6, బాపట్ల జిల్లాలో 30.6 మిల్లీమీటర్ల అధిక వర్షం పడింది. మిగిలిన అన్ని జిల్లాల్లోను సాధారణ వర్షపాతం నమోదైంది. -
‘కృష్ణా’లో బోటింగ్ బంద్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో టూరిజం శాఖ బోటింగ్ కార్యకలాపాలు మళ్లీ బంద్ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు బోటింగ్ రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఉధృతి తగ్గటంతో తిరిగి ప్రారంభించారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం, శుక్రవారం రాత్రి నుంచి 48 గంటల పాటు పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల కారణంగా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కృష్ణా నదిలో బోటింగ్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. దీంతో భవానీపురంలో ఉన్న హరిత బరంపార్క్‌లోని బోటింగ్ పాయింట్ వద్ద బోట్లను నిలుపుదల చేశారు. భవానీ ద్వీపంలో కాటేజీల్లో ఇప్పటికే ఉన్న పర్యాటకుల రాకపోకలకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం బోట్లను పరిమితంగా నడుపుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు తిరిగి ఆదేశాలు ఇచ్చిన తరువాతే బోటింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఏపీ టూరిజం అధికారులు వెల్లడించారు. -
అన్నీ మంచి శకునములే
సాక్షి, అమరావతి: నీటి సంవత్సరం ప్రారంభమైన 6 రోజుల్లోనే నారాయణపూర్ డ్యామ్‌లోకి 4 టీఎంసీలు చేరాయి. ఆల్మట్టిలోకి 1.1, తుంగభద్ర డ్యామ్‌లోకి 2.2 టీఎంసీలు చేరాయి. ఎన్నడూ లేని రీతిలో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలో అధికంగా నీటి నిల్వలు ఉన్నాయి. ఈ నెల మూడు, నాలుగో వారాల్లో కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ శ్రీశైలానికి కృష్ణమ్మ ముందుగానే చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నీ మంచి శకునములే కనిపిస్తుండటంతో కృష్ణా బేసిన్లో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నీటి సంవత్సరం ముగిసే నాటికి అధిక నీటి నిల్వ కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లో సోమవారం నాటికి 129.72 టీఎంసీలకు గాను 48.9 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ డ్యామ్‌లో 37.64 టీఎంసీలకు గాను 30.49 టీఎంసీలు ఉన్నాయి. ఈ రెండు డ్యామ్‌లు నిండటానికి 87.97 టీఎంసీలు అవసరం. తుంగభద్ర డ్యామ్‌లో 100.86 టీఎంసీలకు గాను 39.48 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ డ్యామ్ నిండటానికి 61.38 టీఎంసీలు అవసరం. గతేడాది కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల దాదాపు 8 నెలలపాటు ప్రవాహం కొనసాగడంతో సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోగా నీటి సంవత్సరం ముగిసే నాటికి (జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభమై మే 31తో ముగుస్తుంది) ఆల్మట్టి, నారాయణపూర్ తుంగభద్ర డ్యామ్‌లలో అధికంగా నీటి నిల్వ ఉండటం ఇదే ప్రథమం. ప్రారంభంలోనే వరద ప్రవాహం నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కృష్ణా బేసిన్లో ఎగువన జూన్ 1 నుంచి 3 వరకూ వర్షాలు కురిశాయి. దాంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆరు రోజుల్లోనే ఆల్మట్టిలోకి 1.1 టీఎంసీలు చేరగా.. దానికి దిగువన ఉన్న నారాయణపూర్‌లోకి 4 టీఎంసీలు చేరాయి. తుంగభద్ర డ్యామ్‌లోకి 2.2 టీఎంసీలు చేరాయి. కృష్ణా బేసిన్లో ఎగువన ప్రధానంగా పశ్చిమ కనుమల్లో ఈ నెల 3, 4 వారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు వర్షాలు కురిస్తే నెలాఖరు నాటికే ఆల్మట్టి, నారాయణపూర్ నిండే అవకాశం ఉంది. అప్పుడు జూలై మొదటి లేదా రెండో వారం నాటికే శ్రీశైలానికి కృష్ణమ్మ చేరే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలై 17న ఎగువ నుంచి కృష్ణమ్మ శ్రీశైలానికి చేరగా.. ఈ ఏడాది అంతకంటే ముందుగానే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
రాష్ట్రంలో ఇక బొగ్గు తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలున్న చింతలపూడి సెక్టార్–1, కృష్ణా జిల్లాలోని సోమవరం వెస్ట్ బ్లాక్‌లో తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ.. సెక్టార్–1, సోమవరం వెస్ట్ బ్లాక్‌లను వేలం వేసేందుకు వీలుగా బిడ్లను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 99 బొగ్గు బ్లాక్‌ల వేలానికి బిడ్లు ఆహ్వానించగా వాటిలో ఏపీకి చెందిన ఈ రెండు ఉన్నాయి. విభజనతో ఏపీ కోల్పోయిన సింగరేణి బొగ్గు లోటును చింతలపూడి తీర్చనుంది. అత్యంత నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సర్వేల్లో స్పష్టమైంది. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, కృష్ణా బేసిన్లో అపారమైన బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో బొగ్గు నిల్వల కోసం సుదీర్ఘకాలం సర్వేలు, పరిశోధనలు జరిగాయి. 1964 నుంచి 2006 వరకు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో పాటు.. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, తడికలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 1996–2001 మధ్య కాలంలో ఖనిజాన్వేషణ సంస్థ సర్వే నిర్వహించి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బొగ్గు నిల్వలున్నట్టు నిర్ధారించింది. తక్కువ లోతులో.. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 3,000 మిలియన్ టన్నుల నాణ్యమైన డీ, ఎఫ్ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అది కూడా భూ ఉపరితలానికి 200 నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నట్టు తేల్చింది. చింతలపూడిలో 300 మిలియన్ టన్నులు, రాఘవాపురంలో 997 మిలియన్ టన్నులు, సోమవరంలో 746 మిలియన్ టన్నులున్నట్టు నిర్ధారించింది. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో పుష్కలంగా బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి మండలం గురుభట్లగూడెం, రాఘవాపురం చుట్టు పక్కల గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు 1,000 అడుగుల మందంలో, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం గ్రామాల్లో 70 అడుగుల లోతులో నాణ్యమైన బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి సెక్టార్–1.. పట్టాయిగూడెం, నామవరం, వెంకటాద్రిగూడెం, లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో సుమారు 12.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే సోమవరం వెస్ట్ కోల్ బ్లాక్.. చాట్రాయి మండలం సూర్యాపల్లి, చెక్కపల్లి, అక్కిరెడ్డిగూడెం, రమణక్కపేట పరిధిలో 15.11 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వేలానికి బ్లాక్‌లు ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని వివిధ బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేలం వేస్తోంది. దీని కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో కృష్ణా జిల్లా సోమవరం బ్లాక్‌ను కూడా వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. బిడ్లు దాఖలు కాకపోవడంతో సోమవరం బ్లాక్ కేటాయింపులు జరగలేదు. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ నెల 16న దేశంలోని 99 బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో చింతలపూడి సెక్టార్–1తో పాటు సోమవరం వెస్ట్ బ్లాక్‌ను కూడా చేర్చింది. బొగ్గు మైనింగ్‌పై వచ్చే రెవెన్యూలో వాటా ఆధారంగా వేలం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేస్తారు. -
ప్రాజెక్టుల అప్పగింతపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులను ఆయా బోర్డులకు అప్పగించే విషయం ఎటూ తేలడం లేదు. బోర్డుల భేటీలో నిర్ణయించిన మేరకు తొలిదశలో గుర్తించిన ప్రాజెక్టులను స్వాధీనం చేయాల్సి ఉన్నా తెలంగాణ తేల్చక పోవడంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు వీలుగా గోదావరి బేసిన్‌లోని పెద్దవాగును అప్పగిం చాలని తెలంగాణకు గోదావరి బోర్డు ఇప్పటికే లేఖ రాసింది. కృష్ణా బేసిన్ ఔట్లెట్ల అప్పగింతపై ఒకట్రెండు రోజుల్లో కృష్ణా బోర్డు కూడా లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ప్రతిపాదించిన 15 ఔట్లెట్లలో 9 తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఇందులో శ్రీశైలం, నాగార్జున సాగర్‌పై ఉన్న 3 పవర్‌హౌస్‌లను అప్పగించేది లేదని తెలంగాణ తొలినుంచీ చెబుతోంది. బచావత్ అవార్డుకు విరుద్ధం ఈ ఔట్లెట్ల ఆపరేషన్ ప్రోటోకాల్‌పై రాష్ట్రం ఓ కమిటీని నియమించింది. కాగా ఆ కమిటీ ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణా బోర్డు తెరపైకి తెచ్చిన మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. కమిటీ అభిప్రాయాలను రాష్ట్రం బోర్డుకు తెలియజేసింది. కృష్ణా నీటి పంపిణీ, వినియోగం, ప్రాజెక్టుల ఆపరేషన్‌న్ ప్రొటోకాల్‌పై నిర్దిష్టమైన విధానాన్ని బచావత్ ఇప్పటికే స్పష్టీకరించిన నేపథ్యంలో దానినే బోర్డు అమలు చేయాలని డిమాండ్ చేసింది. బోర్డు రూపొందించిన మార్గదర్శకాలు, నిర్వహణ విధానంలో అవసరమైన మార్పులు చేయాలని కోరింది. దీనిపై బోర్డులు ఎలాంటి వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవలే గోదావరి బేసిన్‌లోని పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. మరోవైపు ఔట్లెట్ల అప్పగింతపై కృష్ణా బోర్డు కూడా ఒకట్రెండు రోజుల్లో లేఖ రాయనున్నట్టు తెలిసింది. అనంతరం తెలంగాణ స్పందించే తీరునుబట్టి తదుపరి కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా గత బోర్డు భేటీలో తీర్మానించిన మేరకు ప్రాజెక్టులను తమకు అప్పగించాలనే అంశంపై సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి, ఇతర సభ్యుల వద్ద కొంత కసరత్తు జరిగింది. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌ను బోర్డు పరిధిలోకి తెండి రాజోలిబండ హెడ్‌వర్క్స్‌ను సైతం కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం బోర్డుకు లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల అప్పగింతపై కొన్ని ప్రాజెక్టులను గుర్తించినప్పటికీ అందులో తెలంగాణ, ఏపీలకు అవతలగా ఉందంటూ ఆర్డీఎస్ హెడ్ వర్క్స్‌ను బోర్డు పరిధి లోకి తేలేదని లేఖలో పేర్కొన్నారు. ఆర్డీఎస్ కింద 15.90 టీఎంసీల మేర తెలంగాణ రాష్ట్రానికి వాడుకునే అవకాశం ఉందని, దీనిద్వారా 87,500 ఎకరాల ఆయకట్టు పారాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే ఎన్నడూ తెలంగాణకు తగినంత నీరు రాలేదని, గడిచిన 15 ఏళ్లుగా కాల్వల ఆధునికీకరణ చేయాలని కోరుతున్నా.. ఏపీ సహకరించకపోవడంతో ఆ పనులు ముందుకు కదలడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రం వాటా ఇప్పించాలని కోరారు. -
సగానికి చేరిన ఎస్సారెస్పీ
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహాలు పెరుగుతున్నాయి. ఎగువ వర్షాలకు రాష్ట్ర పరిధిలోని పరీవాహకంలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. 92 వేల క్యూసెక్కులకుపైగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో నిల్వలు 90 టీఎంసీలకుగానూ 47.70 టీఎంసీలకు చేరగా, ఈ సీజన్లోనే ప్రాజెక్టులోకి కొత్తగా 30 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 33.98 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండగా, ఈ ఏడాది మాత్రం మరో 13 టీఎంసీలు అదనంగా ఉండటం ఆయకట్టు రైతులకు పెద్ద ఊరటనిస్తోంది. గోదావరి బేసిన్లో ఇతర ప్రాజెక్టులకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి ప్రవాహాలు వస్తున్నా యి. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో సింగూరు, లోయర్‌మానేరు, కడెం, మిడ్‌మానేరులో ప్రవాహాలు స్ధిరంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కడెం, లోయర్‌మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ఈ ప్రవాహాలు మరింత పుంజుకునే అవకాశాలున్నట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టే ప్రాజెక్టు ఇంజనీర్లను అప్రమత్తం చేసింది. కృష్ణా బేసిన్లో అప్రమత్తం ఇక కృష్ణా బేసిన్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కృష్ణా నది జన్మస్థలి అయిన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో 120 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో దిగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీ వరద ప్రవాహాలు నమోదయ్యే అవకాశముంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో భారీగా ప్రవాహాలు వచ్చే దృష్ట్యా ప్రాజెక్టుల నిల్వలపై దృష్టి పెట్టాలని, డ్యామ్‌ల్లో నీటి నిల్వలు నిండుగా ఉంచకుండా కొంత ఖాళీగా ఉంచేలా నిర్వహణ చేపట్టాలని సూచించింది. దీంతో ఆల్మట్టిలో 129 టీఎంసీలకుగానూ 93.83 టీఎంసీల నిల్వలు ఉంచి ప్రస్తుతం వస్తున్న 10 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌కి 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఆ నీటిని దిగువకు వదులుతున్నారు ఈ నీరంతా జూరాలకు చేరనుంది. ప్రస్తుతం జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కేవలం వందల క్యూసెక్కుల్లో మాత్రమే నీటి ప్రవాహాలు వస్తున్నాయి. -
ఆధునికీకరణ ముసుగులో ‘కర్ణాటకం’
సాక్షి, అమరావతి: విస్తరణ, పునరుద్ధరణ, ఆధునికీకరణ (ఈఆర్ఎం) పథకం ముసుగులో నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి అక్రమంగా 15–20 టీఎంసీల కృష్ణాజలాలను అదనంగా తరలించడానికి కర్ణాటక సిద్ధమైంది. 2018–19 ధరల ప్రకారం రూ.2,794 కోట్లతో నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ఆధునికీకరణ పనులు చేపట్టడానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక (పీపీఆర్)ను శుక్రవారం కర్ణాటక జలవనరులశాఖ సీఈ ఎస్.రంగారాం కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) సమర్పించారు. ఇప్పటికే అప్పర్ కృష్ణా మూడోదశ ద్వారా 130, అప్పర్ భద్ర ద్వారా 29.90 టీఎంసీలు వెరసి 159.90 టీఎంసీలను అదనంగా వినియోగించుకోవడానికి సిద్ధమైన కర్ణాటక.. తాజాగా నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ద్వారా 15 నుంచి 20 టీఎంసీలను మళ్లించేందుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సంవత్సరాల్లో దిగువ కృష్ణా బేసిన్‌లోని తెలుగు రాష్ట్రాలకు సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఏకపక్షంగా సాంకేతిక అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పర్ కృష్ణా మూడోదశతోపాటు తాజాగా కర్ణాటక చేపట్టిన నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ఆధునికీకరణ పనులకు సాంకేతిక అనుమతి ఇచ్చే విషయంలో సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు వ్యవహరిస్తుందా, లేదా.. అన్నది తేలాల్సి ఉంది. అదనంగా 1.49 లక్షల ఎకరాల ఆయకట్టు అప్పర్ కృష్ణా ప్రాజెక్టు తొలి, రెండోదశల కింద నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కర్ణాటక ఇప్పటికే 22.40 టీఎంసీలను తరలిస్తూ రాయచూర్ జిల్లాలో 2,07,564 ఎకరాలకు నీళ్లందిస్తోంది. తాజాగా ఈ కాలువను ఈఆర్ఎం పథకం కింద ఆధునికీకరించడం ద్వారా 3,56,882 ఎకరాలకు నీళ్లందించడానికి పీపీఆర్‌ను రూపొందించింది. రూ.2,794 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టడానికి సిద్ధమైంది. అంటే నారాయణపూర్ కుడికాలువ ఆధునికీకరణ ముసుగులో కొత్తగా 1,49,318 ఎకరాలకు నీళ్లందించడానికి కర్ణాటక ప్రణాళిక రచించింది. ఇందుకు అదనంగా 15 నుంచి 20 టీఎంసీలు తరలించడానికి సిద్ధమవడం గమనార్హం. కేటాయింపులకు మించి వినియోగం కృష్ణాజలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయించింది. ఇప్పటికే కేటాయింపులకు మించి కర్ణాటక కృష్ణాజలాలను ఉపయోగించుకుంటోంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతానికి, 65 శాతానికి మధ్యన లభ్యతగా ఉన్న 448 టీఎంసీల జలాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో కర్ణాటక వాటా 177 టీఎంసీలు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఇప్పటివరకు కేంద్రం నోటిఫై చేయలేదు. కానీ.. కర్ణాటకకు ఉన్న కేటాయింపులు, వినియోగం, లభ్యత, మిగిలిన జలాలను ఏమాత్రం లెక్కించకుండా.. అంతరాష్ట్ర నదీజల వివాదాల చట్టాన్ని తుంగలో తొక్కి.. దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. నాలుగు నెలల కిందట అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకోవడానికి అనుమతి కోరుతూ అప్పర్ కృష్ణా మూడోదశ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించిన కర్ణాటక.. తాజాగా నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ విస్తరణ పీపీఆర్‌ను సమర్పించింది. -
ఇదేం లెక్క.. కృష్ణా?
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతం (బేసిన్)లో సరాసరి నీటి లభ్యత 3,144.42 టీఎంసీలని తాజాగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీలని లెక్కగట్టింది. అయితే కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేయగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీల లభ్యత ఉంటుందని వెల్లడించింది. సీడబ్ల్యూసీ 1993లో తొలిసారి నిర్వహించిన అధ్యయనంలో కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,069.08 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగట్టింది. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు, సీడబ్ల్యూసీ తొలిసారి జరిపిన అధ్యయనాల్లో తేల్చిన దానికంటే కృష్ణాలో సుమారు 20 శాతం నీటి లభ్యత అధికంగా ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ తేల్చడం గమనార్హం. కృష్ణాలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోవడంతో ట్రిబ్యునళ్ల అంచనాల మేరకు కూడా నీళ్లు రావడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంస్థలు, ట్రిబ్యునళ్లు తేల్చిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ వెల్లడించడంపై అపార అనుభవం కలిగిన ఇంజనీర్లు, అంతరాష్ట్ర జలవనరుల విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారు లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కించడం అశాస్త్రీయమని, వీటిని కచ్చితమైన లెక్కలుగా పరిగణించలేమని స్పష్టం చేస్తున్నారు. బేసిన్లో కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యత లెక్కించడం శాస్త్రీయమని, బచావత్ ట్రిబ్యునల్, 1993లో సీడబ్ల్యూసీ ఇదే రీతిలో అధ్యయనం చేశాయని గుర్తు చేస్తున్నారు. వర్షపాతం పెరగడం వల్లే..!! దేశవ్యాప్తంగా 1985 నుంచి 2015 మధ్య వరద ప్రవాహాల ఆధారంగా నదుల్లో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీతో కలిసి అధ్యయనం చేసింది. కృష్ణా బేసిన్లో వర్షపాతం, వరద ప్రవాహం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఆవిరి, ఆయకట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నీటి లభ్యత లెక్కగట్టింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ.. ► 1955–84 మధ్య కృష్ణా బేసిన్లో సగటు వర్షపాతం 842 మిల్లీమీటర్లు. 1965–84 మధ్య కాలంలో సగటు వర్షపాతం 797 మిల్లీమీటర్లకు తగ్గింది. 1985–2015 మధ్య బేసిన్లో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్లకు పెరిగింది. ► 2010–11లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో 9,607.85 టీఎంసీలు వచ్చాయి. ఇందులో నదిలో 4,164.81 టీఎంసీల లభ్యత వచ్చింది. 2002–03లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో 5,457.16 టీఎంసీలే వచ్చాయి. ఇందులో నదిలో 1,934.63 టీఎంసీల లభ్యత వచ్చింది. ► 1985–2015 మధ్య కాలంలో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్ల వల్ల ఏడాదికి 226 బిలియన్ క్యూబిక్ మీటర్లు (7,980.96 టీఎంసీలు) వచ్చాయి. ఇందులో కృష్ణా నదిలో సరాసరి సగటున 3,144.42 టీఎంసీల లభ్యత ఉంటుంది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ► గతంతో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం పెరగడం వల్లే కృష్ణాలో నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. 8,070 చ.కి.మీ. పెరిగిన బేసిన్ విస్తీర్ణం.. ► మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబలేశ్వర్కు సమీపంలో పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 1,337 మీటర్ల ఎత్తున జోర్ గ్రామం వద్ద పురుడు పోసుకునే కృష్ణమ్మ 1,400 కి.మీ. ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణాకు మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, బీమా, వేదవతి, మూసీ తదితర 12 ఉపనదులున్నాయి. ► కృష్ణా పరీవాహక ప్రాంతం 2,59,439 చదరపు కిలోమీటర్లలో విస్తరించిందని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. 1993లో సీడబ్ల్యూసీ అధ్య యనం జరిపినప్పుడు కృష్ణా బేసిన్ 2,51,369 చదరపు కిలోమీటర్లలో ఉంది. తాజాగా జియో స్పేషియల్ డేటా ఆధారంగా సర్వే చేయడం వల్ల బేసిన్ విస్తీర్ణం 8,070 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. ► 1985–86లో కృష్ణా బేసిన్లో 70,72,365 హెక్టార్ల ఆయకట్టు ఉండగా 2014–15 నాటికి 81,69,157 హెక్టార్లకు పెరిగింది. ► బేసిన్లో ఏటా 72.39 టీఎంసీలు ఆవిరవు తాయి. ఇందులో గరిష్టంగా శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోనే ఎక్కువగా ఆవిరవుతాయి. పదేళ్లలో ఏడేళ్లు తీవ్ర నీటి కొరత.. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రపదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. అయితే గత పదేళ్లలో ఏడేళ్లు ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు జలాలు రాలేదు. శ్రీశైలం జలాశయానికి 2011–12లో 733.935, 2012–13లో 197.528, 2014–15లో 614.07 టీఎంసీలు వస్తే 2015–16లో కేవలం 58.692 టీఎంసీలే వచ్చాయి. 2016–17లో శ్రీశైలం జలాశయానికి 337.95 టీఎంసీలు రాగా 2017–18లో 423.93, 2018–19లో 541.31 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అంటే 2011–12 నుంచి 2020–21 వరకూ గత పదేళ్లలో ఏడేళ్లు తెలుగు రాష్ట్రాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొన్నట్లు స్పష్ట మవుతోంది. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున ల్లు కేటాయించిన మేరకు కూడా కృష్ణా జలాలు రాష్ట్రాన్ని చేరలేదు. వీటిని పరిగణలోకి తీసుకుంటే సీడబ్ల్యూసీ తాజాగా చేసిన అధ్యయనం శాస్త్రీయం కాదని నీటిపారుదల నిపుణులు చేస్తున్న వాదన వంద శాతం వాస్తవమని స్పష్టమవుతోంది. -
ఒక్కటి తప్ప అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీ ప్రవాహాలు నమోదు కావడంతో నాలుగేళ్ల తర్వాత బుధవారం సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ నీరంతా నిజాంసాగర్‌కు వెళ్తుండటంతో అక్క డా ప్రవాహాలు పెరిగాయి. నేడో రేపో ఆ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. తెరుచుకున్న సింగూరు గేట్లు... సింగూరు ప్రాజెక్టులో బుధవారం ఉదయం మూడు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకుగానూ 28.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తుండటంతో ఈ నీరంతా నిజాంసాగర్ వైపు పరుగులు పెడుతోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 41,851 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నిల్వ 17.80 టీఎంసీలకుగానూ 11.10 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నిల్వ 16 టీఎంసీలకు చేరి, ప్రవాహాలు ఇదే రీతిన ఉంటే గురువారంరాత్రిగానీ, శుక్రవారంగానీ గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీకి కాస్త ప్రవాహాలు తగ్గాయి. బుధవారం 24 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. లోయర్ మానేరుకు 96 వేల క్యూసెక్కులు, మిడ్‌మానేరుకు 29వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 82 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ ప్రాజెక్టులన్నీ నిండి ఉండటంతో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్లో ప్రవాహ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలంలోకి 3.47 లక్షలు, సాగర్‌లోకి 2.73 లక్షలు, పులిచింతలకు 4.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఈ నీటినంతా దిగువకు విడిచి పెడుతుండటంతో బంగాళాఖాతం వైపు వెళుతోంది. అలుగు దుంకుతున్న 24,192 చెరువులు రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులకు జలకళ వచ్చింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్లో 24,192 చెరువులు అలుగు దుంకుతున్నా యి. మరో 11,972 చెరువులు వందకు వంద శాతం నీటితో అలుగులు దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణాబేసిన్‌లో 23,301 చెరువులకుగానూ 14,900 చెరువులు నిండగా, మరో 3,766 చెరువులు పూర్తిగా నిండాయి. అత్యధికంగా మెదక్ జిల్లా పరిధిలో 6,993 చెరువులు అలుగు పా రుతుండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4,644 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గోదావరి బేసిన్లో మొత్తంగా 20,111 చెరువులుండగా, ఇందులో 9,292 చెరువులు అలుగు పారుతున్నా యి. మరో 8,206 చెరువులు వంద శాతం మేర నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 2,795 చెరువులు, కరీంనగర్లో 2,578 చెరువులు, వరంగల్ జిల్లాలో 2,209 చెరువులున్నాయి. మంగళ, బుధవారం కురిసిన భారీ వర్షాలకు 152 చెరువులకు గండ్లు పడ్డాయి. మొత్తంగా ఈ సీజ న్లో 661 చెరువులకు గండ్లు, బుంగలు పడటం వంటి నష్టాలు ఏర్పడ్డాయి. -
మహోగ్ర కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు ప్రవాహం తోవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి 6,99,548 క్యూసెక్కులు రాగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9 గంటలకు 7,79,221 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 2,963 క్యూసెక్కులు వదులుతూ బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేసి 7,76,258 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద కారణంగా లంక గ్రామాల్లో పత్తి, మిరప, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటల్లో నీరు నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువన పెరిగిన వరద కృష్ణా బేసిన్లో ఎగువన వరద పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ నిండుకుండల్లా మారడంతో వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.63 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. దీనివల్ల గురువారం జూరాల ప్రాజెక్టులోకి వచ్చే వరద పెరగనుంది. జూరాల నుంచి విడుదల చేస్తున్న 2.73 లక్షల క్యూసెక్కులకు.. నల్లమల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కొండవాగులు వరద ఉధృతి తోడవడంతో శ్రీశైలంలోకి 3.47 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3.44 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జున సాగర్‌లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. వంశధార ఉగ్రరూపం ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధార ఉగ్రరూపం దాల్చింది. గొట్టా బ్యారేజీలోకి 42,980 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తేసి 46,916 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాగా, గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,21,804 క్యూసెక్కుల చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఉగ్ర వేణి
