కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం
ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న నీటిపారుదలరంగ నిపుణులు
సెక్షన్–3 కింద జారీ చేసిన విధి విధానాలు విభజన చట్టానికి విరుద్ధం
వాటి ప్రకారం నీటిని పంపిణీ చేయాలంటే విభజన చట్టాన్ని సవరించాల్సిందే
విభజన చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌దే
చట్టాన్ని సవరించకుండా సెక్షన్–3 కింద జారీ చేసిన విధి విధానాలు చెల్లుబాటు కావంటున్న నిపుణులు
ఆ కోణంలో సుప్రీం కోర్టులో వాదించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలం
కేడబ్ల్యూడీటీ–2లోనూ అదే తీరు
ఓటుకు కోట్లు కేసు భయంతో గతంలోనూ ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన
చంద్రబాబు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ) 2లో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు.
ఒకవేళ సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ చట్టానికి సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టాన్ని సవరించకుండా సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన విధి విధానాలను అనుసరించి విచారణ చేయడానికి వీల్లేదనే కోణంలో వాదనలు వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని నిపుణులు తప్పుబడుతున్నారు.
చంద్రబాబు సర్కారు సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటామని కేడబ్ల్యూడీటీ 2 గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని.. అంతిమంగా ఇది రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆ తరువాత ఓటుకు కోట్లు కేసుతో వ్యక్తిగత లబ్ధి కోసం 2014–19 మధ్య కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.
బాబు సర్కారు నిర్వాకంతో...
కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 811 టీఎంసీలను కేటాయిస్తూ 1976 మే 27న కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ఇచ్చింది. అయితే కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమలులోకి రాని నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పే ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్ 89 ద్వారా కేడబ్ల్యూడీటీ–2కే కేంద్రం అప్పగించింది.
రెండు రాష్ట్రాలకు నీటి లెక్కలను ట్రిబ్యునల్ తేల్చే వరకూ.. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అదే విధానంలోనే 2023–24 వరకూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తోంది.
అయితే ఐఎస్‌ఆర్‌డబ్యూడీఏ 1956 సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ కేడబ్ల్యూడీటీ–2కు అదనపు విధి విధానాలను జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ 2023 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
అయితే సుప్రీంకోర్టులో ఆ రిట్ పిటిషన్‌పై సమర్థంగా వాదనలు వినిపించడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్రం సెక్షన్ 3 కింద జారీ చేసిన అదనపు విధి విధానాలు చెల్లుబాటు కావనే కోణంలో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి ఉంటే.. కేడబ్ల్యూడీటీ–2లో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు.
నాటి తరహాలోనే నేడూ..
విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, పులిచింతల విద్యుత్ కేంద్రం తమ భూభాగంలో ఉన్నాయంటూ తెలంగాణ సర్కార్ వాటిని తన ఆధీనంలోకి తీసుకుంది.
అయితే నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ రాష్ట్ర భూభాగంలో ఉన్నా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆధీనంలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతికి చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టినా నాడు చంద్రబాబు నోరు మెదపలేదు.
ఫలితంగా తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను కాలరాస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలిస్తూనే ఉంది. తెలంగాణ సర్కార్ జల దోపిడీపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన ఫలితంగానే 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగ భాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించిందని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ 2014–19 తరహాలోనే వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించేలా కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టినా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని.. కేడబ్ల్యూడీటీ–2లోనూ సమర్థంగా వాదనలు వినిపించడం లేదని నిపుణులు ఆక్షేపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment