
అమరావతి టెండర్లలో అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్య నేతల లాలూ‘ఛీ’పర్వం
ఆరు కాంట్రాక్టు సంస్థలకు రూ.10,081.82 కోట్ల పనులు పంపిణీ
అంచనాలు పెంచేసి.. అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ
నాడు ముఖ్య నేత తరఫున కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ‘ఐటీ’కి చిక్కిన ఓ అధికారి
నేడు రాజధాని టెండర్లలోనూ ముఖ్యనేత తరఫున కాంట్రాక్టు సంస్థలతో అదే అధికారి బేరసారాలు
మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి కమీషన్లు వసూలు చేసుకునే దిశగా వేగంగా అడుగులు
పారదర్శక జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలకు కూటమి సర్కారు పాతర
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతల లాలూ‘ఛీ’ పర్వం బట్టబయలైంది! టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయక ముందే అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో బేరసారాలు జరిపి, అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాలను పెంచేసేలా చక్రం తిప్పారు. ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మాత్రమే బిడ్లు దాఖలు చేసేలా ఆ పనులకు అర్హతలను నిర్దేశించి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వాటిని అధిక ధరలకు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టారు.
ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్) రూ.10,081.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 35 పనులను ముఖ్యనేత అత్యంత సన్నిహితులకు చెందిన ఆరు కాంట్రాక్టు సంస్థలకు పంచి పెట్టడమే అందుకు నిదర్శనం. 2014–19 మధ్య ముఖ్యనేత తరఫున కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకి పట్టుబడ్డ అధికారే నేడు రాజధాని నిర్మాణ టెండర్లలోనూ కాంట్రాక్టర్లతో బేరసారాలు సాగిస్తుండటం గమనార్హం.
పనులు అప్పగించి కాంట్రాక్టర్లతో ఏడీసీఎల్ ఒప్పందం చేసుకోగానే అంచనా వ్యయంలో 10 శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇప్పించేసి.. అందులో తిరిగి 8 శాతాన్ని ఆ అధికారి ద్వారా కమీషన్‌గా వసూలు చేసుకునే దిశగా ముఖ్యనేత వేగంగా అడుగులు వేస్తున్నారు.
టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూరుస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలను తమ అక్రమాలకు అడ్డు వస్తున్నాయని రద్దు చేసిన చంద్రబాబు సర్కారు రాజధాని టెండర్లలో ఆకాశమే హద్దుగా అక్రమాలకు తెర తీసింది.
రూ.31 వేల కోట్ల రుణ ఒప్పందాలు..
రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) ద్వారా రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా రూ.5 వేల కోట్లు వెరసి ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం తీసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం తెలిసిందే.
ఈ రుణంతో రాజధాని ప్రాంతంలో ఏడీసీఎల్, సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ద్వారా నిర్మాణ పనులను చేపట్టింది. ఏడీసీఎల్ రూ.10,714.57 కోట్లకు.. సీఆర్‌డీఏ రూ.20,358.83 కోట్లకు కలిపి మొత్తంగా రూ.31,073.4 కోట్లతో ఇప్పటివరకూ రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాయి. ఇందులో ఏడీసీఎల్ రూ.10,081.82 కోట్లతో పిలిచిన 35 పనుల టెండర్లను ఇటీవల ఖరారు చేశారు.
ఇతరులు బిడ్ వేస్తే అనర్హత వేటే..
ముఖ్యనేతలు ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు ఎవరైనా బిడ్ వేస్తే అనర్హత వేటు వేయాలన్న ఉన్నత స్థాయి ఆదేశాలను ఏడీసీఎల్ అధికారులు నిక్కచ్చిగా అమలు చేశారు. తస్మదీయ సంస్థపై అనర్హత వేటు వేసి.. అస్మదీయ సంస్థకే పనులు కట్టబెట్టారు. రాజధాని ముంపు నివారణ పనుల్లో రెండో ప్యాకేజీ (నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వకం, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం) పనులే అందుకు నిదర్శనం.
ఆ పనులకు హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రా సంస్థ బిడ్ దాఖలు చేయగా తస్మదీయ సంస్థ కావడంతో అనర్హత వేటు వేశారు. 3.98 శాతం అధిక ధరకు బిడ్ దాఖలు చేసిన ఎమ్వీఆర్ ఇన్‌ఫ్రా(మంత్రి నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ ఎం.భరత్‌కు అత్యంత సన్నిహితుడైన ముప్పాన వెంకటరావుకు చెందిన సంస్థ)కు ఆ పనులను కట్టబెట్టారు. ఇక ఎన్–18 రహదారి (ప్యాకేజీ–5) నిర్మాణ టెండర్లలో బిడ్ దాఖలు చేసిన హజూర్ మల్టీ ప్రాజెక్టŠస్ సంస్థపై అనర్హత వేటు వేసి... వాటిని బీఎస్సార్ ఇన్‌ఫ్రా (సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన సంస్థ) 3.18 శాతం అధిక ధరలకు కట్టబెట్టారు.
