కృష్ణా జలాలపై తేలిన లెక్క
34 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 15.5 టీఎంసీలు.. ఏపీకి 18.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్టా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల పంపిణీపై లెక్క తేలింది. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 34 టీఎంసీల్లో తెలంగాణకు 15.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 18.5 టీఎంసీలు దక్కనున్నాయి. తెలంగాణకు కేటాయించిన నీటిలో 14 టీఎంసీలు సాగర్ ఎడమ కాల్వ కు, 1.5 టీఎంసీలు హైదరాబాద్ తాగు నీటికి, ఏపీకి కేటాయించిన నీటిలో సాగర్ ఎడమ కాల్వ కింద 5 టీఎంసీలు, కుడి కాల్వ కింద 12 టీఎంసీలు, హంద్రీనీవాకు 1.5 టీఎంసీలు వాడుకునేలా ఇరు రాష్ట్రాలు బోర్డు సమక్షంలో అంగీకారానికి వచ్చాయి. కృష్ణా బేసిన్‌లోని వివాదాలపై చర్చించేం దుకు బుధవారమిక్కడ బోర్డు చైర్మన్ హల్దార్ అధ్యక్షతన జలసౌధలో సమావేశం జరిగింది.
ఐదు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, సభ్యుడు బాలన్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌కే జోషి, ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శశిభూషణ్, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. లభ్యత జలాలను పంచుకునే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయని, వచ్చే సమావేశంలో బోర్డు వర్కింగ్ మాన్యువల్‌పై చర్చిస్తామని సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ మీడియాకు తెలిపారు.
తెలంగాణ ప్రధాన వాదనలివీ..
► గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న నీటిపై ఏపీ లెక్కలను సమర్థిం చిన బోర్డు.. మైనర్ ఇరిగేషన్ కింద మేం సమర్పించిన లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనం కాదా?
► మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపులున్నా 2005–06 నుంచి 2014–15 వరకు జరిగిన సరాసరి వినియోగం కేవలం 45.97 టీఎంసీలు మాత్రమే. 2015–16లో అయితే మైనర్ వినియోగం సున్నా. ఈ ఏడాది కృష్ణా బేసిన్లోని చెరువుల్లోకి 37.812 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చింది. ఇందులో 15 శాతం డెడ్‌స్టోరేజీ లెక్కలను పక్కనపెడితే లభ్యత జలం 32.14 టీఎంసీలే. ఇందులో మేజర్ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరు 7.36 టీఎంసీల వరకు ఉంది. అంటే మైనర్ కింద వాస్తవంగా జరిగిన వినియోగం 24.78 టీఎంసీలు మాత్రమే.
► కృష్ణా ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ యంత్రాల్లో ఇదివరకు ప్రతిపాదించిన 47 లొకేషన్లతోపాటు అదనంగా మరో 12 లొకేషన్లు పెట్టాలి. మొదటి విడతలో 18 చోట్ల పరికరాల అనుమతికి అంగీకారం కుదరగా.. ఇందులో 11 చోట్ల తెలంగాణలో, 7 చోట్ల ఏపీలో అమర్చారు. ఇలా కాకుండా రెండు రాష్ట్రాల్లో సమాన సంఖ్యలో ఏర్పాటు చేయాలి. రెండో విడతలో గుర్తించిన 28 చోట్ల వెంటనే వీటిని అమర్చేలా చర్యలు తీసుకోవాలి.
► నల్లగొండ జిల్లాలోని 8 ఎత్తిపోతల పథకాలు పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి ఉన్నాయి. వీటికింద ప్రస్తుతం 30 వేల ఎకరాల పంటల సాగు జరిగింది. అయితే పులిచింతల కనీస నీటిమట్టం లేకపోవడంతో పంటలకు నీరందడం లేదు. ఈ దృష్ట్యా ప్రాజెక్టులో కనీస నీటి మట్టంలో నీరుండేలా చర్యలు తీసుకోవాలి.
న్యాయమైన వాటాను ఎలా అడ్డుకుంటారు?
కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ సూచించిన ప్రకారం 299 : 512 టీఎంసీల(37.63 నిష్పత్తిలో) పంపిణీ జరగాలని సమా వేశంలో తెలంగాణ పట్టుపట్టింది. ఈ లెక్కనే నీటిని పంచుకోవాలని కేంద్ర జల వనరుల శాఖ, అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఒప్పందం కుదిరిందని, దీనిపై ఇప్పుడు ఏపీ, బోర్డు అభ్యంతరం తెలపడమేం టని ప్రశ్నించింది. దీన్ని ఏపీ వ్యతిరేకించింది. బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులను తీసుకున్నప్పుడే ఈ నిష్పత్తి వర్తిస్తుందని, సాగర్, శ్రీశైలంలకు ఇది వర్తించదని పేర్కొంది. ఇందుకు బోర్డు సైతం మద్ద తుగా నిలవడంతో రాష్ట్ర స్పెషల్ సీఎస్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలం గాణకు రావాల్సిన న్యాయమైన వాటాపై ఏపీ అన్యాయంగా వ్యవహరిస్తోంది. కొత్త రాష్ట్రంలోనూ రైతులు చావాల్సిం దేనా?’’ అని ఉద్వేగంగా ప్రశ్నించారు. నీటి పంపిణీ నిష్పత్తి తేలనంత వరకు బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ను ఒప్పుకో మన్నారు. దీన్ని ఏపీ వ్యతిరేకించింది. అయితే బోర్డు చైర్మన్ జోక్యం చేసుకొని దీనిపై తర్వాత చర్చిద్దామని ప్రస్తుతానికి తాము సూచించిన మేరకు నీటిని పంచుకోవాలని సూచించారు.