పట్టిసీమ నీటిలో వాటా ఇవ్వండి
- కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ విన్నపం
- తాత్కాలిక కేటాయింపుల్లో నిష్పత్తి మార్చరాదని వినతి
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటిలో తమకు తాత్కాలిక ప్రాతిపదికనైనా నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల వనరులశాఖను కోరింది. ఈ కేటాయింపులపై కేంద్రం నియమించిన కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇస్తుందని, అయితే అప్పట్లోగా తాత్కాలికంగా కొంత వాటాను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు బుధవారం ఇక్కడ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ను కలసి కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావు కూడా ఉన్నారు. అలాగే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంతవరకు కృష్ణా జలాలను తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య పంచుతూ కేంద్ర జల వనరుల శాఖ నిర్ధారించిన కేటాయింపులను మారుస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. అలాగే పట్టిసీమ ద్వారా మళ్లించే జలాలపై శాశ్వత వాటా తేల్చేందుకు వీలుగా కృష్ణా ట్రిబ్యునల్‌లో సంబంధిత అంశాన్ని ప్రస్తావించాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందించారని విద్యాసాగర్‌రావు తెలిపారు.