పట్టిసీమపై మీ వివరణ ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: గోదావరిపై పట్టిసీమ వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానమివ్వాలంటూ గోదావరి బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం లేఖ రాసింది. పట్టిసీమపై అభ్యంతరాలు లేవనెత్తుతూ తెలంగాణ చేసిన ఫిర్యాదును లేఖతోపాటు జతచేసింది. కృష్ణానదిపై తెలంగాణ నిర్మించతలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో..
తెలంగాణ ప్రభుత్వం పట్టిసీమపై గోదావరి బోర్డుకు ఈనెల 8న ఫిర్యాదు చేయడం తెలిసిందే. గోదావరి బోర్డు అనుమతి లేకుండా, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్‌కు సమాచారమూ ఇవ్వకుండా ‘పట్టిసీమ’ను చేపట్టడం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని బోర్డు దృష్టికి తెచ్చింది. కొత్తగా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలించే పట్టిసీమ పథకాన్ని ఏకపక్షంగా ప్రారంభించడం విభజన చట్టంలోని సెక్షన్ 84(3), 85(8)లకు విరుద్ధమని, బోర్డు జోక్యం చేసుకుని పనులు నిలుపుదల చేయించాలని విన్నవించింది.
గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఎఫ్)ను ప్రస్తావించింది. ఈ నిబంధన ప్రకారం.. 80 టీఎంసీలకు మించి నీటిని పోలవరం కుడికాల్వకు మళ్లిస్తే.. ఆ నీటిని మూడు రాష్ట్రాలూ సమానంగా పంచుకోవాలనే నిబంధనను ఏపీ విస్మరించిందని, కనీసం బోర్డుకూ సమాచారమివ్వలేదని అభ్యంతరం తెలిపింది. 1978లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య జరిగిన మరో ఒప్పందం.. గోదావరి నీటివినియోగంలో ఏపీకి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించిందని, వివిధ బేసిన్‌ల నుంచి వచ్చే నీటిపై ఏపీకి హక్కులుండేలా ఒప్పందంలో ఉందని, ఆ హక్కులు ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలపై వివరణివ్వాలని, దాని ఆధారంగా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని బోర్డు తన లేఖలో పేర్కొంది.
27న గోదావరి బోర్డు సమావేశం: పట్టిసీమ అంశాన్ని చర్చించడానికి ఈనెల 27న సమావేశం ఏర్పాటు చేయాలని గోదావరి బోర్డు నిర్ణయించింది. ఈమేరకు ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. పట్టిసీమ ప్రాజెక్టుతోపాటు బోర్డు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు నిధుల విడుదల, వసతుల కల్పన, బోర్డు నిర్వహణ మార్గదర్శకాల ఖరారు.. తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయని సమాచారం.