సాక్షి, అమరావతి/ విజయవాడ/ మాచర్ల/ శ్రీశైలం ప్రాజెక్ట్/ పెదకూరపాడు/ కాకినాడ/ పోలవరం రూరల్: మూసీ, మున్నేరు, కట్టలేరు, వైరా, కొండ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చగా.. ఉప నదుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో గోదారమ్మ శాంతిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో 2.29 లక్షల క్యూసెక్కులు.. మున్నేరు, వైరా, కట్టలేరు వరద తోడవడంతో 4.10 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. దీంతో 70 గేట్ల ద్వారా 3.23 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 5 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత.. ► కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలంలో 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ► సాగర్ జలాశయం వద్ద ఆదివారం సాయంత్రానికి 12 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,51,695 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద పర్యాటకులు రాకుండా 144 సెక్షన్ విధించారు. కేవలం కొత్త బ్రిడ్జి మీదుగా వెళ్లి రేడియల్ క్రస్ట్‌గేట్ల నుంచి స్పిల్‌వే మీదుగా దుమికే కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గోదావరిలో మరింత తగ్గిన వరద ► గోదావరి నదిలో ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద వరద 9,68,666 క్యూసెక్కులకు తగ్గింది. నీటి మట్టం 45 అడుగులు ఉంది. ► మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తామని అధికారులు తెలిపారు. ► ఆదివారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 17,84,505 క్యూసెక్కులకు తగ్గింది. 175 గేట్ల ద్వారా 17,74,755 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు 17.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించే అవకాశం ఉంది. ► తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో ముంపునకు గురైన ఇళ్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. 36 గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరించలేదు. కోతకు గురవుతున్న నెక్లెస్ బండ్ ► పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గ్రామానికి వరద నుంచి రక్షణగా నిర్మించిన నెక్లెస్ బండ్ కోతకు గురవుతోంది. 6 మీటర్ల వెడల్పున నిర్మించిన బండ్ రెండు మీటర్లకు తగ్గిపోయింది. ► శనివారం అర్ధరాత్రి 12 గంటలకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హుటాహటిన పోలవరం చేరుకుని యుద్ధ ప్రాతిపదికన గట్టు పటిష్ట పరిచే పనులు చేపట్టారు. పడవలపై కరోనా రోగుల తరలింపు ► తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలంకలో శనివారం ఓ వ్యక్తి కరోనా సోకింది. రాత్రివేళ బాలాజీ అనే వ్యక్తి సాయంతో ట్రాక్టర్‌పై సఖినేటిపల్లి బోను వద్దకు చేర్చి అక్కడి నుంచి ఆంబులెన్స్‌లో అల్లవరం కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ► అప్పనరామునిలంక, మామిడికుదురు, అప్పనపల్లి, బి.దొడ్డవరం గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున పడవలపై తీసుకొచ్చి కోవిడ్ ఆస్పత్రులకు తరలించారు. -
శ్రీశైలం చేరిన కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో ఈ సీజన్లో తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును కృష్ణా జలాలు తాకాయి. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల నిరంతరం కొనసాగుతుండటం, జూరాల నుంచి కూడా వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదులుతుండటంతో ఆ నీరంతా శ్రీశైలం చేరుతోంది. మంగళవారం సాయంత్రం శ్రీశైలంలోకి 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తుండగా బుధవారం నుంచి ఆ ప్రవాహాలు మరింత పెరగనున్నాయి. ఎగువ నుంచి భారీగానే.. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీగానే నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆల్మట్టికి మంగళవారం ఉదయం 41,812 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఏకంగా 46,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలకు గానూ 96.50 టీఎంసీల నిల్వ ఉంది. అయినప్పటికీ సాయంత్రానికి 45 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగిస్తున్నారు. దీంతో నారాయణపూర్‌లోకి 46,731 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, నిల్వ 37.64 టీఎంసీలకు గానూ 35.06 టీఎంసీలుగా ఉండటంతో దిగువకు 45,031 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు ఉదయం 14 వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహాలు రాగా అవి సాయంత్రానికి 22 వేలు, రాత్రికి 32 వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో నీటి నిల్వ 9.66 టీఎంసీలకు గానూ 8.85 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతలు, జూరాల కాల్వలకు 3,973 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, పవర్‌హౌస్‌ల ద్వారా 23,501 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలం చేరుతోంది. శ్రీశైలానికి ప్రస్తుతం స్థానిక పరీవాహకం తోడు ఎగువ ప్రవాహాలు కలిపి నుంచి 15,394 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నిల్వ 215 టీఎంసీలకు గానూ 37.50 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నిండాలంటే మరో 178 టీఎంసీలు అవసరం. