రోడ్ల నిర్మాణంలో సాంకేతిక విప్లవం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెరుగైన రోడ్డు అనుసంధాన వ్యవస్థ ఉండేలా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం తోడుకాబోతోంది. ఇందుకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు సహకరించబోతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల అనుసంధానం, రాజధానితో వాటి జోడింపు, నదులు, వాగులు, వంకలపై వంతెనల నిర్మాణం భారీగా చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.12,500 కోట్ల వ్యయంగాగల పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపగా.. రూ.5 వేల కోట్ల పనులు మొదలయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరగబోయే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సులో ఈ ప్రాజెక్టుకు ఓ దిశానిర్దేశం లభించబోతోంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా రోడ్ల నిర్మాణంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ప్రమాద రహితంగా ఉండేలా కొత్త నమూనా ల రూపకల్పనలపై చర్చించి తెలంగాణ పనులకు సూచనలు ఇవ్వబోతోంది.
మాదాపూర్‌లో హైటెక్స్ వేదికగా..
మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా ఈ నెల 15 నుంచి నాలుగు రోజుల పాటు జరగబోయే 77వ సదస్సులో దాదాపు మూడున్నర వేల మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాల రహదారుల శాఖ ఉన్నతాధికారుల తోపాటు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు హాజరవు తున్నారు. కొత్త పద్ధతులపై అవగాహన కల్పించేందుకు విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. 17న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావులు పాల్గొంటారు.
ఇదో గొప్ప అవకాశం: తుమ్మల
తెలంగాణను రోడ్ నెట్‌వర్క్‌లో నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో ఈ సదస్సు నిర్వహించాల్సి రావటం ఓ గొప్ప అవకాశం. ప్రమాద రహితంగా, పర్యావరణ అనుకూల పద్ధతుల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి కొత్త సూచనలు అందనున్నాయి.