సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తొండాటకు దిగుతోంది. జలాల్లో వాటా నుంచి క్యారీ ఓవర్ జలాల వినియోగం వరకు అన్ని వివాదాల పరిష్కారానికి కృష్ణా బోర్డు సమావేశాల్లో పలు మార్లు అంగీకరించి.. ఇప్పుడు అడ్డం తిరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల్లో సగం వాటా కేటాయించాలని, క్యారీ ఓవర్ జలాలను వాడుకోవడానికి అనుమతించాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్ లేఖ రాశారు.
ఏడు అంశాలను వచ్చే నెల 11న నిర్వహించే కృష్ణా బోర్డు 17వ సర్వ సభ్య సమావేశం అజెండాలో చేర్చాలని కోరారు. ఇప్పటికే పరిష్కారమైన ఈ వివాదాలను తెలంగాణ సర్కార్ తిరగదోడటంచర్చనీయాంశంగా మారింది.
కేంద్రం నేతృత్వంలో వాటాలపై ఒప్పందం
బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 (66 శాతం), టీఎంసీలు, తెలంగాణకు 298.96 (34 శాతం) టీఎంసీల పంపిణీ జరిగింది. ఈమేరకు జరిగిన తాత్కాలిక ఒప్పందంపై 2015 జూలై 19న ఏపీతోపాటు తెలంగాణ కూడా సంతకం చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ ఇదే ఒప్పందం అమల్లో ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చెప్పింది.
ఈ ఏడాది మే 10న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలోనూ ప్రస్తుత నీటి సంవత్సరంలో 66 : 34 నిష్పత్తిలో పంపిణీకి ఏపీ, తెలంగాణ ఆమోదించాయి. కానీ, ఇప్పుడు దానికి తాము అంగీకరించబోమని, జలాల్లో 50 శాతం వాటా కావాలని తెలంగాణ కోరుతోంది.
ఎప్పటి లెక్కలు అప్పటికే
ఒక నీటి సంవత్సరంలో వాడుకోని వాటా జలాలను (క్యారీ ఓవర్) మరుసటి ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. ఒక ఏడాదిలో నీటి లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని, మరుసటి ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇస్తే ఏపీ హక్కులను హరించినట్లవుతుందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీంతో క్యారీ ఓవర్ జలాలను వాడుకోవడానికి అనుమతించే ప్రశ్నే లేదని కృష్ణా బోర్డు తేల్చి చెప్పింది. వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ ఆ వివాదాన్ని తెలంగాణ తెరపైకి తెస్తోంది.
ఊ అని.. ఊహూ అంటే ఎలా?
హైదరాబాద్ తాగునీటికి వినియోగిస్తున్న నీటిలో 20 శాతాన్ని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ కృష్ణా బోర్డును కోరుతోంది. తాగు నీటిలో 20 శాతం వాడుకోగా మిగిలిన 80 శాతం మురుగు నీటి కాలువల ద్వారా మళ్లీ తెలంగాణలో ఆయకట్టుకే చేరుతోందని ఏపీ చెబుతోంది. హైదరాబాద్ తాగునీటికి వాడుతున్న జలాలను వంద శాతం లెక్కించాలని పేర్కొంది. దీనికి కృష్ణా బోర్డు కూడా ఏకీభవించింది.
ఇప్పుడు తెలంగాణ మళ్లీ పాత పల్లవే అందుకుంది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) డిజైన్ లోపాలను సరిదిద్దుకోకుండా ఆధునికీకరణ కోసం మంకుపట్టు పడుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన టెలీమీటర్లను ఏర్పాటు చేసి ఏపీ వాడుతున్న ప్రతి నీటి బొట్టూను కృష్ణా బోర్డు లెక్కిస్తున్నప్పటికీ, ఇంకా టెలీమీటర్లు ఏర్పాటు చేయలేదని తెలంగాణ ఆరోపిస్తోంది.
ఒక వైపు అనుమతి లేకుండానే పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్ భగీరథ, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), నెట్టెంపాడు (సామర్థ్యం పెంపు) తదితర ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మరో వైపు నీటి కేటాయింపులు ఉన్న ఆర్డీఎస్ కుడి కాలువ పనులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ ఏపీ చేపట్టకూడదని డిమాండ్ చేస్తోంది.
కృష్ణా జలాలపై తెలంగాణ సర్కారు తొండాట
Published Tue, Dec 27 2022 4:02 AM | Last Updated on Tue, Dec 27 2022 4:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment