తెలంగాణను అడ్డుకొనే శక్తి ఏపీకి లేదు: తుమ్మల
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్త రామదాసు ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. భక్త రామదాసు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన పట్టిసీమకు అనుమతి ఉందా అని ప్రశ్నించారు.
ఖమ్మం టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో భక్తరామదాసు ప్రాజెక్టు ఆగదని, తెలంగాణకు రావలసిన 299 టీఎంసీలలోనే వాడుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టులు ఆపే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకుంటుందన్నారు. కృష్ణా జలాల్లో తమకు రావలసిన వాటా ఎలా తీసుకోవాలో తమకు తెలుసునని తుమ్మల స్పష్టం చేశారు. రైతుల విషయంలో అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఏపీకి సూచించారు.