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో కేవలం 31.53 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది కాస్త మెరుగ్గానే ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 312 టీఎంసీలకు గానూ 167.95 టీఎంసీల నీరుండగా, ఇక్కడ 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. -
కనీస మట్టం..ఇది నీటి కష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస నీటి మట్టానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు తమ అవసరాలకోసం నీటిని వినియోగిస్తుండటంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టు నిల్వలు కనీస నీటి మట్టం 834 అడుగులకు చేరింది. వేసవి ఇంకా పూర్తి స్థాయిలో ఆరంభం కాకముందే నిల్వలు తగ్గడం ఇరు రాష్ట్రాలకు మున్ముందు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాల నేపథ్యంలో మున్ముందు వినియోగంపై నియంత్రణ అవసరమని కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. సాగర్ ఒక్కటే దిక్కు..? ఈ సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 1,784 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తంగా 675 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయి. ఇందులో ఏపీ 513, తెలంగాణ162 టీఎంసీల వినియోగం చేసినట్లు కృష్ణాబోర్డు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సైతం శ్రీశైలం ద్వారా వివిధ అవసరాల నిమిత్తం ఇరు రాష్ట్రాలు 3,591 క్యూసెక్కుల నీటిని వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులకు గానూ కనీస నీటి మట్టం 834 అడుగులకు పడిపోయింది. నిల్వలు 215 టీఎంసీలకు గానూ 53.85 టీఎంసీలకు చేరాయి. కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని వినియోగించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరి. ఇప్పటికే బోర్డు, శ్రీశైలంలో రోజుకు 440 క్యూసెక్కుల మేర నీరు ఆవిరవుతోందని, దీంతో మట్టాలు మరింత వేగంగా తగ్గే అవకాశాలున్న దృష్ట్యా, శ్రీశైలం నుంచి నీటి విడుదలను తగ్గించాలని వారం కిందట సూచించింది. అయినప్పటికీ వినియోగం కొనసాగుతుండటంతో నిల్వలు కనీస నీటి మట్టానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాగు అవసరాలకు నాగార్జున సాగర్‌పైనే అధారపడాల్సి ఉంటుంది. సాగర్‌లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ 551 అడుగుల్లో 212 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 86 టీఎంసీల మేర ఉంటుంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది. మిషన్ భగీరథ మట్టాల్లో మార్పులు.. మిషన్ భగీరథ కింద తాగు నీటి అవసరా లకు ఏటా 60 టీఎంసీల నీటి అవసరాలను అధికారులు గుర్తించి, దీనికి అనుకూలంగా కృష్ణాబేసిన్‌లోని 15, గోదావరి బేసిన్‌లోని 21 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటిని తీసుకునేలా కనీస నీటి మట్టాలను గతంలో నిర్ధారించారు. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు తాగునీటికి 30 టీఎంసీల అవసరాలుంటాయని ఇప్పటికే సాగునీటి శాఖకు ప్రతిపాదించారు. ప్రాజెక్టుల్లో రెండు సీజన్లకు సరిపడేంత నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి మట్టాలను పెంచాలని మిషన్ భగీరథ ఇంజనీర్లు ప్రతిపాదించారు. జూరాలలో కనీస నీటి మట్టాలు గతంలో 313.75 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం దాన్ని 315 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఎస్సారెస్పీలో గతంలో 320.35 మీటర్లు ఉండగా..322.67 మీటర్లకు, కడెంలో 204.21 మీటర్లకు గానూ 206.89 మీటర్లు, కొమరంభీమ్లో 234.60 మీటర్లకు గానూ 236.10 మీటర్లకు పెంచుతూ ప్రతిపాదించారు. ఇవి ప్రస్తుతం సాగునీటి శాఖ పరిశీలనలో ఉన్నాయి. -
గోదావరి – కృష్ణా అనుసంధానంపై ముసాయిదా డీపీఆర్ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్లింపు కోసం నేషనల్ వాటర్ డవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్లు్యడీఏ) ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో వివరించారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీరు మళ్లించే అవకాశాలను పరిశీలించవలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్æ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని వివరించారు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా సీఎం కోరినట్లు మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై ఎన్‌డబ్లు్యడీఏ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్ చెప్పారు. గోదావరి–కావేరీ లింక్ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్‌లు ఉంటాయని, ఆయా ప్రాజెక్ట్‌ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గోదావరి–కృష్ణా లింక్ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్ రూపొందించి, చట్టపరమైన అనుమతులు పొందిన తరువాత పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. సాగరమాల కింద ఏపీలో 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్‌లు సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఏపీలోని 9 జిల్లాల్లో సంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్‌గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, క్వాయర్, విలేజ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని చిత్తూరు (కలంకారీ), విజయనగరం (క్వాయర్ పరుపుల తయారీ), చిత్తూరు (క్వాయర్ ఉత్పాదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పుగోదావరి (జొన్నాడ ఫుడ్‌ప్రాసెసింగ్), చిత్తూరు (చింతపండు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరిపీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
కాళేశ్వరం నీరు... ‘కృష్ణ’కు చేరు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంతో గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించి నీటి లభ్యతను పెంచే కొత్త ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు. కాళేశ్వరంలో భాగం గా నిర్మించే బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి గోదా వరి జలాలను సాగర్ ఆయకట్టు పరీవాహకానికి తరలించి నీటి లభ్యతను పెంచడం, ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యం గా అధ్యయనం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ దిశగా అప్పుడే కసరత్తు మొదలైంది. 3.50లక్షల ఎకరాల స్థిరీకరణ.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తుతం రెండు టీఎంసీల సామర్థ్యంతో చేపట్టగా, ఇందులో మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ, ఎస్సారెస్పీ పునరుజ్జీవానికి మరో టీఎంసీ తరలించేలా ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాలో ప్రతిపాదించిన బస్వాపూర్ వరకు నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు సింగూరు, నిజాంసాగర్ వరకు మరింత నీటిని అందుబాటులో ఉంచేందుకు అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకోవాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ అదనపు టీఎంసీతో నీటి లభ్యత పెరుగుతున్నందున బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించేలా చూడాలని ఆయన ఆదేశించగా రిటైర్డ్ ఇంజనీర్లు ప్రాథమిక సూచనలు చేశారు. బస్వాపూర్ నుంచి 3 కిలోమీటర్ల కాల్వ తవ్వకం ద్వారా నీటిని శామీర్‌పేట వాగుకు తరలించవచ్చని, కనిష్టంగా 4వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వను వెడల్పు చేసుకుంటే సరిపోతుందని సూచించారు. అక్కడి నుంచి మూసీ నది, ఆసిఫ్ నహర్‌కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని తేల్చారు. అక్కడి నుంచి నేరుగా పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తే, అక్కడి నుంచి సాగర్ కింద ఉన్న 3.70 లక్షల ఎకరాల ఆయకట్టులో కనిష్టంగా 3.50లక్షల ఎకరాలకు నీరందించి స్థిరీకరించవచ్చని తేల్చారు. రేపు పర్యటించనున్న రిటైర్డ్ ఇంజనీర్లు కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో ఈ విధంగా గోదావరి నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేలా సమగ్ర అధ్యయనం చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దీనిపై రిటైర్డ్ ఇంజనీర్లు మంగళవారం నుంచి అధ్యయనం మొదలుపెట్టనున్నారు. ఇక దీనితో పాటు సాగర్ ఆయకట్టు పరిధిలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వస్తోంది.ఇప్పటికే వరల్డ్‌బ్యాంకు నిధులతో సాగర్ కాల్వల ఆధునికీకరణ చేసిన నేపథ్యంలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు అవసరమన్న విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సాగర్ పరీవాహకంలో పర్యటించి అధ్యయనం చేయనుంది. వీటితో పాటే ఎస్సారెస్పీ పరిధిలోనూ కొత్త ఎత్తిపోతల పథకాలు అవసరమా? లేదా? అన్నది తేల్చనుంది. -
25 రోజుల్లోనే 865 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా బేసిన్లో ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. పదేళ్ల తర్వాత అంతటి వరద కేవలం 25 రోజుల్లోనే శ్రీశైలాన్ని చేరింది. 2010–11లో 1,024 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు కేవలం ఈ నెలలోనే 865 టీఎంసీల మేర వరద వచ్చింది. అయితే కృష్ణా బేసిన్లో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దీనికితోడు అక్టోబర్‌లో తుపానుల ప్రభావం సైతం ఎక్కువగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే శ్రీశైలంలో ఈ ఏడాది వరద వెయ్యి టీఎంసీల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీటిలో ఈ ఏడాది సాగర్‌కు 569 టీఎంసీల మేర నీరు చేరింది. ఇది సైతం ఈ పదేళ్ల కాలంలో ఇదే గరిష్టం. ఇక ఈ ఒక్క నెలలోనే 343 టీఎంసీల మేర నీరు సముద్రంలో కలిసింది. 2013–14లో 399 టీఎంసీల నీరు సముద్రంలో కలవగా ఆరేళ్ల తర్వాత ఇప్పుడే అంతమేర నీరు సముద్రానికి చేరింది. 2017–18లో సున్నా, 2018–19లో 39 టీఎంసీల మేర సముద్రంలో కలిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుల్లోకి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మళ్లీ వర్షాలు కురిస్తేనే వరద మొదలు కానుంది. ఇక గోదావరి పరిధిలో ఇప్పటివరకు 1685 టీఎంసీల మేర నీరు సముద్రంలోకి వెళ్లినట్లు కేంద్ర జల సంఘం రికార్డులు చెబుతున్నాయి.