అన్ని పనులూ అధిక ధరలకే..
ఏడీసీఎల్ 35 పనులకు పిలిచిన టెండర్లలో ముఖ్యనేతలు ఎంపిక చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్(ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన సంస్థ), బీఎస్సార్.. ఎన్‌సీసీ (ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన ఏవీ రంగారాజు ఎండీగా ఉన్న సంస్థ).. బీఎస్పీసీఎల్ (సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన సంస్థ), మేఘా, ఎమ్వీఆర్ ఇన్‌ఫ్రా సంస్థలు దాఖలు చేసిన బిడ్లు మాత్రమే అర్హత సాధించాయి.
ఆర్వీఆర్ ప్రాజెక్స్‌కు రూ.2,539.72 కోట్ల విలువైన 8 పనులు.. బీఎస్సార్ ఇన్‌ఫ్రాకు రూ.2,170.81 కోట్ల వ్యయంతో కూడిన 9 పనులు, ఎన్‌సీసీకి రూ.2,645.96 కోట్లు విలువైన 8 పనులు, బీఎస్సీసీఎల్‌కు రూ.748.75 కోట్లు వ్యయంతో చేపట్టిన 4 పనులు, మేఘాకు రూ.1,182.54 కోట్లు విలువైన 4 పనులు, ఎమ్వీఆర్ ఇన్‌ఫ్రాకు రూ.794.04 కోట్లు విలువ చేసే రెండు పనులను కట్టబెట్టారు.
లాలూ‘ఛీ’కి ఇదిగో తార్కాణం..
⇒ రాజధాని ముంపు నివారణ పనుల్లో ఒకటో ప్యాకేజీ (కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం) పనులకు రూ.462.25 కోట్లతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఇన్‌ఫ్రా ఎల్–1గా నిలిస్తే... 4.35 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎన్‌సీసీ ఎల్–2గా, 4.69 శాతం అధిక ధరలకు కోట్ చేసిన మేఘా ఎల్–3లుగా నిలిచాయి.
⇒ రాజధాని ముంపు నివారణ రెండో ప్యాకేజీ పనులకు రూ.303.73 కోట్ల వ్యయంతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 3.84 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఎల్–1గా నిలిస్తే... 4.40 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎన్‌సీసీ ఎల్–2గా, 4.76 శాతం అధిక ధరకు కోట్ చేసిన మేఘా ఎల్–3గా నిలిచాయి.
⇒ ఈ రెండు ప్యాకేజీల టెండర్లలో దాఖలైన బిడ్లను గమనిస్తే కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతలు లాలూఛీ పడినట్లు స్పష్టమవుతోంది. ఇవే కాదు మిగతా 33 ప్యాకేజీల పనుల్లోనూ ఇదే కథ.
అంచనాల్లోనే వంచన...
⇒ రాజధాని ముంపు నివారణ పనుల అంచనాల్లోనే వంచనకు తెర తీశారు. అమరావతి ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు లాంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. ఒకటో ప్యాకేజీలో కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించాలి. కొత్తగా 7.843 కి.మీ పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వేందుకు ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.
ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, పది నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు (జీఎస్టీ, సీనరేజీ, ఎన్‌ఏసీ లాంటి పన్నులతో కలిపి) మించదని జలవనరుల శాఖలో పలు ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ అధికారి స్పష్టం చేశారు.
ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్‌ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు కలిపినా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు వెల్లడించారు.
వీటిని పరిగణలోకి తీసుకుంటే ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్‌ఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద రాజధాని ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టుగా కాంట్రాక్టు వర్గాలే లెక్కలు వేస్తున్నాయి.
మిగిలిపోయిన రోడ్డు పనులకు..
దేశంలో ఒక కి.మీ. పొడవున ఆరు లేన్.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారిని సగటున రూ.20 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తోంది. అది కూడా అన్ని రకాల పన్నులు జీఎస్టీ, నాక్ (నేషనల్ కన్‌స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో ఆరు లేన్.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిపోయిన వాటికి కి.మీ.కి గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా ఏడీసీఎల్ ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్ చేస్తామని